గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?

గ్రహాంతర అస్తిత్వం మీద అనేక కథలు, ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, BWFOLSOM

ఫొటో క్యాప్షన్, గ్రహాంతర అస్తిత్వం మీద అనేక కథలు, ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

ఆకాశంలో ఎగిరే అంతు తెలియని పళ్లాల(యూఎఫ్ఓ) అసలు రహస్యమేంటి ? ఇన్నాళ్లు ఈ ఎగిరే పళ్లాల గురించి, గ్రహాంతర వాసుల గురించి అనేక వివరాలు, వీడియో విడుదల చేసి పెంటగాన్ వాటికి సంబంధించిన అసలు నిజాలను చెప్పబోతోందా? ఈ నెలాఖరులో పెంటగాన్ విడుదల చేయబోయే నివేదికపై ఆసక్తి నెలకొంది.

ఆకాశంలో యూఎఫ్‌ఓల కదలికలను పలుమార్లు అమెరికా మిలిటరీ గుర్తించింది. అవి గ్రహాంతరవాసులు లేదంటే , అమెరికా శ‌త్రు దేశాలైన ర‌ష్యా, చైనా త‌యారు చేసిన వస్తువులు అయ్యిఉండొచ్చని మిలిటరీ అధికారులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ యూఎఫ్‌ఓలపై అసలు నిజాలేంటో బహిర్గతం చేయాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

గ్రహాంతర వాసులను సూచించే సైన్ బోర్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రహాంతర వాసులను సూచించే సైన్ బోర్డ్

జూన్‌ చివరన రిపోర్టు

ఈ నెలాఖ‌రులో యూఎఫ్ఓల గురించి అమెరికా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక రిపోర్టును వెలువ‌రించ‌బోతోంది. యూఎఫ్ఓల గురించి నిశితంగా ప‌రిశీలించేందుకు, వాటి పుట్టుపూర్వోత్త‌రాల‌ను గుర్తించేందుకు గ‌తేడాది ఆగ‌ష్టులో అన్‌ఐడెంటిఫైడ్‌ ఏరియల్‌ ఫినామినల్‌ టాస్క్‌ ఫోర్స్‌ను పెంట‌గాన్ ఏర్పాటు చేసింది.

ఈ టీమ్ రూపొందించిన రిపోర్టు ఈ నెల ఆరంభంలో అమెరికా ప్రజాప్రతినిధులు అందింది. అయితే, గ్రహాంతర వాసులు ఉన్నారనడానికి ఎలాంటి ఆధారం లేదని, అలాగని లేవని కొట్టి పారేయడం కూడా సాధ్యం కాదని అందులో పేర్కొన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు అమెరికా మీడియాకు వెల్లడించారు.

ఈ యూఎఫ్ఓలు అమెరికాకు చెందిన ర‌హ‌స్య‌ టెక్నాల‌జీకి చెందినవి కాద‌ని మాత్రం టాస్క్‌ఫోర్స్ తేల్చింది. గ‌త 20 ఏళ్ల‌లో జ‌రిగిన దాదాపు 120 యూఎఫ్ఓ సంఘ‌ట‌న‌ల‌ను టాస్క్‌ఫోర్స్ ప‌రిశీలించింది. వీటిలో మూడు వీడియోలు ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

1952లో మస్సాచుసెట్స్‌లో కెమెరాకు చిక్కిన ఎగిరే పళ్లాలు (యూఎఫ్ఓ)లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1952లో మస్సాచుసెట్స్‌లో కెమెరాకు చిక్కిన ఎగిరే పళ్లాలు (యూఎఫ్ఓ)లు

యూఎఫ్ఓలపై ఎందుకింత ఆసక్తి

గ్రహాంతర వాసులు (ఏలియ‌న్స్ )ఉన్నారని కొంద‌రు యూఫాల‌జిస్టులు బ‌లంగా న‌మ్ముతున్నారు. ప్ర‌భుత్వానికి ఈ విష‌యం తెలిసినా, నివేదిక వివరాలను బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌నేది వారి వాద‌న‌.

వీరి ఒత్తిడి వ‌ల్లే అమెరిక‌న్ ప్ర‌భుత్వం యూఎఫ్ఓల గురించి త‌నకు తెలిసిన‌ స‌మాచారాన్ని బ‌య‌ట‌పెట్టేందుకు సిద్ధ‌ప‌డుతోంది.2007 నుంచి పెంట‌గాన్ అత్యంత ర‌హ‌స్య‌మైన అడ్వాన్స్‌డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేష‌న్ ప్రొగ్రామ్ ద్వారా యూఎఫ్ఓల‌పై స‌మాచారం సేక‌రిస్తోంది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చును నెవాడా సెనేట‌ర్ హ్యారీ రీడ్‌ అభ్య‌ర్ధ‌న మేర‌కు ప్ర‌భుత్వం కేటాయించింది.

నెవాడా స్టేట్‌లోని ఏరియా-51 గురించి అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. 1947లో గ్రహాంతర వాసులకు సంబంధించిందిగా భావిస్తున్న గుర్తు తెలియ‌ని వ‌స్తువు ఏరియా-51 సమీపంలో ప్ర‌మాదానికి గురై ప‌డిపోయిందని, దాన్ని అక్క‌డే మిలిటరీ ఆధ్వర్యంలో భ‌ద్ర‌ప‌రచార‌ని చాలామంది భావిస్తున్నారు.

విమానం నడుపుతుండగా తనకు యూఎఫ్ఓ కనిపించిందని అమెరికా నేవీ పైలట్ అలెక్స్ డీట్రిచ్ వెల్లడించారు
ఫొటో క్యాప్షన్, విమానం నడుపుతుండగా తనకు యూఎఫ్ఓ కనిపించిందని అమెరికా నేవీ పైలట్ అలెక్స్ డీట్రిచ్ వెల్లడించారు

అధ్యక్షులు సైతం...

అమెరికా మాజీ అధ్యక్షులు, ఉన్నతాధికారులు ఇటీవలి కాలంలో గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్‌ సాసర్‌ల ఉనికిపై బ‌హిరంగంగా చర్చిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే, యూఎఫ్‌ఓ సిద్ధాంతాలపై ప్రభుత్వం వద్ద ఉన్న నివేధికను బహిర్గతం చేస్తామని 2016లో అధ్యక్ష బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్‌ క్యాంపెయిన్‌ మేనేజర్‌ జాన్‌ పోడెస్టా హామీ ఇచ్చారు. గతేడాది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రహాంతర వాసులకు సంబంధించి తన వద్ద ఉన్న సమాచారాన్ని కుటుంబ సభ్యులతో కూడా పంచుకోనని చెప్పారు. వాటి గురించి తెలిసినా, బయటకు చెప్పనని, కానీ అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయని ట్రంప్‌ అన్నారు. మరో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇదే విషయాన్ని గతేడాది మే నెలలో టీవీ వ్యాఖ్యాత జేమ్స్‌ కార్డన్‌ వద్ద ప్రస్తావించారు. తాను ఆఫీస్‌లో అడుగుపెట్టిన వెంటనే గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్‌ సాసర్‌లకు సంబంధించి ఎక్కడైన ప్రత్యేకంగా ల్యాబ్‌లు ఉన్నాయా అని అడిగానని, లేదని బదులొచ్చిందని వెల్లడించారు.

'ఆకాశంలో కొన్ని గుర్తు తెలియని వస్తువులకు సంబంధించి ఫుటేజీ, రికార్డులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని నాకూ ఉంది. అవి ఎక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడికి వెళ్లాయన్నది మనకు తెలియదు' అని ఒబామా అన్నారు.

యుఎఫ్ఓల గురించి అమెరికాలో అనేక సంఘటనలు ప్రచారం లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుఎఫ్ఓల గురించి అమెరికాలో అనేక సంఘటనలు ప్రచారం లో ఉన్నాయి.

ఆధారాలేంటి?

ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు తాము యూఎఫ్ఓలను చూశామని కొంద‌రు పైల‌ట్లు గతంలో చెప్పారు. యూఎఫ్ఓల గురించి ప్రజలకు తెలిసిన వాటి కన్నా చాలా సంఘటనలు జరిగాయని, కానీ వాటి గురించి చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని ట్రంప్‌ హయాంలో డైరెక్టర్‌ ఆఫ్ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జాన్‌ రాట్‌లిఫ్‌ ‘ఫాక్స్ న్యూస్‌’కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు.పసిఫిక్‌ మహా సముద్రంలో గుర్తుతెలియని వస్తువు కదలికలను గుర్తించామని సీబీఎస్‌ ఛానల్‌తో ఇద్దరు మాజీ నేవీ పైలెట్లు తెలిపారు. 'చాలా వేగంగా, ఒక దిశ అంటూ లేకుండా అది ప్రయాణించింది. దాని నుంచి పొగ గాని, మంటలుగానీ కనిపించలేదు' అని మాజీ నేవీ పైలట్ అలెక్స్‌ డీట్రిచ్‌ బీబీసీతో చెప్పారు.

మిగ‌తా దేశాలేం చేస్తున్నాయి?

యూఎఫ్ఓల‌పై అమెరికాతో పాటు రష్యా, చైనా కూడా స‌మాచారం సేక‌రిస్తున్నాయ‌ని అమెరికా మాజీ సెనేట‌ర్ రీడ్ పేర్కొన్నారు. వంద‌ల మంది యూఎఫ్ఓల‌ను చూశార‌ని త‌మ ప‌రిశోధ‌న‌లో తేలింద‌ని చెప్పారు.గత డిసెంబర్‌లో గ్రహాంతర వాసుల గురించి ఇజ్రాయెల్‌ అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వానికి గ్రహాంతరవాసులతో ఒప్పందం కుదిరిందన్నారు. ఇజ్రాయెల్‌లో ప్రయోగాలు చేయాడానికి వారు తమతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)