ఆడియో క్యాసెట్ సృష్టికర్త 'లో ఆటెన్' ఇక లేరు

ఆడియో క్యాసెట్

ఫొటో సోర్స్, AFP

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఆడియో క్యాసెట్లలో సంగీతం వింటూ, సంభాషణలు రికార్డు చేసుకుంటూ కొన్ని తరాలు మురిసిపోయాయి. అరవైలలో ఆడియో క్యాసెట్ పుట్టిన తరువాత అది మానవాళి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అలాంటి ఆడియో క్యాసెట్‌ను కనిపెట్టిన డచ్ ఇంజినీర్ లో ఆటెన్స్ 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ 1960లలో జరిగింది. అప్పటి నుంచి 10,000 కోట్ల క్యాసెట్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయని అంచనా. ఆటెన్స్ ఆడియో క్యాసెట్ కనిపెట్టడంతో ప్రజల సంగీతం వినే తీరే మారిపోయింది. ఇటీవలి కాలంలో క్యాసెట్లు మళ్లీ తెర ముందుకు వస్తున్నాయి.

ఆటెన్స్ తన స్వస్థలమైన డూజెల్‌లో మార్చి 6 శనివారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం నాడు వెల్లడించారు.

ఆటెన్స్ 1960లో ఫిలిప్స్ ప్రాడక్ట్ డెవలప్మెంట్ విభాగానికి అధిపతి అయ్యారు. ఆ కంపెనీలో పని చేస్తుండగానే ఆయన ఆడియో క్యాసెట్ కనిపెట్టారు.

ఆయన కనిపెట్టిన ఆడియో క్యాసెట్టును 1963లో జరిగిన బెర్లిన్ రేడియో ఎలక్ట్రానిక్స్ ఫెయర్‌లో తొలిసారి ప్రదర్శించారు. అతి వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

ఆటెన్స్ తాను కనిపెట్టిన ఆడియో క్యాసెట్‌ నమూనాకు పేటెంట్ పొందారు. దాని ఉత్పత్తికి ఫిలిప్స్, సోనీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడియో క్యాసెట్ సృష్టికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన టైమ్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ, 'అది మొదటి రోజు నుంచే సూపర్ హిట్ అయింది' అని అన్నారు.

కాంప్యాక్ట్ డిస్క్ కనిపెట్టడంలోనూ ఆటెన్స్ కృషి ఉంది. కాంప్యాక్ట్ డిస్కులు ఇప్పటివరకు 20 వేల కోట్ల దాకా అమ్ముడయ్యాయి.

ఆడియో క్యాసెట్‌ను 1960లలో కనిపెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా 10 వేల కోట్ల క్యాసెట్లు వినియోగంలోకి వచ్చాయి

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఆడియో క్యాసెట్‌ను 1960లలో కనిపెట్టిన తరువాత ప్రపంచవ్యాప్తంగా 10 వేల కోట్ల క్యాసెట్లు వినియోగంలోకి వచ్చాయి

ఫిలిప్స్ సంస్థ 1982లో సీడీ ప్లేయర్‌ను తొలిసారి మార్కెట్లో విడుదల చేస్తున్నప్పుడు, "ఇకపై పాత రికార్డ్ ప్లేయర్లు నిరర్థకంగా మిగిలిపోతాయి" అని అన్నారు.

ఆ తరువాత నాలుగేళ్లకు ఆయన రిటైర్ అయ్యారు. మీ కెరీర్ ఎలా సాగిందన్న ప్రశ్నకు బదులిస్తూ ఆయన, "క్యాసెట్ ప్లేయర్ వాడకాన్ని మలుపు తిప్పిన వాక్‌మన్‌ను సోనీ సంస్థ తయారు చేసింది. దాన్ని ఫిలిప్స్ చేయలేకపోవడం నాకు అత్యంత బాధ కలిగించే అంశం" అని అన్నారు.

అయితే, అంతరించిపోతాయనుకున్న క్యాసెట్ ప్లేయర్లు ఇటీవలి కాలంలో ఊహించని విధంగా మళ్లీ ఆదరణకు నోచుకుంటున్నాయి. లేడీ గాగా, ది కిల్లర్స్ వంటి కళాకారులు తమ తాజా ఆల్బమ్‌ను ఆడియో క్యాసెట్లలో విడుదల చేశారు.

బ్రిటన్ అధికారిక క్యాసెట్ సేల్స్ రికార్డుల ప్రకారం 2020లో క్యాసెట్ల విక్రయాలు గత ఏడాదితో పోల్చినప్పుడు 103 శాతం పెరిగాయి.

అమెరికాలో కూడా 2018లో క్యాసెట్ల అమ్మకాలు 23 శాతం పెరిగాయని నీల్సన్ మ్యూజిక్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)