అమెరికా, చైనా, జర్మనీ, టర్కీ సహా అనేక దేశాలలో సోషల్ మీడియాపై నియంత్రణ ఉండగా ఇండియాలోనే వ్యతిరేకత ఎందుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబేర్ అహ్మద్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
సోషల్ మీడియా, ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం ఇది డిజిటల్ సార్వభౌమత్వానికి సంబంధించి అంశమని చెబుతుండగా, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా విషయంలో ఇలా కఠిన నియమాలను విధించే, అమలు చేసే ధోరణి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది.
మే 26 నుంచి అమల్లోకి వచ్చిన ‘ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021’ యూజర్ల గోప్యత, ట్విటర్ లాంటి సోషల్ మీడియా సంస్థల ఉద్యోగులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రమాదాన్ని పెంచాయి.
భారత దేశంలో పని చేసే సోషల్ మీడియా కంపెనీలు తమ పరిస్థితి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగా మారుతుందని భయపడుతున్నాయి.
అధికారంలో ఉన్నవారు తాము కోరుకున్నప్పుడల్లా ఈ కంపెనీలను అదుపులో పెట్టగలరు. శాంతిభద్రతల పేరుతో ఒక నగరంలో ఇంటర్నెట్‌ను షట్‌డౌన్ చేసే అధికారం కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది.
భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ నిబంధనల లాంటివి ఇప్పటికే పాకిస్తాన్, వియత్నాం లాంటి దేశాలలో ఉన్నాయి. బ్రెజిల్, పోలాండ్, టర్కీ, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే ఇటువంటి చట్టాలు, నిబంధనలను అమలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు వాటిని సిద్ధం చేస్తున్నాయి.
భారతదేశంలో కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలు దేశంలోనే ఉండే ఒక చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంటుంది.
ఆ అధికారి తన సంస్థ భారతీయ చట్టాలు, నిబంధనలకు లోబడి ఉండేలా బాధ్యత వహించాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియాలోనే కాదు..
ఇటువంటి బాధ్యతలతో వ్యక్తులను నియమించడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధోరణి అని ఇండియా కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సీనియర్ రీసెర్చర్ గుర్‌షాబాద్ గ్రోవర్ బీబీసీతో అన్నారు.
''టర్కీ, బ్రెజిల్ తోపాటు జర్మనీలో ఇలా ఒక అధికారి పరిధిలో పని చేసే స్థానిక సిబ్బంది ఉండాలని ఆదేశించే చట్టం ఉంది'' అని గ్రోవర్ వెల్లడించారు.
చట్టాలను గౌరవించే దేశాలలో టెక్ కంపెనీల అధికారులు ఎప్పుడూ క్రిమినల్ ప్రాసిక్యూషన్ వరకు వెళ్లే ప్రమాదం ఉండదని ఆయన అన్నారు.
మరోవైపు, ఇంటర్నెట్ స్వేచ్ఛను అణగదొక్కే చరిత్ర ఉన్న దేశాలలో సోషల్ మీడియా సంస్థల ఉద్యోగులను భయ పెట్టడానికి లేదా బెదిరించడానికి ఇలాంటి చట్టాలను ఉపయోగించవచ్చని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ మీద పని చేసే స్వచ్ఛంద సంస్థ గ్లోబల్ నెట్‌వర్క్ ఇనిషియేటివ్‌కు పాలసీ డైరక్టర్ పని చేస్తున్న జాసన్ పిల్లేమియర్ ఇలాంటి చట్టాలను బందిఖానా చట్టాలుగా అభివర్ణినంచినట్లు ‘రెస్ట్ ఆఫ్ ది న్యూస్’ పోర్టల్ పేర్కొంది.
ప్రభుత్వాలకు తలొగ్గి ఉండకపోతే సోషల్ మీడియా సంస్థల అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జాసన్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాపై ఎలాంటి నిబంధనలు అమలవుతున్నాయి?
చాలా కాలం వరకు చాలా పాశ్చాత్య దేశాలలో సోషల్ మీడియాపై కొనసాగుతున్న నియమాలపై పెద్దగా అభ్యంతరాలు రాలేదు. అయితే ఇటీవలి కాలంలో వాటిపై విమర్శలు పెరుగుతున్నాయి.
ఈ నిబంధనలు అవసరమైన దానికంటే ఎక్కువ ప్రభావవంతంగా, శక్తివంతంగా మారుతున్నాయని.. వాటిని తొలగించడం అవసరమని చాలామంది వాదిస్తున్నారు.
''తప్పుడు సమాచారాన్ని తొలగించడంలో విఫలమైతే యూకేలోని చట్టాల ప్రకారం ఫేస్‌బుక్, ట్విటర్, టిక్ టాక్‌లాంటి సంస్థలకు వాటి టర్నోవర్‌లో 10శాతం వరకు జరిమానా విధించవచ్చు'' అని ఐక్యూబ్స్‌వైర్ వ్యవస్థాకుడు సాహిల్ చోప్రా అన్నారు.
ఐక్యూబ్స్ వైర్ సంస్థ భారతదేశంలో డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీలో పరిస్థితి ఏమిటి?
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు స్థానికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా టర్కీ ప్రభుత్వం ఒక చట్టాన్ని గత ఏడాది రూపొందించింది. కంటెంట్ తొలగింపుపై అభ్యర్థనలకు 48 గంటల్లో స్పందించాలని ఆయా సంస్థలను ఆదేశించింది.
ఈ నిబంధనలకు పాటించడం లేదంటూ జరిమానా కూడా విధించడంతో ట్విటర్ స్థానికంగా కార్యాలయాన్ని తెరిచింది.
2017లో జర్మనీ చేసిన ఒక చట్టం స్ఫూర్తితో టర్కీ ఈ నిబంధనలను రూపొందించింది.
జర్మనీ- యూరోపియన్ యూనియన్
యూరోపియన్ యూనియన్‌లో జర్మనీ అత్యంత ప్రభావవంతమైన దేశం. యూనియన్ చట్టాలకు అదనంగా తన సొంత చట్టాలను జర్మనీ తయారు చేసుకుంది.
2017లో జర్మనీ వివాదాస్పదమైన నెట్‌వర్క్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లా యాక్ట్‌ను అమలులోకి తెచ్చింది.
20 లక్షల మందికి పైగా రిజిస్టర్డ్ జర్మన్ వినియోగదారులు ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, కంటెంట్ చట్ట విరుద్ధమైందిగా గుర్తిస్తే పోస్ట్ చేసిన 24 గంటలలోపు దానిని సమీక్షించి తొలగించాలి.
లేదంటే 5 కోట్ల యూరోలు(సుమారు రూ. 440 కోట్లు) వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
యూరోపియన్ కమిషన్ ప్రస్తుతం డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ ప్యాకేజీ కోసం బిల్లును సిద్ధం చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో చట్టాలు ఎలా ఉన్నాయి?
2020, మే 28న అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. సోషల్ మీడియా కంపెనీలు కస్టమర్లు పోస్ట్ చేసే కంటెంట్ విషయంలో ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఆర్టికల్ 230ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆదేశాలను జారీ చేశారు.
ట్విటర్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ట్రంప్ ఆదేశాలు వర్తిస్తాయి.
ఈ ఆదేశాలు జారీ చేసి ''సోషల్ మీడియాలో నిజాయితీకి ఇది పండగ రోజులాంటిది'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.
అయితే, ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ రాజకీయ ప్రేరేపితమని, ఇది ఆన్‌లైన్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని, బెదిరింపు ధోరణిలో ఉందని ట్విటర్ వ్యాఖ్యానించింది.
అయితే, ట్విటర్, ట్రంప్ మధ్య జరిగిన యుద్ధంలో చివరకు ట్రంప్ ఓడిపోయారు. ఆయన ఎన్నికల్లో పరాజయం పాలై పదవి నుంచి దిగిపోయిన తర్వాత, అంతకు ముందు ఆయన జారీ చేసిన ఉత్తర్వును అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ట్విటర్, ఫేస్‌బుక్‌లు ఆయన అకౌంట్‌ను రద్దు చేశాయి.

ఫొటో సోర్స్, MANAN VATSYAYANA
బ్రిటన్‌లోనూ నియంత్రణలు
మీడియా రెగ్యులేటర్‌గా పని చేస్తున్నఆఫ్‌కామ్‌ను సోషల్ మీడియాకు కూడా రెగ్యులేటర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ బ్రిటన్ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకుంది.
పిల్లలు, మహిళలు, అమాయక పౌరులను ఆన్‌లైన్ దుర్వినియోగాల నుంచి రక్షించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది.
ఆన్‌లైన్ దుర్వినియోగానికి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే పనిలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం, ఈ ఏడాది 'ఆన్‌లైన్ ప్రొటెక్షన్ బిల్లు'ను సిద్దం చేసింది. పార్లమెంటు ఆమోదం తెలిపితే ఇది చట్టంగా మారుతుంది.
సోషల్ మీడియాను సెన్సార్ చేయబోతున్నారా అని ఆఫ్‌కామ్‌ను ప్రశ్నించినప్పుడు '' ఇంటర్నెట్‌నుగానీ, సోషల్ మీడియానుగానీ సెన్సార్ చేయబోం. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఆధునిక సమాజానికి జీవనాడి'' అని ఆ సంస్థ పేర్కొంది. ఆఫ్‌కామ్‌కు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని ట్విటర్, ఫేస్‌బుక్, గూగుల్ ప్రకటించాయి.

ఫొటో సోర్స్, SOPA IMAGES/GETTY IMAGES
ఆస్ట్రేలియాలో ఎలా ఉంది?
2019లో ఆస్ట్రేలియా అబోరెంట్ వయలెంట్ మెటీరియల్ యాక్ట్‌ను ఆమోదించింది.
ఇందులో సోషల్ మీడియా సంస్థలు నియమాలు ఉల్లంఘించినందుకు జరిమానాలు, సంబంధిత అధికారులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. కంపెనీ టర్నోవర్‌లో 10 శాతం వరకు ఫైన్ విధించవచ్చు.
చైనా ట్విటర్, గూగుల్, ఫేస్‌బుక్ సహా పలు పాశ్చాత్య టెక్ దిగ్గజాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేస్తూ వస్తోంది. రాజకీయంగా సున్నితమైన కంటెంట్ విషయంలో సోషల్ మీడియాపై చైనా ప్రభుత్వం నిత్యం ఒక కన్ను వేసి ఉంచుతుంది.
ఇటీవల ఓ వివాదం కారణంగా నైజీరియా ప్రభుత్వం కూడా తమ దేశంలో ట్విటర్‌ను నిషేధించింది.

భారతదేశంలో వ్యతిరేకత
సామాన్య పౌరులు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, ఓటీటీల మీద చేసే ఫిర్యాదుల పరిష్కారానికి, వాటిపై సకాలంలో నిర్ణయాలు తీసుకునేలా చేయడమే ఈ కొత్త నిబంధనల వెనక ఉన్న పరమార్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇందుకోసం నియమించిన అధికారి భారతదేశంలో నివసిస్తూ ఉండాలి. లైంగిక నేరాలు, నకిలీ వార్తలు , సోషల్ మీడియా దుర్వినియోగం నుంచి మహిళలు, పిల్లలను రక్షించడానికి ఈ చట్టంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
అయితే, దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా చాలామంది భావిస్తున్నారు.
''యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే అంశాలు భారత ప్రభుత్వం తయారు చేసిన కొత్త ఐటీ చట్టంలో ఉన్నాయి. కేవలం తప్పుడు సమాచారాన్ని తొలగించడమొక్కటే ప్రభుత్వ ఉద్దేశం కాదు'' అని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీకి చెందిన రీసెర్చర్ గుర్‌షాబాద్ గ్రోవర్ అన్నారు.
అయితే, సమస్య రెండువైపులా ఉందని ఐక్యూబ్స్‌వైర్ వ్యవస్థాకుడు సాహిల్ చోప్రా అన్నారు.
''స్థానిక చట్టాలు పాటించాలని పెద్ద సంస్థలను కోరడం తప్పేమీ కాదు. ప్రస్తుతం అరాచకం రాజ్యమేలుతోంది. కొందరు డబ్బులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఈ చట్టాలు కొన్నిసార్లు భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించవచ్చు. అరాచకత్వంలో ఉన్న సోషల్ మీడియా మీద కొంత కంట్రోల్ ఉండటం అవసరమే'' అన్నారాయన.
స్థానికంగా అధికారులను నియమించడమే ట్విటర్, భారత ప్రభుత్వం మధ్య ఉన్న ప్రధానమైన సమస్య అన్నారు గుర్‌షాబాద్ గ్రోవర్.
" కంపెనీ ఉద్యోగులను భారతదేశంలో నివసించడం తప్పనిసరి చేయడం ద్వారా, అవసరమైనప్పుడు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం తన చేతిలో పెట్టుకుంది'' అన్నారు గ్రోవర్
కొత్త ఐటీ నిబంధనలను పాటించడంలో విఫలమైనందున ట్విటర్ భారతదేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయిందని ప్రభుత్వంలోని వ్యక్తులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సమస్య ఎక్కడ మొదలైంది?
ట్విటర్ రెండు విషయాలలో ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. కాంగ్రెస్ టూల్ కిట్‌కు సంబంధించిన విషయంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్వీట్‌కు మేనిపులేటెడ్ మీడియా ట్యాగ్ తగిలించింది.
దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న పోలీసులు దిల్లీలోని ట్విటర్ కార్యాలయానికి కూడా వెళ్లి అక్కడి అధికారులను ప్రశ్నించారు.
సంబిత్ పాత్ర ట్వీట్‌ను రీట్వీట్ చేసిన 11 కేంద్ర మంత్రుల ట్వీట్లకు కూడా మేనిపులేటెడ్ మీడియా ట్యాగ్ తగిలించాలని కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌ను డిమాండ్ చేసింది.
ఆ పదకొండు మంది మంత్రులలో కేంద్ర ఐటీ, సమాచారా ప్రసారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఉన్నారు. మంత్రులు ట్వీట్‌ల ద్వారా అసత్యాలు ప్రచారం చేశారని కాంగ్రెస్ వాదించింది.
ఇక రెండో విషయం గాజియాబాద్ ఘటన. ఇందులో ఒక ముస్లింను కొందరు కొడుతున్నట్లు, అతని గడ్డాన్ని కత్తిరిస్తున్నట్లు ఉన్న ఓ వీడియో వైరల్ అయింది.

ఫొటో సోర్స్, Getty Images
గాజియాబాద్ పోలీసులు ఈ వ్యవహారంలో మత పరమైన కోణం లేదని, దాడి చేసిన వారిలో హిందువులు, ముస్లింలు ఉన్నారని చెప్పారు.
ఈ వీడియోను తొలగించాలని పోలీసులు కోరడంతో ట్విటర్ దానిని తొలగించింది. అయితే, ట్విటర్ ఇండియా సంస్థలో సీనియర్ అధికారి మనీశ్ మహేశ్వరిని విచారణ కోసం పోలీసులు పిలిపించారు.
భారత దేశంలో ట్విటర్‌కు దాదాపు రెండు కోట్లమంది యూజర్లు ఉన్నారు. అమెరికా, జపాన్‌ల తర్వాత అత్యధిక యూజర్లు ఉన్న ఇండియాలో ట్విటర్‌ను సమస్యలు చుట్టుముడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








