యూట్యూబ్‌ కోసం దోపిడీ ప్రాంక్, కాల్పుల్లో యువకుడి మృతి

కాల్పులు జరిగిన పార్క్

ఫొటో సోర్స్, Google

ఫొటో క్యాప్షన్, ఘటన జరిగిన పార్క్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

యూట్యూబ్‌ కోసం కొందరు యువకులు దోపిడీ ప్రాంక్ వీడియో చేస్తుండగా కాల్పులు జరగడంతో 20 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఉన్న నాష్‌విల్లేలో జరిగింది.

టిమోతీ విల్స్, అతడి స్నేహితుడు ప్రాంక్ వీడియో కోసం నాష్‌విల్‌లోని ఒక పార్క్ బయట ఉన్న కొంతమందికి దగ్గరగా వెళ్లారు. వారి దగ్గర పెద్ద కత్తులు ఉన్నాయని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.

వారు చేస్తున్నది ప్రాంక్ అన్న విషయం తెలియక విల్క్స్‌ను అక్కడ ఉన్న ఒక 23 ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్చిచంపాడు. అది ప్రాంక్ అనే విషయం తనకు తెలీదని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు.

యూట్యూబ్ కోసం తాము ఒక ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నట్టు మృతుడి స్నేహితుడు తర్వాత పోలీసులకు వివరించారు. ఈ కేసులో పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

దోపిడీ జరుగుతున్నట్లు చూపే ప్రాంక్ వీడియోలు యూట్యూబ్‌లో చాలా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు వాటిని నకిలీ తుపాకులు, ముసుగులను, వాహనాలను ఉపయోగించి షూట్ చేస్తుంటారు.

వీటిలో కొన్ని వీడియోలకు లక్షలు, కోట్ల వ్యూస్ వస్తుంటాయి.

ఈ దోపిడీ వీడియోల్లో చాలా వరకూ నకిలీవే అయినా, వాటిలో నటించే వారు మాత్రం వీడియో కోసం తమ పాత్రల్లో జీవించేస్తుంటారు.

కానీ, ప్రమాదకరమైన, ఇతరులను భయపెట్టే ప్రాంక్స్‌ను నిషేధిస్తున్నట్లు యూట్యూబ్ రెండేళ్ల క్రితం నిబంధనలు తీసుకొచ్చింది.

తీవ్ర శారీరక సమస్యలకు గురయ్యేలా ఎవరినైనా భయపెట్టడం లేదా మైనర్లను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసే ప్రాంక్స్ లాంటి వీడియోలను యూట్యూబ్ అనుమతించదు.

ఆయుధాలతో బెదిరించడం, నకిలీ దోపిడీలు లాంటి వీడియోలను ప్రత్యేకంగా నేరాల జాబితాలో చేర్చారు. అలాంటి వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగిస్తారు.

శామ్ పెప్పర్ ప్రాంక్ వీడియో

ఫొటో సోర్స్, YOUTUBE/SAM PEPPER

ఫొటో క్యాప్షన్, శామ్ పెప్పర్ ప్రాంక్ వీడియో

కొత్త నిబంధనలకు కారణం

ఇంతకు ముందు జరిగిన ఇలాంటి కొన్ని తీవ్రమైన ఘటనల వల్ల యూట్యూబ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

2015లో శామ్ పెప్పర్ అనే ఒక వ్లాగర్, ఒక వ్యక్తిని కాల్చి చంపేసినట్టు ప్రాంక్ చేసి అతడి స్నేహితుడిని తీవ్రంగా భయపెట్టాడు. కానీ, ఆ వీడియోను తొలగించడానికి యూట్యూబ్ ఒప్పుకోలేదు.

కానీ, 2017లో ఇద్దరు యూట్యూబర్లు ఒక లావటి పుస్తకం బుల్లెట్‌ను కూడా అడ్డుకోగలదని ఒక స్టంట్ చేశారు. అది ఒకరి మరణానికి కారణమైంది.

19 ఏళ్ల మోనాలిసా పెరేజ్ మందంగా ఉన్న పుస్తకాన్ని తుపాకీకి అడ్డంగా పెట్టి తన బాయ్‌ఫ్రెండ్ పెడ్రో రూయిజ్‌ మీద కాల్పులు జరిపారు. కానీ, పుస్తకంలోంచి దూసుకొచ్చిన బుల్లెట్ తగిలి అతడు చనిపోయాడు.

ఈ నేరానికి పెరేజ్‌కు 2018 మార్చిలో ఆరు నెలల జైలు శిక్ష విధించారు. అది జరిగిన దాదాపు పది నెలల తర్వాత యూట్యూబ్ ప్రమాదకరమైన ప్రాంక్‌లను నిషేధించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)