సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య, అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిచ్చుక మజ్జియ్య (అందరు శివ అని పిలుస్తారు) అనే యువకుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకోవడానికి ముందు అతను సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.
పోలీసులు వేధిస్తున్నారంటూ ఆ సెల్ఫీ వీడియోలో మజ్జియ్య ఆరోపించాడు.
"నిరుడు హైదరాబాద్ నుంచి వస్తూ రెండు బాటిళ్లు మందు తీసుకొచ్చాను. జగ్గయ్యపేట సమీపంలోని చిలకల్లు దగ్గర పోలీసులు పట్టుకున్నారు. పెట్టీ కేసు పెట్టామని చెప్పారు. ఏడాది తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తే స్టేషన్‌కి వెళ్లాను. అక్కడ శివ అనే కానిస్టేబుల్‌ని కలిస్తే లక్ష రూపాయలు ఇస్తే ఏ కేసు లేకుండా చేస్తాను..లేదంటే గంజాయి కేసు పెట్టి ఇరికించేస్తానని బెదిరించారు.
నాకు తెలిసిన కానిస్టేబుల్‌తో ఫోన్ చేయిస్తే నేనేమయినా భయపడతాను అనుకుంటున్నావా అంటూ శివ అనే కానిస్టేబుల్ మళ్లీ బెదిరించారు. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఎవరి దగ్గరకయినా వెళితే నాదే తప్పంటారు. మందు ఎందుకు తీసుకొచ్చావని అడుగుతారు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్" అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే మజ్జియ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలేం జరిగింది?
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని పిడింగొయ్యి మజ్జియ్య స్వగ్రామం.
తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటున్నారు. వాళ్లదగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ మద్యం వెంటబెట్టుకుని రావడంతో పోలీసులకు పట్టుబడ్డారు.
తాను రెండు బాటిల్స్ మాత్రమే తీసుకొచ్చానని, అది కూడా ఫ్రెండ్స్‌కి పార్టీ ఇవ్వడం కోసమని మజ్జియ్య చెప్పాడు. అయితే, పోలీసులు మాత్రం 5 బాటిల్స్‌తో పట్టుబడినట్టు కేసు రాశారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.23ఏళ్ల మజ్జియ్య ఆటో నడుపుకుంటూ అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. రాజమహేంద్రవరం సమీపంలోని హైవేపై రికార్డ్ చేసిన వీడియోను మిత్రులకు పంపించి బుధవారం నాడు అమ్మమ్మ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసుల వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు మజ్జియ్య చివరి వీడియోలో పేర్కొనడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఫొటో సోర్స్, ugc
పోలీసులు ఏమంటున్నారు..
మజ్జియ్య అనే వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీకి చిక్కినట్టు చిల్లకల్లు పోలీసులు చెబుతున్నారు. అతని మీద కేసు రిజిస్టర్ అయ్యిందని, విచారణ కొనసాగుతోందని బీబీసీకి తెలిపారు.
పోలీసులు తనను వేధించారని ఆరోపించి, ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ ఘటనలో బాధ్యులుగా చిల్లకల్లు ఎస్‌ఐతో పాటుగా ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు.
జగ్గయ్యపేట సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు ఆ యువకుడు పట్టుబడ్డాడు. కేసు కొనసాగుతోంది. ఈలోగా ఆత్మహత్యకు పాల్పడిన విషయం మా దృష్టికి వచ్చింది. పోలీసుల మీద ఆరోపణలు రావడంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేశాము. ఆధారాలు దొరికితే వేధింపులకు పాల్పడిన వారిపై మరిన్ని చర్యలు తీసుకుంటామని డీఐజీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









