ప్రొబేషనరీ లేడీ ఎస్‌ఐపై లైంగిక వేధింపులు, మరిపెడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు

మరిపెడ ఎస్సై

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, మరిపెడ ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి
    • రచయిత, ఎస్.ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

ప్రొబేషనరీ మహిళా ఎస్‌ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపాయి.

తొర్రూర్ సబ్ డివిజన్ పరిధిలోని మరిపెడ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారంటూ ప్రొబేషనరీ మహిళా ఎస్‌ఐ వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు సీపీని కోరారు.

ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సోమవారం రాత్రి తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించారని ఆమె ఫిర్యాదు చేశారు.

"అక్రమ బెల్లం నిల్వపై రైడ్ చేయాలని సోమవారం రాత్రి 11:30 ప్రాంతంలో ఎస్‌ఐ పి. శ్రీనివాస్ రెడ్డి నాకు ఫోన్ చేసారు. తన ప్రైవేట్ వాహనంలో నన్ను తీసుకెళ్లారు. మరిపెడకు 8 కిలోమీటర్ల దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి యత్నించారు. దుస్తులు చించివేసి, ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు" అని మహిళా ప్రొబేషనరీ ఎస్సై తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి

ఎస్ఐ సస్పెన్షన్

ప్రొబేషనరీ మహిళా ఎస్‌ఐపై లైంగిక వేధింపుల ఘటనలో మహబూబాబాద్ జిల్లా ‘మరిపెడ’ ఎస్‌ఐ పి.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.

విచారణలో లభించిన ఆధారాలతో సంతృప్తి చెందిన ఉన్నతాధికారులు టీఎస్ సీఎస్ (కాండక్ట్) రూల్స్ -1964 ప్రకారం ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు చేపట్టారు.

ఈ మేరకు వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

"మహిళా ప్రొబేషనరీ ఎస్‌ఐ ఫిర్యాదుపై ఎస్‌ఐ పీ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసాం. సోమవారం రాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మరిపెడ పోలీస్ స్టేషన్లోనే శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదుకు ఆదేశాలిచ్చాం" అని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి బీబీసీతో చెప్పారు.

మరోవైపు ఈ కేసులో ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

మరిపెడ పోలీస్ స్టేషన్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మరిపెడ పోలీస్ స్టేషన్

ట్రైనింగ్ కోసం మరిపెడ స్టేషన్‌కు

ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 61 మంది ప్రొబేషనరీ ఎస్ఐ‌లు విధుల్లో చేరారు.

ప్రొబేషనరీ సమయంలో 6 నెలల ప్రత్యేక ట్రైనింగ్‌లో భాగంగా ఒక నెల ఎస్‌హెచ్‌వో (ఇండిపెండెంట్ ఛార్జ్)గా ఒక పోలీస్ స్టేషన్‌లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఐ ర్యాంక్‌లో ఎస్‌హెచ్‌వో స్టేషన్లు 27 మాత్రమే ఉన్నాయి. మరో 34 మంది ఎస్‌ఐలను మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు పంపారు.

ఇలా బాధిత మహిళా ప్రొబేషనరీ ఎస్ఐ మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో 18 రోజుల క్రితం విధుల్లో చేరారు.

మరో 10 రోజుల్లో ఎస్‌హెచ్‌వో ట్రైనింగ్ పూర్తి అవుతుందనగా, సోమవారం రాత్రి మరిపెడ రెగ్యులర్ ఎస్ఐ పి. శ్రీనివాస్ రెడ్డి తనపై లైంగిక దాడికి యత్నించారని బాధితురాలు తన కుటుంబ సభ్యులతో వచ్చి మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన

దళిత సంఘాల ఆందోళన

ఈ ఘటనపై మహబూబాబాద్‌లో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.

మరోవైపు హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం ఎదుట తెలంగాణ మహిళా కాంగ్రేస్ ధర్నాకు దిగింది.

ఈ ఘటనపై సత్వర చర్యలకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీజీపి కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునితా రావ్ ధర్నా చేసారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)