మరియమ్మ లాకప్ డెత్ లేవనెత్తుతున్న ప్రశ్నలు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంబడిపూడి మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించడం తెలంగాణలో పెద్ద దుమారమే లేపింది.
దళిత సంఘాలు, విపక్ష పార్టీలు రంగంలోకి దిగడంతో ముఖ్యమంత్రి స్వయంగా ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
గతంలోని ఇలాంటి సందర్భాలకు భిన్నంగా ఉదారంగా నష్టపరిహారం ప్రకటించారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఇంతకీ ఏమిటీ కేసు? మరియమ్మ ఎవరు?
ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ కుమారుడు ఉదయ్, ఆయన స్నేహితుడు శంకర్ ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు ఫిర్యాదు రావడంతో యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారించారు.
వారిద్దరి వాంగ్మూలం ప్రకారం మరియమ్మను కూడా పోలీసులు తరువాత అదుపులోకి తీసుకున్నారు.
''జూన్ 18న ఉదయం 7.45 గంటలకు మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్, ఆయన స్నేహితుడు శంకర్‌లను స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణ పూర్తి చేశారు. విచారణలో వెంటనే వారు నేరాన్ని అంగీకరించారు.
వారి నుంచి దొంగతనం అయిన సొమ్ము రికవరీ చేశారు. విచారణ చేసిన పోలీసులు ఫ్రెష్ అవుదామని ఇంటికి వచ్చారు. వారి బాధ్యతను వేరే కానిస్టేబుల్‌కి అప్పగించారు.
ఉదయం 10 గంటల ప్రాంతంలో మరియమ్మ స్పృహ తప్పింది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్తే పల్స్ పడిపోతోంది. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. భువనగిరి తీసుకెళ్లాం.
11.30కి ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు'' అని మరియమ్మ మరణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో పోలీసులు రాశారు.
''పోలీసులు చెప్పేది అబద్ధం. నన్ను, మా అమ్మను ఘోరంగా కొట్టారు. వారు గట్టిగా కొట్టడంతోనే మేం నేరం చేయకపోయినా చేసినట్లు ఒప్పుకున్నాం. పోలీసులు కొట్టిన దెబ్బలతో మా అమ్మ నా ఒళ్లోనే పడిపోయింది. అక్కడే చనిపోయింది'' అని మరియమ్మ కుమారుడు ఉదయ్ బీబీసీకి చెప్పారు.
తనను, తల్లిని అడ్డగూడూరు పోలీసులు, చింతకాని స్టేషన్లో పెట్టి కొట్టారనీ, తమ వాళ్ల ముందే కొట్టారని ఉదయ్ చెబుతున్నారు.
''16వ తేదీన పోలీసులు మా ఊరు వచ్చి ఉదయ్‌ని ముందుగా అరెస్ట్ చేశారు. ఉదయ్‌ను ఘోరంగా కొట్టి మళ్లీ ఊరు తీసుకు వచ్చి డబ్బుల కోసం ఇల్లంతా వెతికారు. అసలు ఉదయ్ బండి కూడా దిగలేకపోయాడు. అలానే బలవంతంగా ఇంట్లోకి తీసుకువచ్చి ఇంట్లో కూడా మళ్లీ కొట్టారు. రాత్రి 9 తరువాత మళ్లీ వచ్చి ఉదయ్ తల్లి కోసం అడిగారు. డబ్బు ఎక్కడ దాచావో చెప్పాలంటూ ఆమెను ఊళ్లోనే కొట్టారు. దీంతో పోలీసుల దెబ్బలకు భయపడిన ఆమె, ఇంటి వెనుక పొదల్లో డబ్బు ఉన్నట్టు చెప్పింది. ఆమె నిజంగా డబ్బు దాచిందో, పోలీసులకు భయపడి అలా చెప్పిందో నాకు తెలియదు. పోలీసులు ఆ పొదల్లో రాత్రి వరకూ వెతికారు. అర్ధరాత్రి ఆమెను కూడా స్టేషన్‌కి తీసుకెళ్లిపోయారు. ఒకటైతే వాస్తవం, పోలీసులు మొదటిసారి తీసుకెళ్లినప్పుడు ఉదయ్‌ని గట్టిగా కొట్టారు'' అని బీబీసీతో చెప్పారు ఉదయ్ చిన్నాన్న కొడుకు రాజు.

ఉదయ్ శరీరంపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. ముఖ్యంగా ఉదయ్ పిరుదులపై చాలా గట్టిగా కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆ గాయాలకు ఖమ్మంలో చికిత్స తీసుకుంటున్నారు.
మరియమ్మ శరీరంపై గాయాలు ఉన్నాయా లేవా? ఆమె ఎలా మరణించారనేది తేల్చే పోస్టుమార్టం నివేదిక బయటకు రావాల్సి ఉంది.
ఇక ఉదయ్ స్నేహితుడు శంకర్ అందుబాటులో లేరు.
మరియమ్మ భువనగిరి ఆసుపత్రిలో మరణించిన తరువాత ఆమె అల్లుడు నాగరాజుకు సమాచారం ఇచ్చారు పోలీసులు.
నాగరాజు ఆసుపత్రికి వచ్చి ఆ మరునాడు మరియమ్మ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దళిత నాయకులు, కాంగ్రెస్ పార్టీ వారు దీనిపై ఆందోళనకు దిగారు.
మరియమ్మది లాకప్ డెత్ అనీ దానికి సమాధానం చెప్పాలంటూ భువనగిరిలో ఆందోళనకు దిగారు.
దీంతో అప్పటికప్పుడు ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు రాచకొండ కమిషనర్. మల్కాజ్ గిరి ఏసీపీని విచారణ అధికారిగా నియమించారు.

ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం..
పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఎవరైనా మరణిస్తే, జుడిషియల్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరపాలి. కానీ ఈ కేసులో అలా చేయలేదు. ఆర్డీవోతో నివేదిక రాయించారు.
మరియమ్మను అరెస్టు చేసినప్పుడు మహిళా పోలీసులు లేరు.
''అర్ధరాత్రి ఇంటి దగ్గర కొట్టి అరెస్ట్ చేశారనీ, ప్రైవేటు వాహనంలో సివిల్ డ్రెస్‌లో వచ్చి అరెస్ట్ చేశారు" అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం మరియమ్మ కేసులో హైకోర్టు జుడిషియల్ విచారణకు ఆదేశించింది. మరియమ్మ మరణంపై సమగ్ర నివేదిక పంపాలని రాచకొండ కమిషనరేట్‌ను ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్.
ఇప్పటికే రాచకొండ పోలీసులు మరియమ్మ స్వగ్రామం ఖమ్మం జిల్లా చింతకాని దగ్గరలోని కోమట్లగూడెంలో విచారణ చేపట్టారు. ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.

దొంగతనం కేసు ఏమిటి?
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలోని చర్చి ఆవరణలో ఫాదర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేసేవారు మరియమ్మ.
ఆమెను చూడ్డానికి కుమారుడు అతని స్నేహితుడు వచ్చి మరియమ్మ దగ్గరే కొన్ని రోజులు ఉన్నారు.
''వారు అక్కడ ఉన్నప్పుడే నేను పనిమీద హైదరాబాద్ వెళ్లాను. వచ్చి చూస్తే బీరువా తాళం పనిచేయలేదు. వంగి ఉంది. బలవంతంగా తెరిచి చూడగా కొంత డబ్బు మిస్ అయింది. సుమారు రెండు మూడు లక్షల రూపాయలు ఉండొచ్చు. చర్చి నిర్మాణం కోసం పెట్టిన డబ్బు అది.
మరియమ్మను, కుమారుడిని పిలిచి అడగ్గా తమకు సంబంధం లేదన్నారు.
మరియమ్మ కొడుకుతో వచ్చిన స్నేహితుడు అప్పటికే వెళ్లిపోయాడు.
మీరు తప్ప ఇంట్లోకి ఎవరూ రాలేదు కదా అంటే కూడా స్పందించలేదు. ఎటూ తేలకుండానే ఆరోజు గడచిపోయింది.
తెల్లవారి చూస్తే మరియమ్మ, ఆమె కుమారుడు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు.
ఆమె సొంతూరు ఫోన్ చేసి, ఇతర బంధువులతో మాట్లాడితే, త్వరలో వచ్చి మాట్లాడుతాం అని చెప్పారు.
వారి బంధువులు కొందరికి నేను విషయం చెప్పి డబ్బు సంగతి తేల్చమన్నాను.
ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాను. అంత వరకే నాకు తెలుసు.
ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు.
కానీ ఒక రోజు ఆమె చనిపోయిందని చెప్పారు'' అన్నారు మరియమ్మపై ఫిర్యాదు చేసిన ఫాదర్ బాలశౌరి.
దొంగతనం ఫిర్యాదు వరకూ తనకు తెలుసన్న ఫాదర్, ఆ తరువాత ఏం జరిగిందో తెలియదన్నారు.
దొంగతనం జరిగిన రోజు నుంచి ఫిర్యాదు వరకూ మధ్య జరిగిన సంభాషణల్లో తమ వారు దొంగతనం చేసినట్టు మరియమ్మ బంధువులు అంగీకరించారని ఫాదర్ చెబుతున్నారు.
అయితే వారి బంధువులు డబ్బు వెనక్కు ఇప్పిస్తామని చెప్పడంతో ఫిర్యాదు చేయకుండా ఆగినట్టు ఆయన వివరించారు.
చివరకు మరియమ్మ బంధువులు డబ్బు ఇవ్వకుండా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుండడంతో ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు.
చర్చి నిర్మాణం కోసం దాచిన డబ్బు పోయిందని, మేరీమాత బంగారు కిరీటం వంటి ఆభరణాలు మాత్రం పోలేదని ఆయన చెప్పారు.
ఈ కేసులో 7వ తేదీన దొంగతనం జరగ్గా, 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫాదర్.
పోలీసులు తిరిగి ఉదయ్ నుంచి 30 వేలు, శంకర్ నుంచి 60 వేలు స్వాధీనం చేసుకున్నట్టు మరియమ్మ మృతికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
వారిద్దరూ దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారనీ, ఆ దొంగతనం చేసిన సొమ్మును తాము రికవరీ చేసినట్టు మరియమ్మ కేసులో పోలీసులు తెలిపారు.
అయితే పోలీసులు కొట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్లు తమ దగ్గర ఉన్న సొమ్మును పోలీసులకు ఇచ్చారు అని చెబుతున్నారు ఉదయ్ బావ నాగరాజు.
స్పందించిన కేసీఆర్..
గతంలో తెలంగాణలో జరిగిన దళితుల హత్య, లాకప్ డెత్‌లకు భిన్నంగా ఈ కేసులో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటించారు.
కుమారుడికి ఇల్లు, ఉద్యోగం, రూ. 15 లక్షలు.. కూతుళ్లు ఇద్దరికీ చెరో 10 లక్షల పరిహారం ప్రకటించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక దగ్గర్లో ఉండడం వల్లే సీఎం ఇలా నష్టపరిహారం ప్రకటించారని కొందరు విపక్ష నాయకులు చెపుతున్నారు.
నష్టపరిహారం సంగతి సరే కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించాల్సి ఉందని దళిత, పౌరహక్కుల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










