ఎమర్జెన్సీ: దిల్లీలోని తుర్క్‌మాన్ గేట్ దగ్గర బుల్డోజర్ల విధ్వంసానికి కారణం సంజయ్ గాంధీ ఆలోచనలేనా?

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Penguin Books

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది 1976 ఏప్రిల్ 13 నాటి కథ. ఆరోజు ఉదయం దిల్లీ ఆసఫ్ అలీ రోడ్‌లోని తుర్క్‌మాన్ గేట్ వైపుగా ఒక పాత బుల్డోజర్ కదులుతోంది. దాని వెనుక కూలీలతో నిండిన ట్రక్కు వస్తోంది. ఈ ట్రక్కు వెనుక జీపులో దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) తహశీల్దార్ కశ్మీరీ లాల్ కూర్చున్నారు.

‘‘ప్రజల్ని భయపెట్టేలా పనులు చేయొద్దు. నెమ్మదిగా పనులు మొదలుపెట్టండి’’ అని జీపులో నుంచి కశ్మీరీ లాల్ ఆదేశాలు వినిపిస్తున్నాయి.

భవనాలను కూల్చే సిబ్బందితో తుర్క్‌మాన్ గేట్ దగ్గరకు కశ్మీరీ లాల్ రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఇలానే ఇక్కడికి రెండుసార్లు వచ్చారు. అయితే, రెండుసార్లూ పోలీసులను, అధికారుల్ని ప్రజలు తీవ్రంగా కొట్టారు. ఒకసారి అయితే, ఓ డెయిరీ దుకాణం యజమాని పెద్దకర్రతో పోలీసులందరినీ తరిమికొట్టారు. అయితే, అవన్నీ ఎమర్జెన్సీకి మునుపటి రోజులు.

ఎప్పటిలానే ఆ రోజు కూడా తుర్క్‌మాన్ గేట్ దగ్గర ఏర్పాటుచేసిన తాత్కాలిక గుడారాల దగ్గరే డీడీఏ సిబ్బందిని ప్రజలు చుట్టుముట్టారు.

‘‘భయపడకండి. తాత్కాలిక గుడారాల్లో ఉన్నవారిని రంజిత్ నగర్‌కు తీసుకెళ్లేందుకు మేం వచ్చాం. అదీ చాలా మెరుగైన ప్రాంతం. మీకు అక్కడ ఎలాంటి సమస్యలూ ఉండవని నేను హామీ ఇస్తున్నా’’అని జనాలతో కశ్మీరీ లాల్ చెప్పారు.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Penguin books

ఫుట్‌పాత్ బద్దలుకొట్టేందుకే...

కశ్మీరీ లాల్ మాటల అనంతరం జనాలను తీసుకెళ్లి, కొన్ని తాత్కాలిక గుడారాలను కూల్చివేశారు. అయితే, అక్కడున్న వారెవరూ నిరసన తెలపలేదు. ఈ పనులు రెండు రోజులు సాగాయి. ఆ తర్వాత కశ్మీరీ లాల్ తన బృందంతో వెనక్కి వెళ్లిపోయారు.

అయితే, ఏప్రిల్ 15న మళ్లీ తుర్క్‌మాన్ గేట్ దగ్గరకు రెండు బుల్డోజర్లు వచ్చాయి. దీంతో వెంటనే మళ్లీ జనం ఆయన్ను చుట్టుముట్టారు.

‘‘మీరేమీ భయపడొద్దు. ఫుట్‌పాత్ బద్దలుకొట్టేందుకే మేం వచ్చాం. దీనికి ఆనుకుని ఉన్న ఇళ్లలోని వారు తమ వస్తువులను తీసేసుకోండి. ఎవరూ ఇళ్లలో ఉండకండి. ఏమైనా దెబ్బలు తగిలే ముప్పుంది. మేం జాగ్రత్తగా పనిచేసుకుని వెళ్లిపోతాం’’అని కశ్మీరీ లాల్ నెమ్మదిగా చెప్పారు.

అయితే, ఫుట్‌పాత్ బద్దలుకొట్టడానికి బుల్డోజర్లు ఎందుకు? అని ఆయన్ను జనం ప్రశ్నించారు. అయితే, ‘‘ఎవరూ భయపడొద్దు. ఒక్క ఇంటిని కూడా కూల్చివేయబోం. కేవలం ఫుట్‌పాత్ మాత్రమే బద్దలుకొడతాం’’అని ఆయన హామీ ఇచ్చారు. కానీ, చాలా మందిలో సందేహాలు అలానే ఉన్నాయి.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Penguin books

ఫొటో క్యాప్షన్, జాన్ దయాళ్, అజోయ్ బోస్

ఈ ఘటన గురించి ఫర్ రీజన్స్ ఆఫ్ స్టేట్: దిల్లీ అండర్ ఎమర్జెన్సీ పుస్తకంలో చరిత్రకారులు అజోయ్ బోస్, జాన్ దయాళ్ వివరంగా చర్చించారు.

‘‘తాత్కాలిక గుడారాల కూల్చివేతపై దాదాపు 100 మంది స్థానిక కౌన్సిలర్ అర్జన్ దాస్‌ను కలిశారు. వీరిలో చాలా మంది యూత్ కాంగ్రెస్ నాయకులే. మోటార్ మెకానిక్‌గా కెరియర్‌ను మొదలుపెట్టిన అర్జన్ దాస్.. సంజయ్ గాంధీ సన్నిహితుల్లో ఒకరు.’’

‘‘వెంటనే కొంతమందిని తన కారులో కూర్చొబెట్టుకొని అర్జన్ దాస్.. నేరుగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ విద్యాచరణ్ శుక్లా ఇంటికి వెళ్లారు. డీడీఏ ఉపాధ్యక్షుడు, సంజయ్ గాంధీకి సన్నిహితుడైన జగ్మోహన్‌కు విద్యా చరణ్ ఫోన్ చేశారు. ఆ బుల్డోజర్లను వెనక్కి పిలిపించాలని కోరారు. ఆ తర్వాత అందరితో కలిసి అర్జన్ దాస్ తుర్క్‌మాన్ గేట్ దగ్గరకు వెళ్లారు. అయితే, అక్కడి పరిస్థితులను చూసిన ఆయనకు కాలి కింద నేల తిరుగుతున్నట్లు అనిపించింది.’’

‘‘సరిగ్గా కొన్ని గంటల క్రితం రోడ్డుకు ఆనుకుని ఉన్న 50 ఇళ్లను నేలమట్టం చేశారు. ధ్వంసమైన ఇళ్ల బయట పిల్లలు, వారి తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చుని ఉన్నారు. వారి వస్తువులన్నీ చెల్లాచెదురైపోయాయి.’

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Penguin books

ఫొటో క్యాప్షన్, రుఖ్సానా సుల్తానా

సాయం కోసం రుఖ్సానా దగ్గరకు

ఒకవైపు విధ్వంసం జరుగుతుంటే, మరోవైపు సాయం కోసం కొందరు రుఖ్సానా సుల్తానా దగ్గరకు పరుగులు తీశారు. అక్కడకు 2 కిలోమీటర్ల దూరంలో ఆమె కుటుంబ నియంత్రణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సంజయ్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో రుఖ్సానా ఒకరు.

రుఖ్సానా అక్కడికి వచ్చేసరికి మరో 20 ఇళ్లను కూడా కూలదోశారు. బుల్డోజర్లు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.

అయితే, వీరికి సాయం చేస్తానని రుఖ్సానా మాటిచ్చారు. సాయంత్రం అందరూ జంతర్ మంతర్ రోడ్‌లోని తన ఇంటికి రావాలని సూచించారు. ఆ తర్వాతి ఘటనలను ‘‘ఇండియాస్ ఫస్ట్ డిక్టేటర్‌షిప్: ఇన్ ద ఎమర్జెన్సీ 1975-77’’ పుస్తకంలో క్రిస్టోఫ్ జెఫెర్లోట్, ప్రతినవ్ అనిల్ రాసుకొచ్చారు.

‘‘ఒక షరతుపై సాయం చేస్తానని రుఖ్సానా అంగీకరించారు. తుర్క్‌మాన్ గేట్ దగ్గర కుటుంబ నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, వారంలోగా 300 మందిని ఆపరేషన్లకు తీసుకువస్తే సాయం చేస్తానని అన్నారు. దీనికి అంగీకరిస్తే, మీ సాధకబాధకాల్ని సంజయ్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు.’’

‘‘అన్నింటికీ వారు సరేనని తలూపారు. అయితే నిరాశ్రయుల్ని త్రిలోక్‌పురీ, నంద్‌ నగరీలకు తరలించకుండా మాతా సుందరీ రోడ్ లేదా మింటో రోడ్‌లకు తరలించేలా చూడాలని వారు అభ్యర్థించారు.’’

అయితే, వారు చెప్పిన మాటలకు రుఖ్సానాతోపాటు ఆమె పక్కనుండే గూన్ రాజు కూడా కోపగించుకున్నాడు. ‘‘మీరు ఎక్కడికి వెళ్లినా అది జరగదని హెచ్చరించాడు.’’

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Harper Collins

ఇళ్ల చిట్టీల పంపిణీ...

అయితే, తుర్క్‌మాన్ గేట్ రోడ్‌లో బుల్డోజర్లు తిరుగుతూనే ఉండేవి. ఇప్పుడు ఆ బుల్డోజర్ల సంఖ్య మూడుకు పెరిగింది. రాత్రి పగలు తేడా లేకుండా అవి పనిచేస్తూనే ఉండేవి.

‘‘మరోవైపు అప్పటివరకు ఇళ్లు పడగొట్టని లేదా వెరే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడిన వారికి ఇళ్ల చిట్టీలు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు డీడీఏ అధికారులు. త్రిలోక్‌పురి, నంద్ నగరి ప్రాంతాల్లో ప్లాట్ల చిట్టీలను వారు పంపిణీ చేసేవారు. ఆ చిట్టీల పంపిణీ ద్వారా, మరిన్ని ఇళ్లను కచ్చితంగా పడగొడతామనే సంకేతాలు ఇచ్చేవారు’’ అని జాన్ దయాళ్, అజోయ్ బోస్ రాసుకొచ్చారు.

క్రమంగా డీడీఏ అధికారుల మాట తీరు కూడా మారింది. మొదట్లో నెమ్మదిగా మాట్లాడిన వారు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టారు.

‘‘మేం ఇక్కడ తరతరాలుగా జీవిస్తున్నాం. మేం అక్రమ గుడారాలు వేసుకునే వాళ్లం కాదు. సమయానికి ఇంటి పన్ను కూడా కడుతున్నాం’’అంటూ అక్కడి ప్రజలు వేడుకున్నారు. ‘‘అయితే మేం ఏమీ చేయలేం. ఇవి పైనుంచి మాకు వచ్చిన ఆదేశాలు అంటూ వరుసగా ఇళ్లను పడగొట్టుకుంటూ వెళ్లారు.’’

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జగ్మోహన్

‘‘మరో పాకిస్తాన్ కానివ్వం’’

ఏప్రిల్ 18 ఆదివారం బుల్డోజర్లు రాలేదు. అదే రోజున తుర్క్‌మాన్ గేట్ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రతినిధులు డీడీఏ ఉపాధ్యక్షుడైన జగ్మోహన్‌ను కలిసేందుకు వెళ్లారు.

‘‘తుర్క్‌మాన్ గేట్ ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు మమ్మల్ని తీసుకెళ్లొద్దు. ఇక్కడ కలిసి ఉన్న మమ్మల్ని వేర్వేరు ప్రాంతాలకు పంపి విడదీయొద్దు’’అని జగ్మోహన్‌కు వారు అభ్యర్థించారు.

‘‘ఇక్కడున్న ఒక పాకిస్తాన్‌ను ధ్వంసం చేసి, మరోచోట పాకిస్తాన్‌ను ఏర్పాటుచేయడానికి మేం ఏమైనా పిచ్చోళ్లమా? మేం త్రిలోక్‌పురి, ఖిచ్‌దీపుర్‌లలో ప్లాట్‌లు ఇస్తాం. మీరు అక్కడికి వెళ్లండి. అక్కడకు వెళ్లకుండా ఇక్కడే కూర్చుంటా అంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి’’ అని వారిని జగ్మోహన్ హెచ్చరించినట్లు దయాళ్, బోస్ తమ పుస్తకంలో రాసుకొచ్చారు.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Houghton Mifflin

సంజయ్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు...

ఏప్రిల్ 1976లో తుర్క్‌మాన్ గేట్ దగ్గరకు సంజయ్ గాంధీ, జగ్మోహన్ కలిసి వచ్చారు. ఆ విషయాలను ఇందిరా గాంధీ జీవిత చరిత్రలో రచయిత క్యాథరీన్ ఫ్రాంక్ వివరించారు.

‘‘తుర్క్‌మాన్ గేట్ దగ్గర నుంచి జామా మసీద్‌ను స్పష్టంగా చూడాలని తాను అనుకుంటున్నట్లు జగ్మోహన్‌తో సంజయ్ గాంధీ చెప్పారు. సంజయ్ వ్యాఖ్యలను జగ్మోహన్ ఆదేశాలుగా తీసుకున్నారు.’’

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, India Today

‘‘అప్పుడే తుర్క్‌మాన్ గేట్ నుంచి జామా మసీదు వరకు అడ్డుగా ఉన్న ఇళ్లన్నీ పడగొట్టేయాలని జగ్మోహన్ నిర్ణయించుకున్నారు.’’

ఏప్రిల్ 7న డీఐజీ పీఎస్ భిందర్‌కు జగ్మోహన్ ప్రత్యేక సందేశం పంపించారు. 10న తాను తుర్క్‌మాన్ గేట్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టబోతున్నానని, దీని కోసం పోలీసులు, మెజిస్ట్రేట్ సాయం అవసరం అవుతుందని ఆయన కోరారు.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమామ్ బుఖారీ

ఇమామ్ బుఖారీ విషయంలోనూ అసంతృప్తి

తుర్క్‌మాన్ గేట్ పరిసరాల్లో ప్రభుత్వ చర్యలకు మరో కారణం కూడా ఉంది. దీన్ని ‘‘ఎమర్జెన్సీ క్రానికల్స్’’ పుస్తకంలో జ్ఞాన్ ప్రకాశ్ వివరించారు.

‘‘1973లో జామా మసీద్ ఇమామ్‌గా ఇమామ్ బుఖారీ నియమితులయ్యారు. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో బుఖారీ ఈ బాధ్యతలు తీసుకున్నారు. బుఖారీ తండ్రి కూడా తన కొడుక్కు ఈ పదవిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండేవారు.’’

‘‘అయితే బుఖారీ నియామకానికి ఆమోద ముద్ర వేసేందుకు వక్ఫ్ బోర్డు నిరాకరించింది. ఎందుకంటే ఇస్లాంలో ఇమామ్‌లను వంశ పారంపర్యంగా నియమించకూడదు. దీంతో బుఖారీ, ప్రభుత్వానికీ మధ్య విభేదాలు వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వం తీసుకునే ముస్లిం వ్యతిరేక చర్యలు ఈ విభేదాల్ని మరింత పెంచాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం బుఖారీ.. ప్రభుత్వాన్ని విమర్శించేవారు. దీంతో తుర్క్‌మాన్ గేట్ పరిసరాల్లోని ఇళ్లను కూల్చేయడం ద్వారా ఆయనకు బుద్ధి చెప్పాలని సంజయ్ గాంధీ భావించారు.’’

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, India Today

మహిళల ప్రదర్శన

1976 ఏప్రిల్ 19నాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఇళ్లను పడగొడుతున్న ప్రాంతానికి దాదాపు 500 మంది మహిళలు, 200 మంది పిల్లలు నిరసన చేపట్టేందుకు వచ్చారు.

నిరసన చేపట్టేవారంతా చేతికి నళ్ల రిబ్బన్లు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. 11.30 గంటలకు ఇక్కడికి బుల్డోజర్లు చేరుకున్నాయి. అర గంట తర్వాత ఏడు ట్రక్కుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా వచ్చారు.

పోలీసుల చేతుల్లో తుపాకులు, భాష్పవాయు గోళాలు, నిరసనకారులను అడ్డుకునే షీల్డ్‌లు ఉన్నాయి. దీంతో అక్కడున్న ఇళ్ల శిథిలాల నుంచి రాళ్లు తీసి కొందరు భద్రతా బలగాలపైకి విసిరారు. వీరిని బలగాలు తరిమి కొట్టేందుకు ప్రయత్నించాయి. అయితే వీధుల వెంబడి ఇళ్లపై నుంచి పోలీసులపైకి రాళ్లు విసిరారు. భయంతో వణికిన పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఆ తర్వాత గాల్లోకి కాల్పులు జరిపారు. చాలా మంది నిరసనకారులు పక్కనే ఉన్న ఫజల్ ఇలాహీ మసీదులోకి వెళ్లి తలదాచుకున్నారు.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Penguin books

ఫొటో క్యాప్షన్, డీఐజీ భిందర్

ఆ తరువాత కాల్పులు...

దిల్లీ సినిమా హాల్ ప్రాంగణంలో కొంత మంది వెనుకనుంచి వచ్చి పోలీసులపై దాడి చేశారు. అప్పటివరకు ఎడమ వైపు నుంచి వచ్చే వారిని ఎదుర్కొనేందుకే పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు. మరోవైపు హమ్‌దర్ద్ ఆసుపత్రి వైపు నుంచి మరో మూక పోలీసుల్ని చుట్టుముట్టుంది. దీంతో అక్కడున్న పోలీసులు అతికష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు.

అప్పటి పరిస్థితులపై షా కమిషన్‌ను ముందు ఎస్పీ ఆర్‌కే ఓహ్రీ వాంగ్మూలం ఇచ్చారు. ‘‘పరిస్థితులు విషమించడంతో మొదట లాఠీచార్జికి అనుమతించారు. వెంటనే మరింత మంది సిబ్బందిని పంపాలని మేం సూచించాం. గంటలోపలే ఘటన స్థలానికి ఎనిమిది బృందాల దిల్లీ పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితులు మరింత శ్రుతి మించడంతో, కాల్పులు జరపాలని నేను, నాతోపాటు పనిచేస్తున్న ఆర్‌కే శర్మ ఆదేశాలు ఇచ్చాం.’’

మధ్యాహ్నం 2.30కు పోలీసులు కాల్పులు జరిపారు. మొత్తంగా 14 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసుల రికార్డుల్లో పేర్కొన్నారు. షాజహానాబాద్ వీధుల వెంబడి జనాలను తరుముతూ పోలీసులు కాల్పులు జరిపారు.

‘‘డీఐజీ భిందర్‌కు ఒక రాయి తగిలిన వెంటనే, కానిస్టేబుల్ తుపాకీ తీసుకుని ఆయన కాల్పులు జరపాలని చూశారు. కానీ, ఆ కానిస్టేబుల్ తుపాకీ ఇవ్వలేదు. దీంతో నువ్వే కాల్పులు జరపాలని భిందర్ ఆయనకు సూచించారు’’అని షా కమిషన్ నివేదికలో పేర్కొన్నారు.

ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించారని అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, వాస్తవానికి అంతకు రెట్టింపు మంది చనిపోయారని అనధికారిక వర్గాలు తెలిపాయి.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Konark Publication

కర్ఫ్యూ విధింపు...

సాయంత్రం 4.30 సమయంలో ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో అన్ని వీధుల్లోనూ పోలీసు జీపులు తిరిగాయి.

‘‘పోలీసులు ఇళ్లలోకి దూరి చాలా మందిని చితకబాదారు. పిల్లలు, మహిళలను కూడా కొట్టారు. ఒకచోట బంగారం కూడా తీసుకెళ్లిపోయారని ఆరోపణలు వచ్చాయి. మరోచోట తూటాలతో కాలికి గాయాలైన వ్యక్తిని మరింత హింసించారని వార్తలు వచ్చాయి’’ అని షా కమిషన్ నివేదికలో పేర్కొంది.

ఈ కర్ఫ్యూ మే 13, 1976 వరకు కొనసాగింది. ఈ కాల్పుల్లో మరణించింది ఆరుగురేనని జగ్మోహన్ తన జీవిత చరిత్ర ‘‘ఐలాండ్ ఆఫ్ ట్రూత్’’లో పేర్కొన్నారు. షా కమిషన్ కూడా మృతుల సంఖ్య ఆరనే పేర్కొంది.

కానీ ‘‘ఇన్ ద నేమ్ ఆఫ్ డెమొక్రసీ’’ పుస్తకంలో ఈ మరణాల సంఖ్యను 20గా చరిత్రకారుడు బిపిన్ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు ‘‘ద జడ్జిమెంట్’’ పుస్తకంలో ఈ మరణాల సంఖ్యను దాదాపు 150 గా సీనియర్ జర్నలిస్టు కుల్‌దీప్ నాయర్ వివరించారు.

‘‘కర్ఫ్యూ విధించిన తర్వాత చీకట్లోనూ డీడీఏ సిబ్బంది పని చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బుల్డోజర్ల సంఖ్య ఆరుకు పెరిగింది. రాత్రి పూట కూడా పనిచేసేవారు. ఏప్రిల్ 22 వరకు ఈ పనులు కొనసాగాయి. నిరంతరం శిథిలాలను తీసుకెళ్లే ట్రక్కులు అటూఇటూ తిరుగుతుండేవి’’అని అజోయ్ బోస్, జాన్ దయాళ్ పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Vikas Publication Hoouse

వార్తలపై ఆంక్షలు

ఇక్కడ కాల్పులు జరిగిన మరుసటి రోజు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక మొదటి పేజీలో ‘‘ఫ్రాన్స్‌ యూనివర్సిటీలో విద్యా సంస్కరణల కోసం నిరసనలు చేపడుతున్న వారిపై కాల్పులు’’అనే వార్త ప్రచురితమైంది. అయితే, తుర్క్‌మాన్ గేట్ నుంచి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కార్యాలయం కేవలం 2 కి.మీ.లోపే ఉంటుంది. కానీ, ఇక్కడ కాల్పులు జరిగిన విషయాన్ని పత్రికలో ఎక్కడా ప్రస్తావించలేదు.

అన్ని రకాల వార్తలపై ఆంక్షలు విధించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన బిషన్ టండన్ తన పుస్తకం ‘‘పీఎంవో డైరీ’’లో స్పందించారు. ‘‘ఈ ఘటనపై వార్తలు ప్రచురించకుండా వార్తా సంస్థలపై ఆంక్షలు విధించాలా వద్దా అని హోం శాఖ కార్యదర్శి అడిగారు. అయితే, ప్రభుత్వం ఒక చిన్న ప్రెస్ నోట్ అయినా విడుదల చేస్తే బావుంటుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుస్తుందని అన్నాను. దీన్ని దాచిపెట్టడం వల్ల ఏం ప్రయోజనం అన్నాను. వదంతులు చాలా ఎక్కువగా వ్యాపించే అవకాశముందని చెప్పాను. రాత్రి మేమంతా హోం శాఖ కార్యదర్శి ఇంట్లో సమావేశమయ్యాం. అయితే, వార్తలపై ఆంక్షలు విధించాలని అప్పుడే మాకు గవర్నర్ నుంచి ఆదేశాలు వచ్చాయి.’’

అధ్వానంగా పునరావాసం

తుర్క్‌మాన్ గేట్ నుంచి తరలించిన ప్రజలు మంగ్లోపురికి వచ్చి చూసేసరికి అక్కడ ఇటుకలు కనిపిస్తున్న ఇళ్లు ఎదురయ్యాయి. కొన్ని ఇళ్లను సగం కట్టి వదిలేశారు. మరికొన్నింటికి పైకప్పులు కూడా వేయలేదు.

‘‘ఆ కాలనీలో ఏర్పాటుచేసిన 18 మరుగుదొడ్లకు పైకప్పులు లేవు. సరైన తలుపులూ లేవు. వాటిని ఉపయోగించుకునేందుకు పెద్ద లైన్ కూడా ఉండేది. ప్రతి కుటుంబానికి 25 గజాల స్థలం కేటాయించారు. ఇంత చిన్న ప్రాంతంలో జంతువులు కూడా ఉండలేవని జస్టిస్ షా వ్యాఖ్యానించారు’’ అని రచయిత పాల్ బ్రాస్ తన పుస్తకం ‘‘ఎన్ ఇండియన్ పొలిటికల్ లైఫ్: చరణ్ సింగ్ అండ్ కాంగ్రెస్ పాలిటిక్స్’’లో పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షేక్ అబ్దుల్లా

ఇందిరా గాంధీకి షేక్ అబ్దుల్లా లేఖ

తుర్క్‌మాన్ గేట్ దగ్గర అల్లర్లపై అప్పటి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా స్పందించారు. తుర్క్‌మాన్ గేట్‌తోపాటు పరిసరాల్లో కొత్తగా నిర్మించిన కాలనీలను ఆయన సందర్శించారు. ఇందిరా గాంధీకి సన్నిహితుడైన మహమ్మద్ యూనిస్ కూడా ఆయనతో వెళ్లారు.

‘‘శ్రీనగర్‌కు వెళ్లిన వెంటనే, ఇందిరాగాంధీకి అబ్దుల్లా సుదీర్ఘమైన లేఖ రాశారు. యమునా తీరం వెంబడి నిర్మించిన కొత్త కాలనీల దుస్థితిని దానిలో వివరించారు. దీనంతటికి మీ ముద్దుబిడ్డే కారణమని చెప్పారు. ఇది సెక్యులరిజంపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు’’అని రచయిత జనార్దన్ ఠాకుర్ తన పుస్తకం ‘‘ఆల్ ద ప్రైమ్ మినిస్టర్స్ మెన్’’లో వివరించారు.

‘‘అయితే, అబ్దుల్లా చెప్పిన మాటలతో ఇందిరాగాంధీ ఏకీభవించలేదు. మరోవైపు జగ్మోహన్ కూడా తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.’’

‘‘తుర్క్‌మాన్ గేట్ దగ్గర కాల్పులకు అసలు కారణాలు.. రుఖ్సానా సుల్తానా ఆధ్వర్యంలో నడుస్తున్న సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ విధానాలు, పోలీసుల అత్యుత్సాహం’’అని తన ఆత్మకథలో జగ్మోహన్ రాసుకొచ్చారు.

ఈ కుటుంబ నియంత్రణ విధానాలు, కాల్పులకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 1977 ఎన్నికల్లో భారీ సంఖ్యలో ముస్లింలు ఆ పార్టీని దూరం పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)