ప్రెస్ రివ్యూ: ఇవాంకా పర్యటనలో పోలీసులకు ఆయుధాలొద్దు, యూనిఫాంలొద్దు!

ఫొటో సోర్స్, Twitter
భద్రతా సిబ్బందికి ఆయుధాలొద్దు, యూనిఫాంలొద్దు!
అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా భద్రత విషయంలో అనేక మార్పుచేర్పులు జరుగుతున్నట్టు 'ఈనాడు' కథనం తెలిపింది.
ఆమె వ్యక్తిగత భద్రతను అమెరికా అధ్యక్షుడి భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ అధికారులు చూసుకుంటున్నారు.
విదేశీ ప్రతినిధి హోదాలో మన దేశం నుంచి ప్రత్యేక భద్రత దళం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐ.ఎస్.డబ్ల్యూ) విభాగాలు ఆమె భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి.
.... ఇవాంకా భద్రతకు సంబంధించి అమెరికా అధికారులు కొత్తకొత్త నిబంధనలు తెరపైకి తేవడమే యంత్రాంగాన్ని ఇరకాటంలో పెడుతోంది.
ఆమె పాల్గొనే కార్యక్రమానికి (ఇన్‌సైడ్) భద్రత కల్పించే పోలీసు సిబ్బంది ఎవరూ ఆయుధాలు ధరించకూడదంటూ ఇది వరకే సూచించిన వారు.. తాజాగా ఏకరూప దుస్తులు (యూనిఫాం) ధరించకుండా చూడాలని కోరడంపై పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.
ప్రత్యామ్నాయం ఏమిటన్న దిశగా ఆలోచన సాగిస్తోందని 'ఈనాడు' కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
గోప్యత గల్లంతు నిజమే : యూఐడీఏఐ వెల్లడి
కొందరు లబ్దిదారుల పేర్లు, వివరాలను ఆధార్ సంఖ్య సహితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 210 వెబ్‌సైట్లలో బహిరంగంగా ప్రదర్శించారని 'యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (యూఐడీఏఐ) స్వయంగా వెల్లడించింది.
నిబంధనల ఉల్లంఘన జరిగి ఆధార్ డాటా ప్రయివేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిందన్న వాస్తవాన్ని యూఐడీఏఐ ఒప్పుకుంది.
నిబంధనలను ఉల్లంఘించి ప్రదర్శించిన ఆ సమాచారాన్ని వెబ్‌సైట్ల నుంచి పూర్తిగా తొలగించినట్టు సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు యూఐడీఏఐ సమాధానమిచ్చింది.
కాగా ఉల్లంఘన ఎప్పడు జరిగిందో, ఎప్పుడు సమాచారాన్ని తొలగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదని 'నవతెలంగాణ'లో అచ్చయిన కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Twitter
మరో 12 సింగరేణి బొగ్గు గనులు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ కొత్తగా 12 గనులను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో సింగరేణి ప్రాంతంలో పర్యటించి ఆరు భూగర్భ గనులు, మరో ఆరు ఓపెన్ కాస్ట్ గనులను ప్రారంభించనున్నారు.
ఈ గనుల్లో తవ్వకాలు జరిపేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ, అటవీ అనుమతులు వచ్చాయి.
ఈ 12 గనుల ద్వారా సింగరేణి సంస్థ ఏటా 21.07 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనుంది.
ప్రస్తుతం సింగరేణి సంస్థకు 29 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ గనులు కలిపి మొత్తం 45 బొగ్గు గనులు ఉండగా, కొత్త గనులను ప్రారంభించాక మొత్తం సంఖ్య 57కు పెరగనుంది.
ఓపెన్ కాస్ట్ గనులతో పోల్చితే భూగర్భ గనులతో ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆరు భూగర్భ గనులతో సింగరేణి ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలో ప్రారంభించనున్న 6 భూగర్భ గనులపై సింగరేణి బొగ్గు గనుల సంస్థ రూ.2,300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని 'సాక్షి' కథనం పేర్కొంది.
ఆదివాసీ ఘర్షణ!
ప్రభుత్వం ఆదివాసులకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను ఎస్టీల పేరిట లంబాడాలు ఎక్కువగా అనుభవిస్తున్నారని, అవగాహనారాహిత్యం కారణంగా తాము నష్టపోతున్నామని ఆదివాసీలు ఆరోపిస్తున్నట్టుగా 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాల్లో తమకు అన్యాయం జరుగుతోందని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు చూపుతున్నారు.
గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద ప్రభుత్వం 61మందికి రూ.6 కోట్లు మంజూరు చేసింది.
వీరిలో 57మంది లంబాడా విద్యార్థులుండగా, కోయ సామాజిక వర్గం-1, ఎరుకల-1, నాయకపోడ్ విద్యార్థి ఒక్కరు మాత్రమే ఉన్నారు.
అలాగే, 2008లో బాసర ట్రిపుల్ ఐటీ మొదటి బ్యాచ్ ప్రవేశాల్లో మొత్తం 300సీట్లుండగా, వీటిలో 269సీట్లు లంబాడా విద్యార్థులకే లభించాయి.
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 1980 నుంచి 2011 వరకు నిర్వహించిన ఉపాధ్యాయుల స్పెషల్ డీఎస్సీ నియామకాల్లో 696పోస్టులు భర్తీ చేశారు.
వాటిలో ఎస్సీ, బీసీ, ఓసీ కులాలకు 87పోస్టులు వస్తే, లంబాడా అభ్యర్థులకు 292పోస్టులు లభించాయి. మిగిలిన అన్ని తెగల ఎస్టీ కులాల వారికి 317పోస్టులు లభించాయి.
ఇక, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ లంబాడాలకే పెద్దపీట లభిస్తోంది.
ఏజెన్సీ ప్రాంతాలకు చెందని లంబాడాలు నకిలీ ధ్రువపత్రాలతో ఎస్టీ రిజర్వేషన్ల ఫలాలు కొల్లగొడుతూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆదివాసులు ఆరోపిస్తున్నట్టుగా 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/AFP/Getty Images
తెలంగాణకు 'పెళ్లి' కళ
ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగురోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో వేల కొద్దీ పెండ్లిండ్లకు సన్నాహాలు జరుగుతున్నాయి.
రాజధాని హైదరాబాద్‌తోపాటు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెండ్లి మండపాలు ముందుగానే రిజర్వ్ అయిపోయాయి. పెండ్లి మండపాలు, అలంకారాలు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మంగళవాయిద్యాలు, బ్యాం డ్‌బాజాల నుంచి వివాహ సంబంధిత వ్యాపారాలన్నింటికీ ఊహించనంత స్థాయిలో డిమాండ్ పెరిగిపోయింది.
రాజధాని హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాలన్నింటిలోనూ పెండ్లి మండపాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ సమయంలో లక్ష రూపాయల వరకూ అద్దె వసూలు చేసే పెండ్లి మండపాలు డిమాండ్ పెరగటంతో ఏకంగా మూడు లక్షల రూపాయల వరకు రోజుకు అద్దె వసూలు చేస్తున్నాయి.
హోటల్‌లలో హాల్‌బుకింగ్.. ఒక్కో ప్లేట్ ధర కనీసంగా రూ.450 నుంచి ప్రారంభమవుతున్నది. క్యాటరింగ్ ధరలయితే ఆకాశాన్ని అంటుతున్నాయి.
అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు గురుమౌఢ్యం కారణంగా నెల రోజుల పాటు ముహూర్తాలు లేకపోవటం, నవంబర్ 30 నుంచి దాదాపు రెండు నెలల ఇరవై రోజులపాటు (ఫిబ్రవరి 19వరకు) శుక్రమౌఢ్యం కారణంగా మళ్లీ ముహూర్తాలు లేకపోవటంతో ఈ నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రం అంతా మంగళవాయిద్యాలతో మార్మోగబోతున్నదని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Bilal Bahadur
మందుపాతర పేలి జవాను మృతి
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కోళ్లం వెంకన్న (43) మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.
తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన వెంకన్న సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై కాలు వేయడంతో అది పేలినట్టు 'సాక్షి' ప్రచురించిన కథనం తెలిపింది.
తీవ్రంగా గాయపడిన వెంకన్నను హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు, సోమవారం ఆయన మృతదేహానికి స్వగ్రామం పొదలాడలో అంత్యక్రియలు జరిపించనున్నట్టు ఈ వార్తలో రాశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









