కశ్మీరీ నేతలతో సమావేశం వెనుక మతలబు ఏమిటి...నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసిందా?

ఫొటో సోర్స్, Ani
- రచయిత, రియాజ్ మస్రూర్
- హోదా, బీబీసీ న్యూస్, శ్రీనగర్
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కశ్మీర్ రాజకీయ నాయకులతో సమావేశం కావడంతో ఆయనపై ప్రశంసలతో పాటు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
2019 ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత అక్కడి రాజకీయ నాయకులంతా తమ ప్రాధాన్యం తగ్గిపోయిందని భావించారు.
ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ విషయంలో వేసిన 'చిన్నపాటి వెనుకడుగు' వారికి మళ్లీ రాజకీయ ఊపిరులూదింది.
మోదీ కశ్మీరీ నేతలలో జరిపిన సమావేశంలో ఏం చర్చించారనే కంటే ఇప్పుడే ఎందుకీ సమావేశం పెట్టారన్న విషయమే ఎక్కువగా చర్చనీయమవుతోంది.
కశ్మీర్ లోయలో శాంతి నెలకొనడం కోసమంటూ ఎనిమిది నెలలపాటు జైలులో నిర్బంధించిన ముగ్గురు మాజీ సీఎంలు సహా నలుగురు ముఖ్యమంత్రులు..జమ్ము, కశ్మీర్ ప్రాంతాలకు చెందిన మరో 10 మంది అత్యంత కీలక నాయకులు మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇదే అమిత్ షా కొద్ది నెలల కిందట కశ్మీరీ రాజకీయ కూటమిని 'గుప్కార్ గ్యాంగ్' అంటూ ఎద్దేవా చేశారు.

ఫొటో సోర్స్, Pmoindia
గుప్కార్ అనేది కొండల పక్కనే ఉన్న విలాసవంతమైన నివాస ప్రాంతం. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఇతర ప్రముఖుల ఇళ్లన్నీ అక్కడే ఉన్నాయి.
ఈ గుప్కార్ కూటమి 2019 ఆగస్టు 4న ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35ఏ జమ్ముకశ్మీర్‌కు కల్పించే హక్కులు వేటినీ తొలగించకుండా అడ్డుకోవడం ఈ కూటమి లక్ష్యం.
అయితే, కూటమి పురుడు పోసుకున్న మరునాడే అందులోని నాయకులు, వారి మద్దతుదారులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలన్నిటినీ ఆపేశారు. జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేశారు.
2019 ఆగస్ట్ 5న మొదలైన ఈ ఆంక్షలన్నీ ఆ ఏడాది అక్టోబరు తరువాత క్రమంగా ఎత్తేశారు.
ఆ తరువాత అబ్దుల్లాలు, ముఫ్తీలను పక్కన పెట్టి, శాంతి సౌభాగ్యాలు, కొత్త నాయకత్వంతో 'నవ కశ్మీరం' సృష్టించడంపై మోదీ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
అయితే, మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ నుంచి కొందరు నాయకులు బయటకొచ్చి మోదీ అనుకూల విధానాలతో 'అప్నీ పార్టీ'ని ఏర్పాటు చేశారు. కానీ, మోదీ ప్రభుత్వం చెప్పిన శాంతిసౌభాగ్యాల కొత్త కశ్మీరం అనేది మాత్రం ఇంకా సాకారం కాలేదు.
'' మేం సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తాం. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా సాధ్యమేనని నమ్ముతున్నాం'' అని అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ బీబీసీతో అన్నారు. ఆయన 2016లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
బుఖారీ ఒక్కరే కాకుండా హురియత్ మాజీ నేత సజ్జాద్ లోన్, 2010 ఐఏఎస్ టాపర్ శాహ్ ఫైజల్ కూడా 'నవ కశ్మీరా'నికి ముఖచిత్రాలుగా కనిపించారు. దిల్లీ, జమ్ముకశ్మీర్‌లలోని బీజేపీ కేడర్‌కు ఇదంతా సంతోషం కలిగించింది.
కానీ, మోదీ హఠాత్తుగా సయోధ్య రాజకీయాలు ప్రారంభించడంతో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అభివృద్ధి చేస్తారని అంచనాలు పెట్టుకున్నవారంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.

ఎందుకీ అనూహ్య వెనుకడుగు
లద్దాఖ్‌లో చైనా చొరబాటు యత్నాలు, పాకిస్తాన్ తూర్పు ప్రాంతానికి సమీపాన భారత్ తన సైనిక సత్తా పెంచుకుంటూ పోవడంపై పాక్ నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలు, పాక్ ఆందోళన తగ్గించాలంటూ అమెరికా ఒత్తిళ్లు వంటి అంతర్జాతీయ పరిస్థితులకు తలొగ్గి మోదీ వెనుకడుగు వేశారని 'కశ్మీరీ టైమ్స్' ఎడిటర్ అనురాధా భాసిన్ అభిప్రాయపడ్డారు.
''అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన బలగాలను ఎలాంటి గడబిడ లేకుండా ఉపసంహరించాలనుకుంటోంది. భారత్, పాకిస్తాన్‌లు ఎల్ఓసీ వెంబడి 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నాయి. అయితే, చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. కశ్మీర్ శాంతియుతంగా ఉంటేనే భారత్ చైనాతో వివాదం వంటి క్లిష్ట సమస్యపై దృష్టి పెట్టగలదు'' అన్నారామె.

ఫొటో సోర్స్, MEAIndia
కశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కాస్త మెత్తని వైఖరి కనబరచడం వెనుక కారణమేదైనా కానీ ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశాన్ని మాత్రం ప్రజలు భిన్న కోణాల్లోంచి చూస్తున్నారు.
కేంద్రం స్టాండ్ మార్చుకున్నట్లుగా కనిపించడంపై బీజేపీ మద్ధతుదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
''ఎంతోకాలంగా ఒక రాజకీయ వర్గం సాగిస్తున్న దోపిడీ నుంచి మాకు విముక్తి కల్పిస్తామని చెప్పి ఆర్టికల్ 370ని తొలగించారు. కానీ ఇప్పుడు వారితోనే చేతులు కలుపుతున్నారు'' అని జమ్ముకశ్మీర్‌కు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బీజేపీ నేత 'బీబీసీ'తో అన్నారు.
అయితే, 2019 ఆగస్ట్ 5 నాటి పార్లమెంటు నిర్ణయం వల్ల కలిగిన ఒత్తిడి నుంచి ప్రధాని తెలివిగా బయటపడ్డారని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.
''ఈ అంశంలో విజేతలెవరో అప్పుడు నిర్ణయించలేం. అయితే, మోదీ వేసిన తాజా అడుగు పాకిస్తాన్, చైనా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆయనకు కశ్మీర్ విషయంలో కాస్త ఊపిరి తీసుకునే వెసులుబాటు కల్పించింది'' అని కశ్మీర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు హరూనీ రేషీ అన్నారు.
''ఆర్టికల్ 370, 35ఏను పునరుద్ధరించడం జరగకపోవచ్చు. కానీ, మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తుంది. ఉద్యోగాలు, భూ యాజమాన్యాలపైనా కొన్ని హామీలు ఇస్తుంది. ఈ విషయంలో జమ్ముకశ్మీర్ నేతలంతా ఏకతాటిపైకి వస్తారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ క్రమంగా మాటలకే పరిమితమవుతుంది. జరగబోయే పరిణామాలు వేటినీ పాకిస్తాన్ వ్యతిరేకించ లేదు'' అని హరూన్ అన్నారు.
కాగా తాజా భేటీని కశ్మీర్ స్థానిక నేతలు, అక్కడి వ్యవహారాలను నిత్యం పరిశీలించేవారు నైతిక స్థైర్యం పెంచేదిగా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- కృష్ణానది తీరంలో గ్యాంగ్ రేప్: ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం.. పడవలో పారిపోయిన నిందితులు
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిల్ఖా సింగ్: కోవిడ్ అనంతర సమస్యలతో చనిపోయిన భారత ప్రఖ్యాత అథ్లెట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- 'బాబా కా ధాబా' కాంతా ప్రసాద్ ఆరోగ్యం విషమం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








