కేసీఆర్: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి'

ఫొటో సోర్స్, Telangana CMO/FB
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరపాలని, నిజనిర్ధారణ చేసి, చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని శుక్రవారం ఆదేశించారని నమస్తే తెలంగాణ తెలిపింది.
తప్పని తేలితే ఆ పోలీసులను ఉద్యోగంలో నుంచి తొలగించాలని, దళితులపై చేయిపడితే ప్రభుత్వం ఊరుకోబోదని, తక్షణమే కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానికి చెందిన మరియమ్మ లాకప్‌డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టంచేశారు.
దళితుల పట్ల సమాజ దృక్పథం, మారాలి. ముఖ్యంగా పోలీసుల ఆలోచనాధోరణి మారాలని చెప్పిన కేసీఆర్, లాకప్‌డెత్ ఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కూతుళ్లను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతోపాటు, రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని, ఇద్దరు కూతుళ్లకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థికసహాయంగా అందచేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.
ఖమ్మంజిల్లా చింతకాని మండలం కోమటిగూడేనికి చెందిన మరియమ్మ.. యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలో ఓ ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. ఆ ఇంట్లో దొంగతనం జరగడంతో అడ్డగూడూరు, చింతకాని పోలీసులు మరియమ్మను, ఆమె కొడుకు ఉదయ్‌కిరణ్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని భట్టి విక్రమార్క వినతిపత్రంలో పేర్కొన్నారు. దెబ్బలను తట్టుకోలేక మరియమ్మ మృతిచెందినట్టు తెలిపారని పత్రిక పేర్కొంది.

'నన్ను నాన్ లోకల్ అనడం సంకుచితత్వం' -ప్రకాశ్‌రాజ్
సెప్టెంబర్‌లో జరిగే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి బరిలో దిగుతున్న ప్రకాశ్‌రాజ్ శుక్రవారం తన టీమ్‌తో కలసి ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సమావేశంపై సాక్షి పత్రిక అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అనేది ఒక చిన్న సంస్థ. ఈ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నాలుగైదు రోజులుగా టీవీల్లో ‘మా’ ఎన్నికల్లోకి రాజకీయ పార్టీలు వచ్చేశాయట, కేసీఆర్, కేటీఆర్‌గార్లు, ఆంధ్ర సీఎం జగన్‌గారు వచ్చేశారట’ అనే ఊహాగానాల వార్తలు చూపిస్తున్నారు. ఈ విషయం గురించి మేం ప్రెస్‌మీట్ పెట్టకుంటే అమెరికా అధ్యక్షుడు సైతం వచ్చేశారని చూపిస్తారేమోనని భయం వేసింది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ వ్యంగ్యంగా అన్నారు.
"నేను 'మా’ సమస్యలపై రెండేళ్లుగా ఆలోచిస్తున్నా. సమస్యలు పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ‘మా’కి సొంత భవనం కోసం ఏం చేయాలి? ప్యానెల్‌లో ఎవర్ని తీసుకోవాలనే విషయాలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను.
మాది సిని‘మా’ బిడ్డల ప్యానల్. పదవి కోసం కాకుండా పని చేయడం కోసం పోటీ చేస్తున్నాం. మా ప్యానల్‌లో ఉన్నవారందరూ ప్రశ్నించేవాళ్లే. నేను తప్పు చేస్తే ప్రశ్నించి, నన్ను పక్కకు తప్పుకోమంటారు. పైగా అధ్యక్ష స్థానానికి తగ్గ నలుగురు నా ప్యానల్‌లో ఉన్నారు. మా ప్యానల్ ఆవేశంతో పుట్టుకురాలేదు. ఆవేదనతో పుట్టుకొచ్చింది.
నేను ‘మా’ అధ్యక్ష బరిలో నిలుస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి నాన్ లోకల్ అంటున్నారు. ఇలాంటి మాటలు తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించేటప్పుడు ఎదుర్కొన్నాను. ఆవేదన కలిగింది. 1995లో ‘సంకల్పం’ చిత్రంతో తెలుగులో పరిచయమయ్యాను.. 25ఏళ్లు దాటిపోయింది.. ఇప్పుడు తెలుగులో నాన్ లోకల్ అంటుంటే చాలా ఆవేదన కలుగుతోంది. కళాకారులకు భాష, ప్రాంతీయ భేదాలు ఉండవు. ఆర్టిస్టులు లోకల్ కాదు యూనివర్సల్. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొనిచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదే? గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. తెలుగులో తొమ్మిది నందులు, ఒక జాతీయ అవార్డు పొందినప్పుడూ నాన్ లోకల్ అనలేదు. మరిప్పుడు ఎందుకు నాన్ లోకలంటున్నారు? ఇలా మాట్లాడడం సంకుచితత్వం" అని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, బెనర్జీ, తనీష్, ప్రగతి, అనసూయ, సన, అజయ్, నాగినీడు, సమీర్, ఉత్తేజ్, ఏడిద శ్రీరామ్, శివారెడ్డి, భూపాల్, సురేష్ కొండేటి, సుడిగాలి సుధీర్, గోవిందరావు, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరు కాని ఇతర సభ్యులు జయసుధ, సాయికుమార్ తదితరులు వీడియో ద్వారా తమ సందేశాన్ని పంపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తిరుపతిలో తొలి కోవిడ్ డెల్టా ప్లస్ కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదైందని ఈనాడు పత్రిక తెలిపింది.
గత ఏప్రిల్ 3న ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో డెల్టా ప్లస్ వేరియంట్ ఉన్నట్లు సీసీఎంబీ తాజాగా గుర్తించింది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి (వైద్యం) ఆళ్ల నాని అమరావతిలో ప్రకటించారు.
కోవిడ్ కేసుల నమోదు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం సమీక్ష జరిపారు. అనంతరం ఆళ్ల నాని విలేకర్లతో మాట్లాడుతూ బాధిత వ్యక్తి ద్వారా ఇతరులకు ఇది సోకలేదన్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత తిరుపతిలో కలకలం రేగింది. బాధితుడు ఉన్న వీధి, పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 3న తిరుపతిలోని ఓ 50 ఏళ్ల వ్యక్తి వైరస్ నిర్ధారణ పరీక్ష కోసం నమూనా ఇచ్చారు. 4వ తేదీన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తర్వాతి రోజు ఆయన స్విమ్స్ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 13న డిశ్ఛార్జి అయ్యారు. కుటుంబసభ్యుల్లోనూ పలువురికి వైరస్ సోకింది. అందరూ కోలుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుంచి 15 రోజులకోసారి 15 నమూనాలను సీసీఎంబీకి పంపుతున్నారు. వీటిని పరీక్షించి వైరస్ వేరియంట్ గుర్తిస్తున్నారు. ఈ నమూనాలను అక్కడే ఉంచి... కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు వాటిని మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ నమూనాను తొలుత పరీక్షించినప్పుడు అనుమానం రాలేదు. తాజాగా కలకలం రేపుతున్న డెల్టా ఫ్లస్ గురించి తెలుసుకొనేందుకు మళ్లీ పాత నమూనాలను పరీక్షిస్తుండగా.. ఈ నమూనాలో ఆ వేరియంట్ బయటపడిందని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని ‘ఈనాడు’కు తెలిపారు.
నమూనా సేకరించిన రెండున్నర నెలల దాటిన తర్వాత తెలిసిన ఈ కేసుకు సంబంధించిన ఎవరికీ అనారోగ్య లక్షణాలు లేవని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. బాధిత వ్యక్తి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారిలో 15 మంది నుంచి నమూనాలు సేకరించి, ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. సమీపంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దీనిపై ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ డెల్టా ప్లస్ కేసుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. మూడో వేవ్ అనివార్యమైతే సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

'హరిభూషణ్ మరణం వెనుక అనుమానాలున్నాయి'
దండకారణ్యంలో కరోనాతో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ మృతదేహాన్ని అప్పగించి ఉంటే బాగుండేదని ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది.
అనాథ శవానికి చేసినట్లుగా మావోయిస్టులు దహన సంస్కారాలు చేయడంపై మండిపడుతున్నారు. హరిభూషణ్ మృతి చెందినట్లుగా గురువారం మావోయిస్టులు జగన్ పేరుతో ప్రకటించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు.
హరిభూషణ్ మరణ వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని వారు తెలిపారు. మావోయిస్టులు ప్రకటించిన లేఖలో భాష తేడా ఉందని, హరిభూషణ్ మృతదేహం ఫొటో చిరునవ్వుతో ఉందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆయన నిజంగా చనిపోయి ఉంటే మృతదేహాన్ని కుటుంబంలో ఏ ఒక్కరికైనా చూపించాలి లేదా మృతదేహాన్ని తమకు పంపించాలి కదా అని వారంటున్నారు.
ఎంతో రహస్యంగా ఉండే మావోయిస్టు దళాల సమాచారం పోలీసులు ఎలా ముందే తెలుసుకొని హరిభూషణ్ మరణవార్త ప్రకటించారని కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఏదో రహస్యం దాగి ఉందని అనుమానిస్తున్నారు.
కడసారి చూపునకు కూడా నోచుకోకుండా మావోయిస్టులు అడవిలోనే దహనసంస్కారాలు చేయడం సరికాదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
హరిభూషణ్ మరణ వార్త జీర్ణించుకోలేని సోదరి భారతి ఆయన ఫొటో ఎదుట గుండెలవిసేలా ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీరీ నేతలతో సమావేశం వెనుక మతలబు ఏమిటి...నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసిందా?
- కరోనా వ్యాక్సీన్ వేసుకుంటే పత్యం చేయాలా... డాక్టర్లు, ప్రభుత్వాలు చెప్పని మాట యాడ్స్‌లో ఎందుకొచ్చింది?
- 'ఇరాన్ మా పర్షియన్ జర్నలిస్టులను వేధిస్తోంది' అంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసిన బీబీసీ
- ఆధార్, పాన్ కార్డ్ వివరాలు ఇస్తే రూ. 500 ఇస్తామంటారు... ఆ తరువాత ఏం చేస్తారో తెలుసా?
- అఫ్గానిస్తాన్ నుంచి ప్రాణభయంతో పారిపోవడం నుంచి ఒలింపిక్స్‌లో కరాటే పోటీల్లో పాల్గొనే దాకా...
- కోవిడ్ వ్యాక్సీన్ మూడో డోసు కూడా అవసరమా? - డాక్టర్స్ డైరీ
- ఇరాన్ ఎన్నికలు: ఇబ్రహీం రైసీ ఎన్నిక ప్రమాదకరమని హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్
- కశ్మీర్ రాజకీయ నాయకులతో నేడు నరేంద్ర మోదీ సమావేశం.. తర్వాత ఏం జరగబోతోంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- సింగపూర్‌లో మిగిలిన ఒకే ఒక గ్రామం... దాన్ని కాపాడుతున్నదెవరు?
- గ్రహాంతరవాసులు ఉన్నారా....పెంటగాన్ విడుదల చేయబోయే రిపోర్టులో ఏముంది?
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








