పీవీ నరసింహారావు: 65 ఏళ్ల వయసులో సొంతంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న నాయకుడు

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1985వ సంవత్సరం. రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానిగా ఉన్నారు. రక్షణ మంత్రి పీవీ నరసింహారావులానే రాజీవ్‌కి కూడా టెక్నాలజీ అంటే ఆసక్తి.

కాకపోతే పీవీకి అప్పటికి కంప్యూటర్‌తో పరిచయం లేదు. రాజీవ్‌కి మాత్రం మంచి అవగాహన ఉండేది.

ఒక గదిలో రాజీవ్ గాంధీ తన మిత్రుడితో మాట్లాడుతున్నారు. పీవీ నరసింహా రావు అక్కడే ఉన్నారు. భారత దేశంలోకి ఎలక్ట్రానిక్, కంప్యూటర్ దిగుమతులను అనుమతించాలనుకుంటున్నట్టు రాజీవ్ తన మిత్రుడితో చెబుతున్నారు.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రిగా పీవీ ప్రమాణం

‘‘కానీ తమ పార్టీలోని పాతవాళ్లు దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదు. పాతవారికి టెక్నాలజీ గురించి అవగాహన తక్కువ కదా’’ అంటూ మాట్లాడారు రాజీవ్. అదంతా పీవీ విన్నారు.

అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడు ప్రభాకర రావుకు ఫోన్ చేశారు పీవీ. అంతకు 15 రోజులు ముందే, ప్రభాకర రావు తన తండ్రితో తాను పెట్టదలచుకున్న కంపెనీ కంప్యూటర్లపై ఎలాంటి స్డడీ చేస్తుందో చెప్పారు. ఆయనకది గుర్తుంది.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఆరు నెలల్లో అంతా మారిపోయింది..

‘‘నువ్వు ఈ కంప్యూటర్, టెక్నాలజీ గురించి మాట్లాడావు కదా. నీ దగ్గర ఆ శాంపిల్స్ ఉన్నాయా? ఉంటే ఒకటి పంపించు నాకు’’ అని కొడుక్కి చెప్పారు పీవీ.

ప్రభాకర రావు హైదరాబాద్‌లో సొంత కంపెనీ నడిపే వారు. ఆయనకు టీవీ, కంప్యూటర్లకు సంబంధించిన యూనిట్లు నెలకొల్పే ఆలోచనలు ఉండేవి.

అప్పటికే కొన్ని విడి భాగాలతో మూడు ప్రోటో టైప్ డెస్క్ టాప్‌లు కూడా ఆయన తయారు చేశారు. తరువాత ఆయన టీవీ బిజినెస్‌లోకి దిగారు. పీవీ కాల్ చేయగానే, వెంటనే ఒక ప్రోటోటైపు కంప్యూటర్‌ని దిల్లీ పంపారు ప్రభాకర రావు. ఆయనకు కంప్యూటర్ నేర్పడానికి ఒక టీచరును కూడా ఏర్పాటు చేశారు.

అలా 65 ఏళ్ల వయసులో పీవీ కంప్యూటర్ నేర్చుకోవడం ప్రారంభమైంది.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

‘‘అప్పుడన్నీ విడి భాగాలు దిగుమతి చేసుకుని అసెంబుల్ చేయడమే. నాకు గుర్తుండి అది ఐబీఎం క్లోన్ కంప్యూటర్’’ అని బీబీసీతో చెప్పారు పీవీ కుమారుడు ప్రభాకర రావు.

అయితే తన కంప్యూటర్ టీచర్ పీవీకి నచ్చలేదు. దీంతో కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో తెలిపే మాన్యువల్స్, కంప్యూటర్ బుక్స్ పంపమని కొడుకును కోరారు.

సహజంగా టెక్నాలజీ అంటే ఆసక్తి ఉన్న పీవీ ఆ పుస్తకాలు చదివి కంప్యూటర్ నేర్చుకోవడం ప్రారంభించారు. అదే పనిగా ఆరు నెలల పాటూ ఉదయం సాయంత్రం కంప్యూటర్ నేర్చుకున్నారు. ఆరు నెలల తరువాత కొడుక్కి ఫోన్ చేశారు. ‘‘ఇప్పుడు తనకు కంప్యూటర్‌పై పని చేయడం బాగా వచ్చిందని’’ చెప్పారు.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, నెల్సన్ మండేలాతో పీవీ

మామూలు అవసరాల కోసం కంప్యూటర్ వాడడం వేరు. కానీ ఆయన కోడింగ్-ప్రోగ్రామింగ్ కూడా నేర్చేసుకున్నారు. అప్పటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు అయిన కోబాల్ (COBOL), బేసిక్ (BASIC) నేర్చుకున్నారు. యునిక్స్ (UNIX) ఆపరేటింగ్ సిస్టంలో కోడింగ్ రాయడం కూడా ఆయనకు వచ్చు.

ఆరు నెలల్లో సీన్ మారిపోయింది. ‘‘రాజీవ్, పీవీల మధ్య ఖాళీ సమయాల్లో ఎప్పుడు చర్చ వచ్చినా అది టెక్నాలజీ మీదే సాగేది.

ఇద్దరికీ టెక్నాలజీ, కంప్యూటర్లు అంటే ఇష్టం కావడంతో తరచూ వారు కంప్యూటర్లు, వాటిలో వస్తోన్న లేటెస్ట్ ట్రెండ్ గురించి మాట్లాడుకునేవాళ్లు’’ అని చెప్పారు ప్రభాకర రావు.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, విదేశీ ప్రతినిధులతో పీవీ

పెయింటింగ్ వేయమన్నారు..

‘‘ఒకసారి నేను వేరే పనిమీద దిల్లీలో ఉన్నాను. నాన్నగారు పార్లమెంటుకు వెళ్తూ వెళ్తూ నన్ను కంప్యూటర్లో ఒక పెయింటింగ్ వేయమన్నారు. అప్పట్లో ఒక బేసిక్ పెయింటింగ్ ప్రోగ్రామ్ బ్రష్‌తో ఉండేది (బహుశా ఎంఎస్ పెయింట్). అందులో నన్ను పెయింట్ వేయమని చెప్పారు. నాకేమో కంప్యూటర్లో ఏబీసీడీలు కూడా రావు. అదే చెప్తే అక్కడ మాన్యువల్ ఉంది చూసి చేయి అన్నారు. అంతేకాదు, నాకు ఒక ఫ్లాపీ ఇచ్చి, ఇందులో సేవ్ చేయమన్నారు. నాకేమో అది బ్రహ్మపదార్థం. అర్థం కాలేదు. ఇదేమైనా మాన్యువల్ చూసి చేసేదా అనుకున్నాను మనసులో. ఆయన ఫ్లాపీలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. ఆరోజు ఏదో కష్టపడి ఆ వర్క్ చేశాను కానీ, ఫ్లాపీలో సేవ్ చేయడం మాత్రం నాకు రాలేదు. కాకపోతే నన్ను ఆయన కంప్యూటర్ తాకనిచ్చారు. అదే సంతోషం ఆ రోజు నాకు.’’ అంటూ తన తండ్రి కంప్యూటర్ పరిజ్ఞానం గుర్తు చేసుకున్నారు పీవీ నరసింహా రావు కుమార్తె సురభి వాణీ దేవి.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, విదేశీ ప్రతినిధులతో పీవీ

లైబ్రరీలోనూ కంప్యూటర్ పుస్తకాలే..

పీవీ లైబ్రరీలో ఒక ర్యాక్ నిండా కంప్యూటర్ పుస్తకాలు ఉండేవని చెబుతారు కుమారుడు ప్రభాకర రావు.

‘‘2002లో ఓసారి కంప్యూటర్ హార్డ్‌వేర్ సమస్య వస్తే, టెక్నీషియన్ అందుబాటులో లేకపోతే, మళ్లీ మాన్యువల్స్ తిరగేసి, మొత్తానికి తానే బాగు చేసేసుకున్నారు’’ అన్నారు ప్రభాకర రావు.

పీవీ కంప్యూటర్ పరిజ్ఞానం, ఆయన కంప్యూటర్ నేర్చుకున్న విధానం గురించి హాఫ్ లయన్ పుస్తకంలో విపులంగా రాశారు ప్రొఫెసర్ వినయ్ సీతాపతి.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, క్లింటన్‌తో పీవీ

ఐటి ఆసియా సదస్సులో పీవీ మాట్లాడిన మాటలు వింటే ఆయన కంప్యూటర్ పరిజ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు కంప్యూటర్లు, స్మార్టు ఫోన్లు వాడే అందరికీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమస్య తెలుసు. ఆయన కూడా అదే టాపిక్‌పై తన ఆక్రోశం వెళ్లగక్కారు. ఐటి ఆసియా సదస్సులో ఆయన ప్రసంగం ఒక ఫిర్యాదులా సాగుతుంది.

‘‘నేను వర్డ్ ఒక వెర్షన్ వాడతాను. ఏళ్ల తరబడి అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి. తీరా ఆ అప్‌డేట్‌లో ఏముందా అని మొత్తం వివరాలు చదివితే, పెద్ద తేడా ఏమీ ఉండదు. ఈ అప్‌డేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓ నాలుగు అప్‌డేట్లు చేయకుండా ఉండి, ఐదోసారి అప్‌డేట్ చేస్తే అది మనకు ఉపయోగపడొచ్చేమో. అప్పుడు అది నిజంగా అప్‌డేట్ లాగా ఉంటుంది. నేనిలా అన్నానని మీరేమీ అనుకోవద్దు (సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఉద్దేశించి). కానీ నాకు ఇలానే జరిగింది. అన్నారు పీవీ’’ అని హాఫ్ లయన్‌లో రాశారు వినయ్ సీతాపతి.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ప్రణబ్‌ను ఆటపట్టించేవారు..

2012 డిసెంబరులో హైదరాబాద్‌లో హైదరాబాద్ మీడియా హౌస్ సంస్థ నిర్వహించిన పీవీ స్మారక సభలో ఒక ఆసక్తికర విషయం చెప్పారు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. తనకు కంప్యూటర్ రాదని పీవీ సరదాగా ఆటపట్టించేవారని గుర్తు చేసుకున్నారు.

‘‘పీవీ నరసింహారావు మంచి డ్రాప్ట్స్ మెన్. ఆయన చూడకుండా కాంగ్రెస్‌కి చెందిన ఏ పత్రమూ బయటకు రాదు. 1991 మేనిఫెస్టో ప్రిలిమినరీ కాపీ నేను చేస్తే, ఆయన ఫైనల్ చేసేవారు. టెక్నాలజీ కూడా ఆయన ప్యాషన్లలో ఒకటి. ఆయనకు కంప్యూటర్ చాలా బాగా వచ్చు. నాకు సరిగా వచ్చేది కాదు. కొన్నిసార్లు నేను ఆయన దగ్గరకు చేత్తో రాసిన డాక్యుమెంట్లు తీసుకెళ్తే ఆయన తిరస్కరించేవారు. నాకివి వద్దు. కంప్యూటర్ డిస్కులో పంపు అనేవారు. నాకేమో అది రాదు. నాకు తెలియదు. కానీ ఆయనకు అదే ఇష్టం. ఇప్పడు దాని ఫలితాలు మనం అనుభవిస్తున్నాం’’ అన్నారు ప్రణబ్ ముఖర్జీ.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, పీవీతో మదర్ థెరెసా

కంప్యూటర్‌తో పీవీ అనుబంధం గురించి మరిన్ని అధ్యాయాల్లో ప్రస్తావించారు వినయ్ సీతాపతి. ఎప్పుడూ బయట పెద్దగా మాట్లాడని పీవీ, తన మనసులో భావాలని రహస్యంగా కంప్యూటర్లో డిజిటల్ డైరీలో రాసుకునేవారన్నారు.

‘‘1991 మేలో పీవీ దిల్లీని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తన దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్న పుస్తకాలతో పాటూ తన కంప్యూటర్, ప్రింటర్‌ను ఎంతో శ్రద్ధగా దిల్లీ నుంచి ప్రత్యేక బాక్సుల్లో ఆయన హైదరాబాద్ తరలించారు. ఇంట్లోని పుస్తకాల గదిలో ల్యాప్‌టాప్‌లో టైపు చేసుకుంటూ సమయం గడిపేవారు. ఆయన ప్రధాని మంత్రి అయిన తరువాత కూడా తన బెడ్‌రూం పక్కనే కంప్యూటర్ రూమ్ ఉండేది. ఉదయం లేవవగానే న్యూస్ పేపర్లు వచ్చే వరకూ కంప్యూటర్‌తోనే గడిపేవారు’’ అని రాశారు వినయ్ సీతాపతి.

తన సంస్కరణల్లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమలను ఆయన భాగం చేశారు. తరచూ తన ప్రసంగాల్లో ఐటీ గురించి మాట్లాడేవారు.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

82 ఏళ్ల వయసులో డీటీపీ – ఫాంట్లు

పీవీ నరసింహారావు ఆత్మకథ తెలుగు వెర్షన్ సవరణల కోసం పురుషోత్త్ కుమార్ అనే ఆయన్ను దిల్లీ పంపింది ప్రచురణ సంస్థ ఎమెస్కో.

ఆయన ద్వారా వివిధ రకాలు ఫాంట్ల వాడకం, కంప్యూటర్లో భారతీయ భాషల వాడకం వంటివి నేర్చుకున్నారు పీవీ.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

ఫొటో క్యాప్షన్, పీవీతో ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌

‘‘అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారి లీప్ ఆఫీస్ అనే ప్రోగ్రాం ఉండేది.

దాని గురించి నన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేను దిల్లీ వెళ్లిన పని అయిపోయినా.. పీవీకి డీటీపీ, కంప్యూటర్ల భారతీయ భాషల వాడకం నేర్పడానికి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది.

తెలుగు భాషలో ఓపెన్ ఫైల్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఫాంట్లు ఎలా మార్చాలి, లేఅవుట్ ఎలా చేయాలి వంటివి నేర్చుకున్నారు.

తరువాత పీవీ అమెరికా వెళ్లి, అక్కడ ఖాళీగా ఉన్న సమయంలో తన పుస్తకం డీటీపీ తానే చేసేసుకున్నారు.

తరువాత ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నన్ను రాజభవన్ పిలిపించుకునేవారు.

కంప్యూటర్లకు సంబంధించిన కొత్త టెక్నాలజీ అడిగి తెలుసుకునే వారు. తెలుగు భాష ఫాంట్ల ప్రగతి గురించి తెలుసుకునేవారు.

‘ఇంగ్లిష్ ఎంత సులువుగా టైప్ చేసి, ఎడిట్ చేస్తున్నామో, అలా తెలుగు చేయలేమా? అన్ని రకాల పాంట్లు తెలుగులో రావా?’ అని అడుగుతుండే వారు ఆయన. అప్పట్లో కాలేదు. ఇప్పడు అవన్నీ వచ్చాయి’’ అని గుర్తు చేసుకున్నారు పురుషోత్త్ కుమార్.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

సైన్స్ కూడా ఇష్టమే..

పీవీ నరసింహా రావుకి సైన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఆసక్తే ఆయన్ను టెక్నాలజీవైపు ఆకర్షించేది. యుక్త వయసులో గ్రామాల్లో కరెంటు లేని రోజుల్లో... ఆయిల్ ఇంజిన్లు రిపేర్ వస్తే ఆయన సొంతంగా బాగు చేసేవారట. అక్కడి నుంచి కంప్యూటర్ వరకూ ఆయనకు టెక్నాలజీ అంటే ఇష్టం.

‘‘2003లో నన్ను కలవడానికి కొందరు ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి దిల్లీ వచ్చారు. వాళ్లంతా టెలికాం రీసెర్చ్‌లో ఉన్న వాళ్లు. మా నాన్న గారిని మర్యాద పూర్వకంగా కలుస్తామన్నారు. వాళ్లు పలకరించాక ఏం చేస్తుంటారని అడిగారు పీవీ. ఇక ఆ చర్చ టెలికాం రంగంలో పాత విషయాలూ, కొత్త పరిశోధనలు, మార్పులు, ఉపయోగాలు ఇలా రెండు గంటలు సాగింది’’ అంటూ గుర్తు చేసుకున్నారు ప్రభాకర రావు.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

‘‘ఆయన ఏదైనా అలా సొంతంగా నేర్చుకుంటారు. సెల్ఫ్ లెర్నింగ్. కంప్యూటర్‌కి ఏం తెలుసు? మనం ఏం చెప్తే అది చేస్తాది అనేవారు.

ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలన్నీ అలానే నేర్చుకున్నారు. ఆయనకు బుక్స్ తరువాత బెస్ట్ ఫ్రెండ్ కంప్యూటరే.

తన ఆత్మకథ ఇన్ సైడర్ మొత్తం తన ల్యాప్‌టాప్‌లోనే టైప్ చేశారు.

ఆయన ఆర్టికల్స్, స్పీచులు సొంతంగా ల్యాప్‌టాప్‌లో సిద్ధం చేసుకునేవారు. చనిపోవడానికి 15 రోజుల ముందు వరకూ కూడా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూనే ఉన్నారు.’’ అన్నారు వాణీ దేవి.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

సంగీతం – కీబోర్డు

2002లో ఆయనకు చేతివేళ్ల సమస్య వచ్చింది. డాక్టర్ ఒక సాఫ్ట్ బాల్ ఇచ్చి ఎక్సర్‌సైజ్ చేయమన్నారు.

రెండు రోజులు చేశారు కానీ, ఆయనకు నచ్చలేదు. దీంతో ఒక మ్యూజిక్ కీబోర్డు తెప్పించారు.

దానిపై ఉదయం సాయంత్రం సంగీత సాధన చేసేవారు. ఆయనకు సంగీతం చాలా ఇష్టం. యువకుడిగా ఉన్నప్పుడు హిందూస్తానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న పీవీ అప్పుడప్పుడూ సాధన చేసేవారు.

ఈ వేళ్ల నొప్పులకు విరుగుడుగా మరింత సాధన చేసిన ఆయన, అందులోనూ పండిపోయారు.

‘‘ఇక ఆరు నెలల్లో చనిపోతారనగా, ‘నేను ఒక కచేరీ ఇవ్వడానికి సిద్ధంరా’ అన్నారాయన. అంత సాధన చేశారు’’ అని వివరించారు ప్రభాకర రావు.

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, PVNR Family/GoI

‘‘అప్పట్లో రేడియోల సంగీత ఉత్సవాలు వచ్చేవి. తనకు ఏదైనా పని ఉండి, ఆ ప్రోగ్రాం మిస్ అవుతాను అనుకుంటే, నాకు ముందే చెప్పేవారు, ఫలానా వారి కచేరీ వస్తుంది రికార్డు చేసి పెట్టమని’’ అన్నారు వాణీ దేవి.

‘‘నాకు తెలిసినంత వరకూ ఆయన కంప్యూటర్ వాడడం కంటే పెద్ద విషయం ఏమిటంటే.. ఆయన బ్రెయినే కంప్యూటర్ బ్రెయిన్ అంటాను. ముఖ్యంగా ఆ మెమొరీ పవర్. కంప్యూటర్‌లో సేవ్ చేసిన అంశం ఎలా అయితే ఎన్ని ఏళ్ల తరువాత అయినా చెక్కు చెదరకుండా ఉంటుందో, ఆయన బ్రెయిన్‌లో మెమొరీ కూడా అంతే.

ప్రధానిగా, నాయకుడిగా వేల మందిని కలిసినా ఎవరితో గతంలో ఎక్కడ వరకూ మాట్లాడామో, సరిగ్గా అక్కడి నుంచే సంభాషణ ప్రారంభించేవారు.

ఎవరికి ఏ విషయాలు చెప్పాం అనేది ఏళ్ల తరువాత కూడా గుర్తుంచుకునే వారు. ఇక వాస్తవంగా కంప్యూటర్ వాడకానికి వస్తే ఆయన రాయాలనుకున్న లేఖలన్నీ స్వయంగా తానే టైప్ చేసుకుని తరువాత సంతకం పెట్టి పంపేవారు’’అన్నారు కల్లూరి భాస్కరం.

పీవీ నరసింహా రావు ఆత్మకథ ఇన్ సైడర్‌ను తెలుగులో లోపలి మనిషి పేరుతో ఈయన అనువదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)