అలెగ్జాండర్: 20 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కడం నుంచి అంతుచిక్కని మరణం వరకు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హుస్సేన్ అస్కారి
- హోదా, బీబీసీ ఉర్దూ
చిన్నతనం నుంచే అతనిలో ఒక వీరుడి లక్షణాలు కనిపించేవి. అతని ముఖాన్ని చూసినంతనే ఇతను చరిత్రలో ఒక అసాధారణ వ్యక్తిగా మిగిలిపోతాడు అనిపించేలా ఉండేవాడు.
12 ఏళ్ల వయసులోనే అదుపు తప్పిన గుర్రాన్ని దారిలో పెట్టగలిగాడు. బుసెఫాలస్ అనే ఆ అడవి గుర్రం ఆ చిన్నవాడికి జీవితాంతం తోడుగా ఉండిపోయింది.
ఈ పిల్లవాడి పేరే అలెగ్జాండర్. చరిత్రలో అతను 'అలెగ్జాండర్ ది గ్రేట్'గా చిరస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్వకాలపు సుప్రసిద్ధ వ్యక్తులతో ఒకడిగా నిలిచాడు.
క్రీ.పూ 356లో మాసిడోనియాలో అలెగ్జాండర్ పుట్టాడు. ఉత్తర గ్రీస్ నుంచి బాల్కన్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే మాసిడోనియా. అలెగ్జాండర్ తండ్రిని అతని రక్షకుడే హత్య చేశాడు. ఆ తర్వాత కొత్త రాజు కోసం పోరు మొదలైంది.
ఈ పోరాటంలో తన ప్రత్యర్థులందరినీ ఓడించి కేవలం 20 ఏళ్ల వయసులో అలెగ్జాండర్ రాజు అయ్యాడు. తరువాత 12 సంవత్సరాలపాటు రాజ్యాన్ని పాలించాడు. ప్రపంచాన్ని జయించాలన్న కాంక్షతో తన సైనికులతో దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు.

మధ్య ఆసియాకు గ్రీకు సంస్కృతి
పర్షియా రాజైన మూడవ డరయస్ (డరయస్-III)ను అలెగ్జాండర్ ఓడించిన తర్వాత గ్రీకు సంస్కృతి మధ్య ఆసియాకు విస్తరించడం మొదలైంది.
ఒక విజేతగా అలెగ్జాండర్ ఉచ్ఛ స్థితిలో ఉన్న రోజుల్లో ఆయన సామ్రాజ్యం పశ్చిమాన గ్రీస్ నుంచి నేటి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇరాక్, తూర్పున ఈజిప్ట్ వరకు విస్తరించింది. చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, సమర్ధవంతమైన నాయకుడిగా, సైన్యాధిపతిగా అలెగ్జాండర్ గుర్తింపు పొందారు.
అలెగ్జాండర్‌కు ముందు మాసిడోనియా భౌగోళికంగా ఒక ప్రాంతం పేరు మాత్రమే. మిగిలిన ప్రపంచంలో ఈ ప్రాంతానికి పెద్దగా సంబంధాలు ఉండేవి కావు. అలెగ్జాండర్ తండ్రి రెండో ఫిలిప్ ఈ ప్రాంతానికి ఒక సామ్రాజ్యపు రూపాన్ని ఇచ్చాడు.
అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్, తండ్రి ఫిలిప్ IIకు అమె మూడవ లేదా నాల్గవ భార్య అయ్యుంటుందని చరిత్రకారుల భావన. కుటుంబంలో మొదటి అబ్బాయికి జన్మనివ్వడంతో ఆమెకు ప్రాముఖ్యత లభించింది. అలెగ్జాండర్ రూపంలో రాజ్యానికి వారసుడిని ఇచ్చారు ఒలింపియాస్.

ఫొటో సోర్స్, Getty Images
అరిస్టాటిల్ దగ్గర విద్యాభ్యాసం
ఆ రోజుల్లో అలెగ్జాండర్‌కు అత్యుతమ విద్య అందిందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్స్‌లో లెక్చరర్ ఆఫ్ క్లాసిక్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రాచెల్ మైయర్స్ అన్నారు.
అలెగ్జాండర్‌కు అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు విద్యాబుద్ధులు నేర్పించారు.
''అరిస్టాటిల్ నుంచి అలెగ్జాండర్ గ్రీకు సంస్కృతిని నేర్చుకున్నాడు. తత్వశాస్త్రం కూడా నేర్పించారు. విద్యావంతులైన మిగతా గ్రీకుల మాదిరిగానే అలెగ్జాండర్ ఇలియడ్, ఒడిస్సీ వంటి కవితలు రాసిన పురాతన గ్రీకు కవి హోమర్ సాహిత్యం మీద కూడా పట్టు సంపాదించారు'' అన్నారు రాచెల్ మైయర్స్
''హోమర్ రాసిన కవిత ఇలియడ్ అలెగ్జాండర్‌కు చాలా ఇష్టం. యుద్ధ సమయంలో అతను ఈ కవితలోని కొన్ని భాగాలను తన దిండు కింద పెట్టుకునే వారు'' అని మైయర్స్ వెల్లడించారు.
ఇలియడ్ ఒక ఇతిహాసం. ఇది ట్రాయ్ నగరానికి సంబంధించిన కథ. గ్రీక్ యుద్ధపు చివరి సంవత్సరానికి సంబంధించినది. అలెగ్జాండర్‌కు, ఈ కథలోని నాయకుడు అకిలీస్ మధ్య బలమైన మానసిక బంధం ఏర్పడింది.
దీంతోపాటు గ్రీకు దేవతా మూర్తి హర్క్యులస్ అంటే కూడా అలెగ్జాండర్‌కు చాలా ఇష్టం. యుద్ధ సమయంలో ఈ పాత్రలు ఆయన మనసులో మెదిలేవి.

ఫొటో సోర్స్, Getty Images
సాటిలేని పాలకుడు
అలెగ్జాండర్ తన జీవితాంతం అరిస్టాటిల్ శిష్యుడిగా ఉన్నాడు.
''గ్రీకు కులీన కుటుంబం నుంచి వచ్చిన అలెగ్జాండర్ క్రూరుడైన పాలకుడిగా మారేందుకు అవకాశం ఉంది. కానీ అలా జరగ లేదు. దీనికి కారణం అరిస్టాటిల్ నేర్పిన విద్య'' అన్నారు రాచెల్ మైయర్స్.
ఆయన సహనానికి ఉదాహరణగా ఓ సంఘటనను రాచెల్ వివరించారు.
''అలెగ్జాండర్ ఒకసారి సుప్రసిద్ధ తత్వవెత్త డయోజనెస్‌ను కలవడానికి గ్రీక్ నగరం కోరింత్‌కు వెళ్లాడు. డయోజనెస్ కృషిని మెచ్చుకోవాలన్నది ఆయన ఉద్దేశం. డయోజనెస్ ముందు నిలబడిన అలెగ్జాండర్ '' నేను మీకోసం ఏం చేయాలి'' అని అడిగాడు. అప్పుడు డయోజనెస్, నాకు ఎండ తగలడం లేదు. నా ముందు నిలబడకు వెళ్లిపో అని కసురుకున్నాడు. కానీ అలెగ్జాండర్ ఆయనను ఏమీ అనలేదు. ఈ సహనం అరిస్టాటిల్ నేర్పిందే'' అని రాచెల్ వివరించారు.

ఫొటో సోర్స్, AFP
అలెగ్జాండర్ బలహీనతలు
రాజుగా మారడానికి ముందు అలెగ్జాండర్ సమస్యలు ఎదుర్కొన్నాడు. అతని తండ్రి రెండో ఫిలిప్‌కు చాలామంది భార్యలున్నారు. వారిలో క్లియోపాత్రా అనే మహిళ కూడా ఉంది. ఆమె అలెగ్జాండర్‌ను, ఆయన తల్లిని ఇబ్బంది పెట్టింది.
''తల్లీ కొడుకులిద్దరూ స్వచ్ఛమైన మాసిడోనియన్లు కాదని ప్రచారం జరిగింది. ఇది వారిద్దరి గౌరవానికి ఇబ్బందిగా మారింది. రాజకీయంగా కూడా ఇబ్బంది పెట్టింది. ఇదే అలెగ్జాండర్ అతి పెద్ద బలహీనత'' అని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డయానా స్పెన్సర్ అన్నారు.
''కొత్త భార్యగా వచ్చిన క్లియోపాత్రా రాణిగా మారవచ్చు. లేదంటే ఫిలిప్ తర్వాత రాజ్యం కోరుకునే వారికి సాయపడి ఉండవచ్చు. అందుకే రాజ్యాన్ని పొందడంలో క్లియోపాత్ర అలెగ్జాండర్‌కు అవరోధం అని చెప్పక తప్పదు'' అని స్పెన్సర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ వాస్తవికత
ఒకవేళ పూర్తిగా మాసిడోనియాకు చెందిన ఒక మగ వారసుడు వచ్చినట్లయితే అలెగ్జాండర్‌కు ఇబ్బందికర పరిస్థితులు వచ్చి ఉండేవన్నది వాస్తవం. ఇది మానసికంగా కూడా అలెగ్జాండర్‌పై ప్రభావం చూపిందని చరిత్రకారులు చెబుతున్నారు.
''అలెగ్జాండర్ ఆరు నెలలు జైలులో ఉన్నాడు. తల్లి కూడా చాలా రోజులు ఆస్థానానికి రాలేదు. కొన్నాళ్ల తర్వాత తండ్రీ కొడుకుల మధ్య విరోధం తగ్గింది. కానీ స్తబ్ధత కారణంగా అలెగ్జాండర్ వెంటనే వారసుడు కాలేకపోయాడు'' అన్నారు డయానా స్పెన్సర్
''ఈ పరిస్థితుల్లో జరిగిన ఒక ఘటన అలెగ్జాండర్‌ను సింహాసనం ఎక్కించింది. ఈ పరిణామం జరిగి ఉండకపోతే నిజమైన మాసిడోనియన్ రక్తం అనే అంశం అలెగ్జాండర్‌ను సవాలు చేస్తూనే ఉండేది'' అన్నారు స్పెన్సర్.
''రెండో ఫిలిప్ తన భార్య క్లియోపాత్ర కూతురి వివాహ కార్యక్రమంలో పాల్గొంటుండగా ఒక రక్షక భటుడు ఆయన్ను చంపాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన రక్షక భటుడు కూడా చని పోయాడు. ఈ హత్యకు కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు. కొందరు ఈ హత్య వెనక అలెగ్జాండర్ ఉన్నాడని అంటారు'' అని డయానా స్పెన్సర్ అన్నారు.
ఈ హత్య తర్వాత అలెగ్జాండర్ ఊరుకోలేదు. సింహాసనం ఎక్కడానికి తనకు అడ్డుగా ఉన్న వారందరినీ ఒకరి తర్వాత ఒకరిని చంపేశాడు.
సోదరులు, దాయాదులు ఇలా తన రాచపదవికి అడ్డు అనుకున్న వారందరినీ అంతం చేశాడు. ఒక్క తన సవతి సోదరుడైన ఫిలిప్ ఎరిడైస్‌ను మాత్రం వదిలి, మిగిలిన సవతి సోదరులందరినీ హత్య చేశాడు.
అలెగ్జాండర్ సింహాసనంపై కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కళ్లు పర్షియా సామ్రాజ్యం మీద పడ్డాయి. ఇది మధ్యధరా సముద్రంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలతో 200 సంవత్సరాలకు పైగా ఒక రాజ్యంగా కొనసాగింది. చరిత్రలో అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో పర్షియన్ సామ్రాజ్యం ఒకటి.

ఫొటో సోర్స్, Alamy
యుద్ధ వ్యూహాలలో పండితుడు
పర్షియా సామ్రాజ్యం భారత దేశపు సరిహద్దు నుంచి ఈజిప్ట్, ఉత్తర గ్రీస్ సరిహద్దు వరకు విస్తరించింది. కానీ ఈ గొప్ప సామ్రాజ్యం అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయింది. మూడో డరయస్ ఓటమి చరిత్రలో పెద్ద మలుపు.
ఒక పురాతన శక్తి కూలిపోయింది. గ్రీకు సంస్కృతి, నాగరికత విస్తరించడం ఇక్కడి నుంచే ప్రారంభమైంది.
అలెగ్జాండర్ సాధించిన విజయంలో అతని తండ్రి పాత్ర కూడా ఉందని చరిత్రకారులు చెబుతారు. అనుభవజ్ఞులైన, నమ్మకస్తులైన సైన్యాధికారులు అలెగ్జాండర్‌కు తండ్రి పాలన నుంచే లభించారు.
డరయస్‌లాంటి ఒక సమర్ధుడైన నాయకుడిని అతని భూభాగం మీదే ఓడించడం అలెగ్జాండర్ నాయకత్వ పటిమకు, వ్యూహ రచనా చాతుర్యానికి నిదర్శనమని చరిత్రకారులు చెబుతారు.

ఫొటో సోర్స్, AFP
అలెగ్జాండర్ సైన్యం
మాసిడోనియన్‌లు ఒక సైనిక శక్తిగా ఎప్పుడూ లేరు. గ్రీస్‌లో ఏథెన్స్, స్పార్టా, తేబ్స్ రాష్ట్రాలు శక్తి వనరులు. ఈ రాష్ట్రాల నాయకులు మాసిడోనియన్లను ఆటవికులుగా, అనాగరికులుగా అభివర్ణించేవారు.
అయితే, అలెగ్జాండర్ తండ్రి రెండో ఫిలిప్ మాసిడోనియన్ సైన్యాన్ని బలమైన శక్తిగా తీర్చి దిద్దాడు. ఆ రోజుల్లో మాసిడోనియా అంటే మిగిలిన ప్రాంతాల ప్రజలు భయపడేవారు.
బలమైన పదాతి, అశ్విక దళాలతోపాటు విలుకాండ్రు, ఈటెలు ఉపయోగించే వారు ఈ సైన్యంలో ఎక్కువమంది ఉండేవారు. ఫిలిప్ మరణం తరువాత అలెగ్జాండర్ ఈ సైన్యాన్ని వారసత్వంగా పొందాడు.
అలెగ్జాండర్ ఎప్పుడూ తెలివైన వ్యూహకర్తగా వ్యవహరించేవారు. గ్రీసును భయంతో, బలంతో పాలించలేమని అలెగ్జాండర్‌కు తెలుసు. పర్షియన్ సామ్రాజ్యం ఒక శతాబ్ధం కిందట గ్రీస్‌పై దాడి చేసిన సంఘటనను ఆయన ప్రజలకు గుర్తు చేసి వారిలో దేశభక్తిని పెంపొందించాడు. అలా పర్షియాపై తన దాడిని సమర్ధించుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
క్రీస్తు పూర్వం 334లో అలెగ్జాండర్ సైన్యం పర్షియన్ సామ్రాజ్యంలోకి ప్రవేశించింది. 50 వేల మంది అలెగ్జాండర్ సైనికులు ఆ సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత శిక్షణ పొందిన సైన్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.
మూడో డరయస్ దగ్గర 25 లక్షల మంది సైన్యం ఉన్నట్లు అంచనా. అయితే, వీరంతా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు. పర్షియా రాజ్యానికి అవసరమైన కీలకమైన సైన్యాన్ని అమర్ సేన అని పిలిచే వారు. ఇందులో సుశిక్షితులైన 10,000మంది సైనికులు ఉండేవారు.
ఈ సైన్యంలో 10వేలమంది కన్నా తక్కువ ఉండటానికి వీలు లేదు. యుద్ధంలో ఒక సైనికుడు చనిపోయినప్పుడు, మరో సైనికుడు అతని స్థానంలో చేరతాడు. ఆ సంఖ్య మాత్రం తగ్గదు.

ఫొటో సోర్స్, AFP
పర్షియాపై అలెగ్జాండర్ విజయం
అద్భుతమైన సైనిక శక్తి ఉన్నప్పటికీ అలెగ్జాండర్ వ్యూహాల ముందు పర్షియన్ సైన్యం నిలవలేక పోయింది. అయితే, చరిత్రకారులు మాత్రం పర్షియా ఓటమికి అనేక కారణాలున్నాయని చెబుతారు. అప్పటికే ఆ రాజ్యం బలహీనపడి ఉండటం అలాంటి కారణాలలో ఒకటి.
క్రీస్తు పూర్వం 324లో అలెగ్జాండర్ పర్షియాలోని సుసా నగరానికి చేరుకున్నాడు. పర్షియా, మాసిడోనియా ప్రజలను ఏకం చేసి, తనకు మాత్రమే విధేయత చూపే జాతిని సృష్టించాలని ఆయన కోరుకున్నాడు.
అలెగ్జాండర్ తన సైన్యాధిపతులు, ఇతర అధికారులను పర్షియా యువరాణులను వివాహం చేసుకోవాలని ఆదేశించాడు. ఇందుకోసం సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. అలెగ్జాండర్ తన కోసం మరో ఇద్దరు భార్యలను ఎన్నుకున్నాడు.
అలెగ్జాండర్ అధికారంలోకి రావడం, అతని వరస విజయాలు, ఆ పై పతనం ఇవన్నీ చాలా తక్కువ సమయంలోనే జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
చరిత్రకారులు ఏం చెబుతున్నారు?
అలెగ్జాండర్ ఎక్కువగా మద్యం మత్తులో ఉండేవాడని రోమన్ చరిత్రకారులు పేర్కొన్నట్లు ప్రొఫెసర్ డయానా స్పెన్సర్ వెల్లడించారు. ఒకసారి మత్తులో తన స్నేహితుడినే అలెగ్జాండర్ హత్య చేశాడట.
మద్యం మత్తు, కోపం కారణంగా అలెగ్జాండర్ అసాధారణంగా ప్రవర్తించేవాడని రోమన్ చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే, వారి రాతలు ఎంత వరకు నిజమన్నదానిపై సందేహాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, FINE ART IMAGES/HERITAGE IMAGES/GETTY IMAGES
మర్మ వ్యాధి
అలెగ్జాండర్ విజయాలు, అతని వ్యక్తిత్వపు ఆకర్షణల పరంగా ప్రాచీన గ్రీకులు ఆయన్ను దేవుడిగా ఆరాధించ లేదు. కానీ, అలెగ్జాండర్ తాను ఒక దేవుడినని వారిని ఒప్పించాడు.
పర్షియన్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత అలెగ్జాండర్ సైన్యం తూర్పువైపునకు మళ్లి భారతదేశం చేరుకుంది. ఆ తర్వాత అలెగ్జాండర్ మాసిడోనియాకు తిరుగు పయనం ప్రారంభించాడు. కాని స్వదేశం చేరుకునే అదృష్టం అతనికి దక్కలేదు.
భారతదేశానికి ఎందుకు వచ్చాడు?
పర్షియాను జయించిన తర్వాత అలెగ్జాండర్ దృష్టి భారతదేశంపై పడటానికి చాలా కారణాలున్నాయని చరిత్రకారులు అంటున్నారు. తన తండ్రికి సాధ్యం కానీ సామ్రాజ్య విస్తరణను తాను సాధించాలనుకోవడం ఇందులో ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు.
వరస విజయాలు తాను అనుకున్నంత దూరం విస్తరించడానికి అవకాశం కల్పిస్తాయని అలెగ్జాండర్ భావించాడు. కానీ, ఆయన గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం చరిత్రకారుల్లో ఉందని ప్రొఫెసర్ రాచెల్ మైయర్స్ అన్నారు.
''అతను భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకున్నప్పుడు స్థానిక ప్రజల నుంచే కాకుండా, సైన్యం నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. మధ్య ఆసియాలో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత తాము ఇక్కడ ఉండలేమని అతని సైనికులు భావించారు. మరోవైపు భారతదేశంలో యుద్ధ సమయంలో అలెగ్జాండర్ చనిపోయాడని కూడా వదంతులు వ్యాపించాయి. మధ్య ఆసియాలో అతని సైన్యం తిరుగుబాటుకు సిద్ధమై, తర్వాత వెనక్కు తగ్గింది. దీంతో అతను వెనుదిరిగాడు. కానీ అప్పటికే అలెగ్జాండర్ గాయపడి ఉన్నాడు'' అని రాచెల్ అన్నారు.
అలెగ్జాండర్ తదుపరి లక్ష్యం అరబ్ ప్రాంతమని కొంతమంది చరిత్రకారులు ఊహించారు. కానీ, అప్పటికే సమయం, పరిస్థితులు ఆయనకు అనుకూలంగా లేవు.
క్రీస్తు పూర్వం 323లో, 32సంవత్సరాల వయస్సులో బాబిలోన్ (ప్రస్తుత ఇరాక్) ప్రాంతానికి చేరుకున్న తరువాత, ఒక అంతుపట్టని వ్యాధితో అలెగ్జాండర్ మరణించాడు.
అలెగ్జాండర్ మరణానికి గాయాలు కారణమని కొందరు, మలేరియా అని మరికొందరు చరిత్రకారులు ఊహించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- కరోనా సేవకుడే కరోనాతో మృతి... వందల మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన బృందంలో విషాదం
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








