ప్రజాస్వామ్యం నుంచే నిరంకుశత్వం పుడుతుందని ప్లేటో ఎందుకు అన్నారు?

ప్లేటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గ్రీకు తత్వవేత్త ప్లేటో
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

మీరు సముద్రం మధ్యలో ఆగిపోయిన ఒక పడవలో ఉంటే ఏం చేస్తారు.

  • ఆ పడవను నడిపే పద్ధతిని నిర్ణయించడానికి మీరు ఎన్నికలు జరిపిస్తారా?
  • దానిని సమర్థంగా నడపగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని మీరు ఆ పడవలో వెతుకుతారా?

మీరు రెండో ప్రత్యామ్నాయం ఎంచుకుంటే, ఆ పరిస్థితుల్లో నైపుణ్యం చాలా ముఖ్యమనే విషయాన్ని మీరు నమ్ముతున్నారు.

చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో మనం ఏం చేయాలి అనే నిర్ణయం తీసుకోడానికి ఒక కొత్త వ్యక్తి రావడాన్ని మీరు కోరుకోరు.

ఇప్పుడు, దేశం అనే ఒక పెద్ద పడవను నడిపే వ్యక్తి గురించి మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి.

ఎన్నికల ద్వారా నాయకుడిని నిర్ణయించడానికి బదులు, దేశానికి నాయకత్వం వహించడానికి ఒక అనుభవజ్ఞుడిని వెతకడమే మంచిదా?

ఏథెన్స్ తత్వవేత్త ప్లేటో 2400 ఏళ్ల క్రితమే, తన 'ద రిపబ్లిక్' పుస్తకం ఆరో అధ్యాయంలో ఈ విషయాలు చెప్పారు. న్యాయం, మానవ స్వభావం, విద్య, ధర్మం లాంటి అంశాలపై వచ్చిన మొదటి, అత్యంత ప్రభావవంతమైన పుస్తకం ఇదే.

ఈ పుస్తకంలో పాలన, రాజకీయాల గురించి కూడా ప్లేటో వివరించారు. సంభాషణలా ఉండే ఈ పుస్తకంలో సోక్రటీస్, ప్లేటో, ఆయన స్నేహితుల మధ్య అధికారం, పాలన గురించి జరిగిన చర్చను రాశారు. గురుశిష్యుల మధ్య జరిగిన ఆ సంభాషణలో ఒక పాలన మిగతా వాటికంటే ఎందుకు మెరుగ్గా ఉంటుందో వివరించారు.

ద రిపబ్లిక్ పుస్తకం ప్రజాస్వామ్యంపై ప్లేటో అభిప్రాయాలను స్పష్టంగా వివరిస్తుంది. గ్రీకు భాషలో ఉన్న ఈ పుస్తకంలో ఆయన "ప్రజా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉండదు" అని చెప్పారు.

ఓటు ద్వారా ఒక నాయకుడిని ఎన్నుకోవడం చాలా ప్రమాదకరమని ప్లేటో అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అభ్యర్థి రూపురేఖలు లాంటి అనవసరమైన విషయాలకు ఓటరు ప్రభావితం కావచ్చని ఆయన భావించారు.

"పాలన నుంచి ప్రభుత్వాన్ని నడపడం వరకూ తగిన అర్హతలు అవసరమని వారికి ఓటు వేసే సమయంలో అనిపించదు" అని ప్లేటో అన్నారు.

"అధికారంలో ఉండాలని కోరుకునే నిపుణులు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన తత్వవేత్తలుగా ఉండాలి. నిజాయితీ, వాస్తవికత గురించి వారికి ఉన్న లోతైన అవగాహన(సామాన్యుల కంటే చాలా ఎక్కువ)ను బట్టి ప్రజలు వారిని ఎన్నుకోవాలని ప్లేటో భావించారు" అని బీబీసీ హిస్టరీ ఆఫ్ ఐడియాస్ సిరీస్‌లో తత్వవేత్త నైజల్ వార్‌బర్టన్ వివరించారు.

గ్రీకు ది రిపబ్లిక్

అధికార స్వరూపం

అలాంటి ప్రభుత్వ స్వరూపమే అరిస్టోక్రసీ(ప్రభువుల పాలన). గ్రీకు భాషలో 'ఉత్తమ ప్రజా ప్రభుత్వం'. ఈ స్వరూపంలో కొంతమంది తమ జీవితాంతం నాయకుడుగా ఉండడానికి సిద్ధమైపోతారు. తమ ప్రజలు, సమాజం కోసం తెలివైన నిర్ణయాలు తీసుకునేలా గణతంత్రాన్ని నడిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది.

"అయితే, ప్లేటో అభిప్రాయాలు ప్రత్యేకమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రభువులు నిస్వార్థ ఆత్మ, తెలివితేటలతో పాలిస్తారని ప్లేటో భావించారు" అని బీబీసీ ఐడియాస్ కార్యక్రమంలో పాల్గొన్న తత్వవేత్త లిండ్సే పోర్టర్ చెప్పారు.

అయితే, ఈ ఆదర్శ సమాజం ఎప్పుడూ పతనం అంచున నిలుస్తుంది.

"చదువుకున్న, తెలివైన ప్రభువుల పిల్లలు చివరికి ఆ సౌకర్యాలు, ప్రత్యేక హక్కుల వల్ల అవినీతిపరులవుతారని ప్లేటో ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత వారు తమ సంపద గురించే ఆలోచిస్తారు, తద్వారా అరిస్టోక్రసీ ఒక ఆలొగార్కీ(పరిమిత ప్రజలకు సంక్రమించిన అధికారం)గా మారిపోతుంది.

గ్రీకులో దీనికి అర్థం కొంతమందితో పాలన. ఈ ధనిక, అల్ప పాలకులు బడ్జెట్ సమతుల్యం గురించి ఆందోళన చెందుతారు. అలా బలవంతంగా పొదుపు చేయాల్సొస్తుంది. దాంతో అసమానతలు పెరుగుతాయి" అని పోర్టర్ చెప్పారు.

"సంపన్నుడు మరింత సంపన్నుడు అయ్యే కొద్దీ, మరింత సంపద వెనకేసుకోడం గురించే ఆలోచిస్తూ, విలువలను పట్టించుకోడు" అని ప్లేటో తన పుస్తకంలో రాశారు.

అసమానతలు పెరిగేకొద్దీ, నిరక్షరాస్యులైన పేదల సంఖ్య సంపన్నుల కంటే ఎక్కువ అవుతుంది. చివరికి ఆలొగార్కీ అధికారం అంతం అవుతుంది. రాజ్యం ఒక ప్రజాస్వామ్యంగా మారిపోతుంది.

ప్రశంసలు వినడానికి అలవాటు పడిన మనకు ప్రజాస్వామ్యం అనేది అరిస్టోక్రసీ, ఆలొగార్కీ తర్వాత మూడో స్థాయి పాలనా వ్యవస్థ అనేది వినడానికి కాస్త వింతగానే ఉంటుంది. అంతే కాదు, ద రిపబ్లిక్‌లో ప్లేటోతో మాట్లాడిన సోక్రటీస్ ప్రజాస్వామ్యంను "అరాచకత్వానికి ఒక ఆహ్లాదకరమైన రూపం’’ అని వర్ణించారు.

మిగతా పాలనా వ్యవస్థల్లాగే ప్రజాస్వామ్యం కూడా వైరుధ్యం వల్ల అంతం అవుతుంది. అరిస్టోక్రసీ నుంచి ఆలొగార్కీ వచ్చినట్టే, ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వస్తుంది అని ప్లేటో చెప్పారు.

ప్రజలు సంపద కూడబెట్టడానికి గుడ్డిగా పరుగులు తీస్తున్నప్పుడు, సమాజంలో సమానత్వం కావాలనే ఒక డిమాండ్ వస్తుంది. సమానత్వం అనే ఆకలి రగులుతుంది. అలాగే తీరని స్వేచ్ఛా దాహం నిరంకుశత్వం పుట్టేలా చేస్తుంది.

ది రిపబ్లిక్‌ పుస్తకంలో ఒక భాగం

ఫొటో సోర్స్, Plato

ఫొటో క్యాప్షన్, ది రిపబ్లిక్‌ పుస్తకంలో ఒక భాగం

అధిక స్వేచ్ఛ

ఇలాంటి అభిప్రాయాన్ని అంగీకరించడం చాలా కష్టం. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలకు స్వేచ్ఛ లభించినప్పుడు, వారు తమకు మరింత స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు.

ఎట్టి పరిస్థితుల్లో స్వేచ్ఛ పొందడమే వారి లక్ష్యం అయితే, అధిక స్వేచ్ఛ అనేది, గ్రూపులు, అభిప్రాయ బేధాలు ఏర్పడడానికి కారణం అవుతుంది. ఇందులో, ఎక్కువ అంశాలకు సంకీర్ణ ప్రయోజనాలు ఉండడం వల్ల కొన్ని కనిపించవు.

అలాంటప్పుడు నాయకుడు కావాలని కోరుకునేవారు, ఈ గ్రూపులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. వారి భావనలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నియంత ఆవిర్భావానికి ఇది ఒక అనుకూలమైన స్థితి. ఎందుకంటే, ప్రజాస్వామ్యాన్ని నియంత్రించడానికి నియంత ప్రజలను భయపెడతాడు.

అంతే కాదు, అపరిమిత స్వేచ్ఛ ఒక విధంగా ఉన్మాద గుంపులు ఏర్పడ్డానికి కారణం అవుతుంది. అలా జరగడం వల్ల ప్రజలకు తమ పాలకుడిపై నమ్మకం పోతుంది. ప్రజల్లో కలవరం మొదలవుతుంది. దాంతో, తమలో భయాలను పెంచి పోషిస్తూ, తమకు రక్షకుడినని చెప్పుకునేవారికి అప్పుడు వారు మద్దతుగా నిలుస్తారు.

అయితే, ప్రాచీన ఏథెన్స్ ప్రజలకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంది. అలాంటప్పుడు అక్కడి ఓటర్లు దాదాపు ఎప్పటికీ అంతం కాని ఒక ప్రజాభిప్రాయ సేకరణ లాంటి దానికి ఓటు వేశారు.

"ప్రజా ప్రాతినిధ్యం ఉన్న ప్రజాస్వామ్యం, సుప్రీంకోర్టు, మానవ హక్కుల చట్టాలు, ఉన్నత విద్య లాంటి ప్లేటో కాలంలో కనిపించని ఎన్నో ఇప్పుడు ఉన్నాయి. తెలివిలేని గుంపుల పాలనను నియంత్రించడానికి ఇవి రక్షణ ఉపకరణాలు" అని తత్వవేత్త లిండ్సే పోర్టర్ అన్నారు.

అయితే, ఇటీవలి ఏళ్లలో డోనల్డ్ ట్రంప్ లాంటి నేతలు పెరగడంతో 'ద రిపబ్లిక్' పుస్తకంలోని హెచ్చరికలు మరోసారి కీలకమైనవిగా మార్చాయి.

బీబీసీ న్యూస్ సైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆండ్రూ సలివాన్ ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు, ప్లేటో అభిప్రాయాలను ప్రస్తావించారు.

"ఇలాంటి నాయకులు సాధారణంగా ఉన్నత వర్గాల నుంచి వస్తారు. కానీ ప్రస్తుత సమయానికి అనుగుణంగా ఉంటారు. వాళ్లు తమకు విధేయులుగా ఉన్న ఒక గుంపు మీద పెత్తనం చెలాయిస్తారు. ఆ గుంపు నుంచి ధనికులను భ్రష్టుపట్టిస్తారు" అని సలివాన్ అన్నారు.

"చివరికి వాళ్లు ఒంటరిగా నిలబడతారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజలకు ఎన్నో ప్రతామ్నాయాల్లో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తాడు. అలాంటి వ్యక్తి ప్రతి సమస్యకు తననే ఒక పరిష్కారంగా చెప్పుకుంటాడు. ప్రజలు కూడా అతడిని పరిష్కారంగా భావించి ఉత్సాహపడతారు. దాంతో ఐచ్ఛిక ప్రజాస్వామ్యం తనకుతానుగా త్వరత్వరగా అంతమవుతుంది" అంటారు.

కానీ ఇక్కడ మరో విషయం ఉంది. తత్వవేత్త పోర్టర్ ముఖ్యంగా మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు.

"అయితే అరిస్టోక్రాట్స్ తమను పాలించాలనే ఆలోచనల వెనుక, వారు అస్పష్ట ఆనందాలకు దూరంగా ఉంటూ ప్రజలకు నేతృత్వం వహించాలని కోరుకుంటారని, అలాంటి నాయకత్వం అవినీతితో ఉండదని, విద్యావంతులైన వారు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని జనం భావిస్తారు" అన్నారు.

అత్యంత సముచితమైన, తెలివైన చర్య ఏంటి అని అలాంటి నాయకులు తమను తాము నిరంతరం ప్రశ్నించుకుంటారు.

అందుకే, ప్లేటో ఒక ముఖ్య విషయం కూడా చెప్పారు.. "న్యాయమైన, తగిన, తెలివైన నిర్ణయాలు తీసుకోండి. విలువలతో పాలించాలి, భావోద్వేగాలతో కాదు".

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)