75వ స్వాతంత్ర్య దినోత్సవం: 'ఆర్థికవ్యవస్థను వేగవంతం చేసేందుకు త్వరలో రూ. 100 లక్షల కోట్లతో 'గతి శక్తి' ప్రణాళిక' - ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, BJP4India @Twitter
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని.. భారత యువ క్రీడాకారులకు గౌరవంగా కరతాళధ్వనులు చేయాలని ప్రజలను కోరారు. ఈ యువ క్రీడాకారులు భారతదేశానికి పేరు తీసుకురావడంతోపాటూ దేశ ప్రజలకు స్పూర్తిగా నిలిస్తున్నారని అన్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి పటిష్టమైన బాటలు వేసేందుకు 100 లక్షల కోట్ల రూపాయల భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను 'ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్' పేరుతో త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు.
ఆగస్టు 14 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే'
ఇక నుంచి ప్రతి ఏటా ఆగస్టు 14న 'పార్టిషన్ హారర్స్ రిమంబరెన్స్ డే'గా గుర్తు చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు.
"విభజన సమయంలో ఎన్నో బాధలు పడినవారిని, ఆ సమయంలో అంత్యక్రియలకు కూడా నోచుకోలేకపోయిన వారిని ఆగస్టు 14న స్మరించుకుందాం" అన్నారు.
"ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి గుప్పిట్లో ఉన్నప్పుడు భారత్ కరోనా వ్యాక్సీన్ తయారు చేసి ప్రజలకు అందించే పని చేసింది. అలా జరగకపోయుంటే భారత్‌లో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టం" అని ప్రధాని అన్నారు.
మహమ్మారి వ్యాపించిన సమయంలో భారత ప్రజలకు ఉచితంగా రేషన్ అందించామన్నారు.
" కరోనా మహమ్మారి మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ మందికి వ్యాపించింది. మనం ఎన్నో ప్రాణాలను కాపాడగలిగాం. సంపన్న దేశాలతో పోలిస్తే మన మౌలిక సదుపాయాలు తక్కువ, జనాభా అధికం. కానీ, అది మనకు ప్రశంసలు పొందే సమయం కాదు. మనం మరింత మెరుగ్గా పనిచేయాల్సిన సమయం" అని చెప్పారు.
రాబోవు 25 ఏళ్లకు కొత్త లక్ష్యం
ఇప్పటి నుంచి 100వ స్వాతంత్ర్య వేడుకల సమయానికి భారత్ ప్రబల శక్తిగా ఎదిగేలా సంకల్పం తీసుకోవాలని ప్రధాని అన్నారు.
''వందో స్వాతంత్ర్య దినోత్సవం వరకూ మన అమృత ఘడియలుగా భావిద్దాం. ఈ అమృత ఘడియల్లో ఒక కొత్త లక్ష్యంతో ముందుకు వెళ్దాం. ఈ 25 ఏళ్లలో దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం. అమృత ఘడియల్లో భారత నిర్మాణమే కాదు, అందులో సౌకర్యాల విషయంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా ఉండకూడదు. పౌరుల జీవితంలో ప్రభుత్వ అనవసర జోక్యం ఉండకూడదు. ప్రపంచంలోని ప్రతి ఆధునిక మౌలిక సదుపాయాలూ ఉండాలి. మారుతున్న కాలంతోపాటూ మనం కూడా మారాల్సి ఉంటుంది'' అని ప్రధాని అన్నారు.
''కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వ్యాక్సీన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి, కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అండగా నిలిచింది. మనం ఇప్పుడు అభివృద్ధి వైపు కాదు, దానిని పరిపూర్ణం చేయడం వైపు నడవాల్సి ఉంటుంది. అంటే అన్ని సౌకర్యాలూ దేశంలో వంద శాతం ప్రజలకు లభించడమే మన లక్ష్యం కావాలి. అన్ని కుటుంబాలకు అన్ని సౌకర్యాలూ లభించాలి. మన ముందున్న అన్ని పథకాల లక్ష్యం చేరుకోవాలి.'' అన్నారు.
భాష దేశంలో ప్రతిభను బోనుల్లో బంధించింది. మాతృభాషలో మనం ముందుకు వెళ్లవచ్చు. మాతృభాషలో చదువుకుని ముందుకు వెళ్తే, మన ప్రతిభకు న్యాయం జరుగుతుందని అన్నారు. కొత్త జాతీయ విద్యా విదానం కూడా పేదరికంపై యుద్ధంలో ఒక మంచి ఆయుధం కాబోతోంది. ఎందుకంటే మేం ప్రతిభకు పట్టం కట్టాం. మాతృభాష చాలా ముఖ్యం, దానికి ప్రతిష్ట ఉంది. క్రీడా మైదానంలో భాషా అడ్డంకి ఉండదు. యవత మన కోసం ఆడుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. కొత్త జాతీయ విద్యా విదానంలో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చాం. జీవితం పరిపూర్ణం కావడానికి క్రీడలు కూడా ఉండడం చాలా ముఖ్యం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. కాంస్యం కైవసం చేసుకున్న బ్రిటన్
- టోక్యో ఒలింపిక్స్: భారత్ గెలిచిన, తృటిలో చేజారిన పతకాలు ఇవే
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి: 'కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు' - BBC Exclusive
- టోక్యో ఒలింపిక్స్: అమెరికాలో ఒలింపిక్ పతకాల పట్టికలో చైనా టాప్లో ఎందుకు కనిపించడం లేదు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








