అఫ్గానిస్తాన్: తాలిబాన్లతో కలిసి పని చేస్తానంటున్న మహిళ మెహబూబా సిరాజ్

ఫొటో సోర్స్, REUTERS
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం అల్లకల్లోలంగా మారిపోయింది.
అనేకమంది అఫ్గాన్ పౌరులు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.
కానీ మెహబూబా సిరాజ్ మాత్రం అఫ్గానిస్తాన్‌లోనే ఉండాలని కోరుకుంటున్నారు.
'వుమెన్ స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్’కు హెడ్‌గా ఉన్న మెహబూబా సిరాజ్ సుదీర్ఘకాలంగా మహిళల, పిల్లల హక్కులపై పనిచేస్తున్నారు.
ఈ సంస్థ ద్వారా మహిళలకు అక్షరాస్యత, గృహహింస మొదలైన అంశాలపై ఆమె అవగాహన కల్పిస్తారు.
రెండు వారాల క్రితం వరకు సిరాజ్ అమెరికాలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె అఫ్గానిస్తాన్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
"మా సంరక్షణలో ఉన్న స్త్రీలు, పిల్లలను వదిలేసి నేను ఎక్కడికీ వెళ్లలేను. వారి బాధ్యత మాదే" అని సిరాజ్ బీబీసీతో అన్నారు.
సిరాజ్, తాలిబాన్లతో కలిసి అఫ్గాన్ మహిళల వికాసం కోసం పనిచేయాలనుకుంటున్నారు.
"కనీసం వారితో (తాలిబాన్లతో) చర్చలు జరపగలమనే నమ్మకం నాకుంది. ముఖాముఖి చర్చించుకుంటే వారు అర్థం చేసుకోగలరేమో. వారు తెలివైనవారై ఉండి, అఫ్గాన్ మహిళల సామర్థ్యాన్ని అర్థం చేసుకోగలరేమో" అంటూ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, MAHBOUBA SERAJ/TWITTER
'మా కలలు చెదిరిపోయాయి'
తాలిబాన్లు తొలిసారిగా 1996లో అఫ్గానిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టారు.
అయితే 9/11 దాడి అనంతరం, 2001లో అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి తాలిబాన్లను తరిమికొట్టాయి.
తాలిబాన్లు 1996 నుంచి 2001 వరకు పాలన సాగించిన కాలంలో మహిళలకు, ఆడపిల్లలకు కఠినమైన చట్టాలు ఉండేవి.
వారికి చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా చేశారు. తోడు లేకుండా మహిళలు ఒంటరిగా ఇంటి గడప దాట కూడదని చెప్పారు. ముఖం పూర్తిగా కప్పుకోవాల్సి వచ్చేది.
బహిరంగ ఉరిశిక్షలు, కొరడా దెబ్బలు ఉండేవి. వ్యభిచారం, వివాహేతర సంబంధాలకు శిక్షగా రాళ్లతో కొట్టి చంపేవారు.
గత అనుభవాలను అఫ్గాన్ మహిళలు మర్చిపోలేదు. కాబుల్‌లో తాలిబాన్ల పునరాగమనం వారిని వణికిస్తోంది.
తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అఫ్గాన్ ఎంపీ ఫర్జానా కొచాయి అన్నారు.
"ప్రజల మనసుల్లో గూడుకట్టుకుంటున్న భయాందోళనలను అంచనా వేయడం నా వల్ల కాదు. వాస్తవంగా జరుగుతున్న పరిణామాలను కూడా నమ్మలేని స్థితిలో వాళ్లు ఉన్నారు. మేం ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలి?" అని ఆమె అన్నారు.
"తాలిబాన్ల పునరాగమనం నా మనసును ముక్కలు ముక్కలు చేసింది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక రచయిత అన్నారు.
"ఇకమీదట నేను పని చేయగలనో లేదో తెలీదు. అసలు నేను చేయాలనుకుంటున్నవి చేసే అవకాశం వస్తుందో రాదో కూడా తెలీదు. నాలాంటి యువతులు ఎందరో ఉన్నారు. మా కలలన్నీ చెదిరిపోయాయి. మంచి భవిష్యత్తు కోసం కన్న కలలన్నిచాలావేగంగా నాశనం అయిపోయాయి. మా ఆశలన్నీ అడియాశలైపోయాయి" అంటూ ఆమె వాపోయారు.

ఫొటో సోర్స్, REUTERS
'భయపడే సమయం కాదు'
ఈ వ్యవస్థతోనే కలిసి పనిచేస్తూ మహిళల, పిల్లల పరిస్థితులు మెరుగుపడే దిశలో కృషి చేయవచ్చని సిరాజ్ విశ్వసిస్తున్నారు.
"దీనికి (తాలిబాన్ల పునరాగమనానికి) ముందు ప్రపంచంగానీ, అఫ్గానిస్తాన్‌గానీ మా దేశ మహిళల శక్తి, సామర్థ్యాలను చూడలేదు. వారి సామర్థ్యాన్ని సరైన దిశలో వినియోగించే అవకాశం వారికి ప్రపంచం ఇవ్వలేదు. ప్రధాన స్రవంతిలో మహిళల భాగస్వామ్యన్ని ఎప్పుడూ చేర్చలేదు. ఇప్పుడు వీళ్లు (తాలిబాన్లు) ఆ అవకాశాన్ని మహిళలకు ఇస్తారని ఆశిస్తున్నాను. వారు అలా చేస్తే మాకిక ఏ సమస్యలూ ఉండవు. ఒకవేళ వారు సహకరించకపోతే, కనీసం మాకు భద్రత ఉన్నంతవరకు మా పిల్లలు క్షేమంగా ఉంటారు. వాళ్లు బావుంటే నేనూ బావుంటాను" అని అన్నారు.
తాను తాలిబాన్లకు భయపడనని, భయం కారణంగా ఇక్కడ అన్నీ విడిచిపెట్టి వెళ్లబోనని మెహబూబా సిరాజ్ చెప్పారు.
"ఇది భయపడాల్సిన లేదా విచారించాల్సిన సమయం కాదు. ఇప్పుడు నాటకాలు ఆడడానికి సమయం లేదు" అని ఆమె అన్నారు.
అయితే అఫ్గాన్ ప్రజలను ఈ విధంగా తాలిబాన్లకు వదిలిపెట్టినందుకు అమెరికా, ఇతర దేశాలపై సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దీని గురించి నాకెంత కోపంగా ఉందో చెప్పలేను. అంతర్జాతీయ ప్రయత్నాలు, చివరి క్షణాల్లో మమ్మల్ని ఇలా వదిలేసిన తీరు ఎంత నిరాశ కలిగిస్తోందో నేను మీకు చెప్పలేను”
అంతర్జాతీయ డోనర్లతో కలిసి పనిచేసినందుకు, అఫ్గాన్ మహిళల కోసం పనిచేసే విదేశీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు తాలిబాన్లు శిక్షిస్తారనే భయం ఉందా అని సిరాజ్‌ను బీబీసీ అడిగింది.
"అస్సలు లేదు. నేను నిజమైన అఫ్గానిస్తాన్ ప్రతినిధిని. నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నాను. ఇలాగే పనిచేశాను. తాలిబాన్లలో కొందరికైనా ఈ విషయం తెలిసి ఉంటుందని నమ్ముతున్నాను" అని ఆమె జవాబిచ్చారు.
సిరాజ్‌కు ధైర్యం ఎక్కువ, ఆమె గొప్ప సాహసం చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. కానీ, ఆమె అందుకు అంగీకరించరు.
"నేనేం వీరనారిని కాను. బాధ్యతను నమ్ముతాను. నా వారి పట్ల నాకు బాధ్యత ఉంది. దాన్ని నేను కచ్చితంగా నిర్వర్తించాలి.
నేనొక అఫ్గాన్ మహిళను. నేను, నా దేశంలో జీవించాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండి, వారితో కలిసి జీవించాలనుకుంటున్నాను" అని సిరాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల రాకతో భారత్‌కు కొత్త చిక్కులు తప్పవా?
- కోవిడ్-19 అంతమయ్యే నాటికి భారత్‌లో డయాబెటిస్ సునామీ వస్తుందా?
- ‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
- తాలిబాన్లు ఎవరు?
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు డెడ్‌లైన్ తరువాత కూడా ఉండవచ్చన్న బైడెన్
- అఫ్గానిస్తాన్: తాలిబన్లు ఇంత వేగంగా ఎలా పట్టు సాధించారు
- ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్ల పునరాగమనం ప్రభావం అంతర్జాతీయ రాజకీయాలపై ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








