అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు డెడ్‌లైన్ తరువాత కూడా ఉండవచ్చన్న బైడెన్
అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలు గడువు తరువాత కూడా ఉండే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. సైనిక బలగాల ఉపసంహరణ అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఆయన ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
లైవ్ కవరేజీ
తోడుగా మగవారు రాలేదని మహిళను కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లోకి రానివ్వని తాలిబాన్లు

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌కు చెందిన ఓ మహిళ వేరే దేశం వెళ్లడానికి అన్ని అనుమతి పత్రాలు ఉన్నా కూడా ఆమెను విమానాశ్రయంలోకి రానివ్వలేదు తాలిబాన్లు.
అందుకు కారణం ఆమె ఒంటరిగా, పురుషుల తోడు లేకుండా రావడమే.
తాను ఎయిర్‌పోర్టు వద్దకు రాగానే ముగ్గురు వ్యక్తులు కొరడాలు పట్టుకుని వచ్చారని, తోడుగా మగవారెవరూ రాలేదెందుకని ప్రశ్నించారని ఆమె చెప్పారు.
‘ఇది చాలా భయంకరమైన అనుభవం. ఒక పీడకల’’ అని ‘బీబీసీ అఫ్గాన్’తో చెప్పారామె.
తాలిబాన్లలో మార్పేమీ రాలేదని ఆమె అన్నారు. ‘‘అంతకుముందులాగే క్రూరంగా ఉన్నారు. ఇక నన్ను ఈ దేశం దాటి వెళ్లనివ్వరు.ఆశ పోయింది.. ప్రపంచం ముగిసిపోయినట్లుంది’’ అన్నారామె.
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని అఫ్గాన్ విద్యార్థులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, b
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో వంద మందికి పైగా అఫ్గాన్‌కు చెందిన విద్యార్థులున్నారు.
ఈ విద్యార్థులు తమ దేశం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ఏమంటున్నారు?
అపారమైన ఖనిజ సంపద ఉన్నా ఆర్థికంగా చితికిపోయిన అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images
"అఫ్గానిస్తాన్ ఆర్థికవ్యవస్థ బలహీనంగా, విదేశీ నిధులపై ఆధారపడి ఉంది." తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకోవడానికి చాలా నెలల ముందే ప్రపంచ బ్యాంకు చెప్పిన మాటలివి.
తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో అఫ్గానిస్తాన్‌కు విదేశీ ఆర్థిక సహాయం అగమ్యగోచరంగా మారింది. దాంతో, అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
అఫ్గానిస్తాన్‌లో ఖనిజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మైనింగ్‌కు అనుకూలంగా లేవు.
ఆ దేశానికి అందే విదేశీ ఆర్థిక సహాయం చాలా ఎక్కువ. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం, 2019లో అఫ్గాన్‌కు అందిన ఆర్థిక సహాయం స్థూల జాతీయ ఉత్పత్తిలో 22 శాతం.
ఇది చాలా ఎక్కువే. కానీ, పదేళ్ల క్రితం 49 శాతం ఉండేదని, అది క్రమేపి తగ్గుగూ 22 శాతానికి వచ్చిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఇప్పుడు ఈ ఆర్థిక సహాయంపై అనిశ్చితి మేఘాలు కమ్ముకొన్నాయి.
ఆగస్ట్ 31 తరువాతా అఫ్గానిస్తాన్‌లో మా బలగాలు ఉండొచ్చు: బైడెన్

ఫొటో సోర్స్, Getty Images
ఆగస్ట్ 31 నాటికి అఫ్గాన్ నుంచి తమ సేనలను ఉపసంహించాలన్న గడువు తరువాత కూడా తాము అక్కడ కొనసాగొచ్చని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చెప్పారు.
పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
‘ఏబీసీ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రోజుకు 5 వేల నుంచి 7 వేల మంది అమెరికన్లను అఫ్గానిస్తాన్ నుంచి తరలిస్తామని ఆయన చెప్పారు.
నిజానికి ఆగస్ట్ 31 నాటికి అమెరికా సేనలను మొత్తం ఉపసంహరించాలన్నది బైడెన్ ఆలోచన.
కానీ, సుమారు 15 వేల మంది అమెరికా పౌరులు ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్నారు. ఈ అమెరికా పౌరులతో పాటు 50,000 నుంచి 65,000 మంది అఫ్గాన్ పౌరులనూ తరలించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.
అమెరికన్లకు సహకరించిన దుబాసీలు, ఇతర ఉద్యోగాలు, సేవల్లో ఉన్నవారిని తరలించనున్నారు. కాగా అమెరికా ఇప్పటివరకు 5,200 మందిని అఫ్గానిస్తాన్ నుంచి తరలించింది.
గత 24 గంటల్లోనే 2 వేల మందిని అఫ్గాన్ గడ్డ నుంచి తీసుకెళ్లింది.
రోజుకు 9 వేల మంది వరకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు పెంటగాన్ చెబుతోంది.
4,500 మంది అమెరికా బలగాలు ప్రస్తుతం కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నియంత్రిస్తున్నారు.
కానీ, విమానాశ్రయానికి వచ్చే మార్గాలు, విమానాశ్రయ పరిసరాలు మాత్రం తాలిబాన్ల అధీనంలో ఉన్నాయి.
ఆదివారం నుంచి ఇప్పటివరకు విమానాశ్రయంలో, ఆ పరిసరాల్లో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబాన్లు రాయిటర్స్ వార్తా ఏజెన్సీకి చెప్పారు.
తుపాకీ కాల్పులు, తొక్కిసలాటలు ఈ మరణాలకు కారణం.
అధికారక ప్రయాణ పత్రాలు లేనివారిని విమానాశ్రయానికి వెళ్లనివ్వకుండా తాలిబాన్లు ఆపేస్తున్నారు. ప్రయాణ ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నవారు కూడా విమానాశ్రయాన్ని చేరుకోవడం కష్టమవుతోంది.
తాలిబాన్ల నుంచి వారికీ ఆటంకాలు తప్పడం లేదు.
‘నేను పొరపాటు చేయలేదు’
గందరగోళానికి దారితీసిన బలగాల ఉపసంహరణ పొరపాటని అంగీకరిస్తారా అని ఏబీసీ న్యూస్ అడగ్గా అలాంటిదేమీ లేదని బైడెన్ చెప్పారు.
తాలిబాన్లను అఫ్గానిస్తాన్‌ను చేజిక్కించుకునే అవకాశం లేదని గత నెలలో బైడెన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేయగా ఆయన ఈ ఏడాది చివరి వరకు అలాంటి అవకాశం లేదన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఆ మాట చెప్పానని సమర్థించుకున్నారు.
తాలిబాన్లు శరవేగంగా దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం, వారి సైన్యం వైఫల్యమే కారణమని బైడెన్ మరోసారి నిందించారు.
మహిళల హక్కుల విషయంలో భయాలకు సైనిక శక్తి సమాధానం కాదు: బైడెన్
ఆగస్ట్ 31 నాటికి అఫ్గాన్ నుంచి తమ సేనలను ఉపసంహరించాలన్న గడువు అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
‘ఏబీసీ న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రోజుకు 5 వేల నుంచి 7 వేల మంది అమెరికన్లను అఫ్గానిస్తాన్ నుంచి తరలిస్తామని ఆయన చెప్పారు.
మహిళల హక్కుల విషయంలో కలుగుతున్న భయాలకు సైనిక శక్తి సమాధానం కాదని బైడెన్ అన్నారు.
అమెరికా తరలింపు కార్యక్రమం ద్వారా అఫ్గానిస్తాన్ నుంచి బయటపడాలనుకుంటున్న మహిళల్లో వీలైనంత మందికి అవకాశం కల్పించాలని తాను సూచించానని బైడెన్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
బ్రేకింగ్ న్యూస్, అఫ్గానిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన నిరసనలు.. పలువురు మృతి

ఫొటో సోర్స్, Abasin Sarwan/EVN
అఫ్గానిస్తాన్‌లోని అనేక నగరాలు, పట్టణాలలో గురువారం స్థానిక ప్రజలు జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు.
గురువారం(ఆగస్ట్ 19) అఫ్గానిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడం, ఇదే సమయంలో తిరుగుబాటు కారణంగా దేశంలో అనిశ్చితి ఏర్పడడంతో ప్రజలు నిరసన ర్యాలీలు చేపడుతున్నారు.
‘‘మా జెండా, మా అస్తిత్వం’’ అని నినాదాలు చేస్తూ ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లోని అఫ్గానిస్తాన్ జాతీయ జెండాలు చేతబూని జనం వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది.
కాగా అసాదాబాద్‌లో ఇలాంటి ర్యాలీలో పాల్గొన్న అనేకమంది మరణించారని రాయిటర్స్ వార్తా ఏజెన్సీ వెల్లడించింది.
అయితే, తుపాకీ కాల్పుల్లో కానీ.. కాల్పులు జరిపినప్పుడు తొక్కిసలాట జరగడం వల్ల కానీ వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు.
కొన్ని చోట్ల తాలిబాన్ల జెండాలను తొలగించి అఫ్గాన్ జాతీయ జెండాలు ఎగురవేస్తున్న వీడియో క్లిప్‌లు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తాలిబాన్‌లతో భారత్ టచ్‌లో ఉందా? విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిణామాలను భారత్ జాగ్రత్తగా పరిశీలిస్తోందని.. సంక్షుభిత అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడమే ఇప్పుడు భారత్ ముందున్న ప్రధానమైన కర్తవ్యమని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు.
ఇటీవల కాలంలో ఎప్పుడైనా భారత్, తాలిబాన్ల మధ్య సంప్రదింపులేమైనా జరిగాయా అన్న ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానమేమీ ఇవ్వలేదు.
‘‘ప్రస్తుతం మేం అఫ్గానిస్తాన్‌లో మారుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం. తాలిబాన్లు, వారి ప్రతినిధులు కాబుల్ చేరుకున్నారు. కాబట్టి అక్కడి నుంచే ఏమైనా ప్రారంభం కావాలి’’ అన్నారాయన.
తాలిబాన్ నాయకత్వాన్ని భారత్ ఎలా చూస్తుంది? ఆ గ్రూప్ నాయకత్వంతో భారత్ ఎలా వ్యవహరిస్తుందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అవన్నీ ఇప్పుడే మాట్లాడడం తొందరపాటవుతుందన్నారు.
అఫ్గానిస్తాన్‌తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి.. అఫ్గానిస్తాన్‌లో భారత పెట్టుబడులు కొనసాగుతాయా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ అఫ్గానిస్తాన్ ప్రజలతో భారత్‌కు చారిత్రకంగా ఉన్న సంబంధాలు అలాగే కొనసాగుతాయని చెప్పారు.
కాబుల్ ఎయిర్‌పోర్ట్ రక్షణ బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాం: టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్

ఫొటో సోర్స్, Reuters
తాలిబాన్ పాలనలోకి వచ్చిన అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని విమానాశ్రయానికి రక్షణ కల్పించే బాధ్యత చేపట్టడానికి తయారుగా ఉన్నామని టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్ అన్నారు.
కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకుని నిర్వహించడానికి టర్కీ ముందుకొచ్చింది. వివిధ దేశాలు అఫ్గానిస్తాన్‌లో తమ దౌత్య ప్రాతినిధ్యాన్ని కొనసాగించడానికి వీలుగా రాకపోకల కోసం కాబుల్ విమానాశ్రయం అత్యంత కీలకం.
బుధవారం ఓ టీవీ చానల్‌లో మాట్లాడిన ఎర్దవాన్.. కాబుల్ విమానాశ్రయ నిర్వహణ చేపట్టాలని టర్కీ కోరుకుంటున్నట్లు చెప్పారు.
‘‘అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు నియంత్రిస్తుండడంతో మా ముందు కొత్త దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుత వాస్తవాలను అనుసరించి మేం ప్రణాళికలు వేసుకుంటున్నాం’’ అన్నారు ఎర్దవాన్.
తాలిబాన్ నాయకులతో చర్చలకు తాను సిద్ధమని కూడా ఎర్దవాన్ చెప్పారు.
అఫ్గాన్ నుంచి ఏ ఏ దేశాలు ఎంత మందిని తరలించాయి?

ఫొటో సోర్స్, Turkish National Defence Ministry via Getty Images
తాలిబాన్లు ఆదివారం కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి అనేక దేశాలు తమ పౌరులను, బలహీనమైన అఫ్గాన్‌లను దేశం నుండి తరలించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఇప్పటివరకు, పారిపోయిన అఫ్గాన్లలో ఎక్కువ మంది అమెరికాకు వెళ్లారు.
దేశాల వారీగా తరలింపు సంఖ్యలు:
- అమెరికా : గత 24 గంటల్లో 2,000 మందితో సహా ఇప్పటి వరకు మొత్తంగా 5,200 మందిని తరలించారు. 22వేల మంది బలహీనమైన అఫ్గాన్లను, దేశంలో ఉన్న 15వేల మంది అమెరికన్లను తరలిస్తామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఆగష్టు 31ని తరలింపు గడువుగా పెట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత కూడా దీనిని కొనసాగిస్తామని అధ్యక్షులు జో బైడెన్ చెప్పారు.
- బ్రిటన్ : ఆదివారం నుంచి అఫ్గాన్లతో సహా దాదాపు 1,200 మందిని తరలించింది. రోజుకు 1,000 మందిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- జర్మనీ : 100 మంది అఫ్గాన్లతో సహా ఆదివారం నుంచి మొత్తంగా 500 మందిని తరలించింది.
- ఫ్రాన్స్: 184 మంది అఫ్గాన్లతో సహా ఆదివారం నుంచి మొత్తంగా 204 మందిని తరలించింది.
- స్పెయిన్: 500 మందిని తరలించింది.
- నెదర్లాండ్స్: 35 మంది తమ జాతీయులను తరలించింది. 1,000 మంది అఫ్గాన్ కార్మికులను, వారి కుటుంబాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- డెన్మార్క్: 84 మందిని తరలించింది.
- హంగేరి: 26 మంది తమ దేశస్థులను తరలించింది.
- పోలాండ్: 50 మందిని తరలించింది.
- చెక్ రిపబ్లిక్: అఫ్గాన్ కార్మికులతో సహా 46 మందిని తరలించింది.
- జపాన్: 12 మంది రాయబార కార్యాలయ సిబ్బందిని తరలించింది.
- ఆస్ట్రేలియా: అఫ్గాన్లతో సహా 26 మందిని తరలించింది. తమతో పని చేస్తున్న అఫ్గాన్ కార్మికులందరికీ సహాయం చేసే అవకాశం లేదని చెప్పింది.
- భారతదేశం: 170 మందిని తరలించింది.
- టర్కీ: 552 మంది తమ దేశస్థులను తరలించింది.
- స్విట్జర్లాండ్: 230 మంది అఫ్గాన్ కార్మికులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
(సోర్స్ : రాయిటర్స్)
'ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకి రావడానికి భయపడుతున్నారు', ఫ్రాన్సిస్ మావో, బీబీసీ న్యూస్
కాబుల్‌లోని ఒక యువతి తన పరిస్థితి గురించి నాకు చెప్పింది.
ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సిన ఆమె ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
‘‘తాలిబాన్లు ప్రతి ఒక్కరినీ తిరిగి పనికి రమ్మని అడిగారు. కానీ ప్రజలు భయంతో తమ ఇళ్ల నుండి బయటకు రావాలనుకోవడం లేదు. మేమంతా ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. విమానాశ్రయంలో చాలా మందిని తాలిబాన్లు కొట్టారు. నంగర్‌హార్ ప్రావిన్స్ లో ప్రదర్శనల సమయంలో జర్నలిస్టులతో సహా నిరసనకారులపై తాలిబాన్లు దాడులకు పాల్పడ్డారు. క్షమాభిక్ష ప్రకటించినా ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వారి తీరుతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. వారి ప్రకటనలకు, చేస్తున్న పనులకు సంబంధం లేదు’’ అని ఆ యువతి తెలిపింది.
తాలిబాన్లు విదేశీయులను మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారని బంధువుల ద్వారా తెలుసుకున్నానని ఆమె చెప్పారు.
అమెరికన్లతోపాటూ వెళ్లడానికి అనుమతి లభించిన అఫ్గాన్లను కూడా వెనక్కి పంపిస్తున్నారన్నారు.
"విమానాశ్రయం వద్ద విధించిన ఆంక్షల కారణంగా తరలించడానికి వచ్చిన విమానాలు ఖాళీగా వెళ్తున్నాయి" అని ఆమె తెలిపారు.
'అఫ్గాన్ ప్రజలకు భారత్ అండగా నిలవాలి'
తాలిబాన్ల పాలనలోకి అఫ్గాన్ వెళ్లడంతో అక్కడ భారతదేశం చేసిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని అనేక రిపోర్టులు రావడం భయాన్ని పెంచాయి.
ఆ దేశంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పార్లమెంట్, డ్యాములు, హైవేల నిర్మాణాలకు ఏళ్లుగా దాదాపు మూడు బిలియన్ డాలర్లు(దాదాపు 22 వేల కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది.
కీలక మౌలిక సదుపాయాలను అమలు చేయడానికి తాలిబాన్లు ఆసక్తి చూపించడంతో పెట్టుబడులకు తక్షణ ముప్పు ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భారతదేశం వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టిందని నిపుణులు చెబుతున్నారు.
అఫ్గానిస్తాన్‌లో భారత మాజీ రాయబారిగా పని చేసిన గౌతమ్ ముఖోపాధయ్య, బీబీసీ ప్రతినిధి వికాస్ పాండేతో మాట్లాడుతూ ‘‘అఫ్గాన్ ప్రజల హృదయాలను గెలుచుకోవడంతో పాటు సద్భావన రూపంలో భారతదేశం ఇప్పటికే తాను పెట్టిన పెట్టుబడులను తిరిగి రాబట్టుకుంది. అయితే, ఇవి అఫ్గాన్ ప్రజల కోసం చేసిన పెట్టుబడులు. వీటి సంరక్షణను వారే చూసుకోవాలి" అని ఆయన చెప్పారు.
‘‘భవిష్యత్తులో వ్యూహాత్మక పెట్టుబడిగా భారతదేశం అఫ్గాన్‌లో సహాయం అందించాలి. అక్కడి ప్రజలకు మద్దతు ఇవ్వడం కొనసాగించాలి’’ అని ఆయన భారతదేశానికి సూచించారు.
వేలాది మంది అఫ్గాన్లు ఇప్పటికీ చదువు, పని లేదా వైద్య చికిత్స కోసం భారతదేశంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, అఫ్గాన్ పార్లమెంటు భవనం తాలిబాన్లు సరిహద్దు దాటి వాణిజ్యాన్ని నిలిపేశారన్న భారత్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో తనవంతు సహకారంగా పార్లమెంటు భవనాన్ని భారతదేశం నిర్మించింది అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి దాని ఇరుగుపొరుగు దేశాలపై ప్రభావం చూపుతోంది.
సరిహద్దుల ద్వారా జరిగే వ్యాపారాన్ని తాలిబాన్ నిలిపేసినట్లు భారత్ పేర్కొంది.
ఇరుదేశాల మధ్య సరుకు రవాణా పాకిస్తాన్‌లోని మార్గాల గుండా సాగేది.
కానీ, ఆయా మార్గాల గుండా సరుకు రవాణాను అడ్డుకున్నట్లు భారతీయ ఎగుమతుల సమాఖ్య సంస్థ(ఎఫ్ఐఈఓ) వెల్లడించింది.
దీని వల్ల కొన్ని మిలియన్ డాలర్ల మేర ఎగుమతులు, దిగుమతులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
అఫ్గానిస్తాన్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
అఫ్గాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పార్లమెంటు భవనం, డ్యాములు, స్కూళ్లు, రోడ్ల నిర్మాణాలకు భారత్ మూడు బిలియన్ డాలర్లు (సుమారు 22 వేల కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది.
అఫ్గానిస్తాన్ శరణార్థులు రాకుండా సరిహద్దుల్లో కంచె వేసిన పాకిస్తాన్

ఫొటో క్యాప్షన్, తోర్ఖామ్ చెక్‌పోస్టు వద్ద పక్కపక్కనే నిలబడిన తాలిబాన్ ఫైటర్, పాక్ జవాన్ అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో పైకి చూడటానికి అంతా సవ్యంగానే కనిపిస్తోంది. అయితే, జాగ్రత్తగా పరిశీలిస్తేనే ఇక్కడ పరిస్థితులు ఎలా మారాయో తెలుస్తుంది.
సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల దగ్గర రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ జెండాలను తొలగించారు. ఇక్కడ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌కు చెందిన తెల్ల జెండాలు ఎగురుతున్నాయి.
అఫ్గాన్ భద్రతా బలగాలు పహారా కాసేచోట నేడు తుపాకులతో తాలిబాన్ మిలిటెంట్లు కనిపిస్తున్నారు.
‘1257 కోట్లతో పారిపోయాననడం అబద్ధం.. బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు’

ఫొటో సోర్స్, REUTERS
యూఏఈకి భారీగా డబ్బుతో వచ్చారన్న పుకార్లను అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కొట్టిపారేశారు. అవన్నీ ఆధారాల్లేనివని, అబద్దాలని చెప్పారు.
ఓ వీడియోలో ఘనీ మాట్లాడుతూ తాను పారిపోయి రాలేదని, 'భారీ విపత్తు'ను తప్పించేందుకే వచ్చేశానని చెప్పారు.
తాజా అప్‌డేట్స్..
- అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్‌లో నిరసనకారులు.. తాలిబాన్లకు వ్యతిరేకంగా అఫ్గాన్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.
- అఫ్గానిస్తాన్ నుంచి బయటకు వచ్చేయడం మీరు చేసిన తప్పుగా భావిస్తున్నారా అని ఓ టీవీ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు.
- తాలిబాన్ల రాకతో అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆశ్రయం కల్పించింది. కార్లు, డబ్బుతో పారిపోయారంటూ వచ్చిన రిపోర్టులను ఘనీ కొట్టిపారేశారు. తన భద్రతా సిబ్బంది సలహా మేరకు దేశాన్ని వీడానని చెప్పారు.
- అఫ్గానిస్తాన్‌కు అందించే నిధులను స్తంభింపజేస్తున్నట్లు ఐఎమ్ఎఫ్ వెల్లడించింది.
- అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ పౌరులను, వారికి సాయం చేసిన అఫ్గానీయులను పాశ్చాత్య దేశాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
- కాబుల్ ఎయిర్‌పోర్టు వైపు వెళ్తున్న అఫ్గానీయులను తాలిబాన్ గార్డులు చిత్రహింసలు పెడుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి. నగరంలోని అన్ని చెక్ పాయింట్లు మిలిటెంట్లతో నిండివున్నాయి.
ఆస్ట్రేలియా సైన్యం కోసం పనిచేసిన అఫ్గాన్ అనువాదకుడిపై కాల్పులు
ఆస్ట్రేలియా సైన్యం కోసం పనిచేసిన అఫ్గాన్ అనువాదకుడిపై కాబుల్ విమానాశ్రయం వెలుపల చెక్‌పోస్టు వద్ద కాల్పులు జరిపారని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.
కాబుల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకోవడంతో నగరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయేందుకు ఆయన మంగళవరాం రాత్రి కాబుల్ విమానాశ్రయానికి వచ్చేందుకు ప్రయత్నించారు.
కాలిపై కాల్పుల అనంతరం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు కనిపిస్తున్న ఫోటోలను ‘‘ద గార్డియన్ ఆస్ట్రేలియా’’ ప్రచురించింది.
కాబుల్ విమానాశ్రయం వెలుపల తొక్కిసలాట, హింసకు బాధితులుగా మారిన వారిలో ఆయన కూడా ఒకరు.
అఫ్గాన్‌లో చిక్కుకున్న చాలా మంది విదేశీయులు తమ సొంత దేశాలకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్నారు.
అయితే, ముందుగా వీరంతా తాలిబాన్లు ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను దాటుకొని రావాల్సి ఉంటుంది. కేవలం విదేశీయులకు మాత్రమే తాలిబాన్లు అనుమతులు ఇస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా సైనిక విమానంలో ఎక్కేందుకు వెళ్తుండగా చెక్‌పోస్ట్ వద్ద తనపై కాల్పులు జరిపారని బాధిత వ్యక్తి మీడియాతో చెప్పారు.
ఒరుజ్గాన్ ప్రావిన్స్‌లో 2010, 2011 మధ్య కాలంలో ఆస్ట్రేలియా సైన్యం కోసం ఆయన పనిచేశారు.
తాలిబాన్ల ఆక్రమణ అనంతరం తొలి విమానంలో 26 మందిని కాబుల్ నుంచి ఆస్ట్రేలియాకు తీసుకువచ్చామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ధ్రువీకరించింది. అయితే, ఈ విమానంలో 128 మంది వరకు ప్రయాణించొచ్చు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కాబుల్‌లో చెక్ పాయింట్లు, మిలిటెంట్ల నిఘా.. విమానాశ్రయానికి చేరేందుకు అఫ్గాన్లకు ఇబ్బందులు

ఫొటో సోర్స్, AFP via Getty Images
కాబూల్‌లోని చెక్ పాయింట్లను తాలిబాన్ తన ఆధీనంలోకి తీసుకుంది.
ప్రజలు ఎయిర్‌పోర్టుకు చేరుకోకుండా తాలిబాన్ అడ్డుపడుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.
ఎయిర్‌పోర్టును 4500 మంది అమెరికా సైనికులు నియంత్రిస్తుండగా, ఎయిర్‌పోర్టుకు చేరుకునే టర్మినల్స్ అన్నింటినీ తాలిబాన్ అదుపులోకి తీసుకుంది.
ప్రయాణ పత్రాలు లేని అఫ్గానీయులను ఎయిర్‌పోర్టుకు చేరకుండా తాలిబాన్ అడ్డుపడుతోంది.
అయితే, సరైన ధ్రువపత్రాలు కలిగిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదివారం తాలిబాన్ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత వేలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఎయిర్‌పోర్టు గేట్ల వరకూ చేరుకున్న కొందరికి లోపలికి ప్రవేశించడం కూడా ఓ సవాలు మారింది.
బీబీసీ తెలుగు లైవ్ అప్డేట్లకు స్వాగతం..
