అఫ్గానిస్తాన్: ఐఎస్‌లో చేరి అఫ్గాన్‌లో జైలు పాలైన భారత మహిళ 'నిమిష' ఇప్పుడెక్కడ?

బెక్సన్ అలియాస్ ఈసా, నిమిష అలియాస్ ఫాతిమా ఈసా

ఫొటో సోర్స్, SREEKESH R

ఫొటో క్యాప్షన్, బెక్సన్ అలియాస్ ఈసా, నిమిష అలియాస్ ఫాతిమా ఈసా
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

"మా అమ్మాయి అఫ్గాన్ జైల్లో ఉన్నప్పుడే ఇంతకన్నా ఎక్కువ స్వేచ్ఛగా ఉండేదేమో. ఇప్పుడక్కడ బయట పరిస్థితులే ఘోరంగా ఉన్నాయి" అని బిందు సంపత్ వాపోయారు.

"జైల్లో ఉన్న పురుషులను విడుదల చేశారుగానీ మహిళల గురించి ఎలాంటి సమాచారం లేదని ఒక జర్నలిస్ట్ కాబుల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఈ మాట చెప్పి కూడా నాలుగు రోజుల పైనే అయింది" అని కేరళలో నివసిస్తున్న బిందు సంపత్ బీబీసీకి తెలిపారు.

ఆమె తన కుమార్తె నిమిష అలియాస్ ఫాతిమా ఈసా, మనుమరాలు ఉమ్ము కుల్సూల గురించి ప్రస్తావించారు.

2016లో కేరళ నుంచి శ్రీలంక పారిపోయి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరిన 21 మందిలో బిందు సంపత్ కుమార్తె నిమిష, ఆమె భర్త బెక్సన్ విన్సెంట్ అలియాస్ ఈసా కూడా ఉన్నారు.

బిందు సంపత్

ఫొటో సోర్స్, SREEKESH R

ఫొటో క్యాప్షన్, బిందు సంపత్

కూతురిని, మనుమరాలిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు

అప్పటి నుంచి బిందు తన కుమార్తెను, మనుమరాలిని వెనక్కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఐఎస్ కోసం పోరాటం చేస్తూ, అమెరికా వైమానిక దాడిలో నిమిష భర్త బెక్సన్ మరణించిన తరువాత బిందు మరింత దీక్షగా ప్రయత్నాలు కొనసాగించారు.

ఐఎస్‌లో చేరిన ఆ 21 మందిలో చాలా మంది పురుషులు చనిపోగా, మహిళలను అఫ్గాన్ జైలులో ఖైదు చేశారు.

అఫ్గాన్‌ జైల్లో ఉన్న నిమిషను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలకు కూడా బిందు లేఖలు రాశారు.

రెండు సార్లు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐఎస్‌లో చేరినందుకు నిమిషను భారత చట్టాల ప్రకారం శిక్షించాలని, మనుమరాలు ఉమ్మును తమకు అప్పగించాలని, ఆ పాపకు సమాజంతో కలిసి జీవించే హక్కును కల్పించాలని బిందు కోరుతున్నారు.

బిందు పిటిషన్ ఆగస్ట్ 24న హైకోర్టులో విచారణకు రానుంది. అయితే, ఇప్పుడు ఈ కేసును కొనసాగించాలా, వద్దా అని ఆమె ఆలోచనలో పడ్డారు.

"నేను ఈ కేసును కొనసాగించాలనుకోవడం లేదు. ముందు వాళ్లెక్కడున్నారో నాకు తెలియాలి. మా పిల్లల ఆచూకీ తెలుసుకోవడమే నాకిప్పుడు ముఖ్యం" అని బిందు విచారంతో చెప్పారు.

2016లో కూడా బిందు బీబీసీతో మాట్లాడారు. కానీ, అప్పటికన్నా ఇప్పుడు ఆమె ఎక్కువ దుఃఖపడుతున్నారు.

నిమిషలో సడన్‌గా మార్పు వచ్చింది

2015 నవంబర్ నుంచి నిమిష ప్రవర్తనలో సడన్‌గా మార్పు వచ్చిందని బిందు చెప్పారు. రోజూ క్షేమ సమాచారాలు కనుక్కునేందుకు తనకు ఫోన్ చేసేవారని, ఆ నవంబర్ నుంచి అలా ఫోన్ చేయడం మానేశారని ఆమె చెప్పారు.

నిమిష కాసర్‌గోడ్ డెంటల్ కాలేజీలో చదువుతుండేవారు. నిమిష తల్లి బిందు తిరువనంతపురంలో ఉండేవారు. డెంటిస్ట్ కావడానికి మరో ఏడాది చదువు మిగిలి ఉండగా, నిమిష నుంచి ఫోన్లు ఆగిపోయాయి.

కూతురి ఆచూకీ తెలియకపోవడంతో బిందు కంగారుపడ్డారు. ఎన్నో ప్రయాసల తరువాత, నిమిష పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత నుంచే ఆమె అదృశ్యమైపోయారని బిందుకు తెలిసింది.

2015 నవంబర్ 15న నిమిష సవతి తండ్రి కాసర్‌గోడ్ పోలీసు స్టేషన్‌లో తమ కూతురు కనబడడం లేదంటూ ఫిర్యాదు చేశారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిమిష ఆచూకీ తెలుసుకుని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను విడుదల చేసింది.

బిందు కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి నిమిష, ఆమె భర్త బెక్సన్ మతమార్పిడిపై విచారణ చేయాలని కోరారు.

అయితే, నిమిష మేజర్ అని, ఇష్టానుసారం మతం మార్చుకునే, వివాహం చేసుకునే హక్కు తనకు ఉందని చెప్తూ 2015 నవంబర్ 25న హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

అనంతరం, బిందు కూతురి మతమార్పిడిని సహృదయంతో అంగీకరించారు. ఆ తర్వాత నిమిష తన తల్లిని కలిసేందుకు తరచూ వస్తుండేవారు.

పుట్టుకతో క్రైస్తవుడైన బెక్సన్ ఇస్లాం మతం పుచ్చుకుని ఈసాగా మారారు. నిమిష పాతిమా ఈసాగా మారారు.

ఐఎస్‌లో చేరాక...

2016 మేలో తాము శ్రీలంక వెళుతున్నట్లు బెక్సన్ బిందుకు చెప్పారు.

అప్పటికి నిమిష ఏడో నెల గర్భవతిగా ఉండడంతో ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని బిందు వారిని ఎంతో వారించారు.

కానీ, నిమిష, బెక్సన్ అంగీకరించలేదు. రెండు రోజుల తరువాత అంటే మే 17న వాళ్లిద్దరూ శ్రీలంక ప్రయాణమయ్యారు.

2017 జూలైలో బిందుకు పెద్ద షాక్ తగిలింది. ఐఎస్‌లో చేరడానికి కేరళ నుంచి అఫ్గానిస్తాన్‌కు పారిపోయిన 21 మందిలో తన కూతురు, అల్లుడు ఉన్నారని తెలుసుకున్న ఆమె హతాశులయ్యారు.

ఇప్పటికీ బిందు ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు.

కాబుల్ విమానాశ్రయం వద్ద తాలిబాన్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాబుల్ విమానాశ్రయం వద్ద తాలిబాన్లు

అఫ్గానిస్తాన్‌లో ఖైదు...

2016లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని అనుమానించిన మిస్సింగ్ కేసులపై దర్యాప్తు ప్రారంభించింది.

తర్వాత 2019 నవంబర్‌లో నిమిషతో సహా 10 మంది మహిళలు అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి లొంగిపోయారని మీడియాలో రిపోర్టులు వచ్చాయి.

దాంతో, బిందుకు మరో కొత్త పోరాటం ఆరంభమైంది. ముఖ్యంగా, ఐఎస్‌లో చేరిన నషీదుల్ హమ్‌జఫర్ అనే వ్యక్తిని భారతదేశం, అఫ్గానిస్తాన్ నుంచి తీసుకురాగలిగినప్పుడు నిమిషను ఎందుకు తీసుకురాలేరంటూ బిందు వాదించారు.

దీనిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, నిమిష జైల్లో ఉన్న కారణాన ఆమెను అలా రప్పించలేరని బిందుకు తెలిసింది.

"వాళ్లు జైల్లో సురక్షితంగా ఉన్నారని నాకొక జర్నలిస్ట్ దగ్గర నుంచి సమాచారం వచ్చింది" అని బిందు చెప్పారు.

ఈ పిటీషన్‌ను ఉపసంహరించుకుని మరొక పిటిషన్ (రిట్ ఆఫ్ మాండమస్) వేయడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. దానిపై విచారణ ఆగస్ట్ 24న జరగనుంది.

ఇంతలో అమెరికా సైన్యాలు అఫ్గానిస్తాన్ నుంచి వెనుదిరగడం, తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకోవడం వెనువెంటనే జరిగిపోయాయి.

తాలిబాన్లు ఆక్రమణ బిందులో కొత్త ఆశలు చిగురింపజేసింది. కానీ వెంటనే ఉసూరుమనే వార్త తెలిసింది.

తాలిబాన్లు జైల్లో ఉన్న పురుషులను విడుదల చేశారని ఒక జర్నలిస్ట్ ఆమెకు చెప్పారు.

మహిళా ఖైదీల సమాచారం బిందుకు తెలియలేదు. అయినా, ఆమె ఆశ వదులుకోలేదు.

"పైన భగవంతుడు ఉన్నాడు. ఆయన మంచి మాత్రమే చేస్తాడు. రాజకీయలు, కులం, మతం ఇవేవీ ఆయనకు తెలీదు. కాబట్టి నేను వేచి చూడాల్సిందే" అని బిందు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)