'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం

ఐటీబీపీ సీనియర్ కమాండో రాజశేఖర్
ఫొటో క్యాప్షన్, భారత దౌత్య సిబ్బందిని కాబుల్ నుంచి భారత్‌కు తరలిస్తున్న విమానంలో సహచరులతో ఐటీబీపీ సీనియర్ కమాండో రాజశేఖర్
    • రచయిత, శ్రీనివాస్ లక్కోజు
    • హోదా, బీబీసీ కోసం..

''56 గంటలు మాలో చాలా మందికి తిండి, నిద్ర లేదు. అఫ్గానిస్తాన్ నుండి సురక్షితంగా భారత అధికారులు, ప్రజలు, భద్రతా సిబ్బందిని తీసుకుని సురక్షితంగా స్వదేశం చేరుకోవడమే లక్ష్యం. ఇదొక ఛాలెంజింగ్ ఆపరేషన్'' అని ఆగస్టు 15, 16 తేదీలలో కాబూల్‌లో జరిగిన పరిణామాలను బీబీసీతో పంచుకున్నారు సీనియర్ కమాండో రాజశేఖర్.

13 సంవత్సరాలుగా రాజశేఖర్ ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) సీనియర్ కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలోని మందాస మండలం చిన్నలింబుగాం గ్రామానికి చెందిన రాజశేఖర్, డిప్యూటేషన్ మీద రెండేళ్లుగా అఫ్గానిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నారు.

కాబుల్ సహా దేశమంతా తాలిబాన్ల చేతిల్లోకి వెళుతున్నవేళ, భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను దేశానికి తీసుకొచ్చే ఆపరేషన్‌లో రాజశేఖర్ పాల్గొన్నారు. అసలు ఆ తరలింపు ఎలా జరిగింది ? దానికి ముందు ఎదురైన అవాంతరాల గురించి ఆయన బీబీసీకి ఫోన్ ద్వారా వివరించారు.

భయం...భయం

భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను తరలించే ఆపరేషన్ ప్రారంభమయ్యేటప్పటికి కాబుల్‌లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని రాజశేఖర్ అన్నారు.

''అక్కడ తుపాకులు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా తుపాకులు పట్టుకుని తిరుగుతున్న తాలిబన్లే కనిపిస్తున్నారు. దేశంలోని రాకపోకలన్నింటిని వాళ్లే కంట్రోల్ చేస్తున్నారు. అఫ్గాన్ వాసులతో పాటు అక్కడున్న ఇతర దేశస్థులందరు ప్రాణభయంతోనే ఉన్నారు. భారత రాయబార కార్యలయం కాబుల్‌లో ఉంది. ఇక్కడ పని చేస్తున్న అధికారులు, భద్రత సిబ్బంది అంతా కలిపి మొత్తం 150కి పైనే ఉన్నారు'' అని నాటి పరిస్థితిని వివరించారాయన.

ఐటీబీపీ సీనియర్ కమాండో రాజశేఖర్

ప్రమాద ఘంటికలు

అక్కడ జరుగుతున్న పరిణామాలను చూశాక రాయబార కార్యాలయ ఉద్యోగులందరినీ స్వదేశానికి తీసుకు రావాలని ప్రభుత్వం భావించిందని రాజశేఖర్ వెల్లడించారు.

''ఏ క్షణమైనా తాలిబన్లు కాబుల్‌లోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేశాం. ఈ విషయం తెలియగానే భారత రాయబార కార్యాలయ సిబ్బంది అందరూ వెంటనే వచ్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. తొలి దఫా రెండు బృందాలుగా విభజించి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మొదటి బృందంలో విదేశాంగశాఖ అధికారులు 20 మంది, రక్షణగా 25 మంది భద్రతా సిబ్బందిని తరలించాలనేది ప్రణాళిక. అయితే తాలిబాన్లు అంత త్వరగా కాబుల్ ని కంట్రోల్ లోకి తీసుకుంటారని అనుకోలేదు" అన్నారాయన.

ఆగస్టు 15 రాత్రి...

''ఏ క్షణమైనా కాబుల్ తాలిబాన్ల కంట్రోల్ లోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆగస్టు 15 రాత్రి అక్కడ నుంచి బయలుదేరాలని అనుకున్నాం. బుల్లెట్‌ ప్రూఫ్ వాహనాలన్నీ సిద్ధం చేసుకున్నాం. సాధారణంగా ముగ్గురు మాత్రమే ఎక్కాల్సిన ఈ వాహనాల్లో ఐదారుగురిని ఎక్కించాం. భారత రాయబార కార్యాలయం నుంచి 6 కి.మీ. దూరంలో ఉన్న టర్కీ ఎయిర్ బేస్ కు రాత్రి 8.30 గం.లకు బయలుదేరాం. మొత్తం 45 మందిని టర్కీ ఎయిర్ బేస్‌ కు చేర్చాం. దారిలో ఎవర్ని చూసినా తాలిబాన్‌లే అనే అనుమానం ఉండేది. ఆరు కిలోమీటర్ల దూరాన్ని చేరుకోడానికి గంట సమయం పట్టింది" అని నాటి పరిస్థితులను వివరించారు రాజశేఖర్.

''టర్కీ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్న 45మంది ఆగస్టు 15 రాత్రంతా అక్కడే గడిపారు. 16వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు భారత విమానం రావడంతో మన దేశానికి వచ్చారు. మొదటి బృందాన్ని ఎయిర్ బేస్‌లో దింపేసిన తర్వాత మళ్లీ కాబుల్‌ కు బయలుదేరాం. కానీ, అప్పటికే కాబుల్ లోని చాలా ప్రాంతాలు తాలిబాన్ల వశమయ్యాయి. ఆగస్టు 15న మేం టర్కీ ఎయిర్‌ బేస్ లో ఉన్నప్పుడే తాలిబాన్లు కాబుల్ ని అక్రమించారు. మన ఎంబసీ చేరుకునే సరికి తాలిబాన్లు దానిని చుట్టుముట్టారు'' అని వెల్లడించారు రాజశేఖర్.

కాబుల్ నుంచి భారత్ వచ్చిన భారత వైమానిక దళం విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దిగింది

ఫొటో సోర్స్, indian army

ఫొటో క్యాప్షన్, కాబుల్ నుంచి భారత్ వచ్చిన భారత వైమానిక దళం తొలి విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దిగింది

అడ్డుకున్న తాలిబాన్లు

''రాయబార కార్యాలయంలో ఉన్న మిగతా వారిని రెండో బృందంగా ఎయిర్ బేస్‌ కు తీసుకెళ్లాలి. మొదటి బృందం వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్లు రాయబార కార్యాలయాన్ని చుట్టుముట్టారు. రెండో బృందాన్ని వెళ్లనివ్వలేదు. ‘కర్ఫ్యూ ఉంది.. కదలడానికి వీల్లేదు’ అని తాలిబాన్లు తేల్చి చెప్పారు. మరో మార్గంలో రెండో బృందాన్ని తీసుకుని ఎయిర్‌బేస్‌ వద్దకు బయల్దేరాం. కానీ, దారి మధ్యలో తాలిబాన్లు అడ్డగించారు. చేసేదేమీ లేక తిరిగి రాయబార కార్యాలయానికి వచ్చేశాం'' అని రాజశేఖర్ వెల్లడించారు.

క్షణక్షణం...

ఎయిర్ బేస్‌కు వెళ్లనివ్వకుండా తాలిబాన్లు అడ్డుకోవడంతో తాము సురక్షితంగా భారత్ చేరతామా అన్న విషయంలో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని రాజశేఖర్ అన్నారు. ఎంబసీ నుంచి వారిని హెలీకాప్టర్లతో ఎయిర్ లిఫ్టింగ్ చేద్దామని భావించినా, హెలీప్యాడ్ లేకపోవడంతో అది సాధ్యం కాలేదని వివరించారు.

''ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. మేం కూడా మా కుటుంబ సభ్యులతో మాట్లాడాం. వాళ్లు చాలా అందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియలేదు. సమయం గడుస్తున్న కొద్ది పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. ఆగష్టు 16న ఉదయం భారత రాయబార కార్యాలయం అధికారులు మమ్మల్ని భారత్ పంపేందుకు వీలు కల్పించాలని తాలిబాన్లతో చర్చించారు. అందుకు వారు ఒప్పుకోలేదు. అయితే వివిధ దశల్లో చర్చల తర్వాత పంపించడానికి తాలిబాన్లు అంగీకరించారు'' అన్నారు రాజశేఖర్.

కాబుల్ నుంచి భారత్ వచ్చిన భారత వైమానిక దళం విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో దిగింది

ఫొటో సోర్స్, Indian army

చివరకు స్వదేశానికి

రెండో బృందాన్ని అడ్డుకున్న తర్వాత ఆగస్టు 16వ తేదీ అంతా చర్చలతోనే నడిచిందని రాజశేఖర్ వెల్లడించారు.

''చివరకు 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు టర్కీ ఎయిర్‌బేస్‌కు చేరాం. తాలిబాన్లే మాకు ఎస్కార్ట్ గా వచ్చారు. ఆ రోజు సాయంత్రానికి దిల్లీ చేరుకున్నాం. అక్కడకు చేరుకున్న తర్వాతగానీ ఆందోళన తగ్గలేదు. దిల్లీకి చేరుకున్నాకే అందరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాం'' అన్నారు రాజశేఖర్.

కరోనా ప్రోటోకాల్ ప్రకారం ప్రస్తుతం వీరంతా దిల్లీలో క్వారంటైన్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)