అఫ్గానిస్తాన్: ఇంటింటినీ జల్లెడ పడుతున్న తాలిబాన్లు.. భారత కాన్సులేట్‌లలోనూ సోదాలు

కాబుల్ వీధుల్లో తాలిబాన్ ఫైటర్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కాబుల్ వీధుల్లో తాలిబాన్ ఫైటర్

నాటో దళాలు లేదా అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కోసం పని చేసిన వారి కోసం తాలిబాన్ వెతుకులాటను ఉధృతం చేసిందని ఐక్యరాజ్యసమితి రిపోర్టు హెచ్చరించింది.

వారి కోసం మిలిటెంట్లు ఇంటింటినీ జల్లెడ పడుతున్నారని, కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని చెప్పింది.

అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ప్రజలపై 'ప్రతీకారం' తీర్చుకోబోమని తాలిబాన్ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

కానీ, 1990ల నాటి క్రూరత్వం వారిలో ఇంకా ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి.

'సహకారం అందించిన వారు' లక్ష్యంగా తాలిబాన్ కదలికలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితికి ఇంటెలిజెన్స్ అందించే ఆర్‌హెచ్ఐపీటీవో నార్వేయిన్ సెంటర్ ఫర్ గ్లోబల్ అనాలిసిస్ హెచ్చరించింది.

వీడియో క్యాప్షన్, అష్రాఫ్ ఘనీ: 'నాకు బూట్లు వేసుకునే సమయం కూడా ఇవ్వలేదు'

'తాలిబాన్ లక్ష్యంగా చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారందరికీ ముప్పు పొంచివుందని' రిపోర్టు రూపకల్పన చేసిన టీమ్‌ను నడిపిన క్రిస్టియన్ నెల్లేమన్ బీబీసీకి చెప్పారు.

'వారు లొంగకపోతే, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి, విచారించి, శిక్షించాలని భావిస్తున్నారు' అని వివరించారు.

తాలిబాన్ బ్లాక్ లిస్టులో ఉన్న వారందరూ పెనుప్రమాదంలో ఉన్నట్లేనని హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఉరి శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇతర పరిణామాలు:

  • ఇతర నగరాల్లో తాలిబాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధాని కాబుల్లో జాతీయ జెండాను ఊపుతూ కనిపించారు. అసాదాబాద్లో నిరసనకారులు గాయాలపాలయ్యారు.
  • కాబుల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన అమెరికా విమానాన్ని పట్టుకుని జారి పడిపోయి మరణించిన వ్యక్తిని జాకీ అన్వారీ(19)గా గుర్తించారు. అతను అఫ్గానిస్తాన్ జాతీయ ఫుట్‌బాల్ టీమ్‌లో ఆటగాడని తెలిసింది.
  • ఇతర దేశాలు తమ వారిని అఫ్గానిస్తాన్ దాటించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 7 వేల మందిని రక్షించామని అమెరికా వెల్లడించింది.
  • కాబూల్ విమానాశ్రయం వెలుపల పరిస్థితి గందరగోళంగానే ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అఫ్గానీయులను తాలిబాన్ అడ్డుకుంటోంది. ఓ వీడియోలో పిల్లవాడిని అమెరికన్ సైనికుడికి అప్పగిస్తోన్న దృశ్యం కనిపించింది.
  • అమెరికాకు చెందిన వేలాది ఆయుధాలతో కూడిన వాహనాలు ప్రస్తుతం తాలిబాన్ చేతిలో ఉన్నాయి. 30 నుంచి 40 విమానాలు, పెద్ద సంఖ్యలో చిన్న ఆయుధాలను వారు స్వాధీనం చేసుకున్నారని అమెరికా అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు.

విదేశీ బలగాల ఉపసంహరణతో తాలిబాన్ ఆదివారం అఫ్గానిస్తాన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో 20 ఏళ్ల తర్వాత వారికి మళ్లీ అధికారం చేజిక్కినట్లు అయింది. అప్పట్లో ప్రజలను తీవ్రంగా హింసించింది. బహిరంగంగానే ఉరి శిక్షలు అమలు పర్చేది. మహిళలు పని చేయడంపై నిషేధం ఉండేది.

కానీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత తొలి ప్రెస్ మీట్లో ఇస్లామిక్ చట్టాలకు కట్టుబడి ఉంటూ మహిళలకు పని చేసుకునే అవకాశం కల్పిస్తామని తాలిబాన్ పేర్కొంది. బుర్ఖా ధరించాలని బలవంతం చేయబోమని తెలిపింది. అయితే హిజాబ్‌ను కచ్చితంగా వేసుకోవాల్సివుంటుందని స్పష్టం చేసింది.

'అంతర్గత లేదా బాహ్య శత్రువులను' తాము కోరుకోవడం లేదని, భద్రతా దళాల మాజీ సభ్యులకు, విదేశీ శక్తులతో కలిసి పని చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందని కూడా వెల్లడించారు.

ఈ మాటలను అంతర్జాతీయ సమాజంతో సహా అఫ్గానీయులు కూడా నమ్మడం లేదు.

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ, అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబాన్‌ తాపత్రయ పడుతోందని పేర్కొన్నారు.

తాలిబాన్ మారారని అనుకుంటున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు 'లేదు' అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. వారు 'అస్తిత్వం' కోసం చూస్తున్నారని చెప్పారు.

తాలిబాన్

ఫొటో సోర్స్, EPA

రెండు భారత కాన్సులేట్‌లలో తాలిబాన్ల సోదాలు

కాందహార్, హెరాత్‌లలో మూతపడిన భారత కాన్సులేట్‌లలో బుధవారం తాలిబాన్లు సోదాలు చేపట్టారని హిందుస్తాన్ టైమ్స్ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''దౌత్య కార్యాలయాల తాలాలు బద్దలుకొట్టి తాలిబాన్లు లోపలకి ప్రవేశించారు. డాక్యుమెంట్ల కోసం అన్నిచోట్లా వెతికారు. కార్యాలయాల బయట పార్క్ చేసిన వాహనాలను తీసుకెళ్లిపోయారు''అని ఆ కథనంలో పేర్కొంది.

మరోవైపు అఫ్గాన్ ప్రభుత్వ గూఢచర్య సంస్థ ఎన్‌డీఎస్ కోసం పనిచేసిన వారి కోసం ఇంటింటికీ వెళ్లి తాలిబాన్లు సోదాలు చేపడుతున్నారని హిందుస్తాన్ టైమ్స్ తెలిపింది.

''కాబుల్, జలాలాబాద్‌లలోని భారత కాన్సులేట్‌లలో ఏం జరుగుతుందో స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.''

''తాలిబాన్ ప్రధాన నాయకుల్లో ఒకరైన హక్కానీ గ్రూప్ ఛైర్మన్ సిరాజుద్దీన్ హక్కానీ సోదరుడు అనాస్ హక్కానీ నేతృత్వంలోని 6000 మంది హక్కానీ నెట్‌వర్క్ ఫైటర్లు కాబుల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.''

''కాబుల్‌ను నియంత్రణలోకి తీసుకున్న అనంతరం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్, హైకౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సీలియేషన్ (హెచ్‌సీఎన్‌ఆర్) చీఫ్ అబ్దుల్లా అబ్దుల్లాలను అనాస్ హక్కానీ కలిశారు''.

''కర్జాయ్, అబ్దుల్లాల ప్రతి కదలికలపైనా తాలిబాన్లు నిఘా పెట్టారు. అధికార మార్పిడి సాఫీగా సాగేందుకు తాలిబాన్లు వీరితో చర్చలు కొనసాగిస్తున్నారు'' అని హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)