ముంబయి మాఫియా డాన్‌లు: హజీ మస్తాన్ నుంచి కరీం లాలా దాకా, ఎవరెవరు ఎలా రాజ్యమేలారు?

ఫొటో సోర్స్, SUNDER SHEKHAR
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకప్పటి బాంబేలోని మజ్‌గావ్ నౌకాశ్రయంలో షేర్ ఖాన్.. కూలీల నుంచి మామూలు వసూలుచేసేవాడు. డబ్బులు ఇవ్వని కూలీలను తన గూండాలతో చితకబాదించేవాడు.
అక్కడే పనిచేసే హాజీ మస్తాన్ ఈ తతంగాన్ని రోజూ చూసేవాడు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన షేర్ ఖాన్ ఇక్కడ బలవంతంగా ఎలా డబ్బులు వసూలు చేస్తున్నాడో తనకు అర్థమయ్యేదికాదు.
ఎలాగైనా షేర్ ఖాన్ పీడ వదిలించుకోవాలని మస్తాన్ నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటి శుక్రవారం డబ్బులు వసూలు చేసేందుకు తన గూండాలతో షేర్ ఖాన్ వచ్చాడు. అయితే, కూలీల్లో పది మంది కనిపించలేదు.
అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే షేర్ ఖాన్, అతడి పక్కనుండే నలుగురు గూండాలపై మస్తాన్ దాడిచేశాడు.
మజ్‌గావ్‌లో తనకు అడుగడుగు తెలిసినా, తన దగ్గర రామ్‌పురీ కత్తులున్నా.. ఆ క్షణంలో ఏవీ షేర్ ఖాన్‌కు ఉపయోగపడలేదు. దీంతో రక్తం మడుగులో ఉన్న అతడు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గూండాలతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఫొటో సోర్స్, PENGUIN
ఈ దాడితో హాజీ మస్తాన్.. కూలీల్లో హీరోగా మారాడు. ఇక్కడి నుంచే ‘‘మస్తాన్ కథ’’ కూడా మొదలైంది.
అమితాబ్ బచ్చన్ నటించిన 1975నాటి యశ్ చోప్రా సినిమా ‘‘దీవార్’’లో ఈ ఘటనను అచ్చం ఇలానే తెరకెక్కించారు..
ఈ విషయాలను ఇటీవల ప్రచురితమైన తన ఆత్మకథ ‘‘ఏ రూడ్ లైఫ్’’లో సీనియర్ జర్నలిస్టు వీర్ సాంఘ్వీ ప్రస్తావించారు.
‘‘ఆ సినిమాలో అమితాబ్ పాత్రకు హాజీ మస్తాన్ జీవితమే ఆధారం. అమితాబ్ చేతికి కట్టుకున్న 786 బ్యాడ్జి తప్ప, మొత్తం కథ నిజమేనని మస్తాన్ నాతో అన్నారు.’’

ఫొటో సోర్స్, TRIMURTI FILMS
కరీమ్ లాలా, వరదరాజన్ ముదాలియార్‌లతో చేతులు కలిపి
బాంబేలో తిరుగులేని శక్తిగా ఎదగాలంటే కేవలం డబ్బులు మాత్రమే సరిపోవని మొదట్లోనే మస్తాన్ గ్రహించాడు.
బాంబే అండర్‌వరల్డ్ సామ్రాజ్యంపై ఎస్ హుసైన్ జైదీ రాసిన ‘‘డోంగ్రీ టు ముంబయి: సిక్స్ షేడ్స్ ఆఫ్ ముంబయి మాఫియా’’ పుస్తకంలోనూ ఈ విషయాలను ప్రస్తావించారు.
‘‘బాంబేలో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసేందుకు మస్తాన్‌కు శక్తిమంతమైన బలగం అవసరమైంది. దీంతో అప్పట్లో డాన్‌లుగా చెలామణీ అవుతున్న కరీమ్ లాలా, వరదరాజన్ ముదాలియార్‌లతో అతడు చేతులు కలిపాడు’’అని జైదీ వివరించారు.
1956లో దమణ్ డాన్ సుకుర్ నారాయణ్ బఖియాతో మస్తాన్ చేతులు కలిపాడు. కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ మంచి మిత్రులు అయ్యారు. బాంబే పరిసర ప్రాంతాలను వీరిద్దరూ పంచుకున్నారు. బాంబే పోర్టును మస్తాన్, దమణ్ పోర్టును బఖియా తీసుకున్నారు.
‘‘దుబాయి నుంచి అక్రమ మార్గాల్లో వచ్చే వస్తువులు దమణ్‌కు చేరేవి. అదన్ నుంచి వచ్చేవి బాంబేలో దిగేవి. బఖియా ఉత్పత్తులను కూడా మస్తానే పర్యవేక్షించేవాడు’’అని జైదీ వివరించారు.

ఫొటో సోర్స్, ROLI BOOKS
యూసుఫ్ పటేల్‌ను హత్య చేసేందుకు సుపారీ
వార్డెన్, పోడర్ రోడ్‌ల మధ్య నుండే సోఫియా కాలేజీ మార్గంలో భారీ బంగ్లాలో మస్తాన్ ఉండేవాడు.
‘‘1979లో మస్తాన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు ఆ బంగ్లాకు వెళ్లాను. అక్కడ గార్డెన్‌లో ఒక పాత ట్రక్కు ఉంది. మొదట్లో అక్రమంగా తీసుకొచ్చిన వస్తువులను ఈ ట్రక్కులోనే మస్తాన్ తరలించేవాడని అందరూ చెప్పుకుంటుంటారు. దీని గురించి ఏమైనా చెప్పండని ఆయన్ను అడిగాను. కానీ ఆయన ఆ ప్రశ్నను దాటవేశారు. ఆయన స్థానంలో ఉన్నవారు ఎవరైనా అలానే చేస్తారు’’అని సాంఘ్వి వివరించారు.
బాంబే అండర్‌వరల్డ్ నాయకుల్లో ఒకరైనా యూసుఫ్ పటేల్‌ను సాంఘ్వి కలిశారు.
‘‘యూసుఫ్ తన కాళ్లను అలా ఆడిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడూ పైజామాలే వేసుకుంటారు. ఒకసారి పాత సంగతుల గురించి ఆయన్ను ప్రశ్నలు అడిగాను.’’
‘‘ఒకసారి నన్ను చంపడానికి కరీం లాలా మనుషులకు హాజీ మస్తాన్ డబ్బులు ఇచ్చాడు. నేను రోడ్డుపై నడుస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారు. దీంతో నేను చనిపోయానని వారు అనుకున్నారు. గాయాల పాలైన నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాను’’అని యూసుఫ్ వివరించారని సాంఘ్వి తెలిపారు.

ఫొటో సోర్స్, PENGUIN
హత్య కేసులో మస్తాన్, కరీం లాలా అరెస్టు..
ఈ విషయాన్ని హుసైన్ జైదీ తన పుస్తకంలో ప్రస్తావించారు.
‘‘బాంబే మాఫియాలో తొలి సుపారీని యూసుఫ్ పటేల్‌ను చంపేందుకు హాజీ మస్తాన్ ఇచ్చాడు. 1969లో రూ.10,000 జీతానికి మస్తాన్ దగ్గర యూసుఫ్ పనిచేసేవాడు. అయితే, ఒక కేసులో తనను మోసం చేశాడని యూసుఫ్‌పై మస్తాన్‌కు కోపం ఉండేది.’’
‘‘యూసుఫ్‌ను చంపేందుకు కరీం లాలాకు చెందిన ఇద్దరు గూండాలకు సుపారీ ఇచ్చారు. మినారా మసీదు ప్రాంతంలో దాడి చేయాలని నిర్ణయించారు.’’

ఫొటో సోర్స్, SUNDER SHEKHAR
‘‘రంజాన్ నెలలో జనం రద్దీగా ఉండే చోట యూసుఫ్‌పై వారిద్దరూ కాల్పులు జరిపారు. తూటాలు తగలడంతో మస్తాన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అతడి పక్కనుండే బాడీగార్డులు అతడిని కాపాడేందుకు పరుగులు పెట్టారు. కాల్పులు జరిపిన ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడున్న జనం వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. యూసుఫ్ చేతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతడి పక్కనున్న ఓ బాడీగార్డు ఈ కాల్పుల్లో మరణించాడు. ఇది 1969 నవంబరు 22న జరిగింది.’’
‘‘ఈ కేసుకు సంబంధించి హాజీ మస్తాన్, కరీం లాలాతోపాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.’’

ఫొటో సోర్స్, PENGUIN
అలా రాజీ కుదిరింది..
ఈ విషయం నిజమేనా అని మస్తాన్‌ను సాంఘ్వి అడిగారు. దీనికి సమాధానంగా అవునని మస్తాన్ తలూపారు.
‘‘ఓ కేసులో తనను యూసుఫ్ మోసం చేశాడని మస్తాన్ నాతో చెప్పాడు. మస్తాన్‌ను మోసం చేసిన వారెవరూ బతికి ఉండదకూడదని అతడు అన్నాడు.’’
‘‘యూసుఫ్ మరణించాడని తెలియగానే నాకు ప్రశాంతంగా నిపించింది. అయితే, అతడు బతికే ఉన్నాడని మళ్లీ సమాచారం అందింది. ఇది దేవుడి చర్యగా నేను భావించాను. యూసుఫ్ మరణించకూడదని అల్లా భావిస్తే, నేను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తాను’’అని మస్తాన్ తనతో అన్నాడని సాంఘ్వి చెప్పారు. ఆ తర్వాతి కాలంలో మస్తాన్, యూసుఫ్ మళ్లీ స్నేహితులయ్యారు.

ఫొటో సోర్స్, PENGUIN
రుఖ్సానా సుల్తానాతో పరిచయం..
మస్తాన్ ఎప్పుడూ తెల్లని బట్టలే వేసుకునేవాడు. ఈ బట్టలు ఆయనకు వన్నె తెస్తాయని పక్కనున్న గూండాలు ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు.
‘‘మస్తాన్‌ను తొలిసారి ఎలా కలిశానో సంజయ్ గాంధీ స్నేహితురాలు, నటి అమృతా సింగ్ తల్లి రుఖ్సానా సుల్తానా నాకు వివరించారు. ఆమెకు కైమీ సబ్బు అంటే చాలా ఇష్టం. అయితే, ఆ సబ్బు భారత్‌లో దొరికేది కాదు. స్మగ్లర్ల నుంచి ఆమె ఆ సబ్బును కొనుగోలు చేయాల్సి వచ్చేది’’అని సాంఘ్వీ చెప్పారు.
‘‘ఒకరోజు బాంబేలోని రద్దీ మార్కెట్‌లో ఆమె తన కార్‌ను పార్కింగ్ చేసి సబ్బులు కొనేందుకు వెళ్లారు. ఎన్ని షాపులకు వెళ్లిన ఆ సబ్బు దొరకలేదు. ఆ సబ్బులు ఇప్పుడు రావడం లేదని అక్కడున్న వారు చెప్పారు. దీంతో ఆమె తన కారు దగ్గరకు పయనం అయ్యారు. అయితే, ఆమె కారు చుట్టూ జనం గూమిగూడి ఉన్నారు.’’
‘‘కొంచెం దగ్గరకు వెళ్లేసరికి, కారు వెనుక భాగం పూర్తిగా కైమీ సబ్బులతో నిండి ఉంది. తెల్లని బట్టలు వేసుకున్న ఓ వ్యక్తి కారు పక్కనే నిలబడ్డాడు. ముందు నవ్వి, హాయ్ నేను హాజీ మస్తాన్ అంటూ అతడు పరిచయం చేసుకున్నాడు.’’

ఫొటో సోర్స్, ILLUSTRATED WEEKLY
ప్రజల్లో వరదరాజన్ పేరు...
బాంబేలో తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు హాజీ మస్తాన్ ప్రయత్నిస్తున్నప్పుడు, వరదరాజన్ ముదాలియార్.. విక్టోరియా స్టేషన్ దగ్గర కూలీగా పనిచేసేవాడు.
తమిళనాడులోని వెల్లూర్‌లో వరదరాజన్ పుట్టి పెరిగాడు. ఇతడు చదువుకోలేదు. కానీ ఇంగ్లిష్, తమిళ్‌లను చదవగలడు, రాయగలడు. తన కుటుంబంలో ఈ రెండు భాషలను చదవగలిగే ఏకైక వ్యక్తి ఇతడే.
‘‘సామాన్య ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వడం, అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు, నల్లా మంజూరు చేయడంలో బాంబే పరిపాలనా యంత్రాంగం కంటే వరదరాజన్ మనుషులు వేగంగా పనిచేయగలరు’’అని ప్రముఖ ముంబయి క్రైం రిపోర్టర్ ప్రదీప్ శిందే వ్యాఖ్యానించారు.
‘‘ఆయనకు ప్రజల్లో చాలా పెరు ఉండేది. ఆయన ఇచ్చే ఆదేశాలను గుడ్డిగా చాలా మంది పాటించేవారు. తమిళనాడు నుంచి వచ్చే ప్రజలకు సాయంచేసే బాధ్యతను తన నమ్మిన బంట్లో ఇద్దరు తోమస్ కురియన్, మహేందర్ సింగ్‌లకు వరదరాజన్ అప్పగించాడు.’’

ఫొటో సోర్స్, ROLI BOOKS
ఆ ఇద్దరు అలా కలిశారు..
హాజీ మస్తాన్, వరదరాజన్ ముదాలియార్ ఇద్దరూ తమిళనాడు వాసులే.
‘‘నౌకాశ్రయంలోని కస్టమ్స్ ప్రాంతంలో ఒక ఆంటెనాను మాయం చేశాడని వరదరాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దానితోపాటు దోచేసిన వస్తువులను ఎక్కడ పెట్టావో చెప్పాలని పోలీసులు అతడిని ప్రశ్నించారు. చెప్పకపోతే, థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సి వస్తుందని హెచ్చరించారు’’అని జైదీ రాసుకొచ్చారు.
‘‘జైలులో కూర్చొని వరదరాజన్ ఆలోచిస్తుండగా సిగరెట్ చేతిలోపెట్టుకొని ఓ వ్యక్తి వచ్చి వణక్కం తళైవార్ అంటూ నమస్కరించాడు. తళైవార్ అనే సంబోధించగానే వరదరాజన్ అవాక్కయ్యాడు. ఎందుకంటే తమిళ్‌లో తళైవార్ అంటే నాయకుడు అని అర్థం.’’
‘‘ఇదివరకెప్పుడూ అంత గౌరవంతో వరదరాజన్‌ను ఎవరూ పిలవలేదు. ఇప్పుడు అలా పిలించింది మస్తాన్.’’
‘‘‘ఆ ఆంటెనాను వారికి ఇచ్చేయ్. నీకు అంతకంటే ఎక్కువ డబ్బులు వచ్చే మార్గం నేను చెబుతా’అని వరదరాజన్‌తో మస్తాన్ అన్నాడు.’’
‘‘ఆ ఆఫర్‌ను వరదరాజన్ మొదట తిరస్కరించాడు. అయితే, నేను ఇచ్చే ఈ ఆఫర్‌ను తెలివైన వారెవరూ తిరస్కరించరని మస్తాన్ అన్నాడు. ఆ ఆంటెనాను వారికి ఇచ్చేసి నా బంగారం వ్యాపారంలో చేతులు కలుపు అని మస్తాన్ వ్యాఖ్యానించాడు’’
‘‘దీని వల్ల నీకేంటి లాభం? అని వరదరాజన్ ప్రశ్నించాడు. నీ మనుషులను నేను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నానని మస్తాన్ సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన అక్కడి పోలీసులు ఎప్పటికీ దాన్ని మరచిపోలేదు. సూటు, బూటు వేసుకుని చదువుకున్నట్లు కనిపించే వ్యక్తి.. తెల్లని బట్టలు వేసుకుని గూండాలా కనిపించే వాడితో చేతులు కలపడమేంటని వారు అనుకున్నారు.’’

ఫొటో సోర్స్, SUNDER SHEKHAR
మస్తాన్, కరీం లాలా, వరదరాజన్..
జైలు నుంచి బయటకు వెళ్లగానే, మస్తాన్, వరదరాజన్ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకోవడంలో వరదరాజన్ దిట్ట. తన ఇంటి దగ్గర ప్రజల సమస్యలను అతడు వినేవాడు.
దేవుణ్ని ఎక్కువగా నమ్మే వరదరాజన్.. మాటుంగా స్టేషన్ వెలుపల గణేశ్ విగ్రహాలకు భారీగా నిధులు ఇచ్చేవాడు.
తన పేరు ప్రతిష్ఠలతోపాటే ఆ గనేశ్ మండపం పరిమాణం కూడా పెరుగుతూ వచ్చింది. వరదరాజన్‌పై కూడా నాయకన్, దయావాన్, అగ్నీపథ్ లాంటి సినిమాలు తీశారు.
అగ్నీపథ్‌లో వరదరాజన్ స్వరాన్ని అనుకరించేందుకు అమితాబ్ ప్రయత్నించారు.
మరోవైపు మస్తాన్ సామ్రాజ్యం కూడా బాగా విస్తరించింది.
‘‘విదేశాలకు మస్తాన్ పంపే వెండికి మంచి పేరుండేది. స్వచ్ఛతకు ఇది మారుపేరులా అయ్యింది. ‘మస్తాన్ కీ చాంద్’అనేది ఒక బ్రాండ్‌లా మారింది. మలబార్ కొండల్లో ఓ విలాసవంతమైన బంగ్లా, కొన్ని కార్లను మస్తాన్ కొన్నాడు. సబీహా బీని మస్తాన్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు (కమరూన్నిసా, మెహరున్నిసా, సంషాద్)’’అని జైదీ పేర్కొన్నారు.
‘‘1970నాటికి హాజీ మస్తాన్, వరదరాజన్ ముదాలియార్, కరీమ్ లాలా మధ్య బంధం బాగా బలపడింది.’’

ఫొటో సోర్స్, ROLI BOOKS
గ్యాంగ్ వార్‌లలో మస్తాన్ జోక్యం
1974లో హాజీ మస్తాన్ అరెస్టు అయ్యాడు. ఎమర్జెన్సీ సమయంలో 1975లో కూడా మస్తాన్ అరెస్టు అయ్యాడు. జైలు నుంచి విడుదల అయ్యాక, మస్తాన్ స్మగ్లంగ్‌ను వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
మరోవైపు బాంబే పోలీసు అధికారి యాదవ్‌రావ్ పవార్.. వరదరాజన్‌ను బొంబే నుంచి వెళ్లగొట్టాడు. దీంతో అతడు మద్రాసు వచ్చేశాడు. ఆ తర్వాత కొన్నేళ్లకే అతడు మరణించాడు.
1980ల్లో ఆలంజేబ్-అమీర్‌జాదా, ఇబ్రహీం కుటుంబాల మధ్య మళ్లీ ఇక్కడ గ్యాంగ్ వార్ మొదలైంది. రెండు వర్గాలను ఒక మాటపైకి తీసుకొచ్చేందుకు మస్తాన్ ప్రయత్నించాడు.
దావూద్ ఇబ్రహీం, ఆలంజేబ్‌లతో ఖురాన్‌పై మస్తాన్ ప్రమాణం చేయించాడు. అయితే, మరుసటి రోజే రెండు గ్యాంగ్‌లూ ఒకరిపై మరొకరు కాల్పులకు తెగబడ్డారు.
మస్తాన్‌కు ఇచ్చిన మాటను ఎవరూ పట్టించుకోలేదు. దీనిబట్టే మస్తాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దావూద్ భారత్‌ను వదిలిపెట్టి దుబయీకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే.

ఫొటో సోర్స్, SUNDER SHEKHAR
రియల్ ఎస్టేట్ మొదలుపెట్టిన డాన్
రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డాన్‌లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు సినిమాల్లో చూపిస్తుంటారు. కానీ నిజ జీవితంలో డాన్లే బిల్డర్లగా మారిపోయారు.
‘‘స్మగ్లింగ్ కంటే రియల్ ఎస్టేట్‌లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని అటు మస్తాన్, ఇటు యూసుఫ్ ఇద్దరూ అంగీకరించారు. బాంబే రెంట్ చట్టమే దీనికి కారణం. యజమానులతోపాటు అద్దెకు ఉండేవారికి సమాన హక్కులు కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు’’అని సాంఘ్వీ అన్నారు.
‘‘ఉదాహరణకు మీ ఫ్లాట్‌ను అద్దెకి ఇచ్చారని అనుకుందాం. అద్దెకున్న వారిని మీరు అక్కడి నుంచి పంపించాలని అనుకుంటే, ఆ ఫ్లాట్ మీకు ఎందుకు అవసరమో కోర్టు ఎదుట చెప్పాల్సి ఉంటుంది. అయితే, తమకు వేరే చోటు లేదంటూ అద్దెకుండే వారు కోర్టులో వేడుకుంటారు.’’
‘‘ఇలా వివాదాల్లో చిక్కుకున్న ఫ్లాట్లను తక్కువ ధరలకే డాన్లు కొనుగోలు చేసేవారు. అక్కడ అద్దెకుండే వారిని బలవంతంగా ఖాళీ చేయించేవారు. ఖాళీ చేయకపోతే, తమ ప్రతాపం చూపించేవారు.’’
‘‘డాన్లంటే భయంతో చాలా మంది ఖాళీ చేసి వెళ్లిపోయేవారు. దీంతో అక్కడ కొత్త ఇళ్లను కట్టి, అధిక ధరలకు అమ్మేవారు. ఈ రియల్ ఎస్టేట్ విధానంలో స్మగ్లింగ్ కంటే డాన్లకు ఎక్కువ డబ్బులు వచ్చేవి.’’
1980ల్లో ఈ డాన్లపై పోలీసుల ఒత్తిడి బాగా పెరిగింది. దీంతో చాలా మంది విదేశాలకు వెళ్లిపోయారు. అయితే, అక్కడి నుంచి కూడా వారు ఈ పనులను కొనసాగించేవారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటింటినీ జల్లెడ పడుతున్న తాలిబాన్లు.. భారత కాన్సులేట్లలోనూ సోదాలు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








