కిస్ డే: ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనిషికి ఎప్పటి నుంచి మొదలైంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విలియమ్ పార్క్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
#InternationalKissingDay జూలై 6న ప్రపంచమంతటా జరుపుకుంటారు. అలాగే వేలంటైన్స్ డే కు ముందు రోజున అంటే ఫిబ్రవరి 13న కూడా కిస్ డే గా జరుపుకోవడం ప్రపంచ వ్యాప్తంగా ఆనవాయితీ. ప్రేమ. అనురాగాలకు గాఢమైన గుర్తుగా ముద్దు ఎలా మారింది? ఈ ' ముద్దు' కథ ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా 168 రకాల సంస్కృతుల్లో సగానికంటే తక్కువ సమాజాల్లో మాత్రమే పెదవులతో ముద్దాడతారని ఓ పరిశోధనలో వెల్లడైంది.
తల్లిదండ్రులు పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం లేదా శుభాకాంక్షలు తెలియజేయడానికి మినహా కేవలం 46 శాతం మంది మాత్రమే పెదవులతో పెదవులకు ఇచ్చే చుంబనాన్ని శృంగార భరితంగా భావిస్తున్నారని లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయం ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ విలియం జన్కోవిక్ వెల్లడించారు.
హిందువుల వేదాల్లో అధర చుంబనం ప్రాముఖ్యం గురించి 3500 ఏళ్ల కిందటే వర్ణించారు.
అసలు ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనుషుల్లో ఎప్పటి నుంచి మొదలైందో చెప్పడానికి రెండు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మనుషులకు ముద్దు పెట్టుకోవాలనే కోరిక అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే సహజంగా కలుగుతుంది.
మొదటి దాని ప్రకారం పుట్టిన బిడ్డ తన పెదవులతో చనుబాలను తీసుకుంటుంది. అలా తల్లి స్థనాన్ని తాకడానికి, ముద్దుకు మధ్య అంతర్లీన సంబంధం ఉండొచ్చు. ఈ భావన ప్రతి ఒక్కరూ అనుభవించేదే.
బిడ్డలకు తినిపించడానికి తల్లి ఆహారాన్ని ముందుగా నమిలి, తన నోటి ద్వారా పిల్లల నోటికి అందించడం వల్ల కూడా ముద్దు భావన ఉద్భవించి ఉండవచ్చనేది రెండో సిద్ధాంతం. ఆహారాన్ని నోటి ద్వారా అందిస్తున్న సమయంలో తల్లి, బిడ్డల మధ్య ప్రేమ, అనురాగం, అప్యాయత కలబోసుకున్న పేగుబంధం మరింత బలపడుతుంది.
మన పూర్వీకుల తల్లులు పిల్లలకు ఆహారాన్ని ముందుగానే నమిలి నోటి ద్వారా అందించి ఉంటారు. మానవులకు దగ్గరి పూర్వీకులుగా భావించే చింపాజీలు కూడా ఇదే విధంగా పిల్లలకు ఆహారాన్ని తినిపిస్తాయి. మిగతా జాతుల కోతులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
ధరించే దుస్తులు కూడా ముద్దు పెట్టుకోవాలనే భావన కలగడానికి గల కారణాల్లో ఒకటని జన్కోవిక్ పేర్కొన్నారు. 'నిండుగా వస్త్రాలు ధరించి ఉంటే చుంబనంపై ఆసక్తి పెరుగుతుందని, అదే తక్కువ వస్త్రాధరణతో ముద్దు పెట్టుకోవాలనే ఆసక్తి అంతగా ఉండదు' అని తెలిపారు.
'మనిషి కేవలం ముద్దు ద్వారా మాత్రమే కాకుండా రకరకాల మార్గాల్లో తృప్తి చెందడమే, అందరికీ ముద్దు శృంగార భరితం కాకపోవడం వెనుక ఉన్న కారణం' అని భావిస్తున్నట్లు జన్కోవిక్ పేర్కొన్నారు.
పెదవులతో పెదవులను ముద్దాడే సంస్కృతి లేని వారు వేరే తరహాలో తృప్తి పొందుతారని రచయిత షెరిల్ కిష్నెబౌమ్ తెలిపారు.
మలాయ్ ముద్దు గురించి డార్విన్ వర్ణించారు. 'కూర్చున్న మహిళలపై మగవారు వాలుతూ ఒకరి పరిమళాన్ని మరొకరు ఆస్వాదిస్తారు' అని చెప్పారు.

పపువా న్యూ గినియా తూర్పు తీరంలో ఉన్న ట్రోబ్రియాండ్ ద్వీపంలో ప్రేమికులు ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు ముద్దాడతారు. కనుబొమ్మలపై ముద్దుపెడుతూ భాగస్వామిని ఉత్తేజపరుస్తారు. 'ఇది శృంగారంలో తార స్ధాయి అని మనలో చాలా మంది భావించకపోవచ్చు. కానీ, వారికి ఆ ప్రకియ అలాగే పని చేస్తోంది' అని కిష్నెబౌమ్ వివరించారు.
ముద్దు ఎలాంటిదైనా నిజమైన అనుభూతిని ఆస్వాదించాలంటే సున్నిత భావాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. పెదవులపై పెదవులను అదిమిపెట్టి చుంబనం ఇవ్వడం కేవలం మానవ జాతికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం.
ముద్దు నిజంగా పరిణామక్రమమే అయితే, జంతువులు ముద్దాడటం మనకెందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నకు మెలిస్సా హోగెన్బూమ్ బీబీసీ ఎర్త్ కి 2015లో సమాధానమిచ్చారు. మనం నిద్రలేచే సమయంలో మన భాగస్వామి ముఖానికి దగ్గరగా ఉండటానికి కారణం తనకు మంచి సువాసనను అందించాలనే కోరిక వల్ల మాత్రమే జరుగుతోందని చెప్పారు.
సువాసన ఎన్నో రకాలుగా ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తుంది. ఆహారం, జబ్బు, మానసిక స్థితి తదితరాల గురించి చెబుతుంది. సువాసనను బట్టి చాలా రకాల విషయాలను మానవుల కంటే వేగంగా పసిగట్టగల సత్తా జంతువులకు ఉంది కాబట్టే, అవి అంత సన్నిహితంగా మెలగాల్సిన అవసరం లేదు.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












