క్రాస్ లెగ్స్: కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ప్రమాదకరమా?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, క్లాడియా హామండ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
మనం కుర్చీలో కూర్చుంటే ఎలా కూర్చుంటాం? చాలా మంది కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడానికి ఇష్టపడతారు.
1980లో బ్రిటీష్ కమెడియన్ కెన్నీ ఎవరెట్ ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చోవడాన్ని ట్రేడ్ మార్క్‌గా మలుచుకున్నారు.
'ఆల్ ఇన్ ద బెస్ట్ పాజిబుల్ టేస్ట్' కార్యక్రమంలో స్కర్ట్, హైహీల్స్ వేస్కోని ఆయన వివిధ రకాలుగా కాలు మీద కాలు వేస్కోని కూర్చొంటూ నవ్వులు పూయించారు.
కొంత మంది మాత్రం అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఇష్టపడరు. రెండు మోకాళ్లను మరింత దూరంగా పెట్టి దర్జాగా కూర్చుంటారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించేటప్పుడు కూడా వారు ఇలాగే కూర్చొని పక్కవారిని ఇబ్బంది పెడుతుంటారు.
వీరంతా 1999లో యూఎస్ నిర్వహించిన ' ద గ్రేట్ క్రాస్ అవుట్' క్యాంపెయిన్‌ను ఇష్టపడే వ్యక్తులై ఉంటారు. ఈ క్యాంపెయిన్‌లో డైటరీ సప్లిమెంట్ కంపెనీ ప్రజల్ని ఒక రోజంతా కాలుపై కాలు వేసుకోకుండా కూర్చుంటే ఆరోగ్యంగా ఉంటారంటూ ప్రోత్సహించింది.
కాలు మీద కాలు వేసుకోవడం ప్రమాదకరమా?
గంటల తరబడి ఒక మోకాలిపై ఇంకో మోకాలిని వేసుకొని కూర్చోవడం వల్ల రక్తపోటు పెరగడం, రక్తనాళాలు ఉబ్బడం, నరాల బలహీనత వంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందట. అయితే, వీటి ప్రభావాన్నిమరింత శాస్త్రీయంగా పరిశీలించాల్సి ఉంది.
వాస్తవానికి చాలాసేపు అదే స్థితిలో కూర్చోవడం వల్ల పాదం లేదా కాలు మొద్దుబారిపోతుంది. మోకాలి వెనుక భాగంలో ఉండే పెరోనియల్ నరాలపై ఒత్తిడి పడి కాలు స్పర్శను కోల్పోతుంది.
కూర్చొనే స్థితిని మార్చగానే కాసేపటికి కాళ్లు మళ్లీ మామూలు స్థితికి వస్తాయి. ఈ పెరోనియల్ నరాలు కాలు కింది భాగానికి, పాదానికి చలనాన్ని కలుగజేస్తాయి.
ఒకే భంగిమలో గంటల పాటు కూర్చోవడం వల్ల పెరోనియల్ నరాలు పక్షవాతానికి గురై ' ఫుట్ డ్రాప్' అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధికి గురైన వ్యక్తి తన కాలి వేళ్లను, ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేడు.
దీనికి గల ప్రధాన కారణాలను అన్వేషించడానికి దక్షిణ కొరియాలో, రోగుల డేటా తీసుకొని చేసిన అధ్యయనం మరో రకమైన ఫలితాన్నిచ్చింది.
వారు చేసిన పరిశోధనలో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఈ వ్యాధి వచ్చినట్లు తేలలేదు. నేలపై కాళ్లు ముడుచుకొని గంటల తరబడి కూర్చున్న వారిలో ఈ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది.
వాస్తవానికి కాలు పూర్తిగా మొద్దుబారిపోవడం అనే స్థితి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జరిగే ఆస్కారం లేదు. ఎందుకంటే మనకు కాస్త అసౌకర్యంగా, తిమ్మిరి వచ్చినట్లు అనిపించగానే మనం ఆ స్థితి నుంచి కదులుతాం.

ఫొటో సోర్స్, SPL
మరి రక్త పోటు సంగతేంటి?
రక్తపోటు (బీపీ) పరీక్ష కోసం వెళ్లినప్పుడు డాక్టర్ లేదా నర్స్ మీ చేతిని కుర్చీ లేదా బల్లపై పెట్టి పాదాలు నేలకు తగిలేలా విశ్రాంతిగా కూర్చోవాలని చెబుతారు. కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటే రక్తపోటు పెరిగి రీడింగ్‌లో తాత్కాలిక తేడా కనబడుతుందన్నది ఇందులో ఉన్న భావన.
2010 నాటికి ఏడు అధ్యయనాలు కాలు మీద కాలు వేస్కోని కూర్చుంటే రక్తపోటు పెరుగుతుందని ధ్రువీకరించాయి. కానీ మరో అధ్యయనం మాత్రం బీపీలో ఎలాంటి తేడా ఉండదని పేర్కొంది. ఇవన్నీ కూడా బీపీ రీడింగ్‌ను బట్టి చేసిన చిన్న చిన్న అధ్యయనాలే.
ఇస్తాంబుల్‌లోని హైపర్ టెన్షన్ క్లినిక్‌లో దీనిపై భారీ అధ్యయనం జరిగింది. అక్కడి పరిశోధకులు మామూలు స్థితిలో కూర్చున్నప్పుడు, కాలుపై కాలు వేసి కూర్చోన్న స్థితి (క్రాస్ లెగ్)లో పలు రీడింగ్‌లను పరిశీలించారు. క్రాస్ లెగ్ స్థితిలో రక్తపోటు పెరిగింది.
మామూలు స్థితిలో కూర్చున్నాక 3 నిమిషాల తర్వాత బీపీ పరీక్షించగా రక్తపోటు మునుపటి స్థాయికి చేరుకున్నట్లు గుర్తించారు. అధిక రక్తపోటుకు చికిత్స తీసుకుంటోన్న వారిలో మాత్రమే ఈ స్థితిలో బీపీ పెరుగుతున్నట్లు తెలిసింది.
క్రాస్ లెగ్ స్థితిలో తాత్కాలికంగా రక్తపోటు ఎందుకు పెరుగుతుందో రెండు పద్ధతుల్లో వివరించారు. మొదటి దాని ప్రకారం, ఒక మోకాలిపై మరో మోకాలిని ఉంచినప్పుడు కాళ్ల నుంచి రక్తం ఛాతి భాగానికి చేరుతుంది. ఫలితంగా గుండె నుంచి ఎక్కువ భాగంలో రక్తం సరఫరా అవుతుంది. దీంతో రక్తపోటు అధికమవుతుంది.
మరో వివరణ ఏంటంటే, కాళ్లలోని కీళ్ల భాగం కదలకుండా కేవలం కండరాలు మాత్రమే కదలడం వల్ల రక్తాన్నిసరఫరా చేసే సిరలలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది. అందుకే రక్తపోటు పెరుగుతుంది. అదే విధంగా చీల మండ దగ్గర క్రాస్ లెగ్స్ చేసి కూర్చున్నప్పుడు రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండవు.

ఫొటో సోర్స్, Getty Images
గుండె ఎలా స్పందిస్తుంది?
ఈ రెండు వివరణల్లో ఏది వాస్తవానికి దగ్గరగా ఉందో తెలుసుకునేందుకు నెదర్లాండ్స్ లోని నిజ్మెగాన్‌లో ఒక అధ్యయనం నిర్వహించారు. ఇందులో అనేక శారీరకపరమైన ప్రమాణాలను పరిగణలోకి తీసుకున్నారు.
కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు, హృదయ స్పందన తక్కువగా ఉన్నప్పుడు రక్తనాళాల్లో నిరోధకత పెరగలేదని ఈ అధ్యయన బృందం గుర్తించింది. కానీ గుండె నుంచి సరఫరా అయ్యే రక్తం పరిమాణం సిరల్లో నిరోధకతను పెంచినట్లు తెలిపింది.
దీన్ని బట్టి క్రాస్ లెగ్స్ స్థితిలో రక్తం గుండెను చేరుతుండటం వల్ల బీపీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాబట్టి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం తాత్కాలికంగా రక్తపోటు పెరుగుదలకు కారణమవుతోంది. అంతేతప్ప దీర్ఘకాలంలో ఏదో వ్యాధికి దారి తీస్తుందని చెప్పేందుకు రుజువులు లేవు.
కానీ ఇక్కడ కొందరికి మినహాయింపు ఉంటుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు ఈ స్థితిలో ఎక్కువసేపు కూర్చోవద్దని సలహా. ఎందుకంటే రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వారిలో 'డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (సిరల్లో రక్తం గడ్డకట్టడం)' వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఫొటో సోర్స్, iStock
కొందరికే సమస్యలు
క్రాస్ లెగ్స్ స్థితిలో కూర్చుంటే దీర్ఘకాలిక రక్తపోటు సమస్య రాదు. కానీ దీనివల్ల సంభవించే 'వెరికోజ్ వెయిన్స్' (రక్తనాళాలు ఉబ్బడం) వ్యాధి సంగతేంటి ? కొంతమందినే ఈ వ్యాధి ఎందుకు బాధిస్తుందో, మిగతా వారిని ఎందుకు బాధించదు అనేది అంతుపట్టని రహస్యమే.
సాధారణంగా రక్తనాళాల్లోని సూక్ష్మ కవాటాలు రక్తం తప్పుడు దిశలో వెనక్కి ప్రవహించకుండా అడ్డుకుంటాయి. కానీ ఆ కవాటాలు సాగిపోయి బలహీనపడితే రక్తం వెనక్కి ప్రవహిస్తుంది. ఫలితంగా ఆ రక్తనాళాలు ఉబ్బిపోతాయి. దీన్నే వెరికోజ్ వెయిన్స్ అని పిలుస్తాం.
ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కాళ్లను ఒకదానిపై మరొకటి వేసుకొని కూర్చోవడమేనని చెప్పలేం. దీనికి జన్యువులు కూడా కారణం కావచ్చు.
ఒకవేళ, మనం కాలు మీద కాలు వేసుకోవడం వల్ల సిరలు, రక్తపోటు, నరాలపై ప్రభావం పడకపోతే, మరి కీళ్లపై దాని ప్రభావం ఏంటి?
ఒక రోజులో మూడుగంటలకన్నా ఎక్కువ సేపు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే వారిలో ముందుకు వంగిపోయే గుణం, భుజాలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.
అయితే, ఈ పరిశోధనలో వాస్తవంగా వారు ఎంత సమయం కూర్చున్నారు అన్నది ఆయా వ్యక్తులు చెప్పిన సమాచారం ఆధారంగానే అంచనా వేశారు.
మనం డెస్క్‌లో కూర్చుని పని చేస్తున్నప్పుడు ఎంతసేపు అలా క్రాస్ లెగ్‌తో కూర్చుంటామో సరిగా గుర్తుండదు. దీనిపై ఒక అంచనాకు రావాలంటే ప్రత్యేకంగా పరిశోధన జరపాల్సిందే.
మొత్తం మీద ఇక్కడ తేలిందేమిటంటే, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు అన్నది పూర్తిస్థాయిలో రుజువు కాని అంశం. కాబట్టి , అలా కూర్చోవాలనిపిస్తే, మీ కాలు తిమ్మిరిపట్టే వరకు కూర్చోండి. ఆ తర్వాత పొజిషన్ మార్చండి.
దీనివల్ల రైల్లోనో, బస్సులోనో మీ పక్కన కూర్చున్న వారు ఎక్కువ స్థలం దొరికినందుకు మీకు మనసులోనే థ్యాంక్స్ కూడా చెబుతారు.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ‘హోం మంత్రి అమిత్ షాను తొలగించండి’ - కాంగ్రెస్ డిమాండ్
- అంతరిక్షంలోకి 82 ఏళ్ల వృద్ధురాలు, జెఫ్ బెజోస్‌తో కలిసి రేపు ప్రయాణం
- కరోనావైరస్ పుట్టుక రహస్యం తేలాల్సిందే... ఎందుకంటే?
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- కోవిడ్-19: వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తో భారత్‌లో తొలి మరణం, ముప్పు చాలా తక్కువన్న కేంద్రం
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- PTSD: అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలు వెంటాడుతుంటే ఏం చేయాలి?
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








