వాలీ ఫంక్: అంతరిక్షంలోకి 82 ఏళ్ల వృద్ధురాలు, జెఫ్ బెజోస్‌తో కలిసి రేపు ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images
అరవై ఏళ్ల సుధీర్ఘ ఎదురుచూపు తరువాత వాలీ ఫంక్ అనే 82 ఏళ్ల వృద్ధురాలి చిరకాల స్వప్నం నెరవేరబోతోంది.
వాలీ ఫంక్ తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించారు. కానీ ఓ లక్ష్యాన్ని మాత్రం ఇప్పటివరకు చేరుకోలేకపోయారు. అదే అంతరిక్షంలోకి వెళ్లి రావడం.
అమెరికాలో 1960-61లో నెలకొల్పిన మహిళల స్పేస్ ప్రాజెక్ట్ మెర్క్యూరీ-13లో ఫంక్ సభ్యురాలు.
నాసా వ్యోమగాములకు ఇచ్చే శిక్షణే ఈ మహిళలకూ ఇచ్చారు. దీంట్లో అప్పటికి అతి పిన్న వయస్కురాలైన ఆమె అన్ని శిక్షణల్లో ముందు నిలిచారు.
కానీ, ఆ ప్రాజెక్టును ఆపేయడంతో ఆమె రోదసి ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు 60 ఏళ్ల తరువాత 82 ఏళ్ల వయసులో ఆమె తన కల సాకారం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే మంగళవారం(జులై 20, 2021న) అంతరిక్షంలోకి ప్రవేశించిన అత్యంత వృద్ధ వ్యోమగామిగా వాలీ ఫంక్ చరిత్ర సృష్టించనున్నారు.
ఎప్పుడో అంతరిక్షంలోకి వెళ్లాల్సిన ఫంక్‌ను ఇప్పుడు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తమ బ్లూ ఆరిజిన్ తొలి మానవ అంతరిక్షయాత్రలో వాలీ ఫంక్‌ను అతిథిగా తీసుకువెళ్తున్నారు.
జెఫ్ బెజోస్‌తో పాటు అతడి సోదరుడు, మరో 18 ఏళ్ల వ్యక్తి ప్రయాణించనున్నారు.
పైలట్‌గా సుశిక్షితురాలైన ఫంక్ జీవిత కాలపు సేవలకుగానూ బ్లూ ఆరిజిన్‌లో అతిథిగా బెజోస్ ఎంపిక చేసుకోవడం ఆమెకు దక్కిన గౌరవం.

ఫొటో సోర్స్, Getty Images
''నేను ఎగరడం ప్రారంభించినప్పుడు, నేను స్వర్గంలో ఉండాలని కోరుకున్నాను'' అని రెండేళ్ల కిందట ఫంక్ బీబీసీతో మాట్లాడుతూ గగనయానంపై మక్కువను తెలిపారు. నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు(ఎన్‌టీఎస్‌బీ)లో వాలీ ఫంక్ తొలి ఎయిర్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్.
అంతేకాకుండా అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ)లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన తొలి మహిళ కూడా ఫంక్.
పైలట్‌గా మొత్తం 19,600 గంటల ఫ్లయిట్ టైమ్ ఆమె సొంతం. 3000 మందికిపైగా ఆమె శిక్షణనిచ్చారు. 1960 దశకంలో అంతరిక్ష పరిశోధన ప్రారంభంలో మెర్క్యురీ-13 కోసం 20 ఏళ్ల ఫంక్ కఠిన శిక్షణ పొందారు. మరో 12 మంది మహిళలతో పాటు వైద్య, శారీరక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు.
వారు ఆ సమయంలో పురుష వ్యోమగాముల మాదిరిగానే శిక్షణ పొందారు.''ప్రతి పరీక్ష నమ్మశక్యం కానిది. వారు నన్ను కుర్చీపై కట్టేసి ఒక చెవిలో 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న చల్లటి నీటితో ఇంజెక్ట్ చేసేవారు.
అప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేరు. తర్వాత గది నుండి బయటకు తీసుకువెళతారు. గంట తర్వాత ఇతరుల చెవిలో ఇలాగే చేస్తారు'' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి కఠిన పరీక్షలను ఫంక్ గుర్తుచేసుకున్నారు.అంతేకాదు, రేడియోధార్మిక నీటిని తాగవలసి వచ్చేది. ఓర్పును బేరీజు వేసే ఈ పరీక్షలో ఆమె రికార్డు సృష్టించారు.
''ఆ పరీక్షలు చాలా క్రూరమైనవి. అవి స్పేస్‌లో వాతావరణాన్ని తట్టుకోవడానికి నిర్వహించేవారు. 125 మంది పురుషుల్లో ఏడుగురు, 25 మంది మహిళలలో 13 మంది మాత్రమే ఈ పరీక్షల్లో నిలదొక్కుకున్నారు'' అని ఆమె బీబీసీ చెప్పారు.
హై స్పీడ్ జెట్ టెస్ట్ పైలట్లు, ఇంజినీరింగ్ డిగ్రీలు ఉన్నవారిని మాత్రమే అంతరిక్ష కార్యకలాపాలకు పరిగణించాలని నాసా నిర్ణయించినప్పుడు మొదటి మహిళా వ్యోమగామి కావాలన్న ఫంక్ ఆశలు ఆవిరయ్యాయి.అప్పటికి నాసా వ్యోమగాములంతా మిలటరీ టెస్ట్ పైలట్లుగా పురుషులే ఉండేవారు. వారికి మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవకాశం ఉండేది. అప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఫంక్‌కి అవకాశం రాలేదు. ఆ సమయంలో మహిళలను మిలిటరీ జెట్ టెస్ట్ పైలట్లుగా అనుమతించలేదు. లింగ వివక్ష స్పష్టంగా ఉన్నప్పటికీ దీనిపై ప్రభుత్వ దర్యాప్తు కొనసాగింది.
''నేను నాసాకు నాలుగు వేర్వేరు సార్లు దరఖాస్తు చేశాను, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ లేనందున నాలుగు సార్లు తిరస్కరించారు. అలాంటి డిగ్రీని పొందటానికి వారు నాకు తొమ్మిది నెలల సమయం ఇచ్చారు. ఇది అసాధ్యం'' అని ఆమె 1999లో నాసా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.
1983లో అంతరిక్షంలో మొట్టమొదటి అమెరికన్ మహిళగా సాలీ రైడ్ అడుగుపెట్టినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.
ఆమె నన్ను పిలిచి, మెర్క్యురీ-13 పరీక్షలన్నింటినీ ఎదుర్కొన్నందుకు ధన్యవాదాలు అన్నారు. ఎందుకంటే సాలీరైడ్ శారీరక ఓర్పు పరీక్షల కష్టాలను అనుభవించాల్సిన అవసరం రాలేదు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.
నాసాతో అంతరిక్షంలోకి వెళ్లలేనని నిరాశ చెందానని, కానీ ఆశలు మాత్రం వదులుకోలేదని ఫంక్ చెప్పారు. ఆమె తన లక్ష్యాలను అలాగే మనసులో ఉంచుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2010లో రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ ప్రోగ్రాం టికెట్ కోసం ఆమె 2 లక్షల డాలర్లు చెల్లించారు. వర్జిన్ గెలాక్టిక్ ఇటీవలే తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. అయితే ఫంక్ అందులో ప్రయాణించలేదు.
ఇప్పుడు బెజోస్ ''గౌరవనీయ అతిథి'' గా ప్రయాణిస్తున్నారు. వర్జిన్ గెలాక్టిక్ మాదిరిగా, బ్లూ ఆరిజిన్ రాకెట్ ప్రయాణికులను ఉప-కక్ష్య ఎత్తుకు తీసుకువెళుతుంది. టెక్సాస్‌లోని వాన్ హార్న్ సమీపంలోని లాంచ్ సైట్ నుంచి వీరి ప్రయాణం ప్రారంభమవుతుంది.
ప్రయాణికులను తీసుకెళ్లే న్యూ షెపర్డ్ 4 రాకెట్ గంటకు 3,000 కి.మీ కంటే ఎక్కువ వేగంతో చేరుకుంటుంది. అంతరిక్షంలో 4 నిమిషాలపాటూ ఫ్రీ ఫ్లోట్ అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేసిన తర్వాత తిరిగి పారాచూట్‌ల సహాయంతో ఈ క్యాప్సూల్ భూమికి రానుంది.
జెఫ్ బెజోస్ సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రయాణ ప్రణాళికను ఫంక్‌కు వివరిస్తూ కనిపించారు.
అంతరిక్షంలో అడుగుపెట్టిన తర్వాత మీరు చెప్పే మొదటి మాట ఏంటి? అని బెజోస్, ఫంక్‌ను అడిగారు.
ఇది నా జీవితంలోనే గొప్ప సంఘటన అని చెబుతా అని ఆమె సమాధానం ఇచ్చారు.
''నువ్వు ఎవరనేది అసలు విషయం కాదు. ఏదైనా చేయాలనే దృఢ సంకల్పం నీలో ఉంటే, ఏదైనా చేయొచ్చు. ఇంతకు ముందు ఎవరూ చేయని పనులను నేను చేయాలనుకుంటున్నా'' అని ఫంక్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎలాన్ మస్క్: 'నాకు ఆస్పర్గర్ సిండ్రోమ్ ఉంది... అందుకే నేను తేడాగా ఆలోచిస్తా'
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- మార్స్ రోవర్: అంగారకుడిపై నాసా హెలీకాప్టర్ ప్రయోగం... రైట్ బ్రదర్స్ తొలి విమాన ప్రయోగానికి సమానమైందా?
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- 'చంద్రుడిపైకి వెళ్లేందుకు ఎనిమిది మంది కావలెను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








