ఎలాన్ మస్క్: 'నాకు ఆస్పర్గర్ సిండ్రోమ్ ఉంది... అందుకే నేను తేడాగా ఆలోచిస్తా'

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

టెస్లా, స్పేస్ ఎక్స్‌ప్రెస్ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తనకు ఆస్పర్గర్ సిండ్రోమ్ ఉందని చెప్పారు. సాటర్ డే నైట్స్ లైవ్ పేరుతో అమెరికాలో వచ్చే ఒక కామెడీ టీవీ షోలో ఆయన ఈ విషయం బయటపెట్టారు.

టెక్నాలజీ రంగంలో ప్రపంచ ఖ్యాతి సంపాదించిన ప్రముఖుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. ఆయన తనకు ఈ సిండ్రోమ్ ఉందని మొదటిసారి చెప్పినట్లు భావిస్తున్నారు.

టీవీ షోలో మాట్లాడిన 49 ఏళ్ల ఎలాన్ మస్క్ "సుదీర్ఘ కాలం నుంచీ నడుస్తున్న ఒక టీవీ షోను హోస్ట్ చేస్తున్న మొట్టమొదటి ఆస్పర్గర్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తిని నేనే" అనగానే ప్రేక్షకుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి..

ఆస్పర్గర్ సిండ్రోమ్‌ ఉన్నవారు తమ చుట్టుపక్కల వాతావరణాన్ని సామాన్యులతో పోలిస్తే భిన్నంగా చూస్తారని చెబుతారు.

1970లో మొదలైన సాటర్ డే నైట్స్ లైవ్‌ కార్యక్రమంలో ఇంతకు ముందు ఎడెలె, క్రిస్ రాక్, రింగో స్టార్, విల్ ఫరెల్ లాంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. శనివారం ఎలాన్ మస్క్ ఈ షోలో గెస్ట్ హోస్ట్‌గా పాల్గొన్నారు.

"నా గొంతులో పెద్దగా వైవిధ్యం ఉండదు కాబట్టి, వాళ్లు నాతో మీరు అద్భుతంగా కామెడీ చేయగరని చెప్పారు. నిజానికి, సాటర్ డే నైట్స్ లైవ్ కార్యక్రమంలో నేను చరిత్ర సృష్టిస్తున్నా. ఎందుకంటే దీన్ని హోస్ట్ చేస్తున్న మొదటి ఆస్పర్గర్ సిండ్రోమ్ వ్యక్తిని నేనే" అని ఆయన షోలో అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై ప్రశ్నలు

కార్యక్రమంలో ఎలాన్ మస్క్ మాటలను చాలా మంది ప్రశంసించారు. చప్పట్లు కూడా కొట్టి ఉత్సాహపరిచారు.

అయితే సోషల్ మీడియాలో చాలామంది ఆయన వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారు. "మీకంటే ముందు కమెడియన్ డాన్ అక్రాయిడ్ ఆ షోలో పాల్గొన్నారు. తనకు ఆస్పర్గర్ సిండ్రోమ్, టురెట్ సిండ్రోమ్ (మాట్లాడేటపుడు ఎక్కిళ్ల సమస్య) ఉందని ఆయన ఓపెన్‌గా చెప్పారు" అని కామెంట్ చేస్తున్నారు.

ట్విటర్‌లో తాను చేసే పోస్టుల గురించి చాలా మంది వేళాకోళం చేశారని, విమర్శించారని ఎలాన్ మస్క్ సాటర్ డే నైట్స్ షోలో చెప్పారు. ట్విటర్‌లో ఆయనకు 5.3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

"నేను అప్పుడప్పుడు కొన్ని వింత పోస్టులు పెడుతుంటానని నాకు తెలుసు. కానీ, నా మెదడు అలాగే పనిచేస్తుంది" అన్నారు.

"నా వల్ల ఎవరైనా నొచ్చకుని ఉంటే, వారికి నేను ఎలక్ట్రిక్ కార్లను కొత్తగా కనిపెట్టానని, రాకెట్ ద్వారా మనిషిని అంగారక గ్రహంపైకి పంపించబోతున్నానని మళ్లీ చెప్పాలనుకుంటున్నా. నేను సాధారణ వ్యక్తినని మీకు అనిపిస్తోందా" అని మస్క్ ప్రశ్నించారు.

ఆస్పర్గర్ సిండ్రోమ్ అంటే

  • ఆస్పర్గర్ సిండ్రోమ్ జీవితాంతం ఉండే ఒక మానసిక ఆరోగ్య సమస్య. అది ఒక వ్యక్తిని రకరకాలుగా ప్రభావితం చేయచ్చు.
  • కొంతమంది దీనిని ఆస్పర్గర్ సిండ్రోమ్ అంటారు. కానీ ఇది ఉన్న చాలామంది తమను ఆర్టిస్టిక్‌గా లేదా ఆటిజం స్పెక్ట్రమ్ ఉందని చెప్పుకోడానికి ఇష్టపడతారు.
  • ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి తను ఏ విషయాలు చెప్పవచ్చో, ఏవి చెప్పకూడదో తెలుసుకోలేక ఇబ్బంది పడతాడు. ఏదైనా ఒక సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో వారి మెదడు సామాన్యులతో పోలిస్తే ఎక్కువ సమయం తీసుకుంటుంది.
  • ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తి తన భావనలను వ్యక్తం చేయడానికి కూడా కష్టపడతాడు. అయితే, ఇలాంటి వారు మిగతావారితో పోలిస్తే ఎక్కువ సున్నితంగా ఉంటారు. నాన్-ఆర్టిస్టిక్ వ్యక్తితో పోలిస్తే ఎక్కువ భావోద్వేగానికి గురవుతారు.
  • ఆస్పర్గర్ సిండ్రోమ్ ఉన్న చాలామందిలో ప్రత్యేకంగా ఏదైనా ఒక పని గురించి సామాన్యుల కంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాళ్లు దానిపై సమర్థంగా దృష్టి పెట్టగలరు. చాలామంది దాన్ని తమ కెరియర్‌గా కూడా మార్చుకుంటారు.

ఆధారం: Autism.org.uk

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)