షెంజో-12: కొత్త అంతరిక్ష కేంద్రానికి తొలి బృందాన్ని పంపించిన చైనా

ఫొటో సోర్స్, Getty Images
చైనా తమ దేశానికి చెందిన కొత్త అంతరిక్ష కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ముగ్గురు వ్యోమగాములను కక్ష్యలోకి పంపించింది.
నీ హైషెంగ్, లీయూ బోమింగ్, టాంగ్ హోంగ్బో అనే ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అంతరిక్షంలోనే గడపనున్నారు.
ముగ్గురు పురుషులూ భూమికి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న తియానే మాడ్యూల్‌లో ఉంటారు.
ఇది చైనా నిర్వహిస్తున్న అత్యంత సుదీర్ఘ అంతరిక్ష మిషన్ కాబోతోంది. దాదాపు గత అయిదేళ్లలో ఇది చైనా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్.
గురువారం వ్యోమగాములు ఉన్న షెంజో-12 కాప్స్యూల్‌ను లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి ప్రయోగించారు.
గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఇది స్థానిక కాలమానం ప్రకారం 9.22కు నింగిలోకి దూసుకెళ్లింది.
అంతరిక్ష పరిశోధనల్లో చైనా సామర్థ్యం, విశ్వాసం పెరుగుతోందనడానికి తాజా మిషన్ మరో నిదర్శనంగా నిలిచింది.
గత ఆరు నెలల్లో చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన చైనా, అంగారకుడిపై తమ ఆరు చక్రాల రోబోట్‌ను కూడా లాండ్ చేసింది. ఈ రెండూ చాలా క్లిష్టమైన సవాలుతో కూడిన ప్రయత్నాలుగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ వ్యోమగాములు అంతరిక్షంలో ఏం చేస్తారు
ప్రధానంగా 22.5 టన్నుల తియానే మాడ్యూల్‌ను తిరిగి సేవల్లోకి తీసుకువచ్చే లక్ష్యంతో కమాండర్ నీ హైషెన్, ఆయన బృందం షెంజో-12 మిషన్‌లో వెళ్లారు.
"నాకు చాలా అంచనాలున్నాయి" అని లాంచ్‌కు ముందు నీ హైషన్ మీడియాతో అన్నారు.
"మేం అంతరిక్షంలో మా కొత్త నివాసం ఏర్పాటు చేసుకోవాలి, ఎన్నో కొత్త టెక్నాలజీలను పరీక్షించాలి. అందుకే ఈ మిషన్ చాలా కష్టమైనది, సవాలుతో కూడుకున్నది. మేం ముగ్గురం కలిసి పనిచేయగలమని, కచ్చితత్వంతో ఉండే ఆఫరేషన్లతో మా సవాళ్లను అధిగమించగలమనే నేను అనుకుంటున్నా. ఈ మిషన్ పూర్తి చేయగలమనే నమ్మకం మాకుంది" అన్నారు.
16.6 మీటర్ల పొడవు, 4.2 మీటర్ల వెడల్పు ఉండే తియానే సిలిండర్‌ను ఏప్రిల్‌లో లాంచ్ చేశారు.
కక్ష్యలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో ఇది మొదటి, ప్రధాన భాగం. దీనిలో సైన్స్ ల్యాబ్స్, విశ్వంలో పరిశోధనలకు హబుల్ లాంటి టెలిస్కోప్ కూడా ఉన్నాయి.
వచ్చే రెండేళ్లలో చైనా వివిధ భాగాలను ఒక్కొక్కటిగా అంతరిక్షంలోకి పంపించనుంది. దీని నిర్మాణంలో భాగంగా సాధారణ కార్గో డెలివరీలతోపాటూ, వ్యోమగాములను పంపించడం కూడా చేస్తారు.

చైనా వ్యోమగాముల గురించి మనకేం తెలుసు
బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే ముందు వరకూ షెంజో-12 కాప్స్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు ఎవరన్నది చైనా అధికారులు రహస్యంగా ఉంచారు.
ముగ్గురిలో నీ హైషెంగ్‌కు 56 ఏళ్లు, అంతరిక్షంలోకి వెళ్లిన చైనా వ్యోమగాముల్లో ఈయనే పెద్దవారని చెబుతున్నారు.
నీ హైషెంగ్ ఇంతకు ముందు రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. వీటిలో 2013లో నమూనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్-1కు వెళ్లిన 13 రోజుల మిషన్ కూడా ఉంది. తర్వాత ఆ అంతరిక్ష కేంద్రాన్ని కక్ష్య నుంచి తప్పించారు.
ఆయన బృందంలో లీయూ బోమింగ్(54), టాంగ్ హోంగ్బో(45) ఉన్నారు. వీరు కూడా వైమానిక దళం నుంచే వచ్చారు. లీయూ గతంలో 2008లో జరిగిన షెంజో-7 మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. అప్పుడు జరిగిన చైనా తొలి స్పేస్‌వాక్‌లో ఆయన పాల్గొన్నారు.
టాంగ్ హోంగ్బోకు అంతరిక్ష యాత్ర కొత్త. ఆయన ఇప్పటివరకూ కక్ష్యలోకి వెళ్లలేదు.
తియానేలో ఉన్నప్పుడు వారికి అవసరమయ్యే ఆహారం, ఇంధనం, ఇతర సరుకులను గత నెలలో ఒక రోబోటిక్ వాహనం ద్వారా అంతరిక్షంలోకి పంపించారు.
ఆ వాహనం ఇంకా అంతరిక్ష కేంద్రానికి అటాచ్ అయి ఉంది. ఈ ముగ్గురు వ్యోమగాములు అక్కడకు చేరుకోగానే మొదట ఈ వాహనంలోని సరుకులను తీసుకోవాలి.
వాహనంలో ఉన్న సరుకుల్లో తియానే బయట వ్యోమగాములు స్పేస్‌వాక్ చేయడానికి అవసరమైన రెండు స్పేస్‌సూట్‌లు కూడా ఉంటాయి.
చైనా అంతరిక్ష ప్రయోగాల ఆశయం
చైనా గత కొన్నేళ్లుగా తన అంతరిక్ష పరిశోధనల్లో ఎలాంటి దాపరికం ప్రదర్శించడం లేదు.
అంతరిక్ష పరిశోధనలకు అది భారీగా నిధులు కుమ్మరిస్తోంది. చైనా 2019లో చంద్రుడి అవతలి వైపుకు మానవ రహిత రోవర్ పంపిన తొలి దేశంగా కూడా నిలిచింది.
కానీ, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రాజెక్టు నుంచి చైనాను వెలివేయడంతో, తన అంతరిక్ష కేంద్రాన్ని అది ఒంటరిగానే నిర్మించుకోవాల్సి వస్తోంది.
రష్యా, యూరప్, కెనడా, జపాన్‌తో కలిసి ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహిస్తున్న అమెరికా చైనాకు సహకరించడం లేదు.
బుధవారం షెంజో-12 వ్యోమగాములను పరిచయం చేయడానికి చైనా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఏజెన్సీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
అందులో "దీనికి సంబంధించి మేం సహకారాన్ని స్వాగతిస్తున్నాం. చైనా అంతరిక్ష కేంద్రం పూర్తయితే, సమీప భవిష్యత్తులో చైనా, విదేశీ వ్యోమగాములు కలిసి పనిచేయడాన్ని మనం చూస్తామని నేను భావిస్తున్నాను" అని " ఏజెన్సీ అసిస్టెంట్ డైరెక్టర్ జీ క్విమింగ్ చెప్పారు.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా దేశ అంతరిక్ష ప్రయత్నాలకు తన మద్దతు ప్రకటించారు.
చైనా ప్రభుత్వ మీడియా తరచూ 'జాతీయ పునరుజ్జీవన' మార్గంలో 'అంతరిక్ష స్వప్నం'ను ఒక మెట్టుగా వర్ణిస్తుంటుంది.
ఇవి కూడా చదవండి:
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









