బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం

ఫొటో సోర్స్, Getty Images
తొలిసారి రోదసిలోకి ఒక తెలుగు మహిళ విజయవంతంగా అడుగుపెట్టారు.
ఈ చరిత్రాత్మకయానం భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైంది. నిజానికి ఈ రోదసియానం సాయంత్రం 6.30కి మొదలు కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఇది మొదలైంది.
ఈ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి వెళ్లారు.
వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు బండ్ల శిరీష, మరో నలుగురు ఈ రోదసియానం చేశారు.

ఫొటో సోర్స్, Virgin Galactic/SirishaTwitter
వర్జిన్ గెలాక్సీ ఈ ఈవెంట్‌ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేసింది.
నేల నుంచి దాదాపు 88 కి.మీ. ఎత్తుకు చేరుకున్నాక, నాలుగైదు నిమిషాలపాటు వ్యోమగాములు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల గుండా బయట పరిస్థితులను వారు వీక్షించారు.
జీవితాంతం గుర్తుపెట్టుకోగలిగే తీపి అనుభూతులను ఈ యాత్రను తనకు ఇచ్చిందని రిచర్డ్ బ్రాన్సన్ చెప్పారు.
''ఈ యాత్ర కోసం చిన్నప్పటినుంచీ ఎన్నో కలలు కన్నాను. అంతరిక్షం నుంచి భూమిని చూడటం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఏదో మాయాజాలంలా అనిపించింది''అని యాత్ర అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, MARS SCIENTIFIC
రిచర్డ్ బ్రాన్సన్ తన ఈ కలల ప్రాజెక్టును ఇంతవరకు తీసుకురావడం వెనుక ఎంతో కృషి ఉంది.
స్పేస్ ప్లేన్ తయారుచేయాలన్న తన కోరికను ఆయన 2004లో బయట ప్రపంచానికి వెల్లడించారు.
2007 నాటికి వాణిజ్యపరమైన స్పేస్ సర్వీసెస్ అందించాలని ఆయన ఆశించారు. కానీ, సాంకేతిక అవరోధాల కారణంగా అది అనుకున్న సమయానికి సాధ్యపడలేదు.
2014లో ఆయన ప్రయత్నం విఫలమైన స్పేస్ ఫ్లైట్ కూలిపోయింది.
''నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతరిక్షంలోకి వెళ్లాలన్నది కోరిక. వచ్చే వందేళ్లలో లక్షల మంది ప్రజలు స్పేస్‌లోకి వెళ్లగలిగేలా చేయాలన్నది నా కోరిక'' అని 'బీబీసీ'తో చెప్పారు బ్రాన్సన్.
''ఈ విశ్వం అత్యద్భుతమైనది. అంతరిక్షం అసాధారణమైనది. ప్రజలు ఎందుకు అంతరిక్షంలోకి ప్రయాణించకూడదు? ప్రజలు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి నుంచి అందమైన భూమిని చూడగలిగి తిరిగి భూమిని చేరుకోవాలి'' అన్నారాయన.

ఫొటో సోర్స్, VIRGIN GALACTIC
ఇది ఎలా పనిచేస్తుందంటే...
ఈ యాత్రలో భాగంగా యూనిటీ అని పిలిచే వాహక నౌకను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15 కిలో మీటర్ల(50 వేల అడుగుల) ఎత్తుకు తీసుకెళ్లి విడిచిట్టింది.
అప్పుడు యూనిటీకి అమర్చిన రాకెట్ మోటార్‌ను ప్రజ్వలింపజేశారు. మోటార్ 60 సెకండ్లపాటు మండింది. ఆ సమయంలో రిచర్డ్ బ్రాన్సన్, తన ముగ్గురు క్రూ సహచరులు, ఇద్దరు పైలట్లు అక్కడి నుంచి భూమిని చూడగలిగారు.
అనంతరం అంతరిక్షంలోకి యూనిటీ ప్రయాణం సాగింది.
యూనిటీ గరిష్ఠంగా భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.
ఆ ఎత్తుకు వెళ్లాక రిచర్డ్ బ్రాన్సన్ భార రహిత స్థితిలో క్యాబిన్‌లో కొద్ది నిమిషాలు తేలుతూ కిటికీలోంచి చూశారు. తిరిగి తన సీటులోకి ఆయన చేరుకున్నారు.
అక్కడి నుంచి న్యూమెక్సికోలోని స్పేస్‌పోర్ట్‌కు చేరుకునేందుకు తిరుగు ప్రయాణం మొదలైంది.

ఫొటో సోర్స్, PA Media
ఈ రోదసియానం జరుగుతున్నంత సేపు రిచర్డ్ బ్రాన్సన్‌కు వర్జిన్ గెలాక్టిక్ చీఫ్ ఆస్ట్రోనాట్ బెత్ మోజెస్ నుంచి సూచనలు అందాయి.
వర్జిన్ గెలాక్టిక్ టెస్ట్ పైలట్లు కాకుండా ఆ టీంలో ఇప్పటివరకు ఆకాశపుటంచులకు వెళ్లిన అనుభవం ఉన్న వ్యక్తి బెత్ మోజెస్ ఒక్కరే.
కిటికీలోంచి బయటకు చూస్తే అద్భుతం కనిపిస్తుంది అన్నారామె.
''ఆ అద్భుతాన్ని వర్ణించడానికి ఫొటోలు చాలవు. అది చాలా శోభాయమానమైన దృశ్యం. అక్కడి నుంచి నేను మహాసముద్రాలను చూశాను. భూమి పచ్చదనం, తెల్లని మంచు కప్పుకొన్న పర్వతాలు కూడా చూశాను'' అని మోజెస్ బీబీసీతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏమిటీ 'యూనిటీ'
'యూనిటీ' ఒక ఉప కక్ష్యా వాహక నౌక. భూ కక్ష్యలో చేరి భూమి చుట్టూ పరిభ్రమించడానికి కావాల్సినంత ఎత్తుకు ఇది వెళ్లలేదు, అంతటి వేగమూ సాధించలేదు.
అయితే, ఇలాంటి ఉప కక్ష్యా వాహక నౌకా వ్యవస్థ అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వద్ద మాత్రమే ఉంది.
జెఫ్ బెజోస్ వద్ద 'న్యూ షెపర్డ్' అని పిలిచే రాకెట్, క్యాప్సూల్స్ ఉన్నాయి. జులై 20న ఆయన అందులో రోదసియానం చేయనున్నారు.
జెఫ్ బెజోస్ తన సోదరుడు మార్క్‌తో కలిసి ఆ రాకెట్‌లో భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు ఎగరనున్నారు. వారిద్దరితో పాటు ప్రఖ్యాత మహిళా ఏవియేటర్ వాలీ ఫంక్, వేలంపాటలో 2.8 కోట్ల డాలర్లకు టికెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కూడా వెళ్తారు.
కాగా సర్ రిచర్డ్ బ్రాన్సన్ నిర్వహించబోయే తదుపరి రోదసి యాత్రల కోసం ఇప్పటికే సుమారు 600 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఒక్కొక్కరు సుమారు 2.5 లక్షల డాలర్ల విలువైన మొత్తాన్ని టికెట్ రుసుంగా చెల్లించారు.

ఫొటో సోర్స్, Blue origin
రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్ స్నేహపూర్వక పోటీ
జెఫ్ బెజోస్‌తో తాను ఫోన్‌లో మాట్లాడానని.. తమ ఇద్దరి అంతరిక్ష యాత్రలు విజయవంతం కావాలని ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొన్నామని రిచర్డ్ చెప్పారు.
నిజానికి ఇలాంటి అంతరిక్ష యాత్రను మొదట ప్రకటించింది బెజోస్.
మరోవైపు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ స్పేస్ కంపెనీ శుక్రవారం ఒక ట్వీట్ చేసింది.
తమ 'న్యూ షెపర్డ్' రాకెట్ భూమి నుంచి 100 కిలోమీటర్ల దూరం దాటి ఎగురుతుందని, కర్మన్ రేఖ దాటి వెళ్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 100 కిలోమీటర్ల దూరం దాటుతుంది కాబట్టి తమ ఆస్ట్రోనాట్‌ల పేరు చివరన చుక్క గుర్తు(*) ఉండబోదని.. ప్రపంచ జనాభాలో 96 శాతం మంది లెక్క ప్రకారం, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కర్మన్ రేఖగా పేర్కొనే భూమికి 100 కిలోమీటర్ల దూరం తరువాతే రోదసి మొదలవుతుందని ఆ ట్వీట్‌లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దాంతోపాటు బ్లూ ఆరిజన్, వర్జిన్ గెలాక్టిక్‌ల వాహక నౌకల మధ్య వ్యత్యాసాన్ని అక్కడ వివరించారు.
రోదసి సరిహద్దుగా పేర్కొనే ఊహా రేఖ కర్మన్ రేఖను దాటి తమ న్యూషెపర్డ్ వెళ్తుందని, రిచర్డ్ బ్రాన్సన్ సంస్థకు చెందిన యూనిటీ ఆ రేఖను దాటడం లేదని అందులో వివరించారు.
తమ బ్లూ ఆరిజన్ సంస్థది రాకెట్ కాగా రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ పంపుతున్న యూనిటీ కేవలం ఎక్కువ ఎత్తుకు ఎగిరే విమానంవంటిది మాత్రమేనని పేర్కొన్నారు.
తమ రాకెట్ వల్ల ఓజోన్ పొరపై ప్రభావం తక్కువని, యూనిటీ వల్ల ప్రభావం ఎక్కువని కూడా అందులో వివరించారు.
అయితే, వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మాత్రం లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లే విమానం పర్యావరణంపై ఎంత ప్రభావం చూపిస్తుందో తమ యూనిటీ కూడా అంతే చూపిస్తుందని 'బీబీసీ'తో చెప్పింది.
అయితే అమెరికా ప్రభుత్వం రోదసి సరిహద్దు భూమికి 80 కిలోమీటర్ల నుంచి మొదలవుతుందని గుర్తించింది. ఆ ఎత్తు దాటి వెళ్లినవారిని ఆస్ట్రోనాట్‌లగానే పరిగణిస్తోంది. దాని ప్రకారం చూస్తే రిచర్డ్ బ్రాన్సన్ యూనిటీలో వెళ్లేవారు రోదసిలోకి వెళ్లినట్లే.
ఇవి కూడా చదవండి:
- శిరీష బండ్ల, కల్పనాచావ్లా, సునీత విలియమ్స్: అంతరిక్షాన్ని గెలుస్తున్న భారతీయ మహిళలు
- మార్స్ మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- మార్స్ రోవర్: అంగారకుడిపై నాసా హెలీకాప్టర్ ప్రయోగం... రైట్ బ్రదర్స్ తొలి విమాన ప్రయోగానికి సమానమైందా?
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- 'చంద్రుడిపైకి వెళ్లేందుకు ఎనిమిది మంది కావలెను’
- నాసా శాస్త్రవేత్త స్వాతి మోహన్ ఇంటర్వ్యూ: ‘‘భూమి మీద నుంచి సూక్ష్మజీవులు మార్స్ మీదకు చేరకుండా చూడటం చాలా కష్టమైన పని’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








