మార్స్ మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్

హెలికాప్టర్ తన నీడను తానే తీసిన ఫోటో

ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH

ఫొటో క్యాప్షన్, హెలికాప్టర్ తన నీడను తానే తీసిన ఫోటో

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంగారక గ్రహం (మార్స్‌)పై ఒక చిన్న హెలికాప్టర్‌ను విజయవంతంగా ఎగురవేసింది.

'ఇంజిన్యువిటీ' అనే డ్రోన్ ఒక నిమిషం కన్నా తక్కువసేపు గాల్లో ఎగురగలిగింది. దీన్ని ఒక గొప్ప విజయంగా నాసా భావిస్తోంది.

మరో ప్రపంచంలో ఎగిరిన మొట్టమొదటి విమానం ఇదే.

అంగారక గ్రహంపై ఉన్న ఒక శాటిలైట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ ఉపగ్రహం హెలికాప్టర్ డాటాను భూమికి పంపించింది.

భవిష్యత్తుల్లో మార్స్‌‌పై మరిన్ని విమానాలు సాహసోపేతంగా ఎగురుతూ కనిపిస్తాయని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇంజినీర్లు ఈ హెలికాప్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించిన తరువాత ఇంజన్యువిటీని మరింత పైకి, మరింత దూరం ఎగురవేసే ప్రయత్నాలు చేస్తారని నాసా తెలిపింది.

"మానవులు మరో గ్రహంపై రోటర్‌క్రాఫ్ట్ నడిపారని మనం ఇప్పుడు చెప్పవచ్చు" అని నాసా శాస్త్రవేత్త మిమి ఆంగ్ అన్నారు.

మిమి ఆంగ్, కాలిఫోర్నియాలోని పసాడేనాలో నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (జెపిఎల్)లో ఇంజన్యువిటీ ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్నారు.

మార్స్ మీద నాసా హెలికాప్టర్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, మార్స్ మీద నాసా హెలికాప్టర్

మార్స్‌పై ఎగరడం కష్టమే

అంగారక గ్రహంపై గాలిలో ఎగరడం చాలా కష్టం. అక్కడి వాతావరణ సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. భూమిపై సాంద్రతలో 1 శాతం మాత్రమే ఉంటుంది.

మార్స్‌పై ఆకర్షణ శక్తి తక్కువగానే ఉంటుంది. కానీ, మార్స్ నేలపై నుంచి పైకి ఎగరడానికి చాలా ప్రయత్నించాల్సి ఉంటుంది.

అందుకు రోటర్‌క్రాఫ్ట్ బ్లేడులు వేగంగా, శక్తివంతంగా తిరగాల్సి ఉంటుంది.

అందుకే ఇంజన్యువిటీని తేలికగా, అతి తక్కువ బరువుతో ఉండేట్లు రూపొందించారు.

అంతే కాకుండా, బ్లేడులు అత్యంత వేగంగా, నిముషానికి 2,500 రౌడ్లు తిరిగేంత శక్తిని సమకూర్చారు.

వీడియో క్యాప్షన్, అంగారక గ్రహం మీద నాసా హెలికాప్టర్

భూమికి సుదూరంగా ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అన్వేషించడానికి ఇది గొప్ప ప్రారంభం అని నాసా భావిస్తోంది.

భవిష్యత్తులో రోవర్లకు వేగులుగా డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉంది.

వ్యోమగాములు మార్స్‌పై అడుగుపెట్టగలిగితే వారికి కూడా డ్రోన్‌లు సహాయపడతాయి.

శని గ్రహానికి అతి పెద్ద ఉప గ్రహమైన టైటన్‌పై హెలికాప్టర్ మిషన్‌కు ఇప్పటికే నాసా ఆమోదం తెలిపింది.

ఈ మిషన్‌కు డ్రాగన్‌ఫ్లై అని పేరు పెట్టారు. 2030 దశాబ్దం మధ్యలో దీన్ని టైటన్‌పైకి పంపించేందుకు ప్రణాళిక తయారుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)