ఇస్రో మాజీ సైంటిస్ట్‌ నంబి నారాయణన్‌ను కొందరు పోలీసులే గూఢచర్యం కేసులో ఇరికించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయండి: సుప్రీంకోర్టు

ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్

ఫొటో సోర్స్, VIVEK NAIR

ఫొటో క్యాప్షన్, ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్

1994లో గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను కొందరు కేరళ పోలీసులు ఈ కేసులో ఇరికించారని వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.

గూఢచర్యం కేసులో నారాయణన్‌ను ఇరికించడంలో కొందరు కేరళ పోలీసుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. వాటిపై విచారణ చేసిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో విచారణ జరిపిన జస్టిస్(రిటైర్డ్) డీకే జైన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ అందించిన నివేదికను కోర్టు రికార్డుగా స్వీకరించింది.

ఈ కమిటీ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టుకు తన నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది.

ఇది తీవ్రమైన అంశం కావడంతో, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు అవసరమని ఈ కమిటీ అభిప్రాయపడిందని విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సీల్డ్ కవర్‌లోనే నివేదిక

కమిటీ ఇచ్చిన నివేదిక సీల్డ్ కవర్‌లోనే ఉండనుంది. దర్యాప్తు చట్టప్రకారం కొనసాగేలా దీనిని సీబీఐ అధికారులకు ఇవ్వనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నివేదికను ప్రచురించకూడదని స్పష్టం చేసింది.

2018 సెప్టెంబర్ 18న ఇచ్చిన ఆదేశాల ప్రకారం, డీకే జైన్ నేతృత్వంలోని కమిటీ 2021 మార్చి 25న తమకు సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించినట్లు సుప్రీం బెంచ్ తెలిపింది.

నివేదికకు సంబంధించిన ఒక కాపీని సీబీఐ డైరెక్టర్‌కు అందించాలని మేం రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం అని సుప్రీంకోర్టు చెప్పింది.

ఈ నివేదికను ప్రాథమిక నివేదికగా పరిగణించే స్వేచ్ఛ సీబీఐకి ఉంటుందని కూడా కోర్టు చెప్పింది. ఈ నివేదిక కాపీని ప్రచురించకూడదని, పంపిణీ చేయకూడదని చెప్పింది.

ఆ నివేదిక కాపీని తాము పొందవచ్చా అనే దానిపై నంబి నారాయణన్ న్యాయవాది కోర్టు సూచనలు కోరినపుడు, ఈ నివేదిక ప్రచురించడానికి, పంపిణీ కోసం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

"ఈ నివేదిక ఉద్దేశం వేరే, దానిని సీబీఐ ఉపయోగిస్తుంది" అని కోర్టు చెప్పింది. మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐకి సూచించింది.

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను అనవసరంగా అరెస్ట్ చేశారని 2018లో సీజేఐ (రిటైర్డ్) దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం బెంచ్ అభిప్రాయపడింది.

పరిహారంగా ఆయనకు 50 లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

గూఢచర్యం కేసు నంబి నారాయణన్ జీవితాన్ని ఎలా నాశనం చేసింది, ఈ కేసు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)