హైదరాబాద్‌:'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, @narendramodi/twitter

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప ఆలయం, వరంగల్ భద్రకాళి, భద్రాచలం రాముడు, పాల్కురికి సోమనాథుడు, కాకతీయ రాజులు, రాణి రుద్రమ అంటూ తెలంగాణ చరిత్ర, సంస్కృతులను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'తెలంగాణ ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను' అని మోదీ మొదట్లో తెలుగులో ప్రజలకు అభివాదం చేశారు.

హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీజేపీ ప్రముఖ నేతలు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు. రెండు రోజుల సమావేశాల అనంతరం ఏర్పాటైన బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు.

ఆ తరువాత మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీకి 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రజాదరణ పెరుగుతూ వస్తోందని అన్నారు.

మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలు:

1. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో దక్కిన ఆదరణ నిరంతరం పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అద్భుత ఫలితాలు లభించాయి. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ప్రజలు పట్టాలు వేస్తున్నారు.

2, గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి దాదాపు ఒక లక్ష కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

3. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండు రెట్లు పెరిగాయి. 2014లో తెలంగాణలో దాదాపు 2,500 కిలోమీటర్ల హైవే నెట్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది 5,000 కిలోమీటర్ల వరకు పెరిగింది.

4. హైదరాబాద్‌లో 1500 కోట్లు వెచ్చించి నాలుగు, ఆరు లైన్ల ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లను కేంద్రం నిర్మిస్తోంది.

5. హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్‌ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 350 కి.మీ పరిధిలో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనుంది.

6. తెలంగాణలో నీటితో ముడిపడిన దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా విలువ చేసే అయిదు పెద్ద ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.

7. దేశంలో నిర్మించే 7 టెక్స్‌ టైల్స్ పార్క్‌ల్లో ఒకటి తెలంగాణలో నిర్మిస్తాం.

8. హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్ సిటీ ఏర్పాటు చేయడానికి భాజపా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

9. కొత్త జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇచ్చాం.

10. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ. 31,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఆమోదించాం.

సభ ప్రారంభానికి ముందు బీజేపీ విజయ సంకల్ప సభలో కాసేపట్లో మాట్లాడబోతున్నానని ట్వీట్ చేసిన మోదీ, సభ ముగిసిన తరువాత హైదరాబాద్ వాతావరణం చాలా బాగుందని మరో ట్వీట్ చేశారు. సభానంతరం మోదీ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

హరీశ్ రావు

ఫొటో సోర్స్, HarishRao/FB

కేసీఆర్ ఆడిగిన ఒక్క ప్రశ్నకూ జవాబు చెప్పలేదు

కాగా, జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించామని, ఆ పార్టీ నాయకత్వానికి కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కేసీఆర్ ఆడిగిన ఒక్క ప్రశ్నకు కూడా వారు జవాబు చెప్పలేదని, వారికి జవాబుదారీతనమే లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. "రాష్ట్రం నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని చెబుతున్న మోదీ గత నెల రోజులుగా 90 లక్షల టన్నుల బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదు? దీని విలువ 22,000 కోట్ల రూపాయలే ఉంటుంది" అని మోదీ ప్రసంగానికి బదులిస్తూ ట్వీట్లు చేశారు.

మహిళలను ఉద్ధరిస్తున్నట్లు చెబుతున్న ప్రధానమంత్రిగారూ, పార్లమెంటులో పెండింగులో ఉన్న మహిళా బిల్లును ఎనిమిదేళ్ళుగా ఎందుకు ఆమోదించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.

"గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇచ్చామని చెప్పారు. బాగానే ఉంది. కానీ, మా గిరిజన యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదు, అనుమతులు ఇవ్వలేదు. మా సమ్మక్క సారక్క ఉత్సవానికి జాతీయ హోదాఎందుకు ఇవ్వలేదు" అని కూడా హరీశ్‌రావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)