గుజరాత్ అల్లర్లు: 20 ఏళ్లు గడిచిన తర్వాత ఆ నాటి కేసుల పరిస్థితి ఏమిటి, జైలు కెళ్లింది ఎందరు, బాధితులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాక్సీ గంగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ న్యూస్
ఇద్రిష్ ఓరా వయసు ఇప్పుడు నలబై ఏళ్లు. ఇరవై ఏళ్ల కిందట తన అమ్మమ్మను, అమ్మను, సన్నిహిత మిత్రుడొకరిని.. తన స్కూలు మిత్రులు, తమ పొరుగు వారు కూడా ఉన్న ఒక అల్లరి మూక దారుణంగా చంపేయటం ప్రత్యక్షంగా చూశారు ఇద్రిష్. ఆ గుంపులోని వాళ్లంతా మెజారిటీ మతస్తులు.
ఇద్రిష్ ఆ తర్వాత ఆనంద్ జిల్లాలోని తమ పాత ఊర్లో గల తమ పూర్వీకుల ఇంటి స్థలాన్ని వదిలేసి వచ్చారు. ఇప్పుడాయన ఆనంద్ పట్టణం సమీపంలోని సమర్త అనే చిన్న గ్రామంలో నివసిస్తున్నారు.
మీ పూర్వీకుల ఇంటి స్థలాన్ని ఎందుకు వదిలివచ్చారని అడిగినపుడు.. ''నా మనసు అక్కడికి వెళ్లటానికి అంగీకరించటం లేద''ని ఆయన బదులిచ్చారు. ''ఎవరూ ఎప్పుడూ చూడకూడనిది నేను చూశాను. అలాంటి దారుణం ఎవరికీ ఎప్పుడూ జరగకూడదని నేను కోరుకుంటున్నా'' అని చెప్పారు.
గుజరాత్ అల్లర్ల బాధితుల్లో చాలా మందికి లాగానే ఇరవై ఏళ్ల తర్వాత కూడా తనకు న్యాయం జరగలేదని ఇద్రిష్ భావిస్తున్నారు.
''ఆ కేసులో 80 మందికి పైగా నిందితులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకూ వారిలో ఏ ఒక్కరూ జైలులో లేరు. ప్రతి ఒక్కరూ ఒక కోర్టు నుంచో, మరో కోర్టు నుంచో బెయిల్ పొందారు'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Kalpit Bhachech/Getty
బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాయా కొద్నాని మీద నమోదైన నరోడా పటియా కేసులో ప్రత్యక్ష సాక్షి సలీమ్ షేక్. ''ఇన్నేళ్లుగా మేం కేవలం న్యాయం పొందటం కోసం మాత్రమే తంటాలు పడుతున్నాం. నరోడా పటియా ఊచకోత కేసులో కొద్నాని కీలక నిందితురాలని విచారణ కోర్టు పేర్కొంది. కానీ ఆ కింగ్‌పిన్ ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా మేం పడుతున్న తంటాలకు అర్థమేముంది?'' అని సలీమ్ ప్రశ్నించారు.
జాకియా జాఫ్రీ సమర్పించిన ఫిర్యాదు మీద సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వులను ప్రకటించింది. అయితే, ఆ ఉత్తర్వుల తర్వాత గుజరాత్ పోలీసులు రంగంలోకి దిగి మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ను, మాజీ డీజీపీ ఆర్.బి. శ్రీకుమార్‌ను, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను అరెస్ట్ చేసింది.
గుజరాత్‌లో 2002 గోద్రా అల్లర్ల వెనుక భారీ కుట్ర కోణం ఉందని, దాని మీద దర్యాప్తు చేపట్టాలని.. గుజరాత్ అల్లర్లలో హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ఫిర్యాదు చేసిన తర్వాత.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వు ప్రాతిపదికగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటైంది.
సుప్రీంకోర్టు తొమ్మిది కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా సిట్‌కు కేటాయించింది. ఆ కేసుల్లో అప్పటికే ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. స్థానిక పోలీసులు పాక్షికంగా దర్యాప్తు కూడా నిర్వహించారు. దర్యాప్తును సిట్ చేపట్టిన తర్వాత ఆ బృందం మరింత మంది నిందితులను అరెస్ట్ చేసింది. చార్జ్‌షీట్లు కూడా నమోదు చేసింది.
ఈ తొమ్మిది కేసులు 2002 ఫిబ్రవరి 27 నుంచి 2002 మార్చి 5వ తేదీ వరకూ రిజిస్టరయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదైన 20 ఏళ్ల తర్వాత.. ఈ కేసుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది తెలుసుకోవటానికి బీబీసీ ప్రయత్నించింది. సిట్ సుప్రీంకోర్టకు సమర్పించిన నివేదికను పరిశీలించింది.
సర్దార్‌పురా ఊచకోత కేసు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో ఒక చిన్న గ్రామం సర్దార్‌పురా.
గ్రామంలోని ముస్లింలు నివసించే మూడు ప్రాంతాల మీద 2002 మార్చి 1వ తేదీన అల్లరి మూక దాడి చేసింది. పోలీసులు తక్షణమే స్పందించలేకపోయారు. షేక్ ప్రాంతంలోని ఒక ఇంట్లో ముస్లిం మతస్తులు 33 మంది దాక్కుని ఉన్నారు. అల్లరి మూక వారి ఆచూకీని కనిపెట్టి వారి మీద యాసిడ్ పోసింది.
ఒక ఇనుప చువ్వకు విద్యుత్ వైరు చుట్టి వారి మీదకు విసిరింది. దాంతో 29 మంది విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. సర్దార్‌పురా నుంచి ముస్లింలు తప్పింకుని పోకుండా నిరోధించటం కోసం అల్లరిమూక రోడ్లన్నిటినీ దిగ్బంధించింది.
దర్యాప్తు - కోర్టు విచారణ
సిట్ ఏర్పాటు కాకముందు స్థానిక పోలీసులు ఈ కేసులో 54 మందిని అరెస్ట్ చేశారు. చార్జ్‌షీట్ కూడా సమర్పించారు. సిట్ దర్యాప్తు చేపట్టిన తర్వాత మరో 22 మందిని అరెస్ట్ చేశారు. మూడు అదనపు చార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారు. అరెస్టయిన మొత్తం 76 మందిలో 31 మందిని విచారణ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఒక జువెనైల్ సహా 43 మందిని విడిచిపెట్టింది.
మొత్తం 76 మంది నిందితుల్లో ఇద్దరు విచారణ సమయంలో చనిపోయారు. దోషులుగా నిర్ధారితులైన వారు గుజరాత్ హైకోర్టులో నాలుగు వేర్వేరు అప్పీళ్లు వేశారు. ఆ అప్పీళ్లన్నిటినీ 2012 జనవరిలో హైకోర్టు పరిష్కరించింది. ఆ తర్వాత నిందితులు సుప్రీంకోర్టులో వేసిన మూడు అప్పీళ్లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.
ది వైర్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. అప్పుడు గ్రామ సర్పంచ్‌గా ఉణ్న కచ్రాభాయ్ త్రిభువన్‌దాస్ పటేల్, అప్పటి గ్రామ మాజీ సర్పంచ్ కచ్రాభాయ్ జోతారామ్ పటేల్ - ఈ కేసులో ప్రధాన ముద్దాయిలు. వారిద్దరికీ బీజేపీతో సంబంధాలున్నాయని చెప్తున్నారు.
ఈ కేసు విచారణను గుజరాత్ వెలుపల నిర్వహించటం కోసం.. సుప్రీంకోర్టు 2003లో విచారణను నిలుపుదల చేసింది. కేసును మళ్లీ దర్యాప్తు చేయాల్సిందిగా 2008లో ఆర్.కె.రాఘవన్ సారథ్యంలోని సిట్‌కు అప్పగించింది. విచారణ కోర్టు 2011 నవంబరులో తీర్పు చెప్పింది. నిందితులు 31 మందిలో 30 మంది పటేల్ వర్గానికి చెందిన వారు కాగా, ఒక్కరు ప్రజాపతి వర్గానికి చెందిన వ్యక్తి.
ఓడి ఊచకోత కేసు

ఫొటో సోర్స్, Getty Images
ఆనంద్‌లోని ఓడి గ్రామంలో మూడు వేర్వేరు ఘటనల్లో 27 మంది ముస్లింలను చంపేశారు. అయితే రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఆ రెండు కేసులనూ దర్యాప్తు కోసం సిట్‌కు అప్పగించారు.
2002 మార్చి 1వ తేదీన పిరావలి భగోల్ ప్రాంతంలో 23 మందిని సజీవ దహనం చేసి చంపేశారు. వారి మృతదేహాలు ఎంత తీవ్రంగా కాలిపోయాయంటే.. కేవలం రెండు మృతదేహాలు మాత్రమే కనిపించాయి. మిగతావారి ఆచూకీ తెలియటం లేదని (మిస్సింగ్ అని) తొలి పోలీస్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆనంద్‌లోని ఖాంబోలాజ్ 1 పోలీస్ స్టేషన్‌లో రఫీక్ మొహమ్మద్ అబ్దుల్ ఖాలీఫా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
దర్యాప్తు - కోర్టు విచారణ
కేసు నమోదైన తర్వాత స్థానిక పోలీసులు 51 మందిని అరెస్ట్ చేశారు. మూడు చార్జ్‌షీట్లు కూడా సమర్పించారు. ఆ తర్వాత సిట్ కూడా మరొక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అరెస్టయిన 51 మందిలో 23 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది. 23 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఒక వ్యక్తిని విడుదల చేసింది. మరొక వ్యక్తి పరారీలో ఉన్నారు. విచారణ సమయంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు.
విచారణ కోర్టు తీర్పు మీద హైకోర్టులో ఆరు అప్పీళ్లు దాఖలయ్యాయి. హైకోర్టు వాటిని పరిష్కరించి.. ఆ 23 మందిలో 19 మందిని దోషులుగా ప్రకటించింది. అయితే.. వీరిలో 15 మందికి సుప్రీంకోర్టు 2020 సంవత్సరంలో బెయిల్ మంజూరు చేసింది.
3) ఓడిలో ముగ్గురు వ్యక్తుల సజీవ దహనం

ఫొటో సోర్స్, Getty Images
ఓడి లో రెండో కేసు.. మొదటి ఘటన జరిగిన మరుసటి రోజు చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 2002 మార్చి 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామం నడిబొడ్డున ఇద్దరు మహిళలను, ఒక పురుషుడిని సజీవ దహనం చేశారు. స్థానిక పోలీసులు 44 మందిని అరెస్ట్ చేసి వారి మీద చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సిట్ దర్యాప్తు చేపట్టిన తర్వాత తొలి ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేని మరో నలుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేసింది.
మొత్తం నిందితుల్లో ఆరుగురు పరారీలో ఉన్నారు. ఇంకో ఇద్దరు విచారణ కాలంలో చనిపోయారు. విచారణ కోర్టు 10 మందిని నిందితులుగా ప్రకటించింది. మిగతా 30 మందిని విడుదల చేసింది. ఈ కేసులో ఇప్పటివరకూ గుజరాత్ హైకోర్టులో నాలుగు అప్పీళ్లు దాఖలయ్యాయి. అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి.
ఆ రోజున ఇద్రిష్ ఓరా తన అమ్మను, తన అమ్మమ్మను, ఒక స్నేహితుడిని కోల్పోయారు. ఈ కేసులో ప్రధాన సాక్షుల్లో ఇద్రిష్ కూడా ఒకరు. నిజానికి అతడు, అతడి తండ్రి 10 గంటలకు పైగా ఒక టాయిలెట్‌లో దాక్కోవటం వల్ల ఆ రోజు ప్రాణాలు దక్కించుకోగలిగారు.
న్యాయం కోసం ఇన్నేళ్లుగా ఎంత కష్టాలు పడ్డా అంతా వృధా అయినట్లుగా ఉందని ఆయన బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ''అంతా నాశనం చేసిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తిరుగుతుండటం చూసి తట్టుకోలేకపోతున్నాం. మేం 20 సంవత్సరాలుగా పోరాడుతున్నా మాకు ఇంతవరకూ న్యాయం దక్కలేదు'' అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, The India Today Group/Getty
4) నరోడా పటియా కేసు
బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు వ్యక్తుల నాయకత్వంలో ఒక అల్లరి మూక 2002 ఫిబ్రవరి 28వ తేదీన నరోదా పటియాను దిగ్బందఇంచి 97 మందిని చంపేసింది. సిట్ ఏర్పాటవటానికి ముందు స్థానిక పోలీసులు 46 మందిని అరెస్ట్ చేసి, నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఆ తర్వాత సిట్ మరో 24 మందిని అరెస్ట్ చేసి, ఇంకో నాలుగు చార్జ్‌షీట్లు వేసింది.
ఈ కేసులోని మొత్తం 70 మంది నిందితుల్లో ఏడుగురు విచారణ సమయంలో చనిపోయారు. ఇద్దరు ఇంకా పరారీలోనే ఉన్నారు. మొత్తం నిందితుల్లో 32 మందిని విచారణ కోర్టు దోషులుగా ప్రకటించింది. 29 మందిని విడిచిపెట్టింది. దోషులుగా ప్రకటించిన వారిలో ఇద్దరు చనిపోయారు. దోషులుగా ప్రకటితులైన వారు గుజరాత్ హైకోర్టులో 12 అప్పీళ్లు వేశారు. కోర్టు 2018 ఏప్రిల్ 25 నాటికి ఈ అప్పీళ్లన్నిటినీ పరిష్కరించింది. ప్రధాన నిందితురాలైన మాయా కొద్నాని సహా 18 మందిని హైకోర్టు విడుదల చేసింది. మిగతా 13 మందిని కింది కోర్టు దోషులుగా ప్రకటించటాన్ని బలపరిచింది. అలాగే విచారణ కోర్టు విడుదల చేసిన మరో ముగ్గురిని కూడా అప్పీళ్లు విచారించిన హైకోర్టు దోషులుగా ప్రకటించింది. మొత్తం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో 10 అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరైన సలీమ్ షేక్ బీబీసీతో మాట్లాడుతూ.. దాదాపు నిందితులందరూ పైకోర్టుల నుంచి బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటకు వచ్చారని చెప్పారు. ''నేను ఇంకా నరోదా పటియాలోనే నివసిస్తున్నాను. కానీ ఆ అల్లర్లు సృష్టించిన మత విభజన చాలా పెద్దది. అది ఏ కోర్టూ ఎన్నడూ పూడ్చగలిగేది కాదు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన నిందితురాలి తరఫున అమిత్ షా సాక్ష్యం
ఈ అల్లర్ల ప్రధాన సూత్రధారి మాయా కొద్నాని అని, ఆమె దోషి అని విచారణ కోర్టు ప్రకటించింది. ఆమెకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు 33 మందికి విచారణ కోర్టు జైలుశిక్ష విధించింది. మాయా కొద్నాని 2002 అల్లర్ల తర్వాత కూడా 2007 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఆమెను సిట్ ఏర్పాటైన తర్వాత 2009లో మాత్రమే అరెస్ట్ చేశారు. సిట్ ఆమెను అరెస్ట్ చేసినపుడు ఆమె మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నారు. అయితే ఆమెను గుజరాత్ హైకోర్టు 2018 ఏప్రిల్‌లో నిర్దోషిగా విడుదల చేసింది. అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. సిట్ ఎదుట కొద్నానికి అనుకూలంగా సాక్ష్యం చెప్పారు. కొద్నానిని అసెంబ్లీలోను, ఆ తర్వాత సోలా సివిల్ ఆస్పత్రిలోనూ తాను చూశానని అమిత్ షా చెప్పారు. ఆ తర్వాత ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు. బాబూ బజరంగ్ సహా ఇతరులను దోషులుగా నిర్ధారించారు. అయితే బాబూ బజరింగికి కింది కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా 2018లో హైకోర్టు ఆ శిక్షను 21 సంవత్సరాలకు తగ్గించింది. దోషులుగా నిర్ధారించిన ఈ 13 మందిలో మరో నలుగురికి సుప్రీంకోర్టు 2019లో జస్టిస్ ఎ.ఎం.కాన్వీల్కర్ సారథ్యంలోని ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. నరోడా పటియా కేసులో తీర్పు 'చర్చనీయమైనద'ని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది.
5) నరోదా గావ్ కేసు

ఫొటో సోర్స్, AFP
అహ్మదాబాద్ లోని నరోదా గావ్ ప్రాంతంలో 11 మంది ముస్లింలు హత్యకు గురయ్యారు. స్థానిక పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో 44 మందిని నిందితులుగా పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు చేపట్టాక మరో 37 మంది నిందితులను అరెస్ట్ చేసింది. పోలీసులు మూడు చార్జిషీట్లు వేయగా, ఆ తర్వాత సిట్ ఆరు చార్జ్‌షీట్లు దాఖలు చేసింది. కానీ ఈ కేసులో ఇప్పటివరకూ విచారణ ప్రారంభం కాలేదు.
గోద్రా ఉదంతం అనంతర అల్లర్ల కేసులు చాలా వాటిని చూస్తున్న న్యాయవాది ఎం.ఎం.తిర్మిజి బీబీసీతో మాట్లాడుతూ.. ఈ కేసు మొత్తం కేసులో వాదనలు విన్న తర్వాత, సదరు జడ్జి బదిలీకావటమో, పదోన్నతిపై వెళ్లటమో జరగటం.. ఆ తర్వాత కొత్త జడ్జి రావటంతో మొత్తం కేసులో మళ్లీ మొదటి నుంచీ వాదనలు వినిపించటం చాలాసార్లు జరిగిందని చెప్పారు. కేసు నమోదై 20 ఏళ్లు గడిచినా కూడా విచారణ ఇంకా ప్రారంభం కాలేదన్నారు.
6) దీప్దా దర్వాజా కేసు

ఫొటో సోర్స్, Kalpit Bhachech
విస్‌నగర్‌లోని దీప్దా దర్వాజా ప్రాంతంలో నివసించే ఒక కుటుంబానికి చెందిన 11 మందిని 2002 ఫిబ్రవరి 28వ తేదీన అల్లరి మూక చంపేసింది. అదే రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. స్థానిక పోలీసులు తొలుత 79 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సిట్ మరో ఆరుగురిని అరెస్ట్ చేసింది. మొత్తంగా ఐదు చార్జ్‌షీట్లు నమోదయ్యాయి. విచారణ కోర్టు 22 మందిని దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో 13 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఆ అప్పీళ్లన్నీ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ కేసులో.. విస్‌నగర్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ మోహన్‌లాల్ పటేల్, విస్‌నగర్ మునిసిపాలిటీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత దాహ్యాభాయ్ పటేల్ సహా మొత్తం 85 మంది నిందితులు ఉన్నారు. వారిలో ప్రహ్లాద్, దాహ్యాభాయ్ సహా 61 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు.
7) బ్రిటిష్ జాతీయుల కేసు

ఫొటో సోర్స్, Reuters
2002 ఫిబ్రవరి 28వ తేదీన ముగ్గురు బ్రిటిష్ జాతీయులను, వారి డ్రైవర్‌ను అల్లరి మూక చంపేసింది.
కేసు వివరాల ప్రకారం.. గోద్రా ఘటన జరిగిన మర్నాడు ఇమ్రాన్ దావూద్ అనే వ్యక్తి తన బంధువులు ముగ్గురితో పాటు కారులో వెళుతుండగా.. ప్రాంతిజ్ ప్రాంతంలో అల్లరి మూక వారిని ఆపింది. వారిలో ఇద్దరిని సజీవంగా దహనం చేశారు. ఇంకో ఇద్దరు తప్పించుకోవటానికి ప్రయత్నించగా వారిని వెంటాడి పట్టుకుని చంపేశారు. ఇమ్రాన్ పోలీసుల సాయంతో తప్పించుకోగలిగారు.
స్థానిక పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసింది. వారి మీద చార్జ్‌షీట్ నమోదు చేసింది. అయితే విచారణ కోర్టు ఆరుగురు నిందితులనూ విడుదల చేసింది. దీనిపై హైకోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉంది.
పీటీఐ, ఎన్‌డీటీవీ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నిందితుల మీద అభియోగాలను నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున వారిని విడిచిపెట్టటం మినహా కోర్టుకు దారి లేదని హిమ్మత్‌నగర్ ప్రత్యేక కోర్టు 2015లో పేర్కొంది. కోర్టు ఇచ్చిన 182 పేజీల తీర్పులో.. నిందితులను గుర్తించటంలో సాక్షులు విఫలమయ్యారని సిట్ సైతం చెప్పిందని కోర్టు ఉటంకించింది. కోర్టు విచారణ సమయంలో ముగ్గురు కీలక సాక్షులు ఎదురు తిరిగారు.
8) గుల్బర్గ్ ఊచకోత

ఫొటో సోర్స్, ARKO DATTA
2002 ఫిబ్రవరి 28వ తేదీన అసార్వాలోని చమన్‌పురా ప్రాంతంలో గల గుల్బర్గ్ సొసైటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీ సహా 69 మందిని అల్లరి మూక చంపేసింది. ఈ సొసైటీలో 19 బంగళాలు, 10 అపార్ట్‌మెంట్లు ఉంటాయి. మేఘానినగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో తొలుత 46 మంది నిందితుల పేర్లు చేర్చారు. ఆ తర్వాత సిట్ మరో 28 మంది నిందితులను అరెస్ట్ చేసింది.
వివిధ కోర్టుల్లో మొత్తం 12 చార్జ్‌షీట్లు వేశారు. విచారణ కోర్టు 24 మందిని దోషులుగా ప్రకటించింది. 39 మందిని విడుదల చేసింది. ఈ తీర్పు మీద హైకోర్టులో 17 అప్పీళ్లు దాఖలయ్యాయి. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
గుల్బర్గ్ సొసైటీలోని ఆరో నంబరు బంగళా యజమాని, ఆనాటి అల్లర్ల బాధితుల్లో ఒకరైన సైరా బాను బీబీసీతో మాట్లాడుతూ.. ఫిర్యాదులో పేర్లున్న నిందితుల్లో చాలా మంది అరెస్టయిన వెంటనే అసలేమీ జరగలేదన్నట్లుగా బెయిల్ మీద బయటకు వచ్చేశారని చెప్పారు. మానవ హక్కుల ఉద్యమకారులైన తీస్తా సెతల్వాద్, ఆర్.బి.శ్రీకర్‌కుమార్ వంటి వారి అవిశ్రాంత కృషి వల్ల నిందితులందరి మీదా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆమె పేర్కొన్నారు.
ఇదే గుల్బర్గా ఊచకోత నుంచి ప్రాణాలతో బయటపడ్డ దారా మోడీ బీబీసీతో మాట్లాడుతూ.. ''మాకు ఇంతవరకూ న్యాయం జరగలేదు. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో చాలా మంది.. సిట్ దర్యాప్తు తర్వాత కూడా బెయిల్ మీద బయటే ఉన్నారు. ఇన్నాళ్లూ మా కృషి అంతా వృధా అయినట్లుగా కనిపిస్తోంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
9) గోద్రా రైలు ఊచకోత
గుజరాత్ అల్లర్లను రాజేసిన కేసు ఇది. అహ్మదాబాద్‌కు చెందిన 100 మందికి పైగా కరసేవకులు అయోధ్య నుంచి సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్6 బోగీలో ప్రయాణిస్తూ అహ్మదాబాద్ తిరిగి వస్తున్నారు. గోద్రా రైల్వే స్టేషన్ దగ్గర హింస చెలరేగటంతో.. అల్లరి మూక ఆ బోగీకి నిప్పు పెట్టింది. మహిళలు, చిన్నారులు సహా 59 మంది చనిపోయారు. ఈ సంఘటన 2002 ఫిబ్రవరి 27న జరిగింది.
ఈ కేసులో 103 మందిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ దర్యాప్తు తర్వాత మొత్తం నిందితుల సంఖ్య 134కు పెరిగింది. మొత్తం 26 వేర్వేరు చార్జిషీట్లు దాఖలు చేశారు. వాటి నిడివి వేలాది పేజీలు ఉంది. ఈ కేసులో 34 మందిని దోషులుగా విచారణ కోర్టు ప్రకటించింది. 67 మందిని విడుదల చేసింది. ముగ్గురు కేసు విచారణ సమయంలో చనిపోయారు. మిగతావాళ్లు జువెనైల్స్.
విచారణ కోర్టు తీర్పు మీద నిందితులు గుజరాత్ హైకోర్టులో మొత్తం 13 అప్పీళ్లు దాఖలు చేశారు. వాటిలో రెండు అప్పీళ్లను కోర్టు పరిష్కరించింది. సుప్రీంకోర్టులో మరో రెండు అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులో 10 మంది ఇంకా జీవిత ఖైదు అనుభవిస్తున్నారని, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారని ఈ కేసులో ఒక న్యాయవాది అయిన రులామిన్ అకిల బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఉదయ్‌పుర్: కన్నయ్యలాల్ హత్య కేసులో పాకిస్తాన్‌లోని 'దావత్-ఎ-ఇస్లామ్' పేరు ఎందుకు వినిపిస్తోంది?
- జూలై 1: కొత్త కార్మిక చట్టాలతో ఉద్యోగుల జీవితాల్లో, జీతాల్లో వచ్చే మార్పులు ఇవీ...
- ఆంధ్రప్రదేశ్: ఉడుత ఎక్కితే హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడతాయా? ఐదుగురు సజీవ దహనం వెనుక అసలు కారణాలేంటి?
- జస్ప్రీత్ బుమ్రా: టెస్టుల్లో ఒకే ఓవర్లో 35 పరుగులతో ప్రపంచ రికార్డు, యువరాజ్ సింగ్‌తో పోలుస్తూ అభిమానుల ట్వీట్లు
- బీజేపీ ‘ఆపరేషన్ తెలంగాణ’ విజయవంతం అవుతుందా... ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













