గుజరాత్ అల్లర్లు: బీజేపీ మాజీ మంత్రిపై కేసు కొట్టేసిన హైకోర్టు

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
గుజరాత్‌లో 2002 మతఘర్షణల్లో భాగంగా జరిగిన నరోదా పాటియా కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ మంత్రి మాయా కోడ్‌నానీని నిర్దోషిగా ప్రకటించింది.
మాయా కోడ్‌నానీ తన కారులోంచి దిగొచ్చి అల్లరి గుంపుల్ని రెచ్చగొట్టారని చెప్పే ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరినీ పోలీసులు ప్రవేశపెట్టలేకపోయారని హైకోర్టు తెలిపింది.
అయితే, ఈ కేసులో మరో కీలక నిందితుడైన బాబూ బజరంగీ శిక్షను హైకోర్టు యథాతథంగా ఉంచింది. బజరంగీకి కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
ఈ కేసులో విచారణ ప్రక్రియ నిరుడు ఆగస్టులోనే పూర్తయింది. తీర్పును హైకోర్టు బెంచ్ రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించి హైకోర్టు మొత్తం 11 అప్పీల్ పిటిషన్లపై విచారణ జరిగింది.
అంతకు ముందు 2012లో, ఎస్ఐటీ కేసుల కోసం ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో బీజేపీ మాజీ మంత్రి మాయా కోడ్‌నానీ సహా మొత్తం 32 మందికి శిక్ష విధించింది.
మాయా కోడ్‌నానీకి 28 ఏళ్ల శిక్ష, బజరంగ్ దళ్ నేత బాబూ బజరంగీకి యావజ్జీవ శిక్ష ప్రత్యేక కోర్టు విధించింది.
సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో 29 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఈ కేసులో శిక్ష పడిన వారు దీనిపై హైకోర్టులో అపీల్ చేశారు. మరోవైపు, నిర్దోషులుగా ప్రకటించిన వారిపై ఎస్ఐటీ హైకోర్టును ఆశ్రయించింది.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
ఇవీ కేసు పూర్వాపరాలు
2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోధ్రా వద్ద సాబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేసిన ఘటనలో 59 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది అయోధ్య నుంచి తిరిగి వస్తున్న హిందూ కార్‌సేవకులు.
ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో మతహింస చెలరేగగా, దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. వీటిలో నరోదా పాటియా ఉదంతం అత్యంత ఘోరమైన దుస్సంఘటన.
గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో భాగంగా, అహ్మదాబాద్‌లోని నరోదా పాటియా ప్రాంతంలో 97 మంది ముస్లింలను హత్య చేశారు. ఆ హింసాకాండలో మరో 33 మంది గాయపడ్డారు.
కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు నరోదా పాటియా ప్రాంతానికి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
మాయా కోడ్‌నానీ ఎవరు?
ప్రస్తుతం మాయా కోడ్‌నానీ బెయిల్‌పై బయట ఉన్నారు. కింది కోర్టు ఆమెను ఈ హింసకు 'మాస్టర్ మైండ్' అని పేర్కొంది.
గుజరాత్ ప్రభుత్వంలో మాయ మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయ ఆయనకు దగ్గరగా ఉండేవారని చెబుతారు.
దేశ విభజనకు ముందు మాయా కోడ్‌నానీ కుటుంబం ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న సింధ్‌లో ఉండేది.
విభజన తర్వాత ఆమె కుటుంబం గుజరాత్‌కు వచ్చి స్థిరపడింది. వృత్తిపరంగా మాయా కోడ్‌నానీ డాక్టర్. ఆమె ఆర్ఎస్ఎస్‌లో క్రియాశీలంగా ఉన్నారు.
నరోదాలో ఆమెకు ఆసుపత్రి కూడా ఉండేది. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు.
తన వాక్పటిమ వల్ల ఆమె భారతీయ జనతా పార్టీలో గుర్తింపు పొందారు. 1998లో ఆమె నరోదా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2002, 2007లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె మంత్రి అయ్యారు.
ఆమెను విచారించడం కోసం 2009లో సుప్రీంకోర్టు ఆమెకు సమన్లు పంపించింది.
ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. దాంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
అయితే కొద్ది రోజుల్లోనే ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆమెపై కేసు నడుస్తుండగానే ఆమె శాసనసభ సమావేశాలకు కూడా హాజరయ్యే వారు.
2012 ఆగస్టు 29న ప్రత్యేక కోర్టు ఆమెను నరోదా పాటియా అల్లర్ల కేసులో దోషిగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- #BBCGujaratOnWheels: అభివృద్ధికి దూరం బనాస్కాంఠా
- గోధ్రా కేసు: మరణ శిక్ష పడిన దోషులందరికీ శిక్ష తగ్గింపు
- మోదీ-తొగాడియాల దోస్తీ ఎక్కడ బెడిసి కొట్టింది?
- మోదీ ప్రభుత్వానికి హిందూత్వం అజెండాగా మారినట్టేనా?
- ప్రాణాలు నిలుపుకోడానికి.. మతం మారుతున్నారు!
- నాడు దీపిక పదుకొణెకు సెక్యూరిటీ ఇచ్చి.. నేడు పద్మావత్ వ్యతిరేకంగా ఉద్యమం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








