మేధా పాట్కర్: నర్మద నవనిర్మాణ్ అభియాన్‌పై ఈడీ కేసు.. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా.. అందుకే నా నోరు మూయించాలని చూస్తోంది’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాక్సీ గగ్డేకర్ చారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ ట్రస్టీగా ఉన్న నర్మద నవనిర్మాణ్ అభియాన్ (ఎన్ఎన్ఏ) అనే ఎన్జీఓ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది.
17 ఏళ్ల క్రితం నాటి ఎన్‌ఎన్‌ఏ లావాదేవీలపై ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఆ సమయంలో 20 వేర్వేరు అకౌంట్ల నుంచి దాదాపు రూ.1.19 కోట్లు ఈ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ఖాతాలోకి బదిలీ అయ్యాయని భావిస్తోంది.
నర్మద నవనిర్మాణ్ అభియాన్ స్వచ్ఛంద సంస్థ ట్రస్టీలలో మేధా పాట్కర్ కూడా ఒకరు.
'ద పయనీర్' ప్రచురించిన నివేదిక ప్రకారం, మేధా పాట్కర్‌కు చెందిన ఈ ఎన్జీవో బ్యాంకు అకౌంట్‌కు 2005 సంవత్సరంలో రూ. 1,19,25,880 బదిలీ అయ్యాయి. మొత్తం 20 అకౌంట్ల నుంచి రూ. 5,96,294 చొప్పున నగదు ఈ అకౌంట్‌కు బదిలీ అయింది. ఈ లావాదేవీల గురించే ఈడీ విచారిస్తోంది.
ఈ ఘటన గురించి బీబీసీ గుజరాతీ, మేధా పాట్కర్‌తో మాట్లాడింది.
తనతో పాటు తన వర్గం... ప్రభుత్వాన్ని అనేక దశల్లో సవాలు చేస్తున్నందున తమను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని మేధా పాట్కర్ అన్నారు.
''మాకు వచ్చే నిధులు అన్నింటినీ అవసరాలకు అనుగుణంగా ఉపయోగిస్తాం. అనేక రంగాల్లో మేం పని చేస్తున్నాం. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, ఆరోగ్యం, ఉపాధి వంటి రంగాల్లో శ్రమిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే పని'' అని ఆమె చెప్పారు.
ఈడీకి అందినట్లు చెప్తోన్న ఫిర్యాదులో పేర్కొన్న లావాదేవీలు 17 ఏళ్ల నాటివని ఆమె చెప్పారు.
''మేం నివేదికలు సమర్పించాం, ఆడిట్ కూడా జరిగింది. ఎన్ఎన్‌ఏ ఎన్జీవోకు సంబంధించిన ఆడిట్ ప్రతీ ఏడాది జరుగుతుంది. కాబట్టి వీటిపై విచారణ జరగాలి అనే ప్రశ్నే లేదు. సంస్థపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం'' అని ఆమె వ్యాఖ్యానించారు.
''ప్రభుత్వం చేస్తోన్న ఈ కసరత్తు అంతా కేవలం నన్ను, నా వర్గాన్ని అప్రతిష్ట పాలు చేసి మా నోరు మూయించేందుకే'' అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నర్మదా బచావో' ఉద్యమంలో మేధా పాట్కర్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రవహించే నర్మదా నదిపై డ్యామ్‌ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనులు, రైతులు, పర్యావరణవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు ఉద్యమం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నర్మదా బచావో ఆందోళన్ (ఎన్‌బీఏ) ఏమిటి?
నర్మదా బచావో ఉద్యమాన్ని మేధా పాట్కర్‌తో పాటు మరో ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా ఆంప్టే నడిపించారు.
నర్మద నదిపై భారీ ఆనకట్టల నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే ప్రజల మానవ హక్కులను కాపాడటం కోసం ఈ ఉద్యమాన్ని నడిపించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో నిర్వాసితులుగా మారే వారికి పునరావాసం కోసం ఆందోళనలు చేపట్టారు.
2011లో మేధా పాట్కర్ ఉద్యమానికి బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ మద్దతు ఇవ్వడంతో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.
గుజరాత్‌కు చెందిన పర్యావరణవేత్త, ఎన్‌బీఏ ఉద్యమంలో పాట్కర్‌తో కలిసి పనిచేస్తోన్న వర్గంలో సభ్యుడైన రోహిత్ ప్రజాపతి, బీబీసీ గుజరాతీతో మాట్లాడారు.
''ఈ ఉద్యమం ఏకైక ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించడం. ఆనకట్టల కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని మేం అప్పుడే చెప్పాం. ఇప్పుడు అదే నిజమైంది'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గుజరాత్‌తో పాట్కర్ అనుబంధం
నర్మదా వ్యాలీలోని గిరిజన జనాభాతో ముడిపడి ఉన్న ప్రజా ఉద్యమం కారణంగానే ఆమె గుజరాత్‌లో వివాదాస్పద వ్యక్తిగా మిగిలిపోయారని చాలామంది నమ్ముతారు.
కానీ, ఒక సామాజిక కార్యకర్త చెప్పినదాని ప్రకారం అధికార బీజేపీకి ఆమె చర్యలు నచ్చలేదు. 2002లో ఆమె గాంధీ ఆశ్రమంలో ప్రసంగిస్తున్నప్పుడు మేధా పాట్కర్‌తో పాటు ఇతర సామాజిక కార్యకర్తలపై దాడి జరిగింది.
గుజరాత్‌లో గోద్రా అల్లర్ల తర్వాతి పరిణామాల గురించి మాట్లాడేందుకు ఆమె ప్రజలను కలిశారు. అయితే, ఈ ఘటన అక్కడ పెద్ద వివాదానికి దారితీసింది.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక, చైనా మధ్య పెరుగుతున్న దూరం భారత్‌కు కలిసొస్తుందా
- అల్ ఖైదా చీఫ్ అల్-జవహిరి: 'అల్లా-హు అక్బర్' అని నినదించిన కర్ణాటక ముస్లిం యువతిపై ప్రశంసలు
- వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?
- రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన 79 ఏళ్ల పుష్ప ముంజియాల్ ఎవరు?
- పాకిస్తాన్లో దేశద్రోహం అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్ దేశద్రోహి అని నిరూపణ అయితే ఏం శిక్ష విధిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









