గుజరాత్: భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భార్గవ పారిఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాబోయే అకడమిక్ సెషన్ నుంచి గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల పాఠ్యాంశాల్లో భగవద్గీతను చేర్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రానున్న రోజుల్లో అలజడి సృష్టిస్తుందని పలువురు భావిస్తున్నారు.
గుజరాత్ ప్రభుత్వ ప్రకటన తర్వాత, అక్కడి ప్రభుత్వం మాదిరిగానే పాఠశాలల్లో భగవద్గీతను బోధించేలా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సూచించారు.
''భగవద్గీత నైతికతను బోధిస్తుంది. సమాజ సంక్షేమం కోసం మన బాధ్యతలు ఏంటో ఇది గుర్తు చేస్తుంది. మన విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అనేక నైతిక కథలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం గురించి ఆలోచించవచ్చు'' అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
గుజరాత్ నిర్ణయం తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా అదే బాటలో నడవాలని ఆలోచిస్తోంది. ది ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం ఈ అంశంపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో చర్చించారు.
గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘానీ గత గురువారం అసెంబ్లీలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చిస్తూ, వచ్చే విద్యాసంవత్సరానికి మొదటి తరగతి నుంచి ఇంగ్లీషు సబ్జెక్టును తప్పనిసరి చేయడంతోపాటు, ఆరో తరగతి నుంచి భగవద్గీత ను కూడా పాఠ్యాంశంగా చేర్చుతామని ప్రకటించారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, పాఠ్యాంశాల్లో గీత పారాయణం, పఠనం రెండూ ఉంటాయి. రాష్ట్రంలోని మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో దశలవారీగా భగవద్గీతను బోధిస్తామని గుజరాత్ విద్యాశాఖ కార్యదర్శి వినోద్ రావ్ అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది. భగవద్గీత కు ప్రత్యేకంగా సబ్జెక్టు అంటూ ఉండదని, దానిని వివిధ సబ్జెక్టుల్లో చేర్చి బోధించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పిల్లల మనోభావాలపై ప్రభావం చూపి మతపరమైన సెంటిమెంట్ల అంశంలో వివాదం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల మనస్సుపై ప్రభావం
ప్రభుత్వ నిర్ణయంతో పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విద్యావేత్త ప్రఫుల్ గాధవి అన్నారు. '' పిల్లలకు గీతా శ్లోకాలు నేర్పించడంలో తప్పు లేదు. కానీ అది వివాదానికి దారి తీస్తుంది. విద్యార్థుల చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది'' అని ఆయన అన్నారు.
''వివాదాల వల్ల పిల్లలలో వారి మతం గురించి గందరగోళం ఏర్పడుతుంది. వారు భారతీయులుగా కాకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైనులుగా ఆలోచించడం ప్రారంభించే అవకాశం ఉంది. అలాంటి మతతత్వ బీజాలు బాల్యం నుంచే ఏర్పడటం ప్రమాదకరం'' అన్నారు గాధవి.
స్కూళ్లలో భగవద్గీతను ఎలా బోధిస్తారో కూడా గుజరాత్ విద్యాశాఖ మంత్రి జితు వాఘానీ బీబీసీకి వివరించారు. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు భగవద్గీత కథలు, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలుగా గీతను ప్రవేశపెడతామని, నాటక పోటీలు, వ్యాసరచన, శ్లోకాలు నేర్చుకోవడం లాంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు.
పిల్లల్లో విలువలు, భారతీయ సంస్కృతి, నైతికత విలువలను పెంపొందించాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ''పాఠ్యాంశాలలో గీతను చేర్చితే తప్పు లేదు. కానీ, పిల్లలకు నైతికత బోధించే పేరుతో బీజేపీ విద్యార్ధులపై ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తోంది" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి హేమాంగ్ రావల్ బీబీసీతో అన్నారు.
''బీజేపీ పాలనకు ముందు మేం చదువుకునే రోజుల్లో మహాభారతం, రామాయణ కథలు నైతిక విలువలను బోధించే అధ్యయనంలో భాగంగా ఉండేవని, ఆ సమయంలో ఎనిమిదో తరగతిలో సంస్కృతం తప్పనిసరి అని, పదో తరగతిలో మాత్రం అది ఆప్షనల్'' అని ఆయన వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీతి కథలు, సాహిత్యం అన్నీ చదువుకు దూరమయ్యాయని ఆరోపించారు.

ఫొటో సోర్స్, TWITTER / JITUVAGHANI
'నైతికత' పాఠాలు
పాఠ్యాంశాల్లో మతపరమైన పాఠాలను పరోక్ష పద్ధతిలో చేర్చడం ద్వారా, విద్యార్థులపై ప్రయోగాలు చేస్తున్నారని విద్యావేత్త హస్ముఖ్‌భాయ్ క్రిస్టియన్ అభిప్రాయపడ్డారు. ''భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విద్యార్ధుల్లో నైతికత పెంచుతామని మంత్రిగారు చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకు పాఠాలలో నైతికత నేర్పలేదా'' అని హస్ముఖ్ క్రిస్టియన్ ప్రశ్నించారు.
నైతికత పేరుతో విద్యలో మతాన్ని తీసుకురావడంపై హస్ముఖ్‌భాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ''తర్వాత దీన్ని విధ్వంస మార్గంలోకి మళ్లిస్తారు. అభివృద్ధివైపు కాదు'' అన్నారాయన.
ప్రచారం కోసం ఒక మతానికి సంబంధించిన బోధనలను విద్యా వ్యవస్థలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని ప్రఫుల్ గాధవి అభిప్రాయపడ్డారు. ''విద్యార్థులకు భగవద్గీత బోధిస్తే, ఇతర మతాల వారు దానిని వ్యతిరేకిస్తారు, లేదంటే వారి మత బోధలను కూడా చేర్చమని డిమాండ్ చేస్తారు. ఈ విషయం కోర్టుకు కూడా వెళ్ళవచ్చు'' అని ఆయన అన్నారు.
రాజ్యాంగం ప్రకారం భారతదేశం లౌకిక దేశమని, ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలో కూడా సవాలు చేసే అవకాశం ఉందని గాధవి అన్నారు.
''భారతదేశంలో 16,000 క్రైస్తవ పాఠశాలలు, 400 క్రైస్తవ కళాశాలలు ఉన్నాయి. మైనారిటీలుగా, వారి మతాన్ని బోధించే హక్కు వారికి ఉంది. కానీ ఇతర మతాల విద్యార్థులు కూడా క్లాసులో ఉంటారు కాబట్టి వారు అలా చేయరు. విద్య ఉద్దేశ్యం ఒక మతానికి ప్రాధాన్యత ఇవ్వడం కాదు'' హస్ముఖ్ క్రిస్టియన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''భగవద్గీతను బోధించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ, ఇతర మతాల బోధనలను కూడా చేర్చాలి'' అని అహ్మదాబాద్ స్కూల్ బోర్డ్ మాజీ సభ్యుడు ఇలియాస్ ఖురేషి బీబీసీతో అన్నారు. ''గీత ఏది ప్రబోధిస్తుందో, ఖురాన్, బైబిల్ కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. గురు గ్రంథ్ సాహిబ్ లో కూడా ఇలాంటి బోధనలు ఉన్నాయి'' అని అన్నారాయన.
సిలబస్‌లో భగవద్గీతను మాత్రమే ప్రవేశపెట్టడం ద్వారా పిల్లల మనస్సులలో హిందూ మతం గొప్పది అనే చెప్పే ప్రయత్నం జరుగుతోందని ఖురేషీ ఆరోపించారు.
అయితే, అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ గ్రూప్ సలహాదారు జంకృత్ ఆచార్య దీనితో విభేదించారు. "విద్యాశాఖ ఆలస్యంగా మేల్కొంది. గీతా పాఠాలను ముందుగా చేర్చి ఉండవలసింది. భగవద్గీతలో అనేక మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయి, చిన్న వయస్సులో పిల్లలు అవి నేర్చుకోవడం వల్ల వారి జీవితంలో కష్టాలు తొలగుతాయి'' అన్నారాయన.
విమర్శకుల ఆరోపణలపై స్పందిస్తూ ''ప్రజలు దీనిని మతపరమైన గ్రంథంగా కాకుండా లౌకిక గ్రంథంగా చూడాలి, ఇది విద్యార్థులకు మంచి విద్యను అందించగలదు'' అని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టొచ్చా.. ఎవరి అనుమతి తీసుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- ప్రపంచంలో దారుణమైన కేసుల్లో ఒకటి.. 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కాడు?
- 10th క్లాస్, బీటెక్ ఫెయిల్ అయ్యారా? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదా? ఈ ట్రైనింగ్‌తో జాబ్ గ్యారెంటీ..
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లక్ష్య సేన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడిన భారత షట్లర్
- శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం.. రేపు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












