#KashmirFiles: కశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చిన రాత్రి అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జయ్ మక్వానా
- హోదా, బీబీసీ ప్రతినిధి
వివేక్ అగ్నిహోత్రి రచించి, దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కశ్మీరీ పండిట్లు కశ్మీర్ లోయ విడిచిపెట్టి పారిపోవడం, వారు పడ్డ కష్టాలు, బాధలను ఇందులో తెరకెక్కించారు.
అయితే, ఈ సినిమా కథపై చాలా వివాదాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకు ఇందులోని వాస్తవికత పట్ల సందేహాలు లేవనెత్తుతున్నారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించాయి. విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియా వేదికలపై #KashmirFiles ట్రెండింగ్‌లో ఉంది.
కశ్మీరీ పండిట్లు తమ సొంత నేలను విడిచిపెట్టి దేశంలోని ఇతర నగరాలకు లేదా రాష్ట్రాలకు శరణార్థుల్లా పారిపోయిన నాటి రాత్రి ఏం జరిగిందనేది ఈ చిత్రంలో చూపించారు.

ఫొటో సోర్స్, THEKASHMIRFILES
ఆ రోజు రాత్రి ఏం జరిగింది?
"అప్పుడు నేను గాఢ నిద్రలో ఉన్నాను. అకస్మాత్తుగా వింత శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. నాకు భయమేసింది. ఏవేవో విరిగిపడుతున్నాయి. అంతా మారిపోతోంది. గోడలపై కనిపిస్తున్న నీడలు ఒక్కొక్కటిగా మా ఇంట్లోకి దూకుతున్నాయి. ఉలిక్కిపడి లేచాను.
మా నాన్న, నన్ను తట్టి లేపుతూ "ఏదో గందరగోళం జరుగుతోంది" అంటున్నారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్రజలు వీధుల్లో గుమికూడారు. గట్టిగా కేకలు వేస్తున్నారు" అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పండిత, తన పుస్తకం 'అవర్ మూన్ హాజ్ బ్లడ్ క్లాట్స్'లో 1990 జనవరి 19నాటి రాత్రి గురించి వివరించారు.
"నేను చూసింది కల కాదు, నిజమే. వాళ్లు నిజంగానే మా ఇంట్లోకి దూసుకొస్తారా? మా వీధికి నిప్పు పెట్టబోతున్నారా? అప్పుడే నాకు పెద్దగా ఈల లాంటి శబ్దం వినిపించింది. దగ్గర్లోని మసీదు లౌడ్ స్పీకర్ నుంచి వస్తోంది ఆ శబ్దం. అది బాగా తెలిసిన శబ్దమే. రోజూ నమాజుకు ముందు మసీదు నుంచి ఈ శబ్దం వస్తుంది. కొంతసేపయ్యాక ఆగిపోతుంది. కానీ ఆ రాత్రి ఆ శబ్దం ఆగట్లేదు. అది చాలా దురదృష్టకరమైన రాత్రి.
కొంతసేపటికి మా ఇంటి బయట శబ్దాలు ఆగిపోయాయి. కానీ, మసీదు నుంచి ఎవరెవరో మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపించాయి. అక్కడేదో చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోందని మా చిన్నాన్న అడిగారు. 'వాళ్లు ఏదో చేస్తారు' అన్నాను.
కొంతసేపు మసీదులో చర్చలు సాగాయి. తరువాత, పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ప్రారంభించారు.
'నారా-ఎ-తక్బీర్, అల్లా హో అక్బర్' అని.
మా నాన్న వైపు చూశాను. ఆయన మొహం పాలిపోయింది. ఆ నినాదాలకు అర్థమేమిటో ఆయనకు బాగా తెలుసు.
కొన్నేళ్ల క్రితం దూరదర్శన్‌లో వచ్చిన 'తమస్' అనే టీవీ సీరియల్‌లో ఆ నినాదం విన్నాను. 1947లో భారతదేశం, పాకిస్తాన్ విభజనపై సాహితీవేత్త భీష్మ సాహ్ని రాసిన నవల ఆధారంగా ఆ సిరీస్‌ను రూపొందించారు.
కొంతసేపటికి, చుట్టుపక్కల నుంచి విషపూరితమైన ఈటెల్లాంటి మాటలు మాకు వినిపించాయి.
'మనకు ఏం కావాలి: స్వతంత్రం'
'పీడక కాఫీర్లు.. కశ్మీర్ విడిచిపెట్టండి' అనే నినాదాలు వినిపించాయి.
కొద్దిసేపటికి నినాదాలు ఆగిపోయాయి. తరువాత, అఫ్గానిస్తాన్‌పై సోవియట్ దాడికి వ్యతిరేకంగా ముజాహిదీన్లు చేసిన పోరాటాన్ని ప్రశంసిస్తూ పాటలు బిగ్గరగా వినిపించాయి.
'బీఎస్ఎఫ్ ఏదో ఒకటి చేస్తుంది ' అని మా చిన్నాన్న అన్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. తెల్లవారే వరకూ నినాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాత్రంతా మాకు భయంతో కంటి మీద కునుకు లేదు.
ఇది కేవలం మా ఇంటి చుట్టుపక్కల జరిగింది కాదు. దాదాపు కశ్మీర్ లోయ అంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రాత్రి జరిగినదంతా మమ్మల్ని భయపెట్టడానికి, కశ్మీర్ నుంచి వెళ్లగొట్టడానికి చేసినదే. అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగింది.
ఆ మర్నాడే కశ్మీర్ లోయ నుంచి హిందువుల వలస ప్రారంభమైంది. చాలా కుటుంబాలు తమతో తీసుకెళ్లగలిగినన్ని వస్తువులు తీసుకుని జమ్మూ పారిపోయాయి" అని ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పండిత, తన పుస్తకం 'అవర్ మూన్ హాజ్ బ్లడ్ క్లాట్స్'లో రాశారు.
కశ్మీరీ పండిట్ల తొలి హత్య
కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సంజయ్ టికూ బీబీసీతో మాట్లాడుతూ, జనవరి 19 నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అప్పటికి ఆయన వయసు 22 ఏళ్లు.
"1989లో కాల్పులు, బాంబు పేలుళ్లు జరిగాయి. తరువాత, రూబియా సయీద్‌ని కిడ్నాప్ చేశారు. అదే ఏడాది ఆగస్టులో ఒక ముస్లిం రాజకీయ కార్యకర్త హత్యకు గురయ్యారు. ఆ తరువాత, తొలిసారిగా ఒక కశ్మీరీ పండిట్ హత్య జరిగింది. ఆయన ఒక బీజేపీ నాయకుడు.
నాకు బాగా గుర్తుంది. జనవరి 19వ తేదీ రాత్రి డీడీ మెట్రోలో 'హమ్‌రాజ్' సినిమా వస్తోంది. చాలా మంది ఇళ్లల్లో ఆ సినిమా చూస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో వీధుల్లో నినాదాలు ప్రారంభమయ్యాయి. రాత్రంతా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాత్రంతా మాకు నిద్ర లేదు.
మర్నాడు ఉదయం మేం మా ఇరుగుపొరుగువారిని కలిసినప్పుడు వారి వ్యవహార శైలి మారినట్టు అనిపించింది. రాత్రి వాళ్లు ఎందుకు వీధుల్లోకి వచ్చారు, మున్ముందు ఏం జరగబోతోంది లాంటి విషయాలేం వాళ్లు మాట్లాడలేదు. వాళ్లల్లో చాలామంది ప్రవర్తన మారినట్టు తోచింది. అందుకే, మొత్తం వాతావరణమే మారిపోయింది" అంటూ సంజయ్ టికూ చెప్పుకొచ్చారు.
జనవరి 19కి ముందు ఏం జరిగింది?
కల్నల్, డా. తేజ్‌కుమార్ టికూ, తన పుస్తకం 'కశ్మీర్: ఇట్స్ అబోరిజిన్స్ అండ్ దెయిర్ ఎక్సోడస్'లో జనవరి 19కి ముందు జరిగిన సంఘటనలను వివరించారు.
"1990 జనవరి 4న స్థానిక ఉర్దూ వార్తాపత్రిక 'అఫ్తాబ్'లో ఒక ప్రకటన వచ్చింది. అందులో, పండిట్లందరూ వెంటనే కశ్మీర్ లోయను విడిచిపెట్టాలని హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ ఆదేశించింది.
ఇదే హెచ్చరికను మరొక స్థానిక వార్తాపత్రిక 'అల్-సఫా' కూడా ప్రచురించింది. ఈ బెదిరింపుల తర్వాత, 'జిహాదీ' వ్యక్తులు కలాష్నికోవ్ తుపాకీలతో బహిరంగంగా మార్చ్ చేశారు. మరోవైపు, కశ్మీరీ పండిట్ల హత్యకు సంబంధించి మరిన్ని వార్తలు రాసాగాయి. బాంబు దాడులు, కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి.
రెచ్చగొట్టే, బెదిరించే ప్రసంగాలు జరిగాయి. పండిట్లను భయపెట్టడానికి, బెదిరించడానికి దుష్ప్రచారాలతో కూడిన ఆడియో క్యాసెట్లను పంపిణీ చేశారు. అలాగే, మైనారిటీలు కశ్మీర్ విడిచిపెట్టాలని బెదిరించే పోస్టర్లు చాలా చోట్ల అతికించారు.
అవేమీ ఉత్తుత్తి బెదిరింపులు కావు. 1990 జనవరి 15న ఎంఎల్ భాన్ అనే ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేశారు. అదే రోజు మరో ప్రభుత్వ ఉద్యోగి బల్దేవ్ రాజ్ దత్ కిడ్నాప్‌కు గురయ్యారు. నాలుగు రోజుల తరువాత జనవరి 19న ఆయన మృతదేహం లభ్యమైంది" అంటూ టికూ రాశారు.
మరోపక్క, కశ్మీర్ ప్రభుత్వంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం రాజీనామా చేయడంతో జగ్మోహన్ రెండోసారి గవర్నర్‌గా వచ్చారు. ఆయన జనవరి 19న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో వలసలు ప్రారంభమయ్యాయి.
రచయిత అశోక్ కుమార్ పాండే, కశ్మీర్ చరిత్ర, రాజకీయాలు, సామాజిక జీవితంపై రాసిన పుస్తకం 'కశ్మీర్‌నామా'లో జనవరి 19 నాటి నేపథ్యాన్ని హైలైట్ చేశారు.
"కశ్మీరీల ఆక్రమణకు అనేక కోణాలు ఉన్నాయి. ఆ సమయంలో కశ్మీర్ రాజకీయాలపై దిల్లీ నియంత్రణ, అవినీతి, ఆర్థికంగా వెనుకబాటుతనం కశ్మీరీ యువతలో అశాంతికి ఆజ్యం పోశాయి. కశ్మీరీ ప్రజల భావప్రకటనా స్వేచ్ఛకు కూడా భంగం కలగడంతో, వారి కోపం మొదట నినాదాలుగా, తరువాత సాయుధ పోరాటంగా మారింది.
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో ఎక్కువ భాగాన్ని జమ్మూ ప్రాంతంలోనే వినియోగించారు. 1977లో ఇదిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు, కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూనే ఉన్నారు. ఫలితంగా, రాజకీయ వ్యవహారాలపై ఉన్న కోపం భారత వ్యతిరేక ఆగ్రహంగా మారింది. స్వతంత్ర కశ్మీర్ సమర్థకులకు, భారత వ్యతిరేక శక్తులకు ఈ ఉద్యమం అనుకూలించిందని చెప్పవచ్చు" అంటూ అశోక్ కుమార్ పాండే వివరించారు.
ఇంతలో, 1987 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చోటుచేసుకున్న అవకతవకలు ఈ ఉద్యమానికి ఆజ్యం పోశాయి.
1987 ఎన్నికల్లో ఏం జరిగింది?
1987లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. అయితే, 'ముస్లిం యునైటెడ్ ఫ్రంట్' అనే కొత్త రాజకీయ పార్టీ వారికి సవాలుగా నిలిచింది.
ముస్లిం యునైటెడ్ ఫ్రంట్‌లో సయ్యద్ అలీ షా గిలానీ 'జమాత్-ఎ-ఇస్లామీ', అబ్దుల్ ఘనీ లోన్ 'పీపుల్స్ లీగ్', మిర్వాయిజ్ మొహమ్మద్ ఉమర్ ఫరూక్ 'అవామీ యాక్షన్ కమిటీ' ఉన్నాయి.
ఇవి కాకుండా, ఉమ్మత్-ఎ-ఇస్లామీ, జమీయత్-ఎ-అల్లా-ఎ-హదీస్, అంజుమాన్-తహ్ఫుజ్-ఉల్-ఇస్లాం, ఇత్తిహాద్-ఉల్-ముస్లిమిన్, ముస్లిం ఎంప్లాయీస్ యూనియన్ లాంటి చిన్న చిన్న గ్రూపులు కూడా ఇందులో కలిశాయి.
అశోక్ కుమార్ పాండే, తన పుస్తకం 'కశ్మీర్ అవుర్ కశ్మీరీ పండిట్స్: బస్నే అవుర్ బిఖర్నే కే 1,500 సాల్'లో ఇలా రాశారు.
"కశ్మీరీ సమాజంలో, రాజకీయాల్లో ఉన్న అసంతృప్తికి ఒక ఉదాహరణ ఈ కొత్త రాజకీయ పార్టీ. ఇస్లాంను సమర్థించేవాళ్లకు, ప్రజాభిప్రాయాలను సమర్థించేవాళ్లకు ఇదొక గొడుగు సంస్థగా మారింది.
పెద్ద సంఖ్యలో ప్రజలు ర్యాలీలు చేపట్టారు. అవినీతిని అంతం చేయడం, లాభాలు, స్వతంత్ర పాలన గురించి ఈ ఫ్రంట్ హోరెత్తించింది. వారి దుస్థితికి కారణమైన వారిని శిక్షిస్తామని వాగ్దానాలు చేసింది." అని రాశారు.
అప్పటికి కశ్మీర్‌లో నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. అందరికీ ఉద్యోగాలు, పరిశ్రమలు, ఉపాధి గురించి ఈ పార్టీ మాట్లాడింది.
ఈ ఫ్రంట్‌ను అధికారానికి దూరంగా ఉంచేందుకు ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.
ఆ సమయంలో కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న ఖేమ్‌లత వుఖ్లు బీబీసీతో మాట్లాడుతూ, "1987 ఎన్నికలలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయన్న సంగతి నాకు గుర్తుంది. ఓడిపోయిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారు. దాంతో, ఎన్నికలపై, ప్రజాస్వామ్య ప్రక్రియలపై సామాన్య ప్రజలకు విశ్వాసం పోయింది" అని అన్నారు.
ఎంతోమంది చదువుకున్నవారు, నిరుద్యోగ యువత జేకేఎల్ఎఫ్ (జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్) వైపు ఆకర్షితులయ్యారు. వారిలో చాలా మందిని నియంత్రణ రేఖ దాటించి అవతలివైపుకు పంపారు.

ఫొటో సోర్స్, Getty Images
జేకేఎల్ఎఫ్,'క్విట్ కశ్మీర్' నినాదం
'అండర్‌స్టాండింగ్ కశ్మీర్ అండ్ కశ్మీరీ' పుస్తకంలో జేకేఎల్ఎఫ్‌ను పరిచయం చేస్తూ క్రిస్టోఫర్ స్నయిడన్ ఈ విధంగా రాశారు.
"అది 80వ దశకంలో రెండవ సగం. భారతదేశంలో కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం రాజకీయ ఆందోళనలు, నిరసనలు తీవ్రమవుతున్న సమయం. అప్పటివరకు జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారడం మొదలైంది. కశ్మీర్ స్వతంత్రం డిమాండ్‌కు ఈ హింస తోడయ్యింది.
1987లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. కశ్మీర్‌లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గెలుస్తుందని ఆశించారు. అయితే, ఎన్నికల ఫలితాలు ఈ పార్టీని, వేలాది మంది కశ్మీరీ యువతను నిరాశలో ముంచాయి. విద్యావంతులు కూడా ఎన్నికల ప్రక్రియపై నమ్మకం కోల్పోయారు.
వీరిలో కొంతమంది యువత పాకిస్తాన్ వెళ్లిపోయారు. భారతదేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం ప్రారంభించారు.
దాంతో, పాకిస్తాన్‌కు చెందిన 'ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు ఒక అవకాశం దొరికింది. ఈ యువత ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఐఎస్ఐ, ఈ యువకులకు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్‌లో శిక్షణ ఇచ్చింది. భారత సైన్యంతో పోరాడటానికి వారికి ఆయుధాలను ఇచ్చింది.
శిక్షణ పొందిన వారంతా కశ్మీర్‌లోకి ప్రవేశించారు. దాంతో శాంతికి భంగం కలిగించే ప్రక్రియ ప్రారంభమైంది.
1988లో భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
ఒక ఏడాది తరువాత 1989 జూలైలో శ్రీనగర్‌లోని టెలిగ్రాఫ్ కార్యాలయంపై తీవ్రవాదులు బాంబు దాడి చేశారు.
మరో సంవత్సరం తరువాత, కశ్మీర్‌కు చెందిన మత నాయకుడు మిర్వాయిజ్ మౌల్వీ మహమ్మద్ ఉమర్ ఫరూక్ హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలకు సుమారు 20 వేల మంది కశ్మీరీలు హాజరయ్యారు.
పరిస్థితులు అదుపు తప్పడంతో, భారత భద్రతా దళాలు ప్రజలపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 20 మంది కశ్మీరీలు మృతిచెందారు. ఇది, కశ్మీర్‌లో రక్తపాతంతో కూడిన అధ్యాయానికి తెరతీసింది."
జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) ఈ హింసాత్మక ఉద్యమానికి నాయకత్వం వహించింది. అంతేకాకుండా, భారతదేశం, పాకిస్తాన్ నుంచి కూడా విముక్తి కావాలని డిమాండ్ చేసింది.
1965లో కశ్మీర్ స్వతంత్రాన్ని కాంక్షిస్తూ అమానుల్లా ఖాన్, మక్బూల్ బట్ వంటి యువత, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో 'ప్లెబిసైట్ ఫ్రంట్' అనే పార్టీని స్థాపించారు.
భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్‌ను ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ, ఈ పార్టీ ఒక సాయుధ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. అదే జమ్మూ, కశ్మీర్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్). అల్జీరియాలో లాగా సాయుధ పోరాటం ద్వారానే కశ్మీర్‌కు భారతదేశం నుంచి స్వతంత్రం లభిస్తుందన్నది వారి విశ్వాసం అని క్రిస్టోఫర్ స్నయిడన్ రాశారు.
1989లో జేకేఎల్ఎఫ్ 'క్విట్ కశ్మీర్' నినాదాన్ని ప్రారంభించిందని అశోక్ పాండే 'కశ్మీర్‌నామా'లో రాశారు.
"పరిస్థితిని మెరుగుపరిచేందుకు, పాకిస్తాన్ నుంచి తిరిగి వస్తుండగా అరెస్టు చేసిన 72 మందిని ప్రభుత్వం విడుదల చేసింది. వీరంతా తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నవారే.
కానీ, అదేం పనిచేయలేదు. మరుసటి రోజు సీపీఆర్ఎఫ్ క్యాంపుపై దాడి జరిగింది. ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
1989 ఆగస్టు 21న శ్రీనగర్‌లో మొట్టమొదటి రాజకీయ హత్య జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ బ్లాక్ ప్రెసిడెంట్ ముహమ్మద్ యూసుఫ్ హల్వాయ్‌ని కాల్చి చంపారు.
సెప్టెంబర్ 14న హబ్బా కడల్ లోయలో ప్రముఖ హిందూ నాయకుడు, న్యాయవాది అయిన టికారామ్ టిప్లుని హత్య చేశారు. మక్బూల్ బట్‌ను ఉరితీసిన న్యాయమూర్తి నీలకంఠ్ గంజు నవంబర్ 4న హత్యకు గురయ్యారు"
జేకేఎల్ఎఫ్ ఈ హత్యలకు బాధ్యత వహించిందని అశోక్ కుమార్ పాండే ఈ పుస్తకంలో రాశారు.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 8న అప్పటి కేంద్ర హోంమంత్రి మహ్మద్ సయీద్ కుమార్తె డాక్టర్ రూబియా సయీద్‌ను కిడ్నాప్ చేశారు. ఆమెను విడిపించడానికి అయిదుగురు తీవ్రవాదులను జైలు నుంచి విడుదల చేశారు. తీవ్రవాదుల డిమాండ్లకు తలవంచడానికి ఫరూక్ అబ్దుల్లా వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది.
ఈ ఘటన తర్వాత తీవ్రవాదుల నైతిక స్థైర్యం పెరిగింది. దాంతో, పలువురిని జైలు నుంచి విడిపించేందుకు కిడ్నాప్‌లకు పాల్పడిన ఘటనలెన్నో జరిగాయి.
పరిస్థితి చేయి దాటిపోవడంతో, దాన్ని నియంత్రించే బాధ్యతను గవర్నర్ జగ్మోహన్‌కు అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
జగ్మోహన్ కశ్మీర్‌ను సేవ్ చేయగలిగారా?
జగ్మోహన్ మొదటిసారిగా 1984 ఏప్రిల్‌లో కశ్మీర్‌కు గవర్నర్‌గా వచ్చారు. కశ్మీరీలకు ఆయన బాగా తెలిసిన వ్యక్తి.
అయితే, "కశ్మీర్ లోయలో ఆయనకు హిందూ అనుకూలురుగా, ముస్లిం వ్యతిరేకిగా ఇమేజ్ ఉంది" అని అశోక్ కుమార్ పాండే 'కశ్మీర్‌నామా'లో రాశారు.
"జగ్మోహన్ గవర్నర్ అవడంతో కశ్మీర్‌కు చెందిన ముస్లిం (ముఫ్తీ మహమ్మద్ సయీద్)ను హోంమంత్రిగా చేసి కశ్మీరీల విశ్వాసాన్ని చూరగొనాలనే ప్రయత్నం విఫలమైంది.
జనవరి 18న, పారామిలటరీ బలగాలు కశ్మీర్‌లో ఇంటింటికీ వెళ్లి శోధించే ఆపరేషన్‌ను ప్రారంభించాయి. జనవరి 19, జమ్మూలో జగ్మోహన్ బాధ్యతలు స్వీకరించిన రోజు, సీపీఆర్ఎఫ్ దళం సుమారు 300 మంది యువకులను అదుపులోకి తీసుకుంది."
జనవరి 20న జగ్మోహన్ శ్రీనగర్ చేరుకున్నప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. వారిలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు.
"మర్నాడు మళ్లీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దాంతో, ఫైరింగ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఘటనలో గావక్‌దల్‌లో 50 మందికి పైగా మరణించారు. అధికారికంగా 35 మంది చనిపోయినట్లు తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక సంఘటనలో ఇంతమంది చనిపోవడం అదే తొలిసారి" అని అశోక్ కుమార్ పాండే రాశారు.
తన ఆదేశాల మేరకే గావక్‌దల్‌లో ఫైరింగ్ జరిగిందని జగ్మోహన్, తన పుస్తకం 'మై ఫ్రోజెన్ టర్బులెన్స్ ఇన్ కశ్మీర్'లో అంగీకరించారు.
అశోక్ కుమార్ పాండే అలాంటి మరో ఘటనను తన పుస్తకంలో వివరించారు.
"1990 మే 21న మిర్వాయిజ్ హత్యకు గురయ్యారు. ఆయన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అప్పటి చీఫ్ సెక్రటరీ ఆర్ ఠక్కర్, ఆ అంత్యక్రియలకు జగ్మోహన్‌ను స్వయంగా హాజరు కమ్మని లేదా ఏవరైనా సీనియర్ అధికారిని పంపించి మిర్వాయిజ్‌పై పూలమాలలు వేయించని చెప్పారు. కానీ జగ్మోహన్ అంగీకరించలేదు."
మిర్వాయిజ్ మృతదేహం ఊరేగింపు మార్గం, ఊరేగింపుపై ఆంక్షలకు సంబంధించి కొన్ని గందరగోళ సూచనలను ఇచ్చారు జగ్మోహన్. వాటిని అనుసరించి, పారామిలటరీ బలగాలు, ఊరేగింపు చివరి స్టాప్‌కు చేరుతుండగా కాల్పులు జరిపాయి.
"అధికారిక లెక్కల ప్రకారం, ఈ కాల్పుల్లో 27 మంది మరణించారు. మొత్తం 47 మంది చనిపోయారని భారత మీడియా పేర్కొంది. అయితే, బీబీసీ ప్రకారం ఈ సంఖ్య 100. కొన్ని బుల్లెట్లు మిర్వాయిజ్ శరీరానికి కూడా తగిలాయి"
అశోక్ కుమార్ పాండే 'కశ్మీర్‌నామా'లో మరిన్ని విషయాలను ఇలా వివరించారు.
"జగ్మోహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో కశ్మీర్ లోయలో హిందువులు, ముస్లింల మధ్య శత్రుత్వం పెరిగింది. ముస్లింలను చంపడానికే జగ్మోహన్‌ను పంపినట్లు కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. దురదృష్టవశాత్తు, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాయి.
మిర్వాయిజ్ అంత్యక్రియల్లో కాల్పులు, తరువాత నిర్వహించిన శోధన ఆపరేషన్ చాలామందికి అసహనాన్ని కలిగించింది. కశ్మీర్ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకునేందుకు పదివేలకు పైగా ప్రజలు బోర్డరు దాటి వెళ్లి శిక్షణ పొందారు.
జగ్మోహన్ హయాంలో మానవ హక్కుల కార్యకర్తలపై దుష్ప్రచారాలు చేయడమే కాకుండా, హైకోర్టు పనితీరును ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. తీవ్రవాదులు ఈ పరిస్థితులను పూర్తిగా ఉపయోగించుకున్నారు. ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలను రేకెత్తించారు."
"కశ్మీర్ స్వతంత్రం పట్ల మరుగుపడిన ప్రజల మద్దతు జనవరి 19 తరువాత బయటకు వచ్చింది" అని ఎంజే అక్బర్ రాసిన 'కశ్మీర్ బిహైండ్ ద వాల్' పుస్తకాన్ని ప్రస్తావిస్తూ అశోక్ పాండే రాశారు.
అయితే, తాను తీసుకున్న కఠిన చర్యల వల్లనే కశ్మీర్ విడిపోకుండా కాపాడగలిగామని జగ్మోహన్ అంటారు.
సీనియర్ జర్నలిస్టు కల్యాణి శంకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగ్మోహన్ మాట్లాడుతూ, "తాను కశ్మీర్ చేరుకునే సమయానికి అక్కడ ఒక ప్రభుత్వం అంటూ ఏమీ లేదని, తీవ్రవాదుల పాలన మాత్రమే ఉండేదని" సమర్థించుకున్నారు.
"1989లో అఫ్గాన్ యుద్ధం ముగిసింది. ఐఎస్‌ఐ, ముజాహిదీన్లందరినీ కశ్మీర్‌కు పంపింది. వారి దగ్గర అన్ని రకాల ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. ఐఎస్ఐ నుండి ఆర్థిక సహకారం ఉంది. అఫ్గానిస్తాన్‌లో గెరిల్లా యుద్ధం చేసిన అనుభవం ఉంది. ఐఎస్ఐ, వారికి అన్నిరకాలుగా మద్దతు ఇచ్చింది. శిక్షణ, ఆయుధాలు ఇచ్చింది. భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడమని, జిహాద్ చేయాలని ప్రోత్సహిస్తూ ఇస్లామిక్ ఉన్మాదాన్ని పెంచింది. ఇదంతా రికార్డులో ఉంది.
అఫ్గాన్ యుద్ధం చూసి ఏమేమి నేర్చుకున్నానో, అవన్నీ ఇక్కడ కశ్మీర్‌లో ప్రయత్నించాను. గవర్నర్‌గా నా మొదటి పదవీకాలం ముగిసినప్పుడే, ఐఎస్ఐ ఆటలు ఆడుతోందని నేను హెచ్చరించాను. కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ చురుకుగా మారుతున్నాయని కూడా చెప్పాను. తరువాత, చాలా ఆలస్యం అయిపోతుందని లేఖ రాసి మరీ హెచ్చరించాను. కానీ, నా పదవీకాలం ముగియడంతో నేను అక్కడి నుంచి నిష్క్రమించక తప్పలేదు.
అప్పుడు కశ్మీర్‌లో తీవ్రవాదం ఉధృతంగా ఉంది. సుమారు 600 హింసాత్మక సంఘటనలు జరిగాయి. రూబియా సయీద్‌ని కిడ్నాప్ చేశారు. చాలా మంది ప్రముఖ కశ్మీరీ పండిట్లను చంపేశారు. భారత ప్రభుత్వంతో పనిచేస్తున్న వారందరినీ లక్ష్యంగా చేసుకున్నారు. అలాంటి పరిస్థితిలో నన్ను మళ్లీ అక్కడికి పంపారు. నేను పరిస్థితిని చక్కదిద్దగలనని ఆశించారు" అంటూ జగ్మోహన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
"1990, జనవరి 26, శుక్రవారం నాడు ప్రార్థన తరువాత స్వతంత్రం ప్రకటించడానికి ప్రజలు ఈద్గా వద్ద గుమిగూడాలని ప్లాన్ చేశారు. వారిని ఆపడమే నా తక్షణ కర్తవ్యం. ఆ డ్రామా జరగకుండా చూశాను. ఆ విధంగా కశ్మీర్‌ను కాపాడాను" అని జగ్మోహన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'కశ్మీరీ పండిట్ల కోసం ఎవరూ ఏమీ చేయలేదు'
కశ్మీర్ విడిపోకుండా ఆపగలిగాను కానీ, పండిట్లు పారిపోకుండా ఆపలేకపోయానని జగ్మోహన్ అన్నారు.
ఈ ఘర్షణల తరువాత, కశ్మీర్ లోయలో నివసిస్తున్న 3.5 లక్షల మంది కశ్మీరీ పండిట్లలో చాలామంది తమ స్వస్థలాలను వదిలి దేశంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు.
లక్ష మందికి పైగా పండిట్లు కశ్మీర్ లోయను విడిచిపెట్టినట్టు ఒక అంచనా.
జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదం చెలరేగినప్పటి నుంచి 1990ల వరకు కనీసం 399 మంది కశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారని, 1990ల తరువాత 20 సంవత్సరాలలో మొత్తం 650 మంది కశ్మీరీలు ప్రాణాలు కోల్పోయారని కశ్మీరీ పండిట్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు సంజయ్ టికూ చెప్పారు.
1990లోనే 302 మంది కశ్మీరీ పండిట్లను హత్య చేశారని ఆయన అన్నారు.
1989 నుంచి 2004 మధ్య కశ్మీర్‌లో 219 మంది పండిట్లు హత్యకు గురయినట్టు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం 2010లో అసెంబ్లీకి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, ఆ సమయంలో కశ్మీర్‌లో 38,119 పండిట్ కుటుంబాలు రిజిస్టర్‌లో ఉన్నాయి. వాటిలో 24,202 కుటుంబాలు వలస వెళ్లాయి.
టికూ కశ్మీర్ లోయలోనే నివసిస్తున్నారు. అక్కడ ఇప్పటికీ మొత్తం 3,456 మంది కశ్మీరీ పండిట్లు (808 కుటుంబాలు) నివసిస్తున్నారని, ఇప్పటివరకు ప్రభుత్వం వారికోసం ఏమీ చేయలేదని టికూ అన్నారు.
"గత ఏడేళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారు? గత బడ్జెట్‌లో పండిట్ల పునరావాసం కోసం ఎన్ని నిధులు కేటాయించారు?" అని టికూ, బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
అహ్మదాబాద్‌లో నివసిస్తున్న కశ్మీరీ పండిట్ ఏకే కౌల్ కూడా ఇదే ఆరోపణ చేశారు.
"బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ రాజకీయాల ప్రయోజనాల కోసం కశ్మీరీ పండిట్ల సమస్యను వాడుకున్నాయి. నేను గుజరాత్ ప్రభుత్వానికి చాలా ప్రజెంటేషన్లు ఇచ్చాను. రాష్ట్రంలో మాకు భూమి లేదా మరేదైనా సహాయం చేయమని వారిని అడిగాను. కాని గుజరాత్ ప్రభుత్వం మా కోసం ఎప్పుడూ ఏమీ చేయలేదు.
కాంగ్రెస్ కూడా మమ్మల్ని ఉపయోగించుకుంది. బీజేపీ అదే చేసింది. ఇప్పటికీ మమ్మల్ని వాడుకుంటోంది. మోదీ ప్రభుత్వం కూడా కశ్మీరీ పండిట్ల పేరును వాడుకుంటోంది. గుజరాత్ ప్రభుత్వం సహాయం చేయలేదు. మోదీ ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు రాసినా, ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు" అని కౌల్, బీబీసీతో అన్నారు.
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో కశ్మీరీ పండిట్లకు మాత్రమే కాకుండా కశ్మీర్ ప్రజలందరికీ అన్యాయం జరిగిందని అశోక్ కుమార్ పాండే అభిప్రాయపడ్డారు.
కశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ రెండూ అసంతృప్తిగా ఉన్నాయని ఆయన తన పుస్తకంలో రాశారు.
"తమకు అన్యాయం జరిగిందని కశ్మీరీ ముస్లింలు భావిస్తున్నారు. ఎందుకంటే, వాగ్దానం చేసినట్లు ప్రజాభిప్రాయ సేకరణ ఎప్పుడూ జరగలేదు, పైగా ప్రజాస్వామ్యాన్ని నియంత్రిస్తున్నారన్నది వారి వాదన. జీవితాంతం తనకు అన్యాయం జరిగిందని షేక్ అబ్దుల్లా భావించారు. కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం ఎగిరినప్పటికీ నమ్మడానికి లేదని ఫరూక్ అబ్దుల్లా భావించారు.
కశ్మీర్ విడిచిపెట్టిన పండిట్లు, తాము భారతదేశం పక్షం వహిస్తున్నామని భావిస్తున్నారు. కానీ, 1990లో వారికి ఎలాంటి రక్షణా ఇవ్వలేదు. కశ్మీర్‌లోనే ఉండిపోయినవారు, ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందని భావిస్తున్నారు" అని అశోక్ కుమార్ పాండే రాశారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో దారుణమైన కేసుల్లో ఒకటి.. 100 మంది మహిళలను, శవాలను రేప్ చేసిన వ్యక్తి 30 ఏళ్ల తర్వాత పోలీసులకు ఎలా చిక్కాడు?
- 10th క్లాస్, బీటెక్ ఫెయిల్ అయ్యారా? ఎక్కడా ఉద్యోగం దొరకట్లేదా? ఈ ట్రైనింగ్‌తో జాబ్ గ్యారెంటీ..
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లక్ష్య సేన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడిన భారత షట్లర్
- శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం.. రేపు బోధన్ బంద్‌కు బీజేపీ పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














