#TheKashmirFiles: దశాబ్దాలుగా సాగుతున్న అన్యాయంపై కశ్మీర్‌లోని పండిట్‌లు ఏమంటున్నారు?

ది కశ్మీరీ ఫైల్స్

ఫొటో సోర్స్, THE KASHMIR FILES

ఫొటో క్యాప్షన్, ది కశ్మీరీ ఫైల్స్
    • రచయిత, మోహిత్ కాంధారి
    • హోదా, బీబీసీ కోసం

దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైన తర్వాత కశ్మీర్‌లోని నగ్రోటా సమీపంలో ఉన్న జగ్తీ టౌన్‌షిప్‌లో నివసించే కశ్మీరీ పండిట్ కుటుంబాలు మరోసారి 'ఘర్ వాపసి' కలలు కనడం ప్రారంభించాయి.

2011లో ఈ జగ్తీ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇందులో సుమారు 4 వేల నిర్వాసిత కుటుంబాలు నివసిస్తున్నాయి.

విడుదలైన తర్వాత తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా తాము తిరిగి స్వస్థలాలకు తీసుకెళ్లే ప్రయత్నాలను సులభతరం చేస్తుందా లేక అడ్డంకులు సృష్టిస్తుందా అని వారంతా ఆందోళన చెందుతున్నారు.

మూడు దశాబ్ధాలు గడిచినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కశ్మీరీ హిందువులను స్వస్థలాలకు చేర్చడంలో విఫలమయ్యాయి.

జగ్తి టౌన్‌షిప్‌లో నివసిస్తున్న నిర్వాసితులందరూ ఈ సినిమాను మెచ్చుకుంటూనే, 1990 నుండి ఇప్పటి వరకు ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయని, కానీ తమ జీవితంలో మార్పు రాలేదని అంటున్నారు.

ది కశ్మీరీ ఫైల్స్

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC

ఫొటో క్యాప్షన్, సునీల్ పండిత

చాలా సినిమాలు తీశారు కానీ...

జగ్తీ క్యాంపులో నివసిస్తున్న సామాజిక కార్యకర్త సునీల్ పండిత బీబీసీతో మాట్లాడారు.

''మా సమస్యపై మరొక సినిమా వచ్చింది. కానీ, 1990 నుండి ఇప్పటి వరకు మమ్మల్ని 'పొలిటికల్ టిష్యూ పేపర్' లాగా ప్రతిచోటా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది'' అన్నారు.

"ప్రభుత్వ అధికారులు, మీడియా, రాజకీయ నాయకులు...ఇలా అందరూ మమ్మల్ని వాడుకున్నారు. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? మాకు శాశ్వత పరిష్కారం కావాలి, మా ఇళ్లకు తిరిగి వెళ్లాలనుకుంటున్నాం. అది తప్ప మాకు మరేమీ వద్దు" అని ఆయన అన్నారు.

''1990 నుంచి నేటి వరకు కశ్మీర్‌ ప్రజలకు, మాకు మధ్య దూరాన్ని తగ్గించేందుకు పౌర సమాజం ఎంతో శ్రమించింది. అయితే, ఈ సినిమా వల్ల ఆ దూరాలు మళ్లీ పెరిగి పోయాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ది కశ్మీరీ ఫైల్స్

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC

ఫొటో క్యాప్షన్, కశ్మీరీ పండిట్ల కోసం జమ్మూలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రం

'జమ్మూలో కూడా బెదిరింపులు వస్తున్నాయి'

ప్రస్తుతం కశ్మీర్‌లో నివసిస్తున్న కశ్మీరీ పండిట్‌ల భయాలను గుర్తు చేస్తూ ''కశ్మీర్ లోయలో ప్రస్తుతం కనీసం 5000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పుడు వారంతా భయ పడుతున్నారు. తమకు ఏదైనా జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా చూడాలి'' అని సునీల్ పండిత అన్నారు.

జమ్మూలో తనకు కూడా బెదిరింపులు వస్తున్నాయని సునీల్ పండిత వెల్లడించారు.

''1990లో మేం వలస వచ్చినప్పుడు దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని నేను భారత ప్రభుత్వాన్ని అడగాలనుకున్నా. ఆ సమయంలో వారు మమ్మల్ని ఎందుకు రక్షించలేదు'' అని ఆయన ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, కశ్మీరీ పండిట్లు: "అత్యంత దారుణ పరిస్థితుల నడుమ బతుకుతున్నాం’’

అప్పట్లో మా గ్రామానికి ఎక్కడి నుంచో 30 నుంచి 50 వేలమంది వచ్చేవారు. కశ్మీర్‌కు స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేసేవారు. కానీ అక్కడ ప్రభుత్వమే లేదు. ఇది కచ్చితంగా భారత ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు.

''సరిహద్దు అవతల నుంచి ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు భారత సరిహద్దుల్లోకి ఎలా వచ్చాయి? ప్రభుత్వం ఎన్నిమాటలు చెప్పినా 32 ఏళ్లుగా మాకు గూడు దొరకలేదు. ఇలాంటి సినిమాలు తీసినా కూడా కశ్మీరీ పండిట్లకు ఇల్లు దొరకదని, ఇది ప్రజల మధ్య దూరాన్ని మాత్రమే పెంచుతుంది తప్ప మరేమీ లేదు" అని ఆయన అన్నారు.

ది కశ్మీరీ ఫైల్స్

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC

ఫొటో క్యాప్షన్, అంజలీ రైనా

తరగని ఆశలు

12 సంవత్సరాల వయస్సులో అంజలి రైనా తన కుటుంబంతో కశ్మీర్ లోయ నుండి జమ్మూకి వచ్చారు. ఒక టెంటులాంటి ఇంట్లో ఉంటూనే ఆమె తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు.

మండే ఎండలో పగటిపూట 2 గంటలకు తరగతులు నిర్వహించేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. మేం ఇలాంటి జీవితాన్ని ఎందుకు గడపాల్సి వచ్చిందో, తాము ఏం తప్పు చేశామో తెలియదని ఆమె అన్నారు.

32 ఏళ్ల తర్వాత మళ్లీ మాకు ఆశలు చిగురిస్తున్నాయని ఆమె చెప్పారు.

ఈ ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించింది కాబట్టి, తాము తిరిగి తమ ఇంటికి వెళ్లిపోవచ్చని, కాస్త సమయం పట్టినా ఇది ఎప్పటికైనా జరుగుతుందని ఆశిస్తున్నట్లు అంజలి చెప్పారు.

'ది కశ్మీర్ ఫైల్స్' వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమని, పండిట్లు అక్కడి నుంచి బలవంతంగా ఎలా బయటకు రావాల్సి వచ్చిందో, దానికి కారణాలేంటో ఈ సినిమాలో చెప్పారని ఆమె అన్నారు.

''మాకు జరిగిన అన్యాయాలను ఇప్పటి వరకు ప్రభుత్వాలు కప్పిపుచ్చాయి. నిజం ప్రపంచానికి తెలియనివ్వలేదు. మా గొంతులను నొక్కేశారు'' అన్నారు అంజలి.

''ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉండటం మాకు ఇష్టం లేదు. మా సొంత ప్రాంతానికి వెళ్లిపోవాలి'' అని ఆమె తేల్చి చెప్పారు.

తాను ఒక్కసారి మాత్రమే స్వస్థలానికి వెళ్లానని, తన ఇంటిని ఎవరో ఆక్రమించినట్లు గుర్తించానని ఆమె వెల్లడించారు.

ది కశ్మీరీ ఫైల్స్

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC

ఫొటో క్యాప్షన్, ప్యారేలాల్ పండిత

'సినిమా సగం కథే చెప్పింది'

'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా కశ్మీరీ పండిట్ల పూర్తి కథను చూపించ లేదని జగ్తీ టౌన్‌షిప్‌‌లో తన కుటుంబంతో నివసిస్తున్న ప్యారేలాల్ పండిత అన్నారు.

కశ్మీరీ పండిట్‌లతో పాటు, కశ్మీర్‌లోని ముస్లిం, సిక్కు కమ్యూనిటీకి చెందిన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని, కానీ వారి గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేదని అన్నారు.

కశ్మీరీలను వారి ప్రాంతం నుంచి తరిమికొట్టకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

''బాధితుల దగ్గరకు వెళ్లి వాళ్ల కష్టాలు వినకుండా దిల్లీలో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు'' అని పండిత అన్నారు.

వీడియో క్యాప్షన్, కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్ళను కాపాడుకోవడం ఎలా?

కశ్మీరీ పండిట్లపై దౌర్జన్యాలు జరిగాయని, అందుకే తాము అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని కశ్మీరీ నిర్వాసితుడు షాదీ లాల్ పండిత బీబీసీతో అన్నారు.

''మునుపటి ప్రభుత్వాలు కశ్మీరీ పండిట్లకు ఏమీ చేయలేదని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అంటోంది. ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే. మీరు కూడా మమ్మల్ని ఉపయోగించుకున్నారు. మాకు ఉద్యోగాలు కావాలని, భద్రత కల్పించాలని ఎన్నాళ్లుగానో కోరుతున్నాం. కానీ మా మాటలు ఎవరూ వినడం లేదు'' అని పండిత అన్నారు.

ది కశ్మీరీ ఫైల్స్

ఫొటో సోర్స్, MOHIT KANDHARI/BBC

ఫొటో క్యాప్షన్, షాదీలాల్ పండిత

ఈ సినిమా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్మించిందని, కశ్మీరీ పండిట్లపై అఘాయిత్యాలు జరిగాయని వాళ్లు ప్రపంచానికి చెప్పదలుచుకున్నారని పండిత అన్నారు.

''1990లో పాకిస్తాన్ మమ్మల్ని నాశనం చేసింది. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదులు కశ్మీర్‌లో నివసిస్తున్న ముస్లింలను వదిలేసి, మమ్మల్ని టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెస్ వల్లే ఇదంతా జరిగిందని బీజేపీ వాళ్లు కొన్నాళ్లుగా చెబుతున్నారు. అప్పట్లో కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో ఎవరైనా అడిగారా? అప్పట్లో కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి బీజేపీ బయటి నుంచి మద్ధతు ఇస్తోంది. మరి అప్పటి ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు కాపాడలేదు'' అని పండిత ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)