నా కొడుకుని వెనక్కు తీసుకురావాలంటే నేనెవరి తలుపు తట్టాలి?: రష్యా సైనికుడి తల్లి ఆవేదన

ఫొటో సోర్స్, Getty Images
''మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు'' - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న సైనికుల తల్లులను ఉద్దేశించి అన్న మాట ఇది.
కానీ.. కొందరు తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, భార్యలు, ప్రియురాళ్లు.. యుక్రెయిన్ వెళ్లిన రష్యా సైన్యంలోని తమ ఆప్తుల కోసం తల్లడిల్లుతున్నారు. ఆ సైనికుల్లో చాలా మందికి తాము యుక్రెయిన్ ఎందుకు వెళుతున్నామో కూడా తెలియదని వీరు చెప్తున్నారు.
ఈ కథనంలోని వ్యక్తుల పేర్లన్నీ మార్చి రాస్తున్నాం.
మరీనా తన మనుమడి నుంచి కబురు అంది వారం రోజులకు పైగా దాటిపోయాక.. ఆమె అందరికీ ఫోన్ చేయటం మొదలుపెట్టింది.
'నేను బెలారుస్-యుక్రెయిన్ సరిహద్దులో ఉన్నాను. త్వరలో ఇంటికి వస్తాను' అని అతడి నుంచి అందిన చివరి సందేశం. ఆ తర్వాతి నుంచీ ఎలాంటి కబురూ, సమాచారం లేదు. దీంతో ఏం ఘోరం జరిగిందోనని ఆమె భయపడుతోంది.
''అతడి మిలటరీ యూనిట్‌కు ఫోన్ చేశాను. అతడు రష్యా నుంచి బయటకు వెళ్లలేదని వాళ్లు చెప్పారు. 'జోక్ చేస్తున్నారా? అతడు బెలారుస్ నుంచి నాతో మాట్లాడాడు. మీ సైనికులు ఎక్కడున్నారో మీకు తెలీదా?' అని అడిగాను. వాళ్లు ఫోన్ పెట్టేశారు. అప్పటి నుంచీ నాతో మాట్లాడటం లేదు'' అని వివరించారు మరీనా.
మరీనా మనుమడు వాస్తవానికి తొలుత నిర్బంధ సైనికుడు (కాన్‌స్క్రిప్ట్). రష్యాలో.. చదువుకోవటం కానీ, పిల్లల సంరక్షణ చూసుకోవటం వంటి మినహాయింపులు లేని 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న యువకులను ప్రతి ఏటా సైన్యంలో చేర్చుకుంటారు. వీరు ఏడాది పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.
నికిత నిర్బంధ సైనికుడిగా ఉన్న తొలి నాళ్లలో.. అతడి వంటి నిర్బంధ సైనికులను కాంట్రాక్టు సైనికులు (కాంట్రాక్టర్) గా చేర్చుకునే ఉద్దేశంతో సైనిక విభాగాల ప్రతినిధులు తమ ప్రాంతానికి వచ్చారని.. కాంట్రాక్టరుగా చేరితే ''నువ్వు త్వరగా రిటైర్ కావచ్చు. స్థిరమైన జీతం ఉంటుంది. డ్రైవింగ్ నేర్చుకోవచ్చు'' అని చెప్పి నికితను ఒప్పించారని మరీనా తెలిపారు. రష్యా సైన్యంలోని జూనియర్ సైనికుల్లో అత్యధికంగా ఇలాంటి కాంట్రాక్టర్లే ఉంటారు.
నికిత ఒక సైనిక విభాగంలో డ్రైవర్‌గా చేరాడు. కానీ అతడి సంపాదన సౌకర్యవంతమైన జీవితానికి సరిపోలేదు. రష్యా కరెన్సీ రూబుల్ విలువ పతనం కావటానికి ముందు అతడి నెల వారీ జీతం 18,000 రూబుళ్లు. అంటే 240 అమెరికా డాలర్లు. భారత కరెన్సీలో సుమారు 18,000 రూపాయలు.
ఈ జీతం.. రష్యా గ్రామీణ ప్రాంతంలో సాదాసీదాగా బతకు బండి లాగటానికి సరిపోతుంది. అయితే.. తన యూనిఫాంకు, పెట్రోల్‌కు తన జీతం నుంచే చెల్లించాల్సి ఉంటుందని నికిత తన నానమ్మకు చెప్పాడు. అతడికి బారక్‌లలో ఉచిత బస ఉంది కానీ.. గడ్డకట్టే చలిని తట్టుకోలేకపోయేవాడు. బారక్‌లను వేడి చేయటం కానీ, వేడి నీరు కానీ లేకపోవటంతో అద్దె చెల్లిస్తూ వేరే ప్రాంతంలో ఉండేవాడని ఆమె వివరించారు.
నికిత ఎదుర్కొన్న పరిస్థితులే రష్యా సైనికులకు సర్వసాధారణంగా ఉంటాయా అనేది నిర్ధారించటం కష్టం. కానీ.. రష్యా యువత సైన్యంలో నిర్బంధంగా చేరకుండా ఉండటానికి లొసుగులను వెదికిపెట్టే అనేక కంపెనీలు.. రష్యాలో సైన్యాన్ని ఆకర్షణీయమైన అవకాశంగా పరిగణించరని చెప్తున్నాయి.
నికిత తాను యుక్రెయిన్-బెలారుస్ సరిహద్దుకు 'కాపలా కాయటానికి' వెళుతున్నానని ఫిబ్రవరి మధ్యలో తన నానమ్మతో చెప్పాడు. తాము త్వరలోనే ఇంటికి తిరిగివస్తామని కూడా తాను విన్నట్లు చెప్పాడు.
రష్యాలో ప్రభుత్వ సెలవు రోజైన ఫిబ్రవరి 23న.. తాను ఒక సంగీత కచేరీకి వచ్చానని నికిత తన నానమ్మకు మెసేజ్ పంపించాడు. అదే అతడి నుంచి వచ్చిన చివరి సమాచారం.
యుక్రెయిన్‌లో యుద్ధానికి తనను పంపిస్తారనే విషయం తన మనవడికి తెలీదని ఆమె బలంగా నమ్ముతున్నారు.
''ఇక్కడ డ్రిల్స్ చేస్తున్నాం. ఎక్కువగా డ్రిల్స్ చేస్తున్నాం. త్వరలోనే ఇంటికి వస్తాం'' అని అతడు చెప్పాడు. మేం మాట్లాడిన ఇంకా చాలా మంది రష్యా సైనికుల బంధువులు కూడా.. తమ వాళ్లూ ఇలాగే అన్నారని మాతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ సాయుధ బలగాల అధిపతి తన ఫేస్‌బుక్ పేజీలో.. యుద్ధ ఖైదీలంటూ పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసిన తర్వాతే.. తన కొడుకు నికొలాయి యుక్రెయిన్‌లో ఉన్నట్లు తనకు తెలిసిందని గలీనా అనే మరో తల్లి తెలిపారు.
యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో చాలా మంది నిర్బంధ సైనికులేనని.. వారి అనుభవ రాహిత్యానికి, ఏం చేయాలనే దానిపై అవగాహన లేకపోవటానికి అదే కారణం కావచ్చునని.. అమెరికా రక్షణ విభాగం పెంటగన్ గత శుక్రవారం ఒక సమావేశంలో సూచించింది.
అయితే.. తమను యుద్ధానికి కాకుండా కేవలం డ్రిల్స్ కోసమే పంపిస్తున్నారని నిర్బంధ సైనికులు నమ్మటం కొత్తేమీ కాదని తెలుస్తోంది. మరీనా మనుమడు నికిత తరహాలోనే గలీనా కొడుకు నికొలాయ్ కూడా నిర్బంధ సైనికుడిగా మొదలుపెట్టి, కాంట్రాక్టు సైనికుడుగా మారాడు. మేం మాట్లాడిన చాలా మంది కుటుంబాలకు చెందిన యువకులు కూడా ఇలాగే కాంట్రాక్టు సైనికులయ్యారు.
''ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు. మా వాళ్లని బందీలుగా పట్టుకున్నారనే విషయంలో మీడియా మౌనంగా ఉంది. అసలు వాళ్లకి తెలీదేమో'' అంటున్నారు గలీనా.
నికొలాయ్, కొత్తగా ఏర్పడబోయే తన కుటుంబాన్ని పోషించుకోవటానికి గత డిసెంబర్‌లోనే కాంట్రాక్టు సైనికుడిగా చేరాడని, వద్దని తాను ఎంతగా వారించినా వినలేదని అతడి గర్ల్‌ఫ్రెండ్ చెప్తున్నారు. స్థానికంగా గౌరవప్రదమైన వేతనం సంపాదించుకోవటానికి వేరే దారేదీ లేదని అతడి తల్లి తెలిపారు.
''నా కొడుకు తన ఇష్టపూర్వకంగా (యుక్రెయిన్‌కు) వెళ్లలేదు. సర్వసేనాని అతడిని అక్కడికి పంపించారు'' అన్నారామె.
''నిజం చెప్పాలంటే ఇదంతా ఎందుకో, ఏమిటో నాకేమీ అర్థంకావటం లేదు. మా దేశంలో కొంత మంది జనానికి తినటానికి కూడా ఏమీ లేదు. ఈ యుద్ధం ఎందుకో, ఈ సైనిక చర్య ఏమిటో నాకు అర్థంకాదు'' అని వ్యాఖ్యానించారు.
''నా కొడుకును వెనక్కు తీసుకురావాలంటే నేను ఎవరి తలుపు తట్టాలి?'' అని ఆవేదనగా ప్రశ్నించారు.
బీబీసీతో మాట్లాడిన మరో తల్లి కూడా ఇదే నిస్సహాయత వ్యక్తంచేశారు. ఆమె కుమారుడు కూడా కాంట్రాక్టు సైనికుడు. అతడిని కూడా 'డ్రిల్స్' కోసం పంపించారు.
''నా కొడుకు ఎక్కడున్నాడో తెలిస్తే.. నేను వెంటనే అక్కడికి వెళ్లి.. దయ చూపాలని వారిని ప్రాధేయపడతాను'' అన్నారామె.
రష్యాలో సైనికుల తల్లులు.. సైన్యం మోహరింపుల విషయంలో, సైనికుల బాగోగుల విషయంలో గొంతెత్తి మాట్లాడటం ఆది నుంచీ ఉంది. సైనికుల మరణాల సంఖ్యను అధికారులు సక్రమంగా వెల్లడించాలంటూ ఆందోళనలకు కూడా దిగారు.
ముఖ్యంగా.. చెచెన్యా మీద రష్యా చేసిన రెండు యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రష్యా సైనికుల తల్లులు గణనీయమైన పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ.. ఎవరైనా సరే యుక్రెయిన్‌లో సైనిక చర్య గురించి 'బూటకపు' ప్రచారం చేస్తే 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామంటూ గత వారంలో రష్యా ఒక చట్టాన్ని ఆమోదించింది.
యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రభుత్వ మీడియా చేసిన బలమైన ప్రచారం ప్రభావం కూడా రష్యా ప్రజల మీద ఉంది. యుక్రెయిన్‌లో ఆచూకీ తెలీకుండా పోయినట్లు భావిస్తున్న ఒక సైనికుడి సోదరి.. యుక్రెయిన్ మీద దండయాత్రకు సరైన కారణమే ఉండి ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
''ఇప్పుడు మమ్మల్ని ప్రదర్శనలకు పిలుస్తున్నారు. నాకైతే.. వాళ్లు (యుక్రెయిన్) వారి సొంత దేశాన్ని నాశనం చేసుకున్నారని, ఇప్పుడు మరొక దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారని అనిపిస్తోంది'' అన్నారామె.
ఈ ప్రచారాన్ని తన సొంత బలమైన ప్రచారంతో తిప్పికొట్టాలని యుక్రెయిన్ ప్రయత్నించింది. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర మొదలైన మూడో రోజున.. ''మీ వాళ్లను వెదకండి'' అనే పేరుతో ఒక హెల్ప్‌లైన్‌ను ప్రకటించారు. రష్యా యుద్ధ సైనికులు, మృతుల ఫొటోలను టెలిగ్రామ్‌లో ఒక చానల్ ప్రచురిస్తోంది. రష్యా సైనికుల బంధువులు తమను సంప్రదించాలని ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియాలో ఈ భీతావహ ఫొటోలను ప్రచురించటం పట్ల ఉన్న ఆందోళనలపై వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం రాసింది.
''రష్యా తల్లులకు మా సుహృద్భావ సంకేతమిది'' అని యుక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీయ్ అరిస్టోవిచ్ ప్రకటించారు.
యుక్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ మరొక అడుగు ముందుకు వేసి.. ఫేస్‌బుక్ పేజీలో ఒక ప్రకటన చేసింది. రష్యా తల్లులు యుక్రెయిన్ వచ్చి తమ కొడుకులను తీసుకెళ్లాలని అందులో పిలుపునిచ్చింది. అదెలా చేయాలో నిర్దిష్ట మార్గదర్శకాలూ చేసింది.
''మేం యుక్రెయిన్ ప్రజలం.. పుతిన్ ఫాసిస్టులకు విరుద్ధంగా.. తల్లులతోను, బందీలైన వారి కొడుకులతోనూ యుద్ధం చేయం'' అని అందులో పేర్కొన్నారు.
అయితే.. యుక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ఎంతవరకూ న్యాయమనే దాని గురించి మేం మాట్లాడిన.. సైనికుల కుటుంబ సభ్యులెవరికీ ఒక అభిప్రాయం లేదు. ఈ చర్యకు మద్దతు కూడా ఇవ్వటం లేదు.
కానీ.. ఒక మహిళ తన కాబోయే భర్త అయిన ఒక రష్యా సైనికుడితో జరిపిన టెక్ట్స్ మెసేజ్ సంభాషణలో కొంత భాగాన్ని బీబీసీకి చూపించారు. ఆ సైనికుడు.. యుక్రెయిన్ ప్రజలను 'విముక్తం' చేయటానికి తాము ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నామనే రష్యా మాటలను నమ్మటం లేదని ఆ మెసేజ్ చెప్తోంది.
తాను 'కొన్ని దేశాలను చుట్టి రావటానికి' వెళుతున్నానని సదరు సైనికుడు తన ఫియాన్సీతో చెప్పాడు. బహుశా రష్యా పొరుగు దేశమైన మిత్రపక్షం బెలారుస్ గురించి అతడు చెప్తుండవచ్చు. ఆ తర్వాత.. ''రక్షించుకోలేని వారిని రక్షించటానికి వెళుతున్నా, LOL'' అని మెసేజ్ పంపాడు. ''జోక్ చేస్తున్నావా?'' అని ఆమె అడిగితే.. ''లేదు. నేను యుద్ధానికి వెళుతున్నా?'' అని అతడు బదులిచ్చాడు.
రష్యా ఎట్టకేలకు యుక్రెయిన్ దండయాత్రలో చనిపోయిన తమ సైనికుల సంఖ్యను గత వారం ప్రకటించింది. మార్చి 3వ తేదీ నాటికి 498 మంది రష్యా సైనికులు చనిపోయారని, మరో 1,597 మంది గాయపడ్డారని చెప్పింది. కానీ.. 11,000 మందికి పైగా రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ చెప్తోంది. అయితే.. ఈ సంఖ్యను తనిఖీ చేసి నిర్ధారించుకోవటం కష్టం.
ఇవి కూడా చదవండి:
- జంగారెడ్డిగూడెంలో 18 మంది మృతి: ఇవి నాటుసారా కల్తీ మరణాలా? సహజ మరణాలా?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- గ్రహాంతరవాసులు భూమిపైకి వస్తే ఏమవుతుంది? స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు
- 'చదివింపుల విందు' @ రూ. 500 కోట్లు: కష్టాల్లో ఆర్థిక సాయం కావాలన్నా, వ్యాపారానికి పెట్టుబడి కావాలన్నా ఇదో మార్గం..
- ‘అనుభవం ఉందా’ అని అడిగే కంపెనీలకు ఆన్సర్ NATS
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











