యుక్రెయిన్ To సూర్యాపేట: 'బాంబుల వర్షం చూసి బతకనేమో అనుకున్నా.. యుక్రెయిన్ ప్రజల మంచితనమే నన్ను కాపాడింది'

ఫొటో సోర్స్, POLLA VISHNU VARDHAN RAO
తన పెంపుడు కుక్కను ఒళ్లో పెట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్న ఈ యువకుడు విష్ణు కొద్దిరోజుల కిందట వరకు ఇక తాను బతకననే అనుకున్నారు.
యుక్రెయిన్‌లోని విన్నిజియాలో రష్యా పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపిస్తుండడంతో అక్కడి నుంచి బతికి బయటపడడం కష్టమని భావించారు విష్ణు.
విన్నిజియా యుక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉంది. రష్యా సరిహద్దుల నుంచి ఇది చాలా దూరంలో ఉన్నప్పటికీ దాడులను ఎదుర్కొంటోంది.
గత వారం ఇక్కడి విమానాశ్రయంపై రష్యా క్షిపణి దాడిలో 9 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు.
రష్యా దాడి తరువాత యుక్రెయిన్ నుంచి బయటపడి భారత్ చేరుకున్న వేలాది మంది విద్యార్థులలో పొల్లా విష్ణువర్థన రావు(21) కూడా ఒకరు.
తాను ఇంకా బతికి ఉండడానికి కారణం యుక్రెయిన్ ప్రజలేనని, వారి మంచితనమే తనను కాపాడిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
రెండు వారాల కిందటి వరకు విష్ణు యుక్రెయిన్‌లో నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థిగా జీవితం సాగించారు.
యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లడం, లైబ్రరీలో చదువుకోవడం, తన పెంపుడు కుక్క లియోతో నదిలో ఈత కొట్టడం వంటి పనులతో ఆయన జీవితం గడిచిపోయేది.
''యుక్రెయిన్ చాలా అందమైన, ప్రశాంతమైన దేశం. విన్నిజియాలో ఎన్నో ప్రశాంతమైన ప్రదేశాలున్నాయి'' అని విష్ణు చెప్పారు.
అయితే, ఫిబ్రవరి 24న రష్యా దాడి మొదలవడంతో ''పేలుళ్లు, కాల్పుల శబ్దాల''తో నిద్ర లేచాను అని విష్ణు చెప్పారు.
విష్ణు, ఆయనతో ఫ్లాట్‌లో ఉండే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.
'మేం భయంతో గజగజలాడిపోయాం'' అన్నారు విష్ణు.
''బయట చాలామంది యుక్రెయినియన్లు బ్యాగులతో పరుగులు తీయడం కనిపించింది. కానీ, వారెక్కడికి వెళ్తున్నరో తెలియదు' అని చెప్పారాయన.

ఫొటో సోర్స్, POLLA VISHNU VARDHAN RAO
విష్ణు అంతకుముందెప్పుడూ ఎయిర్‌స్ట్రైక్స్ సైరన్లు వినలేదు. ఆ సైరన్ల తరువాత యుక్రెయిన్ భాషలో వినిపించే హెచ్చరికలు ఆయనకు అర్థమయ్యేవి కావు.
విష్ణు ఇరుగుపొరుగు యుక్రెయినియన్లు ఆ హెచ్చరికల అర్థాన్ని ఇంగ్లిష్‌లో వివరించడంతో యుద్ధం మొదలైందన్న సంగతి ఆయనకు తెలిసింది.
'బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండమని అక్కడి వారు చెప్పారని విష్ణు గుర్తు చేసుకున్నారు. అక్కడికి రెండు రోజుల తరువాత ఎయిర్‌స్ట్రైక్స్ సైరన్లు తరచూ వినిపించేవి. విష్ణు, ఆయన ఫ్రెండ్స్ వారుండే అపార్ట్‌మెంట్ కింద బంకర్లో తలదాచుకున్నరు.
అక్కడ నిద్ర పట్టేది కాదు... ఆ నగరం నుంచి ఎలాగైనా బయటపడాలని తీవ్రంగా ప్రయత్నించారు.
ఆ పరిస్థితుల్లో చనిపోతానేమో అని కూడా అనుకున్నాను అని విష్ణు చెప్పారు.
విష్ణు స్నేహితులు ఒక మినీ బస్సు డ్రైవరును సంప్రదించారు. ఆయన వీరిని అక్కడికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రొమేనియా సరిహద్దు వరకు తీసుకెళ్లేందుకు అంగీకరించాడు.

ఫొటో సోర్స్, POLLA VISHNU VARDHAN RAO
ఆ డ్రైవరు సాధారణ రోజుల్లో సందర్శకులను ఆ చుట్టుపట్ల ప్రాంతాల పర్యటనకు తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన భార్య అనారోగ్యంతో ఉండడంతో ఇంకా నగరాన్ని విడిచి వెళ్లలేదు. దాంతో ఆయన వీరిని రొమేనియా సరిహద్దుకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు.
అందుకోసం వారు 12,000 యుక్రెయినియన్ హ్రీవ్నియా(సుమారు రూ. 30 వేలు) చెల్లించారు.
''కేవలం ఆ డ్రైవర్ వల్లే మేం బతికాం. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు'' అని విష్ణు అన్నారు.
రొమేనియాలోకి పెంపుడు జంతువులను తేనివ్వరేమో అన్న అనుమానంతో విష్ణు తన కుక్క లియోను తన టీచర్ దగ్గర వదిలిపెట్టి బస్సు ఎక్కారు.
డ్రైవరు వారిని రొమేనియా సరిహద్దుకు చేర్చిన తరువాత వందలాది మంది అక్కడి గేటు దాటి రొమేనియాలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం కనిపించింది.
యుక్రెయినియన్లను మాత్రమే రొమేనియాలోకి అనుమతించారని విష్ణు చెప్పారు.
ఎన్నిసార్లు ఆ గేటు వరకు వెళ్లినా గార్డులు తనను వెనక్కు ఈడ్చేశారని విష్ణు చెప్పారు.

ఫొటో సోర్స్, POLLA VISHNU VARDHAN RAO
రోజంతా అక్కడ జనంలో నిల్చుని నిరీక్షించిన తరువాత రొమేనియాలోకి వెళ్లడం సాధ్యం కాదేమోనన్న భయం పట్టుకుంది ఆయనకు.
విష్ణు తనతో తెచ్చుకున్న అరటి పండ్లు, రొట్టెలు కూడా అయిపోయాయి... శరణార్థులకు ఆహారపానీయాలు అందిస్తున్నవారి దగ్గర కూడా సరకులు నిండుకున్నాయి.
తిండి, నీరు లేకుండా రెండు రోజులు అక్కడ నిరీక్షించిన తరువాత చివరకు తనను, తన స్నేహితులను గార్డులు రొమేనియాలోకి అనుమతించారని విష్ణు చెప్పారు.
అయితే, యుక్రెయిన్‌లోని తన 20 మంది భారతీయ మిత్ర బృందంలో 13 మంది ఇంకా అక్కడే ఉండిపోయారని విష్ణు చెప్పారు.
'చాలామంది స్నేహితులు అక్కడే ఉండిపోయారు. నేను స్వార్థంగా వచ్చేశాను. కానీ ప్రాణాల మీదకు వచ్చేసరికి స్వార్థం తప్పదు. స్నేహితుల కోసం ప్రాణాలు వదులుకోలేం, అందుకే అప్పటికప్పుడు అక్కడి నుంచి వచ్చేశాం'' అన్నారు విష్ణు.
అయితే, ఆ తరువాత విష్ణు మిత్రులంతా భారత్ చేరుకోగలిగారు.

ఫొటో సోర్స్, POLLA VISHNU VARDHAN RAO
రొమేనియా సరిహద్దులకు చేరుకున్న తరువాత అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు విష్ణు, మిగతా భారతీయులను బస్సుల్లో బుకారెస్ట్ విమానాశ్రయానికి చేర్చారు.
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత ప్రాణాలతో వచ్చిన కుమారుడిని చూసి విష్ణు తల్లిదండ్రులు ఆయన్ను గట్టిగా కౌగిలించుకున్నారు.
కొద్దిరోజుల తరువాత సూర్యాపేటలోని తమ ఇంటికి చేరుకున్నారు విష్ణు.
మరికొన్ని రోజుల తరువాత ఆయన పెంపుడు కుక్క లియో కూడా ఆయన్ను చేరుకుంది.
యుక్రెయిన్‌లో లియోను తన టీచర్ దగ్గర విడిచిపెట్టిన తరువాత ఆ టీచర్ కూడా అక్కడి నుంచి కుటుంబం సహా మాల్డోవా వెళ్లారు.
అలా వెళ్లినప్పుడు తనతో పాటు లియోను కూడా తీసుకెళ్లారు. అనంతరం బస్సులో లియోను బుకారెస్ట్ తీసుకెళ్లి అధికారులకు అప్పగించగా వారు భారత్‌కు దాన్ని పంపించారు.
యుక్రెయిన్ ప్రజల సహకారమే లేకుంటే తాను, తన లియో ఇంటికి చేరేవాళ్లం కాదని, అక్కడి ప్రజలు చాలా మంచివారని విష్ణు చెప్పారు.
''నేను చాలా అదృష్టవంతుడిని, చాలామంది నాకు సాయం చేశారు. నా పొరుగువారు, బస్సు డ్రైవర్, నా టీచర్.. ఇలా అందరూ సహకరించారు''.
''యుక్రెయిన్ ప్రజలు చాలా మంచివాళ్లు'' అన్నారు విష్ణు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?
- ‘దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్’ యుక్రెయిన్‌పై దాడి తీవ్రతను మరింత పెంచుతారా
- యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- తమిళనాడు: కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటున్న 'చదివింపుల విందు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












