యుక్రెయిన్: మరియుపూల్ ఆస్పత్రిపై రష్యా బాంబు దాడి తర్వాత రక్తపు మరకలతో బయటకు.. ఆ మర్నాడే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఫొటో సోర్స్, The Guardian/BBC
రష్యా బాంబు దాడులతో ధ్వంసమైన మరియుపూల్ ప్రసూతి ఆస్పత్రి శిథిలాల నుంచి బయటకు వస్తూ కనిపించిన గర్భిణి ఒకరోజు తర్వాత బిడ్డకు జన్మనిచ్చారని చెబుతున్నారు.
ముఖంపై రక్తపు మరకలతో ఆస్పత్రి శిథిలాల నుంచి బయటకు వస్తున్న నెలలు నిండిన మారియానా విషెర్గిస్కయా ఫొటో వైరల్ అయింది.
ఆస్పత్రిపై రష్యా దాడిని ఖండిస్తూ ఈమె ఫొటోను చాలామంది షేర్ చేశారు.
బాంబు దాడి జరిగిన మరుసటి రోజు ఆమె బిడ్డకు జన్మనిచ్చారని టర్కీ మీడియాకు ఆమె మేనకోడలు చెప్పారు.
ఆ పాపకు వెరోనికా అని పేరు పెట్టినట్టు ఐక్యరాజ్యసమితిలో యుక్రెయిన్ రాయబారి సెర్గీ తెలిపారు.
మారియానా, ఆమెకు పుట్టిన బిడ్డ ఫొటోను చేతిలో పట్టుకుని ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిన సెర్గీ.. ఆస్పత్రిపై బాంబు దాడి తర్వాత ఆమె గురించి రష్యా అబద్ధాలు చెబుతోందని విమర్శించారు.
ఆస్పత్రిపై బాంబు దాడి తర్వాత తప్పుడు ప్రచారానికి మారియానా టార్గెట్ అయ్యారు.
'మారియానా ఒక నటి అని, దాడి జరిగిన తర్వాత ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని, ఇందులో కుట్ర కోణం దాగుంద'ని బ్రిటన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
ట్వీట్‌ను తొలగించిన ట్విటర్
అయితే, నిరాధార వాదనలకు భిన్నంగా ఉన్న ఆధారాలను బీబీసీ డిస్ఇన్ఫర్మేషన్ టీమ్ గుర్తించింది.
రష్యా ఎంబసీ చేసిన ట్వీట్‌ను ట్విటర్ ఆ తర్వాత తొలగించింది.
'హింసాత్మక ఘటనల తిరస్కరణకు సంబంధించిన నిబంధనల'ను ఈ ట్వీట్ ఉల్లంఘిస్తోందని ట్విటర్ పేర్కొంది.
మారియానా అసలు గర్భవతే కాదని మరికొందరు ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు.
అయితే, బ్యూటీ బ్లాగర్ అయిన మరియానా.. తాను గర్భవతినని గత జనవరిలో తన అభిమానులకు చెప్పారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి చాలా ముందే ఈ విషయాన్ని తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
అంతేకాదు.. తనకు పుట్టబోయేది అమ్మాయో లేక అబ్బాయో గెస్ చేయాలని ఆమె కోరారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
'మరియుపూల్‌లో 1500 మంది పౌరులను రష్యా చంపేసింది' - యుక్రెయిన్
శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఫొటోను విడుదల చేసిన యుక్రెయిన్ రాయబారి సెర్గీ.. తాను ఒక శుభవార్త చెప్పబోతున్నానని అన్నారు.
'గత రాత్రి మరియానా పండంటి పాపకు జన్మనిచ్చారు. పాప పేరు వెరోనికా. ఇదిగో ఇక్కడ తను తన తండ్రితో ఉంది. ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి, ఆ సంఘటన గురించి రష్యా ఎలాంటి అబద్ధాలు చెప్పినా ఇది నిజం' అని ఆయన అన్నారు.
మరియుపూల్‌లో 1500 మంది పౌరులను రష్యా చంపేసిందని ఆయన ఆరోపించారు.
రష్యా సైన్యం చుట్టుముట్టిన ఈ నగరంలోని ప్రజలు చాలా రోజులుగా తాగు నీరు, విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.
అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రయత్నాలు పలుమార్లు విఫలమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
మరియుపూల్‌లోని ప్రసూతి ఆస్పత్రిపై రష్యా దాడిలో ఒక చిన్నారి సహా ముగ్గురు చనిపోయారని యుక్రెయిన్ చెబుతోంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారి యుక్రెయిన్‌లో సామూహిక ఖననాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని రాయబారి సెర్గీ చెప్పారు.
తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా కంపెనీలు రష్యా ప్రభుత్వ మీడియా చానెళ్లను బ్లాక్ చేయడం మొదలుపెట్టాయి.
తాజాగా రష్యా ప్రభుత్వం నిధులు అందిస్తున్న మీడియా చానెళ్లను శుక్రవారం యూట్యూబ్ బ్లాక్ చేసింది.
ఇవి కూడా చదవండి:
- ‘సేవ్ ఖాజాగూడ రాక్స్’: ఈ బండ రాళ్లను ఎందుకు కాపాడాలి? వీటికోసం నిరసన దీక్షలు ఎందుకు?
- "నేనొక అబ్బాయిని... పదహారేళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"
- రాధేశ్యామ్ రివ్యూ: రూపాయి కథకు.. 99 రూపాయల హంగులు
- ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం తెలుగు సినీ పరిశ్రమ హబ్‌గా మారుతుందా... అవకాశాలేంటి, అవరోధాలేంటి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














