ప్రపంచ ఆహార వ్యవస్థకు పెను విపత్తుగా యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎమ్మా సింప్సన్
- హోదా, బిజినెస్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్
యుక్రెయిన్‌పై యుద్ధం ప్రభావం ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థ, ఆహార ధరలపై పడే అవకాశం ఉందని ప్రపంచంలోని అతిపెద్ద ఎరువుల కంపెనీల్లో ఒకదాని యజమాని చెప్పారు.
యారా ఇంటర్నేషనల్ ఎరువుల కంపెనీ 60కి పైగా దేశాల్లో విస్తరించింది. రష్యా నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ముడి పదార్థాలను కొనుగోలు చేస్తుంది ఈ కంపెనీ.
గ్యాస్ ధరలు పెరుగుతుండటం వల్ల ఇప్పటికే ఎరువుల ధరలు కూడా పెరిగాయి.
ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని యారా ఇంటర్నేషనల్ కంపెనీ యజమాని సీయిన్ టోర్ హోల్‌స్థర్ హెచ్చరించారు.
''గంట గంటకూ పరిస్థితులు మారిపోతున్నాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు.
''యుద్ధం కంటే ముందు నుంచే ఎరువుల కంపెనీలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు యుద్ధంతో సరఫరా గొలుసుకు అదనపు కష్టాలు జోడయ్యాయి. ఉత్తరార్థ గోళంలో ఈ సీజన్‌కు సంబంధించి చాలా కీలకమైన దశకు మేం చేరువ అవుతున్నాం. ఈ దశలో పెద్ద ఎత్తున ఎరువుల సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ సరఫరా గొలుసుపైనే యుద్ధం ప్రభావం చూపనుంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
రష్యా, యుక్రెయిన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఆహారం, వ్యవసాయంలో అతిపెద్ద ఉత్పత్తిదారులు.
ఎరువుల తయారీలో కీలక మూలకాలైన పొటాషియం, ఫాస్పేట్‌లను కూడా రష్యా పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తుంది.
''ప్రపంచంలోని సగం జనాభాకు ఆహారం అందడానికి కారణం ఎరువుల వల్ల సాధించే అధిక దిగుబడులే. ఒకవేళ ఎరువుల వాడకం ఆపేస్తే కొన్ని పంటల దిగుబడి 50 శాతానికి పడిపోతుంది'' అని హోల్‌స్థర్ అన్నారు.
''మనం, ప్రపంచ ఆహార సంక్షోభం దిశగా వెళ్తున్నామన్నది నా ఆందోళన కాదు. ఆ సంక్షోభం ఏ స్థాయిలో ఉండనుందో అని భయంగా ఉంది'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, YARA INTERNATIONAL
ఆయన కంపెనీ కూడా యుద్ధం బారిన పడింది. కీయెవ్‌లోని యారా కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. అదృష్టవశాత్తు అందులోని 11 మంది సిబ్బంది ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు.
రష్యాపై ఆంక్షలతో ఆయన కంపెనీపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం లేదు . కానీ వాటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆంక్షలతో నౌకా వ్యాపార పరిశ్రమకు అంతరాలు ఎదురుకావడంతో ఎరువుల సరఫరా కష్టతరం అయింది.
హోల్‌స్థర్ బీబీసీతో మాట్లాడిన కొన్ని గంటల అనంతరం, రష్యా ప్రభుత్వం ఎరువుల ఎగుమతులను ఆపేయాలని తమ ఉత్పత్తిదారులను కోరింది.
యూరోపియన్ ఆహార ఉత్పత్తిలో ఉపయోగించే 25 శాతం రష్యా నుంచే వస్తోందని హోల్‌స్థర్ తెలిపారు.
''ఈ సమయంలో మేం చేయగలిగినవి అన్నీ చేయడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం. కానీ ఇంత తక్కువ వ్యవధిలో పరిమిత వనరులతోనే సరిపెట్టుకోవాలి'' అని హోల్‌స్థర్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల కారణంగా రైతులకు అధిక వ్యయంతో పాటు తక్కువ దిగుబడి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఆహార ధరలు అధికమయ్యేందుకు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ ఆందోళనంతా కేవలం ఆహార ధరల గురించి మాత్రమే కాదు, గ్యాస్ గురించి కూడా
నైట్రోజన్ ఎరువులో కీలకమైన అమ్మోనియా ఉత్పత్తికి భారీగా సహజవాయువు అవసరం. అయితే యూరోపియన్ ప్లాంట్ల కోసం యారా ఇంటర్నేషనల్ కంపెనీ రష్యన్ గ్యాస్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
గ్యాస్ ధరలు పెరగడంతో గతేడాది యారా ఇంటర్నేషనల్ కంపెనీ, యూరప్‌లో 40 శాతం ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సి వచ్చింది. మిగతా ఉత్పత్తిదారులు కూడా తమ ఉత్పత్తుల్లో కోత విధించారు.
షిప్పింగ్ ధరలు అధికం కావడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు పొటాషియం మరో ప్రధాన సరఫరాదారు బెలారుస్‌పై ఆంక్షల కారణంగా గతేడాది ఎరువుల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆహార ధరల్లో కూడా పెరుగుదల వచ్చింది.
సరఫరా గొలుసు నిర్వహణకు రోజూవారీ మూల్యాంకనాలు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. రాబోయే కాలంలో జరిగే షట్‌డౌన్ల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని చెప్పింది.
ఉత్పత్తిని నిరాటంకంగా కొనసాగించడం తమకున్న అతిపెద్ద బాధ్యత అని కంపెనీ అంగీకరించింది. కానీ తాజా పరిస్థితుల్లో ఇది చాలా కష్టమైన పని అని అభిప్రాయపడింది.
ఆహార ఉత్పత్తి కోసం ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆధారపడటం సుదీర్ఘ కాలంలోనైనా కచ్చితంగా తగ్గించుకోవాలని హోల్‌స్థర్ అన్నారు.
''సాగుకు ఆటంకం కలగకుండా రైతులకు చేరవేయడం కోసం మేం ఎరువుల సరఫరా నిరంతరం జరిగేలా ప్రయత్నిస్తున్నాం. యుక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజం చెప్పాలంటే చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం'' అని వ్యాఖ్యానించారు.
కరోనా మహమ్మారి కంటే ముందే ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థకు వాతావరణ మార్పులు, అధిక జనాభా రూపంలో సవాళ్లు ఎదురయ్యాయి.
ఈ నేపథ్యంలో యారా ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తాజా యుద్ధాన్ని 'విపత్తుకే మహా విపత్తు' అని అభివర్ణించారు.
పేద దేశాల్లో ఆహార కొరతను ఇది పెంచుతుందని అన్నారు.
''గత రెండేళ్ల కాలంలో ఆకలితో పడుకునే వారి సంఖ్య 500 మిలియన్లు పెరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తాజా పరిస్థితులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి'' అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా, అమెరికాలతో సంబంధాలు భారత్‌కు కత్తి మీద సాముగా మారాయా
- యుక్రెయిన్ నో ఫ్లై జోన్‌కు పశ్చిమ దేశాలు ఎందుకు అంగీకరించడం లేదు
- యుక్రెయిన్: చుట్టూ మంటలు, నీళ్ల కోసం హాహాకారాలు, రోడ్లపై చెల్లాచెదురుగా శవాలు
- పాకిస్తాన్ కెప్టెన్ బిస్మా మరూఫ్ కూతుర్ని ఆడిస్తున్న భారత ప్లేయర్లు
- రొమాన్స్‌లో మహిళలు యాక్టివ్‌గా ఉంటే తప్పా, కామసూత్ర పుట్టిన దేశంలో ఎందుకీ పరిస్థితి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











