యుక్రెయిన్: చుట్టూ మంటలు, నీళ్ల కోసం హాహాకారాలు, రోడ్లపై చెల్లాచెదురుగా శవాలు

భవనాల్లో మంటలు, పొగలు
ఫొటో క్యాప్షన్, భవనాల్లో మంటలు, పొగలు
    • రచయిత, జోయెల్ గుంటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ల్వీవ్, యుక్రెయిన్ నుంచి

యుక్రెయిన్ రేవు నగరం మరియుపూల్‌‌లో శనివారం ఉదయం కాల్పుల విరమణ ప్రకటించారు. అక్కడ ఉంటున్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అది మంచి అవకాశం.

రష్యా బాంబు దాడుల తర్వాత ఆ నగరంలో దాదాపు రెండు లక్షల మంది చిక్కుకుపోయి ఉంటారని ఒక అంచనా.

రష్యా కాల్పుల విరమణ ప్రకటించగానే, నగర కార్పొరేషన్ ప్రజలను అక్కడి నుంచి తప్పించడానికి వెంటనే 50 బస్సులు ఏర్పాటు చేసింది.

జనం కూడా తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి సిటీ సెంటర్ చేరుకోవడం మొదలెట్టారు. బస్సులు కాసేపట్లో అక్కడ్నుంచి బయల్దేరేవి.

కానీ, కాల్పుల విరమణ ప్రకటించిన రెండు గంటల్లోపే రష్యా సైన్యం మళ్లీ నివాస ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపించడం ప్రారంభించింది. తర్వాత యుక్రెయిన్లే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది.

గదిలో కింద పడుకున్న పౌరులు
ఫొటో క్యాప్షన్, జనాలతో ఇరుకైపోయిన మరియుపూల్‌‌లోని మాగ్జిమ్ ఫ్లాట్

తన తాతయ్య, బామ్మను కాపాడాలని యువకుడి పరుగులు

మరియుపూల్‌‌లో గత ఐదు రోజులుగా నీళ్లు, కరెంటు లేదు. ప్రజల దగ్గర అప్పటివరకూ ఉన్న తిండి, నీళ్లు వేగంగా అయిపోతూ వస్తున్నాయి.

శనివారం ఉదయం కాల్పుల విరమణ ప్రకటనతో తమలో ఒక కొత్త ఆశ ఉదయించిందని, తర్వాత వెంటనే అది నిరాశగా మారిపోయిందని తాతయ్య, బామ్మలను చూసుకుంటున్న 27 ఏళ్ల ఐటీ డెవలపర్ మాక్సిమ్ బీబీసీకి చెప్పారు.

"మేం ఈరోజు ఇక్కడ్నుంచి బయటపడే ప్రయత్నం చేశాం. మేం కాల్పుల విరమణ సమయంలో బయటకు వెళ్లుండాల్సింది. అప్పుడు బాంబులు వేయలేదు. అదే సమయంలో అక్కడ నుంచి వెళ్లవచ్చని విన్నాం. వీలైనంత త్వరగా వెళ్దామని నేను మా తాత, బామ్మలను తీసుకుని నాలుగు బ్యాగుల్లో స్వెటర్లు, ఆహారం పెట్టాను. ఇంట్లో మిగిలిన నీళ్లు తీసుకున్నా. అన్నీ నా కార్లో పెట్టాను."

"మా తాతయ్య, బామ్మ ఇద్దరికీ 80 ఏళ్లు పైనే ఉంటుంది. అందుకే ఇలాంటి పరిస్థితి వారికి చాలా కష్టం. ఆ సమయానికి లిఫ్టు కూడా పనిచేయకపోవడంతో.. నేను వారిని, వస్తువులు అన్నీ తీసుకుని ఆరంతస్తుల భవనం మీద నుంచి మెట్లపై దిగాను."

కానీ, ఇక కారు స్టార్ట్ చేసే సమయంలో మళ్లీ బాంబుల మోత మొదలయ్యింది. నాకు దగ్గర్లోనే పేలుడు శబ్దం వినిపించింది. దాంతో నేను మళ్లీ వారిని తీసుకుని త్వరగా పైకి పరిగెత్తాను. మా ఫ్లాట్‌లోకి చేరుకోగానే నాకు నగరం అంతా పొగ కమ్మేసి ఉండడేం కనిపించింది. ఆ పొగ హైవే నుంచి జెపోరిఝియా వైపు వెళ్తోంది. జనమంతా అటే వెళ్లారని చెబుతున్నారు"

మాగ్జిమ్ తాతయ్య, బామ్మ
ఫొటో క్యాప్షన్, మాగ్జిమ్ తాతయ్య, బామ్మ

బయటికెళ్లాలని సిటీ సెంటర్ చేరుకున్నవారు బాంబుల దాడుల్లో ఇరుక్కుపోయారు

మాగ్జిమ్ వివరాల ప్రకారం ఇప్పటికీ తాతయ్య, బామ్మలతో ఇప్పటికీ తన అపార్టుమెంట్లోనే ఉన్నారు. శనివారం రోజంతా బాంబు దాడులు జరిగాయని, పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లో తమ ముగ్గురితోపాటూ తిరిగి వచ్చిన మరో 20 మంది కూడా ఉన్నారని తెలిపారు.

"కాల్పుల విరమణ చేశారు. బస్సులు మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తాయని చెప్పడంతో చాలా మంది సిటీ సెంటర్‌కు చేరుకున్నారు. ఎలాగైనా రష్యా బాంబు దాడుల నుంచి తప్పించుకోవాలని అనుకున్నారు. కానీ, మళ్లీ బాంబులు వేయడంతో వాళ్లంతా అక్కడే చిక్కుకుపోయారు. రష్యా సైన్యం మళ్లీ దాడులు మొదలు పెట్టడంతో వాళ్లందరూ అంతకు ముందు దాక్కున్న ప్రాంతాలకు తిరిగి చేరుకోలేకపోయారు" అని మాగ్జిమ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

బాంబులతో దద్దరిల్లుతున్న నగరం, రహదారులపై చెల్లాచెదురుగా శవాలు

"బయట పరిస్థితులు చూసి మేం చాలా మందిని మా అపార్ట్‌మెంటు లోపలికి పిలిచాం. వాళ్లంతా నగరంలో ఉత్తర ప్రాంతంలో ఉండేవారు. తమ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైపోయిందని వాళ్లు మాకు చెప్పారు. ఇళ్లకు మంటలు అంటుకున్నాయని, ఆర్పడానికి కూడా ఎవరూ లేరన్నారు. నగరంలో రోడ్లపై శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ వాటిని తొలగించేవాళ్లు కూడా ఎవరూ లేరు" అని మాగ్జిమ్ చెప్పారు.

"మా పొరుగింట్లో ఉన్న ముగ్గురు నాకు తెలుసు. మిగతా వాళ్లు ఎవరూ నాకు తెలీదు. వారిలో ఒక 70 ఏళ్ల వృద్ధురాలు, ఒక పిల్లాడు కూడా ఉన్నారు. నేను మహిళలు, పిల్లలు పడుకోడానికి మా ఇంట్లో నేలమీదే ఏర్పాట్లు చేశాను. మా ఇంట్లో అదనపు బెడ్లు లేవు అందుకే మేం కార్పెట్లు, బట్టలే నేలమీద పరిచాం" అన్నారాయన.

"మా దగ్గర బాటిల్లో ఉన్న నీళ్లు అయిపోయాయి. కుళాయిల్లో కూడా రావడం లేదు. గ్యాస్ సరఫరా మాత్రం ఉంది. స్నానం చేసే నీళ్లు వేడి చేసుకుని వాటిని తాగేలా చేసుకోవచ్చు. ఈరోజు పోలీసులు స్టోర్ తెరిచి, అక్కడున్న అన్ని వస్తువులూ తీసుకోండని చెప్పడంతో మా పొరుగువారు అక్కడ్నుంచి ఎలాగోలా చాక్లెట్లు, చేపలు, కూల్ డ్రింక్స్ తీసుకురాగలిగారు" అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా, యుక్రెయిన్ సైన్యాల భీకర పోరు

కాల్పుల విరమణ ఒక మోసం

"కాల్పుల విరమణ అనేది ఒక మోసం. ఒక పక్షం ఫైరింగ్ ఆపడానికి ఎప్పుడూ అసలు ప్రయత్నమే చేయలేదు. వాళ్లు రేపు(ఆదివారం) కాల్పుల విరమణ అని చెప్పినా, మేం ఇక్కడ నుంచి బయటపడ్డానికి ప్రయత్నించాలి. కానీ, వారు అలా నిజంగా చేస్తారా అనేది మాకు తెలీదు. అంటే, మళ్లీ బాంబులు వేస్తారేమో... మేం ఇక్కడ దాక్కున్నాం కాబట్టి మెరుగైన స్థితిలో ఉన్నాం" అని మాగ్జిమ్ చెప్పారు.

నా ఫోన్లో బ్యాటరీ ఉన్నంతవరకూ మీరు నాతో మాట్లాడవచ్చు. కానీ అది ఎప్పటివరకూ వస్తుందో నాకు తెలీదు అన్నారు మాగ్జిమ్.

"నాకు దిగులుగా ఉంది. ఈరోజు నుంచి నేను నన్ను, మా ఇరుగుపొరుగువారిని కాపాడుకోడానికి పోరాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. మేం చాలా అలసిపోయాం. మమ్మల్ని తప్పించే దారి కూడా కనిపించడం లేదు" అంటున్నారు ఆయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)