యుక్రెయిన్ సంక్షోభం: భారతీయ విద్యార్థులు, పౌరులను తీసుకురావడం ఎందుకు కష్టంగా మారింది?

యుక్రెయిన్‌లోని పలు నగరాల్లో ఇంకా భారతీయ పౌరులు, విద్యార్ధులు చిక్కుకుపోయారు

ఫొటో సోర్స్, TWITTER/IEMBASSY OF INDIA IN KYIV

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌లోని పలు నగరాల్లో ఇంకా భారతీయ పౌరులు, విద్యార్ధులు చిక్కుకుపోయారు
    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వైమానిక దళానికి చెందిన సి-17 యుద్ధ విమానాలను, నలుగురు కేంద్ర మంత్రులను యుద్ధ పీడిత యుక్రెయిన్ సమీప దేశాలలో మోహరించడం ద్వారా ఆ దేశంలో చిక్కుకున్న తమ విద్యార్థులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తోంది.

యుక్రెయిన్‌లోని వివిధ నగరాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారందరికీ తక్షణ సహాయం అవసరం.

అయితే, ఇక్కడ ఒక సందేహం ఉంది. యుక్రెయిన్‌ను ఆనుకుని ఉన్న వివిధ ఈయూ దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపడం వల్ల విద్యార్థులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే పని సులభం అవుతుందా?

వాస్తవానికి ఇలాంటి ఏర్పాటు చేయడం భారత్‌కు కొత్తకాదు.1990లో కువైట్‌లో, 2003లో ఇరాక్‌లో, 2015లో యెమెన్‌లో యుద్ధం జరిగినప్పుడు ఇదే వ్యూహాన్ని అనుసరించింది. 1990లో అప్పటి విదేశాంగ మంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ ఈ తరహా ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించారు.

స్లొవేకియా అధికారులతో కిరెన్ రిజిజు

ఫొటో సోర్స్, @KirenRijiju

ఫొటో క్యాప్షన్, స్లొవేకియా అధికారులతో కిరెన్ రిజిజు

ఆ సమయంలో సుమారు 1 లక్షా 70 వేలమంది భారతీయ పౌరులు కువైట్ నుండి స్వదేశానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ లిఫ్టింగ్‌ గా ప్రచారం

2015 లో యెమెన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పుడు, అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను ఇండియాకు తరలించడంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కీలక పాత్ర పోషించారు. 2003లో ఇరాక్‌పై అమెరికా దాడి జరిగినప్పుడు కూడా భారత పౌరులను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని డిమాండ్‌లు వినిపించాయి.

అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వయంగా ఈ ప్రయత్నాలకు చొరవ తీసుకున్నారని, ఇరాక్ ప్రభుత్వంతో ఆయన నిత్యం టచ్‌లో ఉండేవారని నిపుణులు చెబుతున్నారు.

అయితే, అప్పట్లో భారత ప్రభుత్వం అమెరికా దాడిని విమర్శించింది. అప్పట్లో భారత్-ఇరాక్‌ల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అందుకే అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, సుమారు 50 వేల మందికి పైగా భారత పౌరులు జోర్డాన్ మీదుగా స్వదేశానికి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు అంతమంది వైద్య విద్యార్థులు ఎందుకు వెళ్లారు?

భారత ప్రభుత్వం ఏం చేస్తోంది?

2015లో యెమెన్‌లో యుద్ధం జరిగినప్పుడు విదేశాంగ శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ స్వయంగా ఆ దేశం వెళ్లి అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేందుకు అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అయితే యుక్రెయిన్‌లో పరిస్థితి గల్ఫ్ దేశాలకు పూర్తి భిన్నంగా ఉందని లండన్‌లోని కింగ్స్ కాలేజీలో విదేశీ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు, అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అధిపతి హర్ష్ వి.పంత్ బీబీసీతో అన్నారు. యుక్రెయిన్‌లో అతిపెద్ద సమస్య ఏమిటంటే అక్కడి నుంచి బయటపడాలంటే విద్యార్ధులకు లేదా పౌరులకు అదృష్టం కూడా తోడుకావాల్సిన పరిస్థితి ఉంది.

స్వదేశానికి ప్రయాణమవుతున్న భారతీయులు

ఫొటో సోర్స్, Embassy of India in Kyiv, Ukraine.

ఫొటో క్యాప్షన్, స్వదేశానికి ప్రయాణమవుతున్న భారతీయులు

హంగేరి, పోలండ్, రొమేనియా, స్లోవేకియా లేదా మోల్డోవా సరిహద్దులను చేరుకోగలిగిన విద్యార్ధులు సులభంగానే భారత్ రాగలుగుతున్నారు. అయితే యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌తో పాటు ఇతర నగరాల్లో చిక్కుకున్న విద్యార్ధులు, పౌరుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. యుక్రెయిన్, పోలాండ్ సరిహద్దులలో చిక్కుకుపోయిన విద్యార్థులను తిరిగి రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ పర్యవేక్షిస్తారు. మరో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి హంగేరి మీదుగా విద్యార్ధులను పంపించే ఏర్పాట్లు చేస్తారు.

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మోల్డోవా, రొమేనియా నుంచి ఈ ఏర్పాటును పర్యవేక్షిస్తారు. మరో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు స్లోవేకియా ద్వారా భారతదేశానికి విద్యార్థులను పంపే ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఆపరేషన్ గంగ పేరుతో ఈ ఎయిర్ లిఫ్టింగ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది.

పోలండ్ సరిహద్దులకు చేరుకోవడం శరణార్ధులకు, విదేశీ పౌరులకు సమస్యగా మారింది

ఫొటో సోర్స్, RAJAT JOHAL

ఫొటో క్యాప్షన్, పోలండ్ సరిహద్దులకు చేరుకోవడం శరణార్ధులకు, విదేశీ పౌరులకు సమస్యగా మారింది

'తరలింపు ఆలస్యమే'

మంత్రులు స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడం కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని సీనియర్ జర్నలిస్టు, విదేశీ వ్యవహారాలు, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు అభిజిత్ అయ్యర్ మిత్రా అన్నారు.

''వనరుల ఏర్పాటు, ఆయా దేశాల ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, తమ పౌరులకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ పనిని రాయబారులు, రాయబార కార్యాలయాలు చేయలేవు'' అని మిత్రా అన్నారు.

వీడియో క్యాప్షన్, వట్టి చేతులతో రష్యా ట్యాంకుకు ఎదురు నిలిచిన యుక్రెయిన్ పౌరుడు

ఇంతకు ముందు భారతీయ విద్యార్థులతో యుక్రెయిన్ సైనికాధికారులు దురుసుగా ప్రవర్తించినట్లు వీడియోలు విడుదలయ్యాయని, ఇది ఆందోళన కలిగించిందని, మంత్రుల అక్కడ ఉండటం వల్ల ఇలాంటివి జరగడం లేదని మిత్రా అన్నారు.

మంత్రులకు అక్కడికక్కడే తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని, సాధారణంగా అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి రాయబారి లేదా రాయబార కార్యాలయ అధికారులు దిల్లీ నుండి సూచనలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

అయితే భారత ప్రభుత్వ చొరవ మంచిదేనని, అయితే ఇది 'ఆలస్యంగా తీసుకున్న చర్య'గా తాను భావిస్తున్నానని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని యూరోపియన్ స్టడీస్ సెంటర్ ప్రెసిడెంట్ గుల్షన్ సచ్‌దేవా అన్నారు.

స్వదేశానికి పయనమైన భారతీయ విద్యార్ధులు, పౌరులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, స్వదేశానికి పయనమైన భారతీయ విద్యార్ధులు, పౌరులు

''రష్యాతో భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఉంటుంది"

"అమెరికాతో సహా చాలా దేశాలు ఇప్పటికే యుక్రెయిన్ నుండి తమ పౌరులను ఖాళీ చేయించాయి. భారతదేశం ఆలస్యం చేసింది. నో ఫ్లై జోన్ ప్రకటించిన తర్వాత రైలు, రోడ్డు మార్గాల ద్వారా సరిహద్దులకు చేరుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది'' అని సచ్‌దేవా అన్నారు.

బంకర్లలో చిక్కుకున్న దాదాపు 15,000 మంది భారతీయ విద్యార్థులకు తక్షణ సహాయం అవసరమని తెలుస్తోంది. మన పౌరులను సురక్షితంగా తిరిగి రావడానికి భారత ప్రభుత్వం రష్యాతో ఇప్పటికే మాట్లాడి ఉంటుందని సచ్‌దేవా అన్నారు.

యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని నగరాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు పశ్చిమ యుక్రెయిన్‌లో ఉన్న సరిహద్దులకు తరలించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని విదేశీ వ్యవహారాల నిపుణుడు హర్ష్ పంత్ అన్నారు.

విద్యార్ధులతో కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియా

ఫొటో సోర్స్, @JM_Scindia

ఫొటో క్యాప్షన్, విద్యార్ధులతో కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింథియా

విదేశీయులతో పాటు పెద్ద ఎత్తున యుక్రేనియన్లు కూడా పెద్ద ఎత్తున శరణార్ధులుగా తరలి వెళుతున్నారు. ఇది కూడా భారత పౌరులను తరలించడంలో పెద్ద అడ్డంకిగా మారింది. కొన్నిచోట్ల యుక్రేనియన్లు భారతీయులపై దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు కూడా రిపోర్టవుతున్నాయి.

''యుద్ధం, బాంబు దాడులు మొదలైన తర్వాత యుక్రెయిన్ పొరుగు దేశాలకు మంత్రులు వెళ్లి పౌరులను రప్పించడం గొప్ప విప్లవాత్మక మార్పు అని నేను అనుకోను. సమస్య పోలండ్, హంగరీలలో లేదు'' అని సచ్ దేవా అభిప్రాయపడ్డారు.

సరిహద్దులకు చేరుకున్న విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు మంత్రులు ఏర్పాట్లు చేయగలరని, బంకర్లలో చిక్కుకున్న వారిని ఆదుకోవడం ఇంకా పెద్ద సవాలేనని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)