రష్యా అణు బాంబులు వేస్తుందా? అణ్వాయుధాలను ప్రయోగిస్తే పాశ్చాత్య దేశాలు ఏం చేస్తాయి?

రష్యా, యుక్రెయిన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యాకు చెందిన పోసిడాన్ న్యూక్లియర్ అండర్‌వాటర్ వెహికిల్ - రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ ద్వారా గ్రహించిన చిత్రం
    • రచయిత, గార్డన్ కొరెరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు, అణ్వాయుధాలతో సహా నిరోధక వ్యవస్థను "స్పెషల్ అలర్ట్"పై ఉంచాలని ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు.

దీనర్థమేమిటి?

దీనిపై ఇంకా స్పష్టత రాలేదని పాశ్చాత్య విశ్లేషకులు అంటున్నారు. పుతిన్ వాడిన భాష అస్పష్టంగా ఉందని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు.

అలర్ట్‌లలో వివిధ స్థాయిలు ఉంటాయి. దళాలు, ఆయుధాల సన్నద్ధత ఆధారంగా ఈ స్థాయిలు ఉంటాయి. ప్రస్తుతం అత్యల్ప స్థాయి అలర్ట్ నుంచి పైకి వెళ్లాలన్నది పుతిన్ ఉద్దేశమని, అది కూడా కచ్చితంగా చెప్పలేమని కొందరు అంటున్నారు.

నిజంగా అణ్వాయుధాలను ఉపయోగించాలనే ఆలోచన కంటే ప్రజలకు ఒక సూచన ఇవ్వడమే పుతిన్ ఉద్దేశం అయ్యుంటుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. నిజంగా, అణ్వాయుధాలను ప్రయోగిస్తే పాశ్చాత్య దేశాలు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండవని పుతిన్‌కు తెలుసు.

పుతిన్ ప్రకటన కేవలం "రెచ్చగొట్టే చర్య" అని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ అభిప్రాయపడ్డారు.

అంటే దానివల్ల ముప్పు లేదని కాదు. అంతర్జాతీయ సమాజం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది.

వీడియో క్యాప్షన్, పెన్‌లు ఇచ్చి గన్‌లు తీసుకుంటున్నారు

కొత్త హెచ్చరిక ఏమిటి?

గత వారం పుతిన్ పరోక్షంగా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. యుక్రెయిన్ సంక్షోభంలో ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, "గతంలో ఎన్నడూ చూడని" పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇది ప్రధానంగా నాటో దేశాలకు చేసిన హెచ్చరిక అని నిపుణులు భావించారు.

అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుత సంక్షోభంలో జోక్యం చేసుకోమని నాటో స్పష్టం చేసింది. యుక్రెయిన్‌కు సహాయం అందిస్తే, రష్యాతో నేరుగా తలపడినట్లవుతుందని, అది అణు యుద్ధానికి దారి తీయవచ్చని నాటోకు తెలుసు.

కాగా, ఆదివారం పుతిన్ నేరుగా, బహిరంగంగా హెచ్చరికలు చేశారు.

కొన్ని "దూకుడు ప్రకటనలకు" ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు పుతిన్ చెప్పారు. నాటోతో ఘర్షణల గురించి బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్‌ సహా పాశ్చాత్య అధికారులు చేసిన ఆక్షేపణల గురించే పుతిన్ చెబుతున్నారని సోమవారం క్రెమ్లిన్ తెలిపింది.

అయితే, యుక్రెయిన్ గురించి పుతిన్ అంచనాలు తప్పడం వల్లే ఈ హెచ్చరిక చేశారని కొందరు పాశ్చాత్య అధికారులు అభిప్రాయపడుతున్నారు.

యుద్ధరంగంలో యుక్రెయిన్ ప్రతిఘటనను పుతిన్ తక్కువ అంచనా వేసి ఉండవచ్చు. అలాగే, ఆంక్షల విషయంలో పాశ్చాత్య దేశాలనూ తక్కువ అంచనా వేసి ఉండవచ్చు. అందుకే ఆయన ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

"కోపం, నిరాశ, నిస్పృహలకు సూచిన ఇది" అని ఈమధ్యే రిటైర్ అయిన బ్రిటిష్ జనరల్ నాతో అన్నారు.

పుతిన్ భాష యుక్రెయిన్‌లో యుద్ధాన్ని సమర్థించే ప్రయత్నమని, తాము దురాక్రమణకు పాల్పడలేదని, కేవలం రక్షణ కోసం దాడి చేశామని చెప్పడానికేనని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ అభిప్రాయపడ్డారు.

అలా చూస్తే, ఇది పుతిన్ తన దేశ ప్రజలకు ఇస్తున్న భరొసా కావొచ్చు. లేదా పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు సైన్య సహాయం అందిస్తాయన్న ఆందోళనలోంచి వచ్చిన హెచ్చరిక కావొచ్చు.

మరొక విషయమేమిటంటే, పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు స్వదేశంలో అశాంతికి తెరలేపి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉందని కూడా పుతిన్ ఆందోళన చెందుతున్నారు.

మొత్తంగా చూస్తే, ఇది నాటోకు మరొక రకమైన హెచ్చరికలా ఉంది. నాటో నేరుగా యుద్ధంలోకి దిగితే పరిస్థితులు తీవ్రమవుతాయని చెబుతున్నట్టు ఉంది.

వీడియో క్యాప్షన్, బాంబుల వర్షం మధ్య బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

ముప్పు ఏమిటి?

పుతిన్ ప్రకటన కేవలం హెచ్చరికే అనుకున్నా, ఆయన వ్యాఖ్యలను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. దానివల్ల పరిస్థితులు చేయి దాటిపోవచ్చు.

ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయమేమిటంటే, పుతిన్ ఒంటరిగా ఉంటున్నారు. ఆయన సలహాదారులలో కొంతమంది మినహా, ఆయనకు నిజం చెప్పగల వారెవరితోనూ టచ్‌లో లేరు.

ఆయన తీర్పులు అస్థిరంగా ఉన్నాయని కొందరు భయపడుతున్నారు. పుతిన్ అంత దూరం వెళితే, కింది స్థాయి అధికారులు కొందరైనా ఆయన ఆదేశాలకు అడ్డు చెప్తారని మరికొందరు నిపుణులు ఆశిస్తున్నారు.

అయితే, అణు యుద్ధం ముప్పు తెరపైకి వచ్చిందిగానీ ఇంకా భయపడేంత స్థాయిలో లేదని విశ్లేషకులు అంటున్నారు.

పాశ్చాత్య దేశాలు ఏమంటున్నాయి?

ఇప్పటివరకు పశ్చిమ దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మాటకు మాట పెంచకుండా, ఎలాంటి ప్రతి చర్యలూ తీసుకోకుండా సంయమనం పాటిస్తున్నాయి. అమెరికా మిలటరీకి తమ సొంత రక్షణ అప్రమత్త వ్యవస్థ ఉంది. దాన్ని 'డెఫ్‌కాన్' అంటారు.

సోమవారం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ, ప్రస్తుతానికి తమ దేశ అణు హెచ్చరిక స్థాయిలను మార్చడానికి ఎలాంటి కారణం లేదని అన్నారు.

బ్రిటన్‌కు చెందిన అణు సామర్థ్యం గల జలాంతర్గాములు సముద్రంలో ఉన్నాయి. కానీ, ఆ దేశం కూడా బహిరంగ ప్రకటనలేవీ చేయకపోవచ్చు.

రష్యా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకుండా, ఉద్రిక్తతలు పెరగకుండా చూడడమే పశ్చిమ దేశాల లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతానికి ఇది అణు సంక్షోభం కాదని, భవిష్యత్తులో కూడా కాకూడదని పాశ్చాత్య భద్రతా అధికారులు ఆశిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో కారుపైకి ఎక్కిన రష్యా ట్యాంకర్

రష్యా ఏం చేస్తోందో పశ్చిమ దేశాలకు తెలిసే అవకాశం ఉందా?

రష్యా అణ్వాయుధాల కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులూ కనిపించలేదని బ్రిటన్ రక్షణ శాఖ కార్యదర్శి బెన్ వాలెస్ బీబీసీకి తెలిపారు. ఆ మేరకు రష్యా కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్థరించాయి.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, మాస్కో అణ్వాయుధాలపై నిఘా ఉంచడానికి పశ్చిమ దేశాలలో భారీ నిఘా వ్యవస్థను నిర్మించారు.

ఉపగ్రహాలు, కమ్యూనికేషన్‌లో అంతరాయాలు, మరికొన్ని ఇతర సాధనాల ద్వారా ఆయుధాల విస్తరణ, బాంబర్ విమానాలను సిద్ధం చేయడం మొదలైన మార్పులను విశ్లేషిస్తారు. ఈ వ్యవస్థ నేటికీ అమలులో ఉంది.

పాశ్చాత్య దేశాలు ఇప్పుడు మరింత జాగ్రత్తగా రష్యా కార్యకలాపాలను గమనిస్తాయి. దాని ప్రవర్తనలో మార్పులను నిశితంగా పరిశీలిస్తాయి. అయితే, ఇప్పటి వరకు అలాంటి సూచనలేవీ కనిపించలేదు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)