యుక్రెయిన్ సంక్షోభం: ‘నా పదేళ్ల కుమారుడు భయంతో వణికిపోయాడు, ఆ తరువాత కీయెవ్ నుంచి వెళ్లిపోయాం’

- రచయిత, మార్తా శోకాలో
- హోదా, ఎడిటర్, బీబీసీ యుక్రెయిన్
నేను తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి వార్తలు చూశాను. నా కుమారుడిని తీసుకుని కీయెవ్ నగరాన్ని ఇక వదలిపెట్టి వెళ్లాల్సిందేనని నాకు అర్థమైంది.
ఉత్తరం నుంచే కాకుండా ఇతర దిక్కుల నుంచీ మిలటరీ ట్యాంకులు నగరం వైపు వస్తున్నాయి. రష్యా సైనికులు యుక్రెయిన్ రాజధానిని అన్నివైపుల నుంచి దిగ్బంధం చేసి, నగరంలోకి చొచ్చుకురావాలని చూస్తున్నారని నాకర్థమైంది.
యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్స్ అలారాలు ఉదయం 8 గంటల దాకా మోగుతూనే ఉన్నాయి. అరగంట తరువాత నాకు దగ్గరలో బాంబులు పేలిన శబ్దాలు వినిపించాయి.
గురువారం నాడు చాలా మంది తమ కార్లలో కీయెవ్ నగరాన్ని వదలి వెళ్ళిపోతున్నారు. పశ్చిమాన పోలండ్ పరిధిలోని లీవివ్ నగరం వైపుగా వారు వెళ్తున్నారు.
అప్పుడు నా భర్త ఇంట్లో లేరు. నేను ఆయనకు ఫోన్ చేశాను. యుక్రెయిన్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఆయన తల్లితండ్రులు ఉంటున్న ప్రాంతానికి వెళ్లడానికి నేను ప్లాన్ వేసుకున్నాను.
మేం ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం, మా పదేళ్ల కుమారుడు గురువారం నాడు అంతా భయంతో వణికిపోయాడు.
నేను సామాన్లు సర్దుకోవడం ప్రారంభించాను. మళ్లీ వెనక్కి ఎప్పుడు వస్తామో తెలియనప్పుడు ఎవరైనా ఎన్ని వస్తువులను ప్యాక్ చేసుకుంటారు? పల్లెటూళ్లో ఎండాకాలం దాకా ఉండాల్సి వస్తే ఏమేం కావాలో అవన్నీ సర్దుకున్నాను, కర్ఫ్యూ ఎత్తేసిన అరగంటకు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మేం ఇల్లు వదిలి కీయెవ్ నగరం నుంచి తూర్పు వైపునకు పయనమయ్యాం.
నేను వెళ్లే దారి అంతా నిర్మానుష్యంగా ఉంది. నగర శివార్లలో యుక్రెయినీ ట్యాంకర్లు కీయెవ్ వైపు రావడం కనిపించింది.
నేను అలాగే వెళ్తూ రష్యా సైనికులకు చిక్కుతానా లేక ఎక్కడైనా దారి మూసేసిన హెచ్చరికలు కనిపిస్తాయా అన్నది నాకు తెలియదు. ఎలాగైనా, ఆ ప్రాంతం నుంచి బయటపడాలని వెళ్తూనే ఉన్నాను.

ఫొటో సోర్స్, Getty Images
ఎటు చూసినా ఖాళీ నివాసాలే...
నేను దారిలో మధ్య మధ్య ఆగుతూ ఫోన్ చూస్తున్నాను. కీయెవ్ ఉత్తర ప్రాంతమైన ఓబోలోన్‌లో ఘర్షణలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ ప్రాంతంలో ఉన్న నా సహోద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఒకవైపు దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే అందమైన ఉదయం. వసంతం వస్తున్న ఆనవాళ్లు అక్కడి మైదానాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అదో అధివాస్తవిక చిత్రంలా తోచింది.
కొన్ని గంటల తరువాత మేం ఊరికి చేరుకున్నాం. గత వేసవిలో మేం ఆడుకున్న తోటలోకి వెళ్లి బ్లాక్ బెర్రీ పండ్లు కోసుకున్నాం. ఈరోజు కూడా ఆనందంగానే ఉంది. కానీ, ఈ అనందానికి కారణం, కీయెవ్ నుంచి బయటపడడమే. ప్రాణాలతో మిగిలి ఉండడమే. నా కుమారుడితో కలిసి సురక్షితమైన ప్రాంతానికి వచ్చానన్న సంతోషం.
మా అత్తగారి ఇంట్లో నేను కడుపు నిండా భోంచేశాను. గత 24 గంటల్లో ఇప్పుడే నేను హాయిగా తిన్నాను.
సైన్యంతో కలిసి పోరాడడానికి స్థానిక ప్రజలు ఎవరెవరు వెళ్లారన్న సంగతి మాట్లాడుకుంటున్నాం. కానీ, మా మధ్య అంతులేని నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం ఇంకా చాన్నాళ్ళపాటు కొనసాగుతుంది.
నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. నేను ఇక్కడి నుంచి కూడా పని చేయగలను. కరెంటు పోతే మాకు జనరేటర్ కూడా ఉంది.

ఫొటో సోర్స్, EPA
నా బీబీసీ సహోద్యోగులు సురక్షితంగా ఉండడమే నాకు అత్యంత ముఖ్యం. వారిలో కొందరు కీయెవ్‌కు దూరంగా తమ బంధు మిత్రుల వద్దకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. వారిని మా అత్తగారి ఊరికి రమ్మని పిలిచాను. ఇక్కడ చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి వాటిలో నివసిస్తే యజమానులు నిజంగా సంతోషిస్తారు.
మేం మెయిన్ రోడ్డుకు చాలా దూరంగా ఉన్నాం. రష్యా ట్యాంకులు మా వద్దకు రావనే అనుకుంటున్నాం. మేం మళ్ళీ కీయెవ్ తిరిగి ఎప్పటికి వెళ్లగలం? వెళ్ళగలిగినా పరిస్థితులు మునపటిలానే ఉంటాయా? ఈ ప్రశ్నలకు జవాబులు ఇప్పట్లో తెలిసే అవకాశమే లేదు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
- భీమ్లా నాయక్: ‘గజినీ మొహమ్మద్ 17 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. నెగ్గినోడి పేరు తెలుసా?’
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












