సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్

సైబర్ నేరాల్లో అరస్టైన వారు

ఫొటో సోర్స్, SEETU TIWARI

    • రచయిత, సీటూ తివారి
    • హోదా, బీబీసీ కోసం

థాల్‌పోష్ గ్రామం పైకి అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోలోపల అల్లకల్లోలంగా ఉంది.

ఫిబ్రవరి 15న బిహార్‌ నవాదా జిల్లా పకరీ బార్వా బ్లాక్‌లోని ఈ గ్రామంలో పోలీసులు ఒకేసారి 33 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 31 మంది ఇదే ఊరికి చెందినవారు.

ఈ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత బీబీసీ టీమ్ ఆ గ్రామానికి వెళ్లినపుడు అక్కడ వృద్ధులు, పిల్లలు మాత్రమే కనిపించారు.

పొలాల్లో కూడా యువతీయువకులు ఎవరూ కనిపించలేదు. గ్రామస్థులు బయటి నుంచి వచ్చే ప్రతి ఒక్కరినీ సందేహంగా చూస్తున్నారు.

కానీ ఊరంతా వ్యాపించిన ఆ నిశ్శబ్దం మధ్య అక్కడక్కడా సన్నటి ఏడుపులు కూడా వినిపిస్తున్నాయి.

షర్వీలా దేవి

ఫొటో సోర్స్, SEETU TIWARI

ఫొటో క్యాప్షన్, షర్వీలా దేవి

కన్నీళ్లు పెడుతున్న షర్వీలా దేవి 19 ఏళ్ల కొడుకు గుల్షన్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుల్షన్ 2019లో పదో తరగతి ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. అతడికి అప్పుడు బిహార్ ప్రభుత్వం ప్రోత్సాహకంగా రూ.10వేలు కూడా ఇచ్చింది.

"అదే డబ్బుతో వాడు ఒక పెద్ద ఫోన్ కొన్నాడు. తర్వాత ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవడంతో పాత ఫోన్ అమ్మేసి కొత్త ఫోన్ కొన్నాడు. ఇంటర్ చదవడానికి మంచి ఫోన్ అవసరం అన్నాడు" అని షర్వీలా దేవి చెప్పారు.

వితంతు ఫించనుగా ప్రతి నెలా రూ.400 అందుకునే షర్వీలా ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఆమె ఇంట్లో ఒక్కటి మాత్రం పాత నల్ల బ్రీఫ్‌కేసులో చాలా జాగ్రత్తగా దాచి ఉంచారు. అది గుల్షన్ చాలా తెలివైనవాడు అని చెప్పే అతడి సర్టిఫికెట్.

అసలు ఏం జరిగింది

ఫిబ్రవరి 15న నవాదా పోలీసుల ఒక బృందం తమకు అందిన రహస్య సమాచారంతో ఈ గ్రామంలోని 33 మందిని అరెస్ట్ చేయడంతో పకరీ బార్వా బ్లాక్‌లోని థాల్‌పోష్ గ్రామంలో వార్తల్లో నిలిచింది.

పోలీసుల వివరాల ప్రకారం సైబర్ నేరాల కేసులో అరెస్టైన ఈ 33 మందిలో ఇద్దరు మైనర్ బాలురు కూడా ఉన్నారు. 15 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వీరి దగ్గర నుంచి 46 మొబైల్ ఫోన్లు, మూడు లాప్‌టాప్‌లు, నకిలీ స్టాంపులు, వివిధ కంపెనీలకు చెందిన డేటా షీట్లు కూడా దొరికాయి.

ఎలా మోసం చేస్తారు

ఫొటో సోర్స్, SEETU TIWARI

ఎలా మోసం చేస్తారు

"సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని, గ్యాస్ ఏజెన్సీ ఇప్పిస్తామని వీళ్లు ఆశ చూపుతారు. ప్రస్తుతం అతహర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏజెన్సీ ఇప్పిస్తామననే పేరుతో వీరు మోసాలు చేస్తున్నారు. వేరే రాష్ట్రాల చిరునామాతో జారీ అయిన సిమ్ కార్డుల ద్వారా వీరు దేశవ్యాప్తంగా కస్టమర్లను కాంటాక్ట్ అవుతారు. వాళ్లు తమ వలలో చిక్కితే వారి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు అంటూ నగదు వసూలు చేస్తారు. వారికి ఏజెన్సీ అప్రూవల్ లెటర్ కూడా ఇష్యూ చేస్తారు" అని పకరీ బార్వా బ్లాక్ సబ్ డివిజనల్ అఫీసర్ ముకేష్ కుమార్ సాహా చెప్పారు.

సైబర్ నేరస్థులు డబ్బు వేయమని చెప్పిన బ్యాంక్ అకౌంట్లను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేస్తున్నాం. మాతోపాటూ ఆర్థిక నేరాల విభాగం కూడా స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి వివరాలు తీసుకుని తమ స్థాయిలో దర్యాప్తు చేస్తోంది అన్నారు.

అసలు ఏం జరిగింది అనేది ఒకసారి గమనిస్తే, ఫిబ్రవరి 15న నవాదా పోలీసుల ఒక టీమ్ మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు ఈ గ్రామానికి చేరుకుంది. అక్కడ పొలాల్లో ఉన్న చాలా మంది యువకులను అరెస్ట్ చేసింది. పోలీసులు గ్రామంలో నివాస ప్రాంతాల్లోకి వెళ్లలేదు. పొలాల్లో ఉన్నవారిని మాత్రమే తీసుకెళ్లారు.

వీడియో క్యాప్షన్, అమెరికా చరిత్రలోనే అతి పెద్ద సైబర్ దాడి.. చేసిందెవరు?

గ్రామంలో వేరేవారు మోసాలు చేస్తున్నారు. మా పిల్లలు నిర్దోషులు

దాదాపు 3 వేల జనాభా ఉన్న థాల్‌పోష్ గ్రామంలో అన్ని కులాల వారూ నివసిస్తున్నారు. గ్రామంలో చాలామంది వ్యవసాయం, కూలి పనులు లేదా ఇతర రాష్ట్రాల్లో ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్నారు.

వృత్తిపరంగా మంగలి అయిన భూషణ్ ఠాకూర్, సోలో దేవీల కొడుకును కూడా పోలీసులు సైబర్ క్రైమ్ ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఇతడు మైనర్. ఐదుగురు పిల్లల తండ్రి అయిన భూషణ్ ఠాకూర్ గ్రామస్థులకు జుట్టు కత్తిరించడం, గడ్డం గీయడం చేస్తుంటారు.

భూషణ్ ఠాకూర్, సోలో దేవి

ఫొటో సోర్స్, SEETU TIWARI

ఫొటో క్యాప్షన్, భూషణ్ ఠాకూర్, సోలో దేవి

"పోలీసులు నా చిన్న కొడుకును అరెస్ట్ చేశారు. తను ఇప్పుడు పదో తరగతి పరీక్షలు రాయలేకపోతున్నాడు. వాడికి నెల ముందే వాళ్ల అన్న ఒక పెద్ద ఫోన్ కొనిచ్చాడు. ఆ రోజు కూడా మధ్యాహ్నం తను పొలంలో పనిచేయడానికి వెళ్లాడు. కానీ పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్రామంలో 1954లో నిర్మించిన గ్రంథాలయం దగ్గర గ్రామస్థులు పేకాడుతుంటారు. అక్కడ వారిలో మాకు 67 ఏళ్ల సీతారామ్ ప్రసాద్ కనిపించారు.

ఆయన కొడుకు శైలేంద్ర కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 34 ఏళ్ల శైలేంద్ర నోయిడాలో ఒక ఫ్యాక్టరీలో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేసేవారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో ఆయన తిరిగి ఇంటికి వచ్చేశారు.

"మేం నోయిడాలో ఉండేవాళ్లం. మాకు వీటన్నిటితో ఎలాంటి సంబంధం లేదు. ఆ పని చేసేవారు వేరే వాళ్లున్నారు. నా భర్త నిర్దోషి" అని శైలేంద్ర భార్య అనీసా కుమారీ చెప్పారు.

అనీసా కుమారి

ఫొటో సోర్స్, SEETU TIWARI

ఫొటో క్యాప్షన్, అనీసా కుమారి

అలాగే, ఈ ఊళ్లో ఐటీఐ చదువుతున్న కన్హయ్య కుమార్, ఇంటర్ పరీక్షలు రాయబోతున్న నితీష్ కుమార్, చేపల పెంపకంలో ఉన్న మనీష్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా తమ పిల్లలు నిర్దోషులని చెబుతున్నారు.

పింకీ కుమార్ ఇద్దరు సొంత సోదరులను, ఇద్దరు కజిన్స్‌ను పోలీసులు ఇదే కేసులో అరెస్ట్ చేశారు.

"ఫిబ్రవరి 14న మా అక్క పెళ్లి జరిగింది. పెళ్లి వంటల కోసం మా అన్నలు ఆ రోజు చేపలు పట్టుకురావడానికి బయటకు వెళ్లారు. కానీ, పోలీసులు వాళ్లను అక్కడ నుంచే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు" అని ఆమె చెప్పారు.

"మొత్తం గ్రామాన్ని మొదట చూడగానే ఎలాంటి అభివృద్ధి జరిగినట్లు కనిపించదు. అయితే గ్రామంలో పట్టుబడిన వారిలో ప్రధాన సూత్రధారిగా చెబుతున్న అశుతోష్ కుమార్ ఇంటిని గమనిస్తే, ఆయన ఇంటికి సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి. అశుతోష్ అరెస్ట్ తర్వాత నుంచీ ఆయన ఇంటికి తాళం కనిపిస్తోంది. ఏదైనా సమాచారం ఇవ్వాల్సి వస్తుందేమోనని గ్రామస్థులు తప్పించుకుని తిరుగుతున్నట్లు అనిపిస్తోంది.

ప్రధాన సూత్రధారిగా చెబుతున్న అశుతోష్ కుమార్ ఇల్లు

ఫొటో సోర్స్, SEETU TIWARI

ఫొటో క్యాప్షన్, ప్రధాన సూత్రధారిగా చెబుతున్న అశుతోష్ కుమార్ ఇల్లు

సైబర్ క్రైమ్ చుట్టూ తిరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు

థాల్‌పోష్‌లోనే కాదు, ఆ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో ఇలాగే చాలా మందిని అరెస్టు చేశారు.

వారిసలీగంజ్ స్టేషన్‌కు కొంతదూరంలో ఉన్న చకవాయ్ గ్రామంలో కూడా 2021 డిసెంబర్ 17న సైబర్ నేరగాళ్లను పోలీసులు ఒకేసారి అరెస్ట్ చేశారు. విషయం ఏంటంటే చకవాయ్ పంచాయతీ ప్రస్తుత సర్పంచ్ మృత్యుంజయ్ కుమార్‌ను ఇదే ఫిబ్రవరిలోనే వారసీల్‌గంజ్ పోలీసులు సైబర్ నేరాల ఆరోపణలతో అరెస్ట్ చేశారు.

అదే పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ జితేంద్ర కుమార్‌ను పోలీసులు సైబర్ నేరంలో అంతకు ముందే అరెస్ట్ చేశారు.

థాల్‌పోష్ గ్రామంలో ప్రస్తుత సర్పంచ్ రంజిత్ కుమార్ అలియాస్ గోల్డన్, మాజీ సర్పంచ్ రాజేష్ కుమార్ అలియాస్ బబ్లూ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది. ఈ సైబర్ నేరాలకు అవతలివారే కారణం అంటూ వారు పరస్పరం ఆరోపించుకోవడం కనిపించింది.

ఈ మొత్తం పనిలో మాజీ సర్పంచ్‌కు 30 శాతం వెళ్తుంది, ఆ డబ్బుతో ఆయన అధికారులను మేనేజ్ చేస్తుంటారు అని సర్పంచ్ రణజీత్ కుమార్ చెబుతుంటే, ఈ సైబర్ నేరాల కింగ్ పిన్ రంజిత్ కుమారే అని, అందుకే ఆయనకు లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయని మాజీ సర్పంచ్ రాజేష్ ఆరోపిస్తున్నారు.

వారసలీగంజ్

ఫొటో సోర్స్, SEETU TIWARI

సైబర్ మోసాలకు హాట్‌స్పాట్ వారసలీగంజ్

నవాదా జిల్లా వారసలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం గత కొన్నేళ్లుగా సైబర్ మోసాలకు కేంద్రంగా ఆవిర్భవించింది.

ఈ అసెంబ్లీలోని కాశీచక్, పకరీ బార్వా, వారిసలీగంజ్ బ్లాకుల్లో సైబర్ నేరాలకు సంబంధించిన అరెస్టులు వరుసగా జరుగుతూనే వచ్చాయి.

స్థానిక పోలీసులే కాకుండా, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్ సహా చాలా రాష్ట్రాల పోలీసులు ఇక్కడకు వచ్చి సైబర్ ఫ్రాడ్ కేసుల్లో అరెస్టులు చేస్తుంటారు.

భౌగోళికంగా చూస్తే వారిసలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నలందా జిల్లాలోని కతరీసరాయ్ పక్కనే ఉంటుంది. అది మోసాలకు పేరుమోసిన ప్రాంతం.

"సాధారణంగా 'ముఖం గుర్తించండి.. బహుమతి పొందండి'. 'తెల్ల మచ్చలు నయం చేసుకోండి'. 'మీ అంగాలను పెద్దది చేసుకోండి' లాంటి ప్రకటనలతో డబ్బు సంపాదిస్తుంటారు. కతరీసరాయ్ నుంచి దేశవ్యాప్తంగా ఆయుర్వేద ఔషధాల భారీగా సరఫరా అవుతాయి. దాంతో ఇక్కడి పోస్టల్ శాఖ ఆదాయం భారీగా ఉంటోంది" అని స్థానిక నిపుణులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, సైబర్ నేరగాళ్లు బెదిరించినప్పుడు మహిళలు ఏం చేయాలి... వారికున్న హక్కులేంటి?

నవాదా జిల్లాలో విస్తరించిన సైబర్ నేరాలకు కతరీసరాయ్ కేంద్రంగా ఉండవచ్చని వీరు భావిస్తున్నారు.

"కరోనా బయట ప్రపంచంలో వ్యాపించినట్లే, కతరీసరాయ్ నుంచి మోసాలు వారిసలీగంజ్ వరకూ వ్యాపించాయి" అని స్థానికులు మాటల్లో సరదాగా అనుకోవడం కూడా వినిపించింది.

కానీ, కతరీసరాయ్‌లో జరిగే ఈ మోసాలు కూడా కాలంతోపాటూ మారుతూ వస్తున్నాయి.

కతరీసరాయ్ ప్రభావం నలందా, నవాదా, షేఖ్‌పురా జిల్లాల్లోని గ్రామాల్లో ఉంది. వాటిని మేం కతరీసరాయ్ ప్రాంతాలు అంటుంటాం. అక్కడ 29 గ్రామాల్లో బాగా చదువుకున్న దాదాపు 60 మంది సీసీఎల్(సైబర్ క్రైమ్ లీడర్)గా పనిచేస్తున్నారు. ఈ సీసీఎల్ మెట్రో నగరాల్లో ఉంటారు. తమ లొకేషన్లు పదే పదే మారుస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామాల్లో యువకులు వారి కింద పనిచేస్తుంటారు. నకిలీ సిమ్‌లు తీసుకోడానికి, నకిలీ అకౌంట్ తెరవడానికి, బ్యాంక్ అకౌంట్ ఉపయోగించుకునేలా చేసినందుకు వారికి కమిషన్ లభిస్తుంది" అని స్థానిక జర్నలిస్ట్ అశుతోష్ చెప్పారు.

మోసాలు ఎలా జరుగుతాయి

ఫొటో సోర్స్, SEETU TIWARI

ఫొటో క్యాప్షన్, గ్రామంలో దశాబ్దాల క్రితం నిర్మించిన లైబ్రరీ

సైబర్ నేరాలు జరుగుతాయి

ఈ మొత్తం మోసాల్లో సిమ్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పనికోసం నేరస్థులకు లాప్‌టాప్, మొబైల్, డేటా షీట్ ఉంటే చాలు.

డేటా షీట్ అంటే ఇందులో సైబర్ నేరస్థులు లక్ష్యంగా చేసుకునే వివిధ కంపెనీల కస్టమర్ల సమాచారం ఉంటుంది. ఈ షీట్‌ వారికి రకరకాల కంపెనీల్లో పనిచేసే సిబ్బంది ద్వారా లభిస్తుంది. ఎంతో నమ్మకంతో జనం ఇచ్చిన వ్యక్తిగత సమాచారాన్ని వారు ఇలాంటి నేరస్థులకు అందిస్తారు. థాల్‌పోష్‌లో పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

"వీళ్లు మోసాల ట్రెండ్ మారుస్తూ ఉంటారు. కొత్త పద్ధతులు ఉపయోగిస్తారు. ఒక ట్రెండ్ గురించి జనం జాగ్రత్త పడగానే, వాళ్లు కొత్త పద్ధతిని ఉపయోగిస్తారు. నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి సామాన్యులకు అది నిజమైనదే అనేలా నమ్మకం కలిగిస్తారు. ఉదాహరణకు వీళ్లు ఒక నకిలీ వెబ్ సైట్ చేసి దాన్ని మాటిమాటికీ తెరుస్తారు. అలా సామాన్యులు ఆ వెబ్ సైట్‌ను సెర్చ్ చేసినప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజన్ మొట్టమొదట నకిలీ వెబ్ సైట్ చూపిస్తుంది. దానిలోకి వెళ్లి మీరు మీ మొత్తం సమాచారం ఇచ్చేస్తారు" అని రాష్ట్రంలో సైబర్ సెల్‌కు సంబంధించిన ఒక పోలీస్ అధికారి చెప్పారు.

ఈ మూడు వస్తువులు తీసుకుని సైబర్ నేరస్థులు తమ గ్రామాల్లో పొలాల్లో గుంపుగా కూర్చుంటారని ఆఫీస్ టైంలో అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 10 వరకూ వారు తాము టార్గెట్ చేసిన వినియోగదారులను సంప్రదిస్తారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

పట్నా హైకోర్ట్

ఫొటో సోర్స్, MANISH SHANDILYA

ఆందోళన వ్యక్తం చేసిన పట్నా హైకోర్ట్

సైబర్ నేరాల విషయంలో పట్నా హైకోర్ట్ తరచూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ వస్తోంది.

ఇటీవల శివకుమార్ వర్సెస్ బిహార్ ప్రభుత్వం కేసు, ఫేస్‌బుక్, ట్విటర్ సహా 11 కంపెనీల కేసుల్లో 2021 జనవరిలో విచారణ జరిగినపుడు సైబర్ నేరాల కేసుల్లో అరెస్టులకు సంబంధించిన వివరాలను డీజీ(ఆదాయ పన్ను శాఖ)కు, పట్నా ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌కు అందించామని నవాదా, నలందా, షేఖ్‌పురా జిల్లా ఎస్పీలు అధికారులు కోర్టుకు తెలిపారు.

ఇలాంటి కేసుల్లో దర్యాప్తు చేసిన తర్వాత మనీ లాండరింగ్ యాక్ట్, ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటారని కోర్టు ఆ సమయంలో ఆశాభావం వ్యక్తం చేసింది.

సైబర్ మోసాల కేసుల్లో స్థానిక పోలీసులు చాలా సమర్థంగా పనిచేయలేరని కోర్టు చెప్పింది. బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్, ఇతర వివరాలను సైబర్ నేరస్థులకు ఇచ్చినపుడే ఇలాంటి నేరాలు జరుగుతాయని భావించింది.

పోలీసులు

ఫొటో సోర్స్, SEETU TIWARI

మరోవైపు, ఆర్థిక నేరాల విభాగం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.

"పట్నా, నలందా, నవాదా, షేఖ్‌పురా, గయ, జమూయీ జిల్లాలను సైబర్ నేరాలకు హాట్‌స్పాట్లుగా గుర్తించాం. వాటిని అంతం చేయడానికి ఒక ప్రామాణిక ఆపరేటింగ్ విధానం రూపొందిస్తున్నాం" అని అందులో చెప్పారు.

మేం థాల్‌పోష్ నుంచి పట్నా తిరిగి వెళ్తున్న సమయంలో దారిలో ఒక దగ్గర జనం గుమిగూడి కనిపించారు. అక్కడ అభిమన్యు అనే కళాకారుడు "సంపద బంగారు పాము లాంటిది, నిలువెల్లా విషంలా మారుతుంది. అది మూణ్ణాళ్ల ముచ్చటే, తర్వాత మిగిలేది చీకటే..." అని పాడుతున్నారు.

అభిమన్యు ఊరు థాల్‌పోష్‌కు చాలా దగ్గర్లోనే ఉంటుంది. వారిసలీగంజ్ ఒకప్పుడు భారీ వరి దిగుబడికి పేరు పొందింది. కానీ, ఇప్పుడు మా ప్రాంతం సైబర్ మోసాలతో చెడ్డపేరు మూటగట్టుకుంది" అని ఆయన బాధగా చెప్పారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)