చైనా సైబర్ దాడి చేస్తే ఎదుర్కోగల సామర్థ్యం ఇండియాకు ఉందా

GETTY IMAGES
ఫొటో క్యాప్షన్, GETTY IMAGES
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంపై సైబర్ దాడులు చేయగల సామర్థ్యం చైనాకు ఉందని, అదే జరిగితే దేశంలోని సైబర్ వ్యవస్థకు పెద్ద దెబ్బే తగులుతుందని భారత రక్షణ శాఖ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు.

దిల్లీలో ఉన్న వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత, చైనా సైబర్ సామర్థ్యాలను విశ్లేషించారు. రక్షణ రంగంలో టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని వివరించారు.

గత ఏడాది అక్టోబరులో ముంబయిలో బ్లాక్అవుట్ నేపథ్యంలో జనరల్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు జరిగిన సైబర్ అటాక్ వెనుక చైనా హస్తం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఆదివారం ఇరాన్ నాటాన్జ్ అణు కేంద్రంలో సంభవించిన నష్టానికి సైబర్ దాడే కారణమని భావిస్తున్నారు.

2015లో ఉక్రెయిన్‌లో జరిగిన విద్యుత్ బ్లాక్అవుట్‌కు కారణం రష్యా చేసిన సైబర్ అటాక్ అనే ఆరోపణలు ఉన్నాయి.

GETTY CREATIVE /ISTOCK /IPOPBA
ఫొటో క్యాప్షన్, GETTY CREATIVE /ISTOCK /IPOPBA

ముంబయిపై సైబర్ అటాక్

గత ఏడాది అక్టోబర్ 12న ముంబయి మొత్తం అంధకారమైపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో లోకల్ ట్రైన్లు, ఆసుపత్రులు సహా జనజీవనం స్తంభించిపోయింది.

ఇండో-చైనా సరిహద్దు వివాదానికి, ఎల్ఏసీ దగ్గర జరిగిన ఘర్షణలకు ఈ బ్లాక్అవుట్‌కు సంబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ విశ్లేషణ ప్రకారం, భారతదేశ ఇంధన ఉత్పత్తి సంస్థలు, ఓడరేవులపై జరిగిన ఈ దాడి వెనుక చైనాతో సంబంధం ఉన్న రెడ్ ఎకో అనే గ్రూపు హస్తం ఉంది.

"ఈ బృందాన్ని గత ఏడాది ఆరు నుంచి ఎనిమిది నెలలు ట్రాక్ చేశాం. వీరు భారతదేశంలోకి ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని మా పరిశోధనలో తేలింది" అని రికార్డెడ్ ఫ్యూచర్ సీఈఓ క్రిస్టొఫర్ ఆల్బర్గ్ తెలిపారు.

ఈ సమాచారాన్ని తాను భారత అధికారులకు అందించానని అయితే, దీని మీద తదుపరి చర్చలేమీ జరగలేదని ఆల్బర్గ్ చెప్పారు.

కాగా, జరిగిన సంఘటనపై మహరాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారని, అది చేతిలో లేకుండా ఏం చెప్పినా ఊహాగానాలే అవుతాయని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ (డాక్టర్) జనరల్ రాజేష్ పంత్ అన్నారు.

"ఆ రాష్ట్రం నుంచి రిపోర్టులు వచ్చాకే అసలేం జరిగిందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మా రికార్డులు.. మిగతా ఏజెన్సీలు తెలిపిన వివరాల ప్రకారం అది సైబర్ దాడి కాదు" అని ఆయన అన్నారు.

అయితే, ఈ సైబర్ దాడి వెనుక చైనా హస్తం ఉందన్న ఆరోపణలను ఆ దేశం ఖండించింది.

సైబర్ దాడి అనేది ఒక ఎంఆర్ఐ స్కాన్‌లాంటిదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్‌లో మన శరీరంలోని బలహీనతలన్నీ బయటపడినట్లే ఈ సైబర్ దాడిలో భారత ఇంధన వ్యవస్థలోని బలహీనతలన్నీ హ్యాకర్లకు తెలిసిపోయి ఉంటాయని వారు అంటున్నారు.

చైనీస్ మాల్‌వేర్ ఇప్పటికీ భారత సిస్టమ్స్‌లో ఉండే అవకాశం ఉందని కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ సందీప్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు.

"సిస్టంలో మాల్‌వేర్ ఉంటే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని కంట్రోల్‌కు చేరవేస్తూ ఉంటుంది. చైనా హ్యాకర్లు మళ్లీ ఎప్పుడైనా ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు" అని ఆయన తెలిపారు.

అయితే, జరిగిన సంఘటన ఎంత ప్రమాదకరమైనది, దాని వలన కలిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదని నిపుణులు భావిస్తున్నారు.

"ప్రస్తుతానికి చైనా ఏమీ చేయకుండా ఉందంటే దానికి కారణం.. ఇప్పుడేం చేసిన అది యుద్దాన్ని ప్రకటించినట్లుగా ఉంటుంది. దీనివల్ల దౌత్యపరమైన, ఇతర రకాల సవాళ్లు అనేకం ఎదుర్కోవలసి వస్తుంది" అని ప్రొఫెసర్ శుక్లా అంటున్నారు.

అయితే, ఇక్కడ మరో విషయం కూడా ఉంది. వేరే ఎవరైనా ఈ సైబర్ దాడికి పాల్పడి అది చైనా చేసినట్లు చూపించే అవకాశం ఉంది. అలా చేయాలంటే చైనా సర్వర్ కూడా వారి కంట్రోల్‌లో ఉండాలి. అది అంత సులభం కాదని విశ్లేషకులు అంటున్నారు.

CHRISTOPHER AHLBERG

ఫొటో సోర్స్, CHRISTOPHER AHLBERG

ఫొటో క్యాప్షన్, క్రిస్టొఫర్ అల్బర్గ్

భారత, చైనా సాంకేతిక సామర్థ్యాలు ఎలా ఉన్నాయి?

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన బెల్ఫెర్ సెంటర్ నివేదిక ప్రకారం, సైబర్ ప్రపంచంలో అమెరికా తరువాత అత్యంత శక్తిమంతమైన దేశం చైనా.

కాగా, గణాంకాల ప్రకారం.. సైబర్ దాడుల వల్ల ప్రభావితమైన మొదటి ఐదు దేశాల్లో ఇండియా కూడా ఉంది.

అయితే, తన పదవీకాలంలో 30-35 శాతం సైబర్ దాడులు చైనా భూభాగం నుంచి జరిగినట్లు భారతదేశం మొదటి జాతీయ సైబర్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ (2015-19) గుల్షన్ రాయ్ తెలిపారు.

చైనీస్ హ్యాకర్లు భారత్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయని సైబర్‌పీస్ ఫౌండేషన్ గత ఏడాది విడుదల చేసిన ఒక రిపోర్ట్‌లో పేర్కొంది.

గత కొన్నేళ్లల్లో ఇండియాలోని రైల్వే, ఆయిల్, గ్యాస్, వైద్య సదుపాయాలపై చైనా హ్యకార్లు దాడి చేశారని సైబర్‌పీస్ ఫౌండేషన్ చీఫ్ వినీత్ కుమార్ తెలిపారు.

అంతకుముందు హ్యాకర్లు చైనాకు సంబంధించిన స్లోగన్లను ఇండియన్ వెబ్‌సైట్లల్లో రాసేవారని, అయితే, 2013-14 నుంచి సైలెంట్‌గా అటాక్ చేస్తున్నారని ఆయన అన్నారు.

సైబర్ సెక్యూరిటీ విషయంలో భారత్, చైనాలు సమానంగా ఉన్నాయని జనరల్ రాజేష్ పంత్ అంటున్నప్పటికీ చైనాకన్నా భారత్ చాలా వెనుకబడి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చైనాలో సైబర్ నిపుణులు, హ్యాకర్ల సైన్యమే ఉంది. భారత్‌లో ఇంకా ఇప్పుడిప్పుడే సైన్యాన్ని సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

గత 15 ఏళ్లుగా చైనా సైబర్ రంగంలో విశేషంగా పెట్టుబడులు పెడుతోదని ప్రొఫెసర్ సందీప్ శుక్లా అన్నారు.

చాలా ఏళ్లుగా ఇతర దేశాల నుంచి రహస్య సమాచారాన్ని చైనా దొంగిలిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

అయితే, ఈ ఆరోపణలన్నిటినీ ఎప్పటికప్పుడు చైనా ఖండిస్తూనే ఉంది.

రక్షణ రంగంలో డిఫెన్స్ సైబర్ ఏంజెన్సీని ఇటీవలే ప్రారంభించారని, గత కొన్నేళ్లుగా భారతదేశ సైబర్ రక్షణ సామర్థ్యాలు పెరిగాయని గుల్షన్ రాయ్ తెలిపారు.

వినీత్ కుమార్

ఫొటో సోర్స్, vineet kumar

ఫొటో క్యాప్షన్, వినీత్ కుమార్

స్పష్టమైన వ్యూహం లేదు

సైబర్ రంగంలో సవాళ్లు పెరుగుతున్న సమయంలో వాటిని ఎదుర్కోవడానికి స్పష్టమైన వ్యూహం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని సైబర్ వ్యవహారాల నిపుణులు, మాజీ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా అభిప్రాయపడ్డారు.

ఇండియాలో సైబర్ రంగంలో సవాళ్లను ఎదుర్కోవడానికి 2013లో సైబర్ సెక్యూరిటీ పాలసీ తీసుకొచ్చారు.

అయితే, గత ఎనిమిదేళ్లల్లో సైబర్ రంగంలో వస్తున్న సమస్యలు, సవాళ్ల తీరు మారింది. దానికి అనుగుణంగా కొత్త పాలసీ తీసుకు రావలసిన ఆవశ్యకత ఉంది.

కొత్త సైబర్ పాలసీ తీసుకురావడం గురించి కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయని, అయితే, దాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారో స్పష్టంగా తెలీదని హుడా చెప్పారు.

"సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఒక స్పష్టమైన వ్యూహం లేకపోతే కంపెనీలు తమపై జరిగిన దాడి గురించి సమాచారం ఇవ్వకుండా ఉండిపోతాయి. ఎందుకంటే, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అందించవలసిన చట్టబద్ధమైన అవసరం లేదు" అని హుడా అన్నారు.

జాతీయ స్థాయిలో స్పష్టమైన సైబర్ పాలసీ లేదా వ్యూహం లేకపోతే ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయో, అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉంటాయో తెలిసే అవకాశం లేదని ఆయన అన్నారు.

సైబర్

ఫొటో సోర్స్, Getty Images

ముందున్న మార్గం ఏమిటి?

ఇటీవల అమెరికాలో పెద్ద సైబర్ దాడి జరిగినప్పుడు.. దాడి జరిగిందని, నష్టం చేకూరిందని అమెరికా అంగీకరించింది.

ఈ దాడి వెనుక వెనుక రష్యా హస్తం ఉందని ఆరోపించింది.

కానీ రష్యా ఈ ఆరోపణలను ఖండించింది.

ఈ దాడిలో ఎంత నష్టం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

అలాంటి దాడి ఇండియా మీద జరిగితే.. అంతా సవ్యంగానే ఉందని, నష్టాలేం లేవని భారత అధికారుల నుంచి స్పందన వస్తుంది.

"సమస్యకు పరిష్కారం వెతకాలంటే ముందు సమస్యను అంగీకరించాలి. సైబర్ రక్షణ రంగంలో భారతదేశం బలపడాలంటే సైబర్ రంగంలోని మౌలిక సదుపాయాల ఉత్పత్తిలో దేశం బలపడాలి" అని హుడా అన్నారు.

అయితే, ఇండియాలో చైనా ఫోన్లు, విద్యుత్ పరికారలు ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో ఇది అంత సులభం కాదు.

అలాగే, రక్షణ రంగంలో కూడా అధికంగా విదేశీ పరికరాలను వాదుతున్నారు.

ఈ రంగంలో ఇండియా స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రభుత్వం ఉత్పత్తికి అవసరమైన సబ్సిడీలు అందించి ప్రోత్సాహించడం ముఖ్యం.

"అమెరికా, చైనాలాగ ఇండియాలో కూడా అధిక సంఖ్యలో సైబర్ నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. సైబర్ రంగంలో బోల్డంత భవిష్యత్తు ఉందని యువతకు తెలియజేయాలి. ఐఐటీ, ఎన్ఐఐటీలను పక్కకుపెట్టి మిగతా విశ్వవిద్యాలయాలవైపు దృష్టి సారించాలి. సైబర్ రంగానికి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టి యువతను ప్రోత్సహించాలి. వాటికి కావాల్సిన నిధులు సమకూర్చాలి" అని వినీత్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)