మమత బెనర్జీపై 24 గంటల నిషేధం.. ఎన్నికల ప్రచారం చేయరాదంటూ ఈసీ ఆదేశాలు -Newsreel

మమత బెనర్జీ

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 24 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయరాదంటూ ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించింది.

సోమవారం (ఏప్రిల్ 12) రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

ఈ 24 గంటల సమయంలో ఆమె ఏ రకమైన ఎన్నికల ప్రచారమూ చేయరాదని ఈసీఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

చైనా సీనోవాక్ టీకా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా తయారీ సీనోవాక్ టీకా

చైనా వ్యాక్సీన్‌: తమ కోవిడ్ టీకాలు ఎక్కువ రక్షణ అందించలేవన్న చైనా అధికారి

'చైనా కోవిడ్ టీకాల సామర్థ్యం తక్కువేనని' చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ హెడ్ గావో ఫూ చెప్పారు.

తమ టీకాల సామర్థ్యాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు గావో ఫూ తెలిపారు.

అయితే, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ తర్వాత ఆయన చెప్పారు.

విదేశాల్లో జరిగిన కొన్ని ట్రయల్స్‌లో చైనా టీకాల సామర్థ్యం 50 శాతం కంటే తక్కువే ఉందని బయటపడినప్పటికీ, తాము తయారు చేసిన నాలుగు టీకాలను ప్రజలకు వేసేందుకు చైనా అనుమతించింది.

చైనాలో 10 కోట్ల మందికి పైగా కనీసం ఒక డోస్ వ్యాక్సీన్ వేసుకున్నారు. తమ టీకాలు సమర్థవంతమైనవేనని చైనా చెబుతోంది. చైనా వ్యాక్సీన్ వేసుకున్న విదేశీయులకు మాత్రమే వీసాలు జారీ చేస్తామని చెప్పింది.

చైనాలో వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Reuters

అధికారి గావో అసలు ఏమన్నారు

శనివారం ఒక కాన్ఫరెన్సులో మాట్లాడిన 'చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' హెడ్ గావో ఫూ "మా టీకాలు మరీ అంత ఎక్కువ రక్షణ అందించలేవు" అని అన్నారు.

వాటి సామర్థ్యం పెంచడానికి చైనాలో తయారైన కోవిడ్-19 వ్యాక్సీన్లను కలిపి ఉపయోగించవచ్చా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

డోసుల సంఖ్యను, సమయ పరిమితిని మార్చితే వాటి సామర్థ్యం పెరుగుతుందా అనేది కూడా ఆలోచిస్తున్నామని ఆయన వివరించారు.

కానీ తర్వాత ఆయన తన వ్యాఖ్యలపై మాట మార్చారు.

"ప్రపంచంలోని అన్ని వ్యాక్సీన్ల రక్షణ సామర్థ్యం కొన్నిసార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది" అని ఆయన చైనా మీడియా గ్లోబల్ టైమ్స్‌తో అన్నారు.

"వాటి సామర్థ్యం ఎలా మెరుగుపరచాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఆలోచించాల్సిన ప్రశ్న" అని చెప్పారు.

'చైనా టీకాలు తక్కువ రక్షణ కల్పిస్తాయని' తాను ముందు చేసిన వ్యాఖ్యలను పూర్తిగా అపార్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.

గావో మొదట, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలను చైనా మీడియా పెద్దగా చూపించడం లేదు.

అయితే ఆయన మొదట మాట్లాడినపుడు సోషల్ మీడియా సైట్‌ వీబోలో విమర్శలు వచ్చాయి. 'మీరు మాట్లాడ్డం ఆపేస్తే మంచిదని' కొందరు కామెంట్లు పెట్టారు.

'ఇరాన్ భూగర్భ అణుకేంద్రంపై విద్రోహ చర్య'

ఇరాన్ నతాంజ్ అణు కేంద్రం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇరాన్ నతాంజ్ అణు కేంద్రం

ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై 'విద్రోహచర్య' జరిగిందని ఆదేశ అత్యున్నత అణు అధికారి అలీ అక్బర్ సలేహీ ఆరోపించారు.

ఈ విద్రోహ చర్య తర్వాత ఆదివారం దక్షిణ టెహ్రాన్‌లోని నతాంజ్ కాంప్లెక్స్‌లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. అయితే, ఈ చర్యలకు బాధ్యులు ఎవరు అనేది మాత్రం అలీ అక్బర్ సలేహీ చెప్పలేదు.

'అణు ఉగ్రవాదాన్ని' ఎదుర్కోవాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

ఇరాన్ నతాంజ్ నగరంలోని ఈ అణు కేంద్రం భూగర్భంలో ఉంది.

ఇజ్రాయెల్ సైబర్ దాడుల వల్లే ఈ అణు కేంద్రానికి నష్టం జరిగిందని ఆ దేశ మీడియా చెబుతోంది.

ఇజ్రాయెల్ ఈ ఘటన గురించి ప్రత్యక్షంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కానీ, ఇటీవల అది ఇరాన్ అణు కార్యక్రమం గురించి హెచ్చరికలను తీవ్రం చేసింది.

దీనికి ఒక్క రోజు ముందే యురేనియం శుద్ధికి సంబంధించిన సరికొత్త సెంట్రిఫ్యూజ్‌ డివైస్‌ను ఇరాన్ ఆవిష్కరించింది.

ఇరాన్ అణు కేంద్రం

ఫొటో సోర్స్, EPA

గత ఏడాది ఇదే అణు కేంద్రంలో అగ్ని ప్రమాదం

గత ఏడాది ఇరాన్‌లోని ఇదే భూగర్భ అణు కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు సైబర్ దాడుల వల్లే ఆ ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారులు చెప్పారు.

అమెరికా బైడెన్ ప్రభుత్వం వైపు నుంచి 2015 అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభమైన సమయంలో ఇరాన్ అణు కేంద్రంలో ఈ తాజా ఘటన జరిగింది.

నతాంజ్ కేంద్రంలో యురేనియంను మరింత వేగంగా శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌ను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రుహానీ శనివారం ఆవిష్కరించారు.

ఇరాన్ అణు కార్యక్రమానికి ఈ సెంట్రిఫ్యూజ్ చాలా కీలకం. దీని ఆవిష్కరణను టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

సెంట్రిఫ్యూజెస్ ద్వారా సుసంపన్న యురేనియంను ఉత్పత్తి చేస్తారు. దానిని రియాక్టర్ ఇంధనం, అణ్వాయుధాల తయారీకి ఉపయోగిస్తారు.

ఈ చర్యతో ఇరాన్ 2015 ఒప్పందంలోని ఒక షరతును ఉల్లంఘించినట్లు సంకేతాలు ఇచ్చింది.

ఆ అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ సుసంపన్న యురేనియంను పరిమిత స్థాయిలో ఉత్పత్తి చేయాలి. దానిని పరిమితంగా నిల్వ చేసుకోవచ్చు.

దీనితోపాటూ యురేనియంను కమర్షియల్ అణు కర్మాగారాలకు మాత్రమే వినియోగించాలని ఈ ఒప్పందంలో ఉంది.

ఇరాన్ అణు కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images

ఇరాన్ ఏం చెప్పింది

అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగిందని ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ ప్రతినిధి బెహ్రోజ్ కమల్‌వంది చెప్పారు.

దీని గురించి మిగతా వివరాలేవీ ఇవ్వని కమల్‌వంది, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, లీక్స్ జరగలేదని ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.

తర్వాత ఏఈఓఐ చీఫ్ అలీ అక్బర్ సలేహీ ప్రకటనను ఇరాన్ టీవీ ఛానల్‌లో చదివి వినిపించారు.

అందులో ఆయన ఈ ఘటనను విద్రోహ చర్యగా, అణు ఉగ్రవాదంగా వర్ణించారు.

ఈ అణు ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికి అంతర్జాతీయ సమాజం, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అవసరాన్ని ఇరాన్ నొక్కి చెబుతోందని, దీనికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)