కుంభమేళా: హరిద్వార్‌కు పోటెత్తుతున్న జనం.. రోజువారీ కరోనావైరస్ కేసుల్లో బ్రెజిల్‌ను దాటిన భారత్

హరిద్వార్ కుంభమేళా

ఫొటో సోర్స్, Getty Images

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో భక్తులు పోటెత్తుతున్నారు.

సోమవారం గంగానదిలో స్నానం చేయడం పవిత్రమని భావిస్తూ అనేకమంది తరలివస్తున్నారు.

వేల సంఖ్యలో జనం తరలిరావడంతో కోవిడ్ జాగ్రత్తలు పాటించడం అసాధ్యమవుతోందని అధికారులు వాపోతున్నారు.

గంగానదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం.

కుంభమేళాలో భక్తురాలు

ఫొటో సోర్స్, Reuters

కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.

అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలలో ఒక చోట ఈ కుంభమేళా నిర్వహిస్తారు.

ఈ ఏడాది కుంభమేళా హరిద్వార్‌లో జరుగుతోంది.

భారత్‌లో గత కొన్ని వారాలుగా రోజువారీ కోవిడ్ కేసులు 1,00,000ల కంటే ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు వేలాదిమంది తరలి రావడం ఆందోళన కలిగిస్తోందని పలువురు భావిస్తున్నారు.

సోమవారం తాజాగా 1,68,000ల కన్నా ఎక్కువ కోవిడ్ కేసులు నమోదు కావడంతో, బ్రెజిల్‌ను దాటి ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది.

మూడు కోట్ల కన్నా ఎక్కువ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 1.35 కోట్ల కన్నా ఎక్కువ కరోనావైరస్ కేసులతో ఇండియా రెండో స్థానంలో ఉంది. 1.34 కోట్ల కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది.

భక్తురాలు

ఫొటో సోర్స్, Reuters

ఈ ఏడాది కుంభమేళా ఉత్సవాలను రద్దు చేయమని వైద్య, ఆరోగ్య నిపుణులు అభ్యర్థించినప్పటికీ కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని హామీ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ముందడుగు వేసింది.

గంగానది ఒడ్డున జనం భౌతిక దూరం పాటించేలా చూడడం కష్టమని ఒక సీనియర్ పోలీస్ అధికారి ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.

"కోవిడ్ నిబంధనలు పాటించమని నిర్విరామంగా మేం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కానీ, జనం ఎక్కువగా ఉన్నందు వల్ల జాగ్రత్తలు పాటించనివారికి జరిమానా వేసి చలాన్ ఇవ్వడం సాధ్యం కావట్లేదు" అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ గుంజ్యాల్ తెలిపారు.

పోలీసులు బలవంతంగా భౌతిక దూరం అమలు చేయాలని ప్రయత్నిస్తే "తొక్కిసలాట జరిగే అవకాశం" ఉందని ఆయన అన్నారు.

రెండు నెలలపాటూ సాగే ఈ కుంభమేళా ఉత్సవంలో సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా గంగానదిలో స్నానం చేయడం పుణ్యమని భక్తులు భావిస్తారు.

కోవిడ్ నెగటివ్ ఉన్నవాళ్లనే ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు అనుమతిస్తామని, కఠినంగా కోవిడ నిబంధనలు అమలు చేస్తూ జనం భౌతిక దూరం పాటించేలా చూస్తామని ప్రభుత్వం అంతకుముందు తెలిపింది.

అయితే, ఇప్పటికే అక్కడ ఉన్న అనేకమంది భక్తులకు, సాధువులకు కూడా కరోనా పాజిటివ్ అని టెస్టుల్లో తేలింది.

దాంతో సోమవారం గంగానదిలో మునక వేసే భక్తుల తాకిడికి కరోనా వ్యాప్తి అధికమవుతుందని, వారితో పాటే వైరస్ వారి వారి ఊర్లకు కూడా వ్యాపించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్

ఫొటో సోర్స్, Reuters

ఇండియాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ తాకిడి తీవ్రంగా ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో మంచాల కొరత, మందుల కొరత ఉంటోందనే రిపోర్టులు వస్తున్నాయి.

మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దేశం మొత్తమ్మీద నమోదవుతున్న కేసుల్లో 30 నుంచి 40 శాతం రోజువారీ కేసులు ఆ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి.

పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలు విధించారు.

ఇలాంటి పరిస్థితుల్లో కుంభమేళా ఉత్సవాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిపుణులను కలవరపెడుతోంది.

కోవిడ్ వ్యాప్తిని అదుపు చేయకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉందని, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కూడా చతికిలబడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో ఇప్పటికే 10 కోట్ల వ్యాక్సీన్లు డోసులు అందించారు.

అయితే, అది సరిపోదని, సెకండ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్ వేగం పెంచాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)