కరోనావైరస్: తెలంగాణలో మాస్క్ లేకుంటే రూ. 1,000 జరిమానా... తెలుగు రాష్ట్రాల్లో 3 వేలు దాటిన రోజువారీ కేసులు - Newsreel

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో (ఏప్రిల్ 10 ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 11 ఉదయం 9 గంటల వరకు) కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 719 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత గుంటూరులో 501 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రమంతటా 31,719 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు

ఫొటో సోర్స్, APHealthMinistry

గత 24 గంటల్లో 1,198 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని ఏపీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణ విషయానికి వస్తే, రాష్ట్రంలో గత 24 గంటల్లో (ఏప్రిల్ 10 రాత్రి 8 గంటల వరకు) కొత్తగా 3,187మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఏడుగురు కోవిడ్ వల్ల చనిపోయారు.

తెలంగాణలో కోవిడ్ కేసులు

ఫొటో సోర్స్, TSHealthMinsitry

రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 3,27,278 మందికి కరోనా సోకింది. వీటిలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య 1,759కి చేరుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం గత 24 గంటల్లో 1,15,311 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. వీటిలో 3,753 మంది రిపోర్టులు ఇంకా రావల్సి ఉంది.

మాస్క్ లేకుంటే జరిమానా... జీఓ విడుదల చేసిన తెలంగాణ

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్కులు ధరించడాన్ని తప్పసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆధివారం జీఓ జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో, పని చేసే చోట, ప్రయాణంలో ఉన్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఈ జీఓ ఆదేశించింది.

మాస్కులు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ

ఫొటో సోర్స్, TSGovernment

ఫొటో క్యాప్షన్, మాస్కులు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ

తెలంగాణ సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా కనిపిస్తే రూ. 1,000 వరకు జరిమానా ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ -2005 లోని 51 నుంచి 60 వరకు ఉన్న సెక్షన్ల ప్రకారం అలాంటి వారి మీద విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంటుంది.

line

పవన్ కల్యాణ్: హోం క్వారెంటైన్‌లో జనసేన అధినేత

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, janasena/fb

పవన్ కల్యాణ్ చుట్టూ ఉండే పార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యక్తిగత - భద్రతా సిబ్బందిలో చాలా మందికి కరోనావైరస్ సోకినట్లు తెలియడంతో, ఆయన డాక్టర్ల సలహా మేరకు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారని జనసేన పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పవన్ అనుచరుల్లో చాలా మందికి గత వారం రోజుల్లో కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వారందరూ పవన్ కల్యాణ్‌తో చాలా సన్నిహితంగా మెలిగేవారు.

దాంతో, ముందస్తు జాగ్రత్తగా, తన వల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం లేకుండా చూసేందుకు ఆయన క్వారెంటైన్లోకి వెళ్లారు.

జనసేన పార్టీ ప్రకటన

ఫొటో సోర్స్, JanasenaParty/twitter

ఫొటో క్యాప్షన్, జనసేన పార్టీ ప్రకటన

డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ ప్రశాంత వాతావరణంలో ఉన్నారు. అయితే, అదే సమయంలో ఆయన పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని ఆ ప్రకటనలో తెలిపారు.

జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఈ ప్రకటన విడుదల చేశారు.

line

భారత్‌లో ఒకే రోజు అత్యధికంగా 1.52 లక్షల కరోనా కేసులు

మాస్క్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఆదివారం దేశంలో కొత్తగా 1,52,829 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వల్ల గత 24 గంటల్లో 839 మంది చనిపోయారు. దీంతో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 1,69,275కు చేరుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కు చేరాయని, 11,08,087 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

భారత్‌లో ఇప్పటివరకూ కోటీ 20 లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకోగా, 90 వేల మందికి పైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో వేసిన టీకాల సంఖ్య 10,15,95,147కు చేరింది.

భారత్‌లో కరోనా

ఫొటో సోర్స్, NAVEEN SHARMA/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY

తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న కేసులు

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

ఏప్రిల్ 10 ఉదయం 10 గంటల వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 3,309 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు మొత్తం 9,19,011 పాజిటివ్ కేసులు రికార్డు కాగా అందులో 8,93,054 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు.

మొత్తం 7,291 మంది మరణించారు.

యాక్టివ్ కేసులు 18,666 ఉన్నాయి.

తెలంగాణలో..

తెలంగాణలో శనివారం రాత్రి 8 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం కొత్తగా 3,187 పాజిటివ్ కేసులొచ్చాయి.

కరోనా వ్యాప్తి మొదలైన తరువాత తెలంగాణలో ఒక్క రోజులో ఇంత ఎక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 1,759 మంది మరణించారు. ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)