కరోనావైరస్: అంత్యక్రియల కోసం శ్మశానాల దగ్గర క్యూలు, టోకెన్లు తీసుకుని బంధువుల ఎదురుచూపులు

కరోనా అంత్యక్రియలు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, అంత్యక్రియల కోసం శ్మశానం బయట వరుసలో అంబులెన్సులు

కరోనా ప్రస్తుత వేవ్ చాలా రాష్ట్రాల్లో తీవ్ర సమస్యలకు కారణం అవుతోంది. ఒకవైపు రోగులకు చికిత్స అందించడానికి వనరుల కొరత వేధిస్తుంటే, మరోవైపు కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో మృతుల అంత్యక్రియల కోసం బంధువులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాజధానుల్లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. భోపాల్‌ గ్యాస్ లీక్ విషాధం తర్వాత మొదటిసారి అక్కడ, ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని కొన్ని స్థానిక సంస్థలు చెబుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు భిన్నంగా ఉందని జర్నలిస్ట్ సమీరాత్మజ్ మిశ్రా చెప్పారు.

"కరోనాతో చనిపోయినవారి అంత్యక్రియల కోసం వారి బంధువులు టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. తర్వాత శ్మశానం దగ్గర 8 నుంచి 10 గంటలు వేచిచూడాల్సి వస్తోంది" అని ఆయన తెలిపారు.

కరోనా అంత్యక్రియలు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, అంత్యక్రియల వరుసలో టోకెన్ చూపిస్తున్న అంబులెన్స్ సిబ్బంది

రోజంతా శవ దహనాలు

లఖ్‌నవూలోని వైకుంఠధామ్‌లో ఉన్న విద్యుత్ శవ దహన గృహంలో రోజూ దాదాపు 25 శవాలకు దహన సంస్కారాలు జరుగుతుంటాయి.

"అందులో ఒక శవానికి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. ఇక్కడ రోజంతా శవాలకు అంత్యక్రియలు చేస్తున్నాం" అని అక్కడ పనిచేసే మున్నా సింగ్ బీబీసీతో చెప్పారు.

అయితే, ప్రభుత్వం లెక్కల ప్రకారం ఏప్రిల్ నుంచి లఖ్‌నవూలో రోజుకు సగటున 5 నుంచి 8 మరణాలు నమోదవుతున్నాయి. కానీ, వైకుంఠధామ్‌లో కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం రోజూ 20కి పైనే శవాలను దహనం చేయచ్చు. ఇది కాకుండా మిగతా శ్మశాన ఘాట్లలో కూడా అంత్యక్రియలు జరుగుతున్నాయి. కానీ, కోవిడ్ మృతుల అంత్యక్రియలను మాత్రం వైకుంఠధామ్‌లోనే చేస్తున్నారు.

"హోలీ తర్వాత నుంచి ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎక్కువ మృతదేహాలు కేజీఎంయూ ఆస్పత్రి నుంచే వస్తున్నాయి. వాటికి ఉదయం 3 గంటల నుంచి 4 వరకూ చేస్తున్నాం" అని మున్నాసింగ్ చెప్పారు.

ఒకే వాహనంలో మృతదేహాలు

ఫొటో సోర్స్, SAMIRATMAJ MISHRA

ఫొటో క్యాప్షన్, ఒకే వాహనంలో మృతదేహాలు

ప్రభుత్వం లెక్కలు ఎంత కరెక్ట్

"వైకుంఠధామ్ శ్మశాన ఘాట్ బయట పొడవాటి క్యూలు కనిపిస్తున్నాయి. తాను ఒక్కో అంబులెన్సులో మూడు శవాలు కూడా తీసుకురావడం చూశానని, పొడవాటి వరుసలో అంబులెన్సులు కొన్ని గంటలు వేచి ఉంటాయి" అని శవ దహనాలు జరిగే ప్రాంతం దగ్గరున్న రాజేంద్ర నాయక్ చెప్పారు.

యూపీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయం జారీ చేసిన గణాంకాల ప్రకారం లఖ్‌నవూలో గత మూడు రోజుల్లో కరోనాతో 20 మంది కరోనాతో చనిపోయారు. కానీ, నగరంలోని వివిధ శ్మశానాల్లో 60 మంది కరోనా మృతులకు దహన సంస్కారాలు చేశారు.

"మా దగ్గర రెండు ఘాట్లలో మూడు మెషిన్లు ఉన్నాయి. గుల్లారా ఘాట్ దగ్గర ఒకటి, వైకుంఠ ధామ్‌లో రెండు ఉన్నాయి. సంఖ్య పెరుగుతుండడంతో రెండు మూడు గంటలు వేచిచూడాల్సి వస్తోంది. వైకుంఠధామ్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎక్కువగా తీసుకొస్తున్నారు. గుల్లారా ఘాట్ దగ్గర పెద్దగా రద్దీ లేదు. ఇంత వేచిచూడాల్సిన అవసరం లేకుండా చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం అని లఖ్‌నవూ అదనపు మున్సిపల్ కమిషనర్ అమిత్ కుమార్ అన్నారు.

భోపాల్‌లో శ్మశానం దగ్గర పరిస్థితి

ఫొటో సోర్స్, SHURAIH NIAZI

ఫొటో క్యాప్షన్, భోపాల్‌లో శ్మశానం దగ్గర పరిస్థితి

భోపాల్‌లో ఆందోళనకర పరిస్థితి

మరోవైపు మధ్యప్రదేశ్‌లో పరిస్థితి ఘోరంగా ఉందని స్థానిక జర్నలిస్ట్ షురేహ్ నియాజీ చెబుతున్నారు.

శవాల అంతిమ సంస్కారాల కోసం జనాలు గంటలపాటు వేచిచూడాల్సి వస్తోంది.

రాజధాని భోపాల్‌లోని భద్భదా ఘాట్ దగ్గరే గురువారం కరోనాతో చనిపోయిన 31 మందికి దహన సంస్కారాల జరిగాయి. ఇక్కడకు ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా తీసుకొస్తున్నారు. కానీ, వారికి అంత్యక్రియల కోసం బంధువులు రెండేసి గంటలు వేచిచూడాల్సి వస్తోంది.

భోపాల్లో ఇది కాకుండా వేరే శ్మశానాలు కూడా ఉన్నాయి. వాటి దగ్గరకు ఎక్కువ మందిని పంపించడం లేదు.

"పరిస్థితి అంతకంతకూ ఘోరంగా అవుతోంది. అందుకే ఒకేసారి చాలా శవాలను దహనం చేస్తున్నాం. ఇక్కడే కాకుండా కొత్త ప్రాంతాల్లో కూడా దహన సంస్కారాలు జరుగుతున్నాయి" అని భద్బధా శ్మశానం నిర్వాహకుడు లాడ్ సింగ్ బీబీసీతో అన్నారు.

శ్మశానంలో అంత్యక్రియలకు ఎదురుచూపులు

ఫొటో సోర్స్, SHURAIH NIAZI

ఏర్పాట్లపై ప్రశ్నలు

గురువారం బోపాల్‌లో కోవిడ్‌తో చనిపోయిన 13 మందితోపాటూ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన 18 మందికి ఈ శ్మశానంలో అంత్యక్రియలు జరిగాయి. మిగతా శ్మశానాల్లో కలిపి గురువారం మొత్తం 41 మందికి అంతిమ సంస్కారాలు చేశారు. వీరిలో కరోనా వల్ల చనిపోయిన నెల శిశువు కూడా ఉంది.

శ్మశానాల్లో పరిస్థితి భయానకంగా ఉందని అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే 'జనసంవేదన' సంస్థకు చెందిన రాధేశ్యామ్ అగ్రవాల్ కూడా చెప్పారు.

శ్మశానాల్లో దహనం చేయడానికి విడిగా స్థలాలు కూడా ఏర్పాటు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

"ప్రస్తుత పరిస్థితిలో విద్యుత్ శవదహన గృహాలు చాలా అవసరం. కానీ అవి సిద్ధంగా ఉన్నా, ప్రభుత్వం వాటిని ప్రారంభించడం లేదు. ఆర్థిక పరిస్థితి సరిలేక కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయలేకపోతున్న ఎన్నో కేసులు రోజూ వస్తున్నాయి. మా సంస్థ వారికి సాయం అందిస్తోంది" అని రాథేశ్యామ్ చెప్పారు.

భోపాల్ గ్యాస్ విషాధం తర్వాత నగరంలో ఇలాంటి పరిస్థితి మొదటిసారి కనిపిస్తోంది. మరోవైపు ఇండోర్‌లో పరిస్థితి భోపాల్ కంటే మెరుగ్గా ఉంది. అయితే, అక్కడ కూడా జనం అంతిమ సంస్కారాల కోసం వేచిచూడాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)